Tags

, ,

సత్య

     సంఘపరివార్‌ ముందుకు తెచ్చిన కుహనా జాతీయ వాదంతో దేశంలోని ప్రముఖులందరూ తాము జాతీయ వాదులమే అని ముద్ర వేయించుకోవాల్సిన దుస్థితి దాపురించిందా ? కొల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన క్రికెట్‌ ప్రపంచ కప్‌ మాచ్‌ సందర్భంగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తాను జాతీయ వాదిని అని నిరూపించుకొనేందుకు లేదా లోకానికి వెల్లడించుకొనేందుకు తన జేబులోంచి 30లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందా ? అలాగాక ఆ మాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు, జాతీయ గీతం పాడేందుకు(తద్వారా ఐసిసి, బిసిసిఐ, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు కాసులు కురిపించేందుకు) నాలుగు కోట్ల రూపాయల ప్రతిఫలం తీసుకున్నారా ?

    పెళ్లికి ముందు గలగలా మాట్లాడే పడుచు కుర్రాడి మాదిరి ఎన్నికలకు ముందున్న చలాకీతనం నరేంద్రమోడీ ప్రధానిగా పీఠం ఎక్కాక కనిపించటం లేదు. మనువాడటానికి ముందు చిట్టిపొట్టి బట్టలతో కుర్రకారుకు కిర్రెక్కించే సినిమా హీరోయిన్‌ పెళ్లి కాగానే చీరకట్టులోకి మారిపోయే మాదిరి మౌనమే నా భాష అన్నట్లుగా, ఏ ఫంక్షన్‌కు ఏ చీర కట్టుకోవాలో అత్తగారు నిర్దేశించినట్లుగా ఏ సందర్బానికి ఏ దుస్తులు వేసుకోవాలో, ఏ మాట్లాడాలో అధికార యంత్రాంగం రాసి ఇచ్చిన సుభాషితాలను చదవటానికే నరేంద్రమోడీ పరిమితమై పోయారు. సీను తిరగేస్తే గత లోక్‌సభ ఎన్నికలలో గుజరాత్‌ అభివృద్ధి మోడల్‌ దేశమంతటా విస్తరణ, అవినీతి పరుల భరతం, రైతులకు ఆదాయాల రెట్టింపు వంటి వాగ్దానాలను పక్కన పెట్టి జాతీయ వాదం, జావ్యతిరేకులు, భారత మాతాకీ జై ఆయన పార్టీ, అనుబంధ సంస్థల వారు వీధుల్లో వూరేగుతున్నారు. మోడీ భక్తులకే ఇదంతా ఆశ్చర్యంగా వుంది. ఈ పూర్వరంగంలో అమితాబ్‌ బచ్చన్‌ దేశభక్తి ప్రదర్శన అంశాన్ని చూడాల్సి వుంది.

   భారత జట్టు ఘన విజయం సాధించగానే కెమెరా ఫోకస్‌ అమితాబ్‌పైకి మళ్లటాన్ని కోట్లాది మంది వీక్షకులు చూశారు. ఆయన జెండా వూపిన తీరు చూసిన వారికి ఔరా అనిపించింది. క్రీడా స్ఫూర్తి , గెలిచిన జట్టుకు అభినందనల కంటే ఒక శత్రుదేశంపై కసి ప్రదర్శన మాదిరి కనిపించిందంటే అతిశయోక్తి కాదు.ఆయన సుప్రసిద్ధ నటుడు, ఏ సీన్‌లో ఎలా నటించాలో, హావభావాలను ఎలా ప్రదర్శించాలో ఎవరూ చెప్పనవసరం లేదు.

   నయా వుదార వాద విధాన స్వభావం ప్రకారం ప్రతిదీ సరుకే. అంటే ప్రతిదాన్నీ కొనుగోలు చేయాలి, అమ్ముకోవాలి, ఏదీ వుచితం కాదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అలాంటపుడు జాతీయ గీతాలాపన చేసి, ఈడెన్‌ గార్డెన్‌ కార్యక్రమాల్లో పాల్గొని, సందడి చేసినందుకు అమితాబ్‌ నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమంలో ఒక సమాచారం పరుగులు పెట్టింది. జాతీయ గీతం పాడినందుకు అంత తీసుకుంటారా ? ఆమితాబ్‌ అసలు జాతీయ వాదేనా, దేశభక్తుడేనా అన్నట్లు అనేక మంది ఆగ్రహించారు.అసలు అలా స్పందించని వారు దేశభక్తులు కాదన్న వాతావరణం మన చుట్టూ వుంది.

   వెంటనే ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు సర్వం తానే అయి వ్యవహరిస్తున్న దాదా సౌరవ్‌ గంగూలీ రంగంలోకి దిగి అబ్బే అలాంటిదేం లేదు, తన విమాన టిక్కెట్లు తానే కొనుగోలు చేసి తన హోటల్‌ బిల్లు తానే చెల్లించి, మేము ఇస్తామన్నా నిరాకరించి తన జేబులోంచి 30లక్షల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు.ప్రతిపైసా నిర్మాత జేబు నుంచి ఖర్చు చేయించే, ప్రతిఫలంలో ఒక్క రూపాయి తగ్గకుండా సినిమా విడుదలకు ముక్కు పిండి ముందే వసూలు చేసేదిగా పేరు మోసిన సినిమా రంగంలో అమితాబ్‌ అంతటి నటుడు తన స్వంత ఖర్చులతో అంత దూరం వచ్చి అలా చేశారంటే నిజంగా ఈ దేశంలో ఏదో జరగకూడనిది జరుగుతోందన్నట్లే.

    దేశంలో మామూలు పరిస్థితులు నెలకొని వుండి వుంటే అమితాబ్‌ వచ్చి జాతీయ గీతం పాడినా లేక ఐటెం సాంగ్‌లో స్టెప్పులేసినా ఎంజాయ్‌ చేయటం తప్ప అది చర్చనీయాంశం అయ్యేది కాదు. సినిమావారు డబ్బు తీసుకోకుండా సినిమాలకే కాదు, ఏ ఫంక్షన్‌కూ కాల్షీట్లు ఇవ్వరన్నది జగమెరిగిన సత్యం. వారేమీ దేశ సేవకులు కాదు.తాము దేశ సేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకుంటున్నవారు కాదేదీ కవిత కనర్హం అన్నట్లు ప్రతి అంశంలోనూ వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన వుదంతాలు మన కళ్లముందున్నాయి. అలాంటి వారి భరతం పడతామంటూ అధికారానికి వచ్చిన వారు రెండు సంవత్సరాలు కావస్తున్నా చేసిందేమిటో జనానికి తెలియదు, వారు చెప్పరు. విదేశాల్లో దాచుకున్న నల్లధనం తెచ్చే సంగతి అటుంచి అలా దాచుకున్న లలిత్‌ మోడీ, విజయ మాల్య వంటి వారిని దేశ సరిహద్దులు దాటించి అవినీతికి కొత్త భాష్యం చెప్పిన తరుణమిది.

    అమితాబ్‌ తాను దేశ భక్తుడనే అని నిరూపించుకొనేందుకు అంత ఖర్చు చేయటం అవసరమా? లేక దాన్ని కూడా పెట్టుబడిగా పరిగణిస్తున్నారా ? దాన్ని పక్కన పెడదాం. అసలు అమితాబ్‌ గానీ మరొక ప్రముఖుడెవరైనా క్రీడా పోటీలకు వుచితంగా ఎందుకు రావాలి అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అదేమీ దాన ధర్మాలకు నిధులు పోగు చేసే పోటీ కాదే. ప్రతిదీ పెట్టుబడి-లాభం ప్రాతిపదికన నిర్వహిస్తున్న అత్యంత ఖరీదైన క్రీడ అది. దానిలో ఆడేవారు, ఆడించేవారు ఎవరూ వుచితం కాదు. ఫోర్‌, సిక్సర్‌ కొట్టినా వికెట్‌ తీసినా కాసులే కాసులు.అందువలన అలాంటి కాసులు కురిపించే క్రీడకు తాను డబ్బు తీసుకున్నట్లు చెబితే అమితాబ్‌కు వచ్చే నష్టం ఏమీ వుండదు, ఎవరూ తప్పు పట్టరు. ఎవరి వాటా వారికి దక్కుతోంది. అయితే ఆ తీసుకున్న సొమ్ము బ్లాక్‌లో ఎంత వైట్‌లో ఎంత అన్నది వేరే విషయం.లేదూ గంగూలీ చెప్పినట్లు స్వంత ఖర్చులతోనే అమితాబ్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కొల్‌కతాకు వచ్చారా? తనమీద వచ్చిన విమర్శలు లేదా ఆరోపణలపై అమితాబ్‌ ఆగ్రహించారు. ప్రతిదానినీ తాము నిర్వచించిన దేశ భక్తికి అనుకూలంగా వుందా లేదా దానిని బట్టి దేశ భక్తులు, దేశ వ్యతిరేకులు అని ముద్ర వేస్తున్న రోజులివి కాబట్టి అందుకు కారకులపై ఆగ్రహించాలి.

   2010లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కూడా అవినీతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే.ఆ క్రీడలకు సంగీతం సమకూర్చటానికి ఏఆర్‌ రహమాన్‌ పదిహేను కోట్ల రూపాయలు అడగటాన్ని కొందరు నాడు విమర్శించారు. చివరకది ఐదు కోట్లకు బేరం కుదిరింది. అయితే ఆ క్రీడల ప్రారంభ సంబరాల పేరుతో చేసిన 350 కోట్ల రూపాయల ఖర్చులో అదెంత? ఆ సమయంలో అధికారంలో వుంది కాంగ్రెస్‌ కనుక నాడది అవినీతిలో భాగం, నేడున్నది బిజెపి కనుక అమితాబ్‌ది దేశ భక్తి ప్రదర్శన ! ఆహా ఎంత ఆత్మవంచన ?