సత్య
న్యూఢిల్లీలో శని, ఆదివారాలలో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశం జాతీయ వాదం, భారత మాతాకీ జై, అభివృద్ధి గురించి జపం చేసిందన్నది మీడియా వార్తల సారాంశం. అభివృద్ధి, అభివృద్ధి, మరింత అభివృద్ధి మీద కేంద్రీకరించాలి తప్ప ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ఇతర అంశాల జోలికి పోవద్దని ప్రధాని నరేంద్రమోడీ నొక్కి వక్కాణించినట్లు సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన హోంమంత్రి రాజనాధ్ సింగ్ చెప్పారు. గత ఇరవై రెండు నెలల బిజెపి కేంద్ర పాలన తీరును చూస్తే అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు బిజెపికి ఏమైనా వుందా ? ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల సందర్భంగా ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ ఐదు చోట్లా బిజెపికి ఎక్కడా అవకాశాలు లేవన్నది స్పష్టం. పార్లమెంట్ ఎన్నికలలో అసోంలో అది పొందిన ఓట్లను బట్టి అక్కడ పెద్ద పార్టీగా అవతరించవచ్చని కొంతమంది వూహాగానాలు చేస్తున్నారు, బిజెపి కూడా అదే ఆశతో వున్నట్లు కనిపిస్తోంది. చిత్రం ఏమిటంటే అక్కడ మోడీని ముందు పెడితే ప్రయోజనం లేదనుకుందో ఏమో ముందుగానే ముఖ్య మంత్రి అభ్యర్ధిని ప్రకటించింది. దీని వలన ఫలితం ఎలా వున్నా ఏ విధంగా అయినా భాష్యం చెప్పుకోవచ్చు. మోడీని ముందు పెడితే ప్రతికూల ఫలితాలు వస్తే మరింత పరువుపోవటం ఖాయం కనుక ఇలా చేశారని చెబుతున్నారు.
భావ ప్రకటన స్వేచ్ఛ రాజకీయ విమర్శలను తాము అంగీకరిస్తామని కానీ స్వేచ్ఛ పేరుతో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలను అంగీకరించేది లేదని రాజనాధ్ సింగ్ రాజకీయ తీర్మానం గురించి వివరించారు.భారత మాతాకి జై అంటేనే జాతీయ వాదం, దేశ భక్తి అనే విధంగా జాతీయ వాదానికి బిజెపి తాజా వ్యాఖ్యానం చెప్పటం జర్మనీలో హిట్లర్‌ను గుర్తుకు తెస్తున్నది.
బిజెపి జాతీయ కార్యవర్గంలో నిజంగా ఏం చర్చించారో, ఎవరు ఏం మాట్లాడారో మిగతావారు వినలేదా ? అంటే సమాధానం చెప్పటం కష్టం. రాజకీయ తీర్మానాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారు.దాని గురించి మరో మంత్రి ఆరుణ్ జైట్లీ విలేకర్లకు వివరించారు. వెంకయ్య నాయుడు ప్రవేశపెట్టారన్న సమాచారం తప్ప ఆయనేం మాట్లాడారనే అంశాన్ని కనీస ప్రస్తావన కూడా చేయలేదు. అంతకు ముందే వెంకయ్య నాయుడు తన ప్రసంగంలోని అంశాలంటూ మీడియాకు ఇమెయిల్ ద్వారా పంపారు. దానిలో ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తారు. ఇదే విషయం గురించి హోం మంత్రి రాజనాధ్ సింగ్‌ను అడగగా వెంకయ్యగారు చెప్పిన వాటితో అంగీకరించటానికి గానీ కాదనటానికి గానీ తానసలు వెంకయ్య వుపన్యాసం వినలేదని భట్టిప్రోలు పంచాయతీ తీర్పు చెప్పారు.
ఇంతకీ వెంకయ్య ఏం చెప్పారు? ఆయన మీడియాకు పంపిన ఇమెయిల్ ప్రకారం ‘మోడీ దేశానికి ఒక వరం, దేవుడు పంపిన పేదల రక్షకుడు, మోడీ పేరు ప్రతిష్టలు నూతన స్ధాయికి చేరాయి.లండన్‌లోని మాడమే టుస్సాడ్స్‌లో మోడీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కోటీ ఎనభైలక్షల మంది ట్విటర్ అనుచరులు, మూడు కోట్ల ఇరవైలక్షల మంది ఫేస్బుక్ లైక్‌లతో ప్రపంచ స్థాయిలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నాయకుడు మోడీ. అభివృద్ధి చెందుతున్న భారత్‌ను రూపాంతరం(మోడి ఫయర్) చెందించిన వ్యక్తి. ఇలా సాగింది వెంకయ్య గారి మోడీ స్త్రోత్రం. మోడీ పేదలకు బదులు పెట్టుబడిదారుల రక్షకుడని కాంగ్రెస్ ఎత్తి పొడిచింది.
ఈ పొగడ్తల గురించి మీడియా ముందు జెట్లీ లేదా రాజనాధ్ సింగ్ చెప్పరని వెంకయ్యకు బాగా తెలుసు.అందుకే తన మీడియా మేనేజ్మెంట్ పద్దతులలో ప్రసంగ అంశాలను మీడియాకు ముందే పంపారు.ఈ భజన చూస్తే అత్యవసర పరిస్థితి సందర్భంగా ఇందిరే ఇండియా ఇండియా ఇందిర అని కాంగ్రెస్ నేత డికె బారువా చేసిన పొగడ్తలు గుర్తుకు వస్తున్నాయి. దాని గురించి ఆ నాడు జనసంఘంగా వున్న నేటి బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నేడు వెంకయ్య పొగడ్తలు అంతకు తక్కువేమీ కాదు.
మోడీని వ్యతిరేకించే ఎల్‌కె అద్వానీ ప్రియశిష్యుడిగా పేరు పొందిన వెంకయ్య నాయుడు పార్టీలో నరేంద్రమోడీ ప్రాభవం పెరగ్గానే ఇటువైపు ఫిరాయించారు. తన స్వామి భక్తిని నిరూపించుకొనేందుకు మోడీని పదే పదే పొగడటంలో వెంకయ్య పేరు మోశారు. తాజా సమావేశాలలో ఆయన పొగడ్తల గురించి రాజనాధ్ సింగ్ గాలి తీయటం, దానిని జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొని వ్యాఖ్యానాలను రాయటం బహుశా వెంకయ్య నాయుడు వూహించి వుండరు. నరేంద్రమోడీ మోడీని పొగడటంలో కేంద్ర మంత్రులు పోటీ పడుతున్నారు.
ఈ సమావేశాలకు ముందు రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్జు తన ఫేస్బుక్ ఖాతాలో నరేంద్రమోడీ 2026 వరకు ప్రధానిగా పదవిలో కొనసాగుతారని 1555లోనే ఫ్రెంచి జోస్యుడు నోస్ట్రాడామస్ చెప్పారని ఒక పోస్టును పెట్టాడు. మోడీ భారత్‌ను స్వర్ణయుగంలో ప్రవేశపెడతారని, అనేక దేశాలకు రక్షణ కల్పించే దేశంగా భారత్ ఎదుగుతుందని పేర్కొన్నాడు. ‘ 2014 నుంచి 2026 వరకు మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి భారత్‌కు నాయకత్వం వహిస్తాడని, ఆయనను తొలుత జనం ద్వేషించినా, తరువాత ఎంతగానో ప్రేమిస్తారని దేశ దశ, దిశను ఆయన మారుస్తాడని, ఆయన నాయకత్వంలో భారతదేశమే గాక మొత్తం ప్రపంచం స్వర్ణయుగంలో ప్రవేశించటమే గాక ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తుందని ‘ జోస్యం చెప్పినట్లు రిజు పేర్కొన్నారు.
సాధించిన విజయాలేమీ లేనపుడే ఇలాంటి పోసుకోలు కబుర్లతో నాయకత్వాన్ని పొగుడుతూ కాలక్షేపం చేయటం అన్ని పాలకవర్గ పార్టీలలో వున్న ఒక వుమ్మడి లక్షణం.