సత్య
తెలుగు వారందరికీ సుపరిచితమైన ఒక చక్కటి సామెత ,అదే పిర్ర గిల్లి జోల పాడటం గురించి వేరే చెప్పనవసరం లేదు. ‘దేశ భక్త ‘నరేంద్రమోడీ మనకు మరోసారి దానిని గుర్తు చేశారు.( కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యలో బిజెపి నేతల పేర్లకు ముందు దేశభక్త పదం తగిలించినందుకు మన వూరి దేశ భక్త కొండా వెంకటప్పయ్య కూడా పరివార్ బాపతా అని అనుకొనే ప్రమాదంలో పడవేశావని ఒక మిత్రుడు చేసిన మందలింపుతో కూడిన విమర్శ సరైనదే) న్యూఢిల్లీలో సోమవారం నాడు అంబేద్కర్ స్మారక వుపన్యాసం చేసిన ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్ల విధానంలో ఎలాంటి మార్పు లేదని, ఒక వేళ అంబేద్కరే తిరిగి వచ్చినా దానిని మార్చలేరని, ఆయన ముందు మనమెంత అని మోడీ ప్రశ్నించారు. తామంటే గిట్టని వారు రిజర్వేషన్లపై తన ప్రభుత్వ విధానాల గురించి ఆవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. గతంలో వాజ్పేయి ప్రధానిగా వుండగా ఇదే మాదిరి ప్రచారం చేశారని, తమ పార్టీ మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలలో అధికారంలో వున్నప్పటికీ ఎన్నడైనా రిజర్వేషన్ల విధానం మార్చేందుకు ప్రయత్నించిందా అని అమాయకంగా అడిగారు. నిజమే ! అనేక సమస్యలపై అడిగినా నోరు విప్పని ప్రధాని తనంతట తానుగా దీని గురించి చెప్పటానికి ఏ పార్టీ ప్రచారం చేసిన అసత్యమేమిటో చెప్పి వుంటే నిజాయితీగా వుండేది.అన్నింటికీ మించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంఘపరివార్ అధినేత మోహన్ భగవత్ మాటలపై ఇంతవరకు మోడీ నోరు విప్పలేదు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పటం సంతోషమే. కానీ వాటిపై పార్టీ వైఖరి ఏమిటి ?
రిజర్వేషన్ల గురించి తాజాగా వార్తలలోకి ఎక్కింది అపర సాంస్కృతిక సంస్ధ ఆర్ఎస్ఎస్ మాత్రమే. నాగపూర్లో జరిగిన సమావేశాల సందర్భంగా ఆ సంస్ధ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషీ విలేకర్ల సమావేశంలో రిజర్వేషన్లపై చేసిన ప్రస్తావనతో స్పందన వచ్చింది తప్ప మరొకటి కాదు.ఒక్క రిజర్వేషన్లే కాదు, అనేక అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయటం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. గతేడాది బీహార్ ఎన్నికలకు ముందు ముందు ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ తమ పత్రికలైన పాంచజన్య, ఆర్గనైజర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లు ఎవరికి, ఎంతకాలం ఇవ్వాలో నిర్ణయించేందుకు రాజకీయేతర కమిటి నిర్ణయించాలని చెప్పారు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు సురేష్ భయ్యాజీ కూడా మరో రూపంలో దానినే పునరుద్ఘాటించారంటే జనం దానిని ఎలా స్వీకరించాలి. ఫిబ్రవరి నెలలో కొల్కతా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ ‘అనేక మంది రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఎవరు అర్హులో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయటం అవసరం అని నేను భావిస్తున్నాను.అ కమిటీ రాజకీయ రహితమైనదిగా వుండాలి, తద్వారా స్వప్రయోజనాలకు పాల్పడకుండా చూడవచ్చు, సమాజంలో ఏ తరగతిని ముందుకు తీసుకురావాలి, వారికి ఎంతకాలం రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నదాని గురించి ఒక నిర్ణీత కాల పరిమితి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. ఆ కమిటీకి దానిని అమలు జరిపే అధికారాలు ఇవ్వాలి’ అని మోహన్ భగవత్ చెప్పారు. ‘అదే సమయంలో కేవలం ఒక కులంలో పుట్టిన కారణంగా అవకాశం దొరకకుండా వుండకూడదు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు వుండాలి. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు వుండాలి. కేవలం పుట్టుక కారణంగానే రిజర్వేషన్ పొందేట్లయితే ఆ పరిస్తితి ఎంతకాలం వుంటుందో అంతకాలం రిజర్వేషన్లు వుంటాయి అని కూడా భగవత్ చెప్పారు.
బీహార్ ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగటంతో తమ నేత వర్తమాన రిజర్వేషన్ కోటా గురించి మాట్లాడలేదని, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రతిఫలాన్ని పొందాలన్నది వుద్దేశ్యమని ఆర్ఎస్ఎస్ సంజాయిషీ ఇచ్చుకుంది. భగవత్ వ్యాఖ్యలతో తమకేమీ సంబంధం లేదని బిజెపి ప్రకటించుకుంది. చిత్రమేమంటే ఆ భగవత్ సమక్షంలోనే బిజెపి కేంద్ర మంత్రులందరూ నిక్కర్లు వేసుకొని కేంద్ర ప్రభుత్వం గురించి సమీక్ష జరిపారు.అదే భగవత్ ఆ తరువాత అఖిల భారతీయ వాల్మీకి మహాసభలో మాట్లాడుతూ సమాజంలో అన్ని తరగతుల అభ్యున్నతి గురించి తప్ప ఆర్ఎస్ఎస్కు రిజర్వేషన్లు ఒక సమస్య కాదని, తమ సంస్ధ హిందువుల అభ్యున్నతికోసం పాటు పడుతుందని చెప్పారు.(డిఎన్ఏ అక్టోబరు 26,2015)
రాజకీయ ప్రయోజనాల కోసం, మెజారిటీ పౌరుల ఓటు బ్యాంకు ఏర్పాటు, వారిని సంతృప్తి పరచేందుకు రిజర్వేషన్లపై భిన్న స్వరంతో మాట్లాడటం తరువాత అబ్బే అబ్బే లేదనటం పదే పదే జరుగుతోంది.హర్యానాలో జాట్లు రిజర్వేషన్ల కోసం హింసాత్మక ఆందోళనకు పూనుకుంటే వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది బిజెపి. బీహార్ ఎన్నికలలో బిజెపి మిత్ర పక్షంగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ ఆర్ఎస్ఎస్ నేతల వాదనను సమర్ధించారు. భవిష్యత్ ఎన్నికలలో తాను, తన కుమారుడు జనరల్ సీట్లలో పోటీ చేసి ఇతరులకు రిజర్వుడు సీట్లలో అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అటువంటి ప్రకటన బిజెపి, దాని మిత్రపక్షాలలోని నేతలందరూ ఒక వరవడిగా అమలు జరిపి ఇతర పార్టీల నేతలకు మార్గదర్శనం చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంగిట్లో వున్నాయి, బిజెపి సాధారణ సీట్లలో ఎంత మంది దళితులు, గిరిజనులకు అలాగే ముస్లింలకు సీట్లు ఇచ్చి ఆర్ఎస్ఎస్ స్ఫూర్తిని అమలులోకి తెస్తుందో నిరూపించుకొనే తరుణమిది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ వ్యాఖ్యలు ఎక్కడ తమ అవకాశాలను దెబ్బతీస్తాయోనన్న భయంతో నరేంద్ర మోడీ అంబేద్కర్ స్మారక వుపన్యాస అవకాశాన్ని వుపయోగించుకొని నష్ట నివారణకు ప్రయత్నించారు తప్ప మరొకటి కాదు. రిజర్వేషన్లపై సమీక్ష జరపాలన్నది మోహన్ భగవత్ ఏదో అనాలోచితంగా చెప్పింది కాదు. 1981, 1985లో రెండు సార్లు అఖిలభారత ప్రతినిధి సభ, కార్యకారీ మండలి సమావేశాలలో రిజర్వేషన్లను సమీక్షించాలని ఏకంగా ఆర్ఎస్ఎస్ తీర్మానాలు చేసి డిమాండ్ చేసింది. వాటిని రద్దు చేసుకున్నట్లు ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, ఎలాంటి కొత్త తీర్మానాలు చేయలేదు కనుక మోహన భగవత్ పాత తీర్మానాల సారాంశాన్ని పునరుద్ఘాటించారు. అందువలన సమీక్ష జరగాలన్న ఆర్ఎస్ఎస్ నేతల వైఖరి సరైనదో, ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పూ వుండదని చెబుతున్న మోడీ వైఖరి సరైనదో స్పష్టం చేయాలి. తామంతా పరివార్ కుటుంబమేనని సగర్వంగా అందరూ చెప్పుకుంటున్నారు గనుక ఆర్ఎస్ఎస్-బిజెపి రెండూ తమ వైఖరిని చెప్పాలి. దాగుడు మూతలకు తెరదించాలి.