ఎంకెఆర్
పెట్రోలు ధరల పెరుగుదల ఎక్కడ ఎలా ?
ప్రపంచ చమురు మార్కెట్లో 2015 జూన్ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో ముడిచమురు ధరలు 48శాతం తగ్గాయి. ఆమేరకు ఎన్ని దేశాలలో చమురు ధరలు తగ్గాయి ? సమాచారం అందుబాటులో వున్న 96 దేశాల వివరాల ప్రకారం ఆ మేరకు ఏ దేశంలోనూ ధరలు తగ్గలేదు. పది దేశాలలో ఒకటి నుంచి 14శాతం మేరకు ధరలు పెరిగాయి. ఏడు దేశాలలో ఎలాంటి మార్పు లేదు. డెబ్బయి తొమ్మిది దేశాలలో ఒకటి నుంచి 29శాతం వరకు మాత్రమే ధరలు తగ్గాయి. మన దేశంలో 12, చైనాలో 15శాతం మేరకు తగ్గాయి.
ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఒకే విధంగా వుంటాయి. అయితే ఆయా దేశాలలో విధించే పన్నులు, వాటి కరెన్సీల విలువ, ఇచ్చే రాయితీలను బట్టి వినిమయదారులకు వేర్వేరు ధరలు వుంటాయి.గతవారం మన ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచింది. మరి ఇదే సమయంలో ఇతర దేశాల్లో పెరిగాయా? చూడండి. ధరగా పేర్కొన్న మొత్తాలు స్ధానిక కరెన్సీలో అని, స్థానిక పన్నులతో ప్రతి వారం ఒక నిర్ణీత కేంద్రంలో సేకరించిన వివరాలుగా గమనించాలి. మన దేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ పన్నుల రేటు కారణంగా ధరలలో మార్పు గురించి తెలిసినదే. పెట్రోలు ధర మార్పు శాతాలలో.
దేశం ప్రస్తుత ధర వారంలో మార్పు మూడు నెలల్లో మార్పు
భారత్ 62.09 4.9 -2.5
పాకిస్థాన్ 62.77 0.0 -17.7
శ్రీలంక 128.0 0.0 0.0
మలేషియా 1.6 0.0 -17.9
చైనా 5.92 0.0 -2.0
నేపాల్ 99.00 0.0 -4.8
సింగపూర్ 1.8 0.0 -5.0
తాము అధికారంలోకి రావటం అంటే మంచి రోజులు వచ్చినట్లే అని నరేంద్రమోడీ చెబుతారు, రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా మాదిరి మారుస్తానని చెప్పే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నరేంద్రమోడీ అడుగుజాడల్లో నడిచే చంద్రబాబు నాయుడు ఈ ధరల గురించి ఏం చెబుతారు? కనీసం పెట్రోలు,డీజిల్ విషయాల్లో ఎవరికి మంచి రోజులు వచ్చినట్లు ? మన దేశంలో ప్రపంచ మార్కెట్లకు అనుగుణ్యంగా ధరలు ఎందుకు తగ్గటం లేదు? కర్ణుడి చావుకు కారణాలు అనేక అన్నట్లు పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని గత 22నెలల కాలంలో రెట్టింపునకు పైగా పెంచింది. తెలుగు రాష్ట్రాలలో వ్యాట్‌ను పెంచాయి.. దీనికి తోడు రూపాయి విలువను నిలబెట్టటంలో మోడీ సర్కార్ విఫలమైంది.