Tags

, , , , , ,

ఎంకెఆర్‌

   హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులతో అమీ తుమీ తేల్చుకొనేందుకే సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.అందుకు కెసిఆర్‌ కూడా సై అన్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంఛార్జి వైస్‌ ఛాన్సలర్‌కు సైతం తెలియకుండా సెలవుపై వెళ్లిన వైస్‌ ఛాన్సలర్‌ పొదిలె అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయంలో ప్రత్యక్షం కావటం యాదృచ్చికంగా జరిగిందని ఎవరూ అనుకోవటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న విషయమేమీ రహస్యం కాదు. దానికి ముందుగానే వైస్‌ ఛాన్సలర్‌ అకస్మికంగా ప్రత్యక్షం కావటం కన్నయ్యను విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టకుండా చేయటానికే అన్నది సుస్పష్టం. తన ఆందోళన ప్రస్తానంలో విద్యార్ధులను ఎంతగానో వుపయోగించుకున్న తెలంగాణా ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు కనుసన్నలలో పనిచేసే పోలీసు యంత్రాంగం వివాదాస్పద వైస్‌ ఛాన్సలర్‌కు మద్దతుగా విద్యార్దుల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే ఓడమల్లయ్య బోడి మల్లయ్యను గుర్తుకు తెస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ మద్దతు లేకుండా వైస్‌ ఛాన్సలర్‌ తిరిగి విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టే సాహసం చేసి వుండరని లోకం కోడై కూస్తున్నది.

    ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులపై దేశ ద్రోహ నేరం మోపేందుకు బహుశా బ్రిటీష్‌ పాలకులు కూడా సిగ్గుపడే విధంగా వీడియోలను తిమ్మిని బమ్మిని చేసి చేతులు కాల్చుకున్న కేంద్ర ప్రభుత్వం అది కాస్త చల్లబడగానే హైదరాబాదులో మరో అధ్యాయానికి తెరతీసింది. వైస్‌ ఛాన్సలర్‌ పొదిలె అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పగించటం ద్వారా విద్యార్ధులను రెచ్చగొట్టింది. వైస్‌ ఛాన్సలర్‌పై కేసులు నమోదు చేయాలన్న విద్యార్ధుల డిమాండ్లను పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సదరు అప్పారావు కబురు చేయగానే తగుదునమ్మా అంటూ విద్యార్ధులపై తన ప్రతాపం చూపింది. చివరకు అమ్మాయిలను కూడా మగ పోలీసులు వదలి పెట్టలేదు. బూతులు తిట్టకపోతే పోలీసులే కారు అని మరోసారి నిరూపించుకున్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రుజువు చేసుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా వుండాలనుకుంటే అది వేరే విషయం, కానీ అందుకు చూశారా విద్యార్ధులపై ఎలా లాఠీని ఝళిపించానో అంటూ మోడీని సంతృప్తి పరచేందుకు ప్రయత్నించటం అన్యాయం. ఇప్పటి వరకు దేశమంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనే తన నిరసనను కేంద్రీకరించింది, ఇప్పుడు దానిలో కూడా వాటా కావాలని చంద్రశేఖరరావు కోరుకుంటునట్లున్నారు. వైస్‌ ఛాన్సలర్‌ తిరిగి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అంశం పోలీసులకు తెలియదా ? వైస్‌ ఛాన్సలర్‌ రాక సందర్భంగా జరిగాయని చెబుతున్న వుదంతాలే అందుకు నిదర్శనం.అటువంటపుడు ఆయన వస్తే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని కేంద్రానికి తెలంగాణా సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది? ఆ వుదంతాలను ఎందుకు నిరోధించలేకపోయింది? పోనీ తగిన భద్రతా సిబ్బందిని నియమించి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? న్యూఢిల్లీ పోలీసు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కాబట్టి జెఎన్‌యు విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటానికి కేంద్ర ప్రభుత్వ వత్తిడి కారణం కావచ్చు. కానీ హైదరాబాదు పోలీసులు కూడా అదే పని చేస్తారని బహుశా విద్యార్ధులు వూహించి వుండరు.

   విద్యార్ధులకు తగిన ‘పాఠం’ చెప్పేందుకు ఎంతో అనుభవం వున్న వైస్‌ ఛాన్సలర్‌ హాస్టళ్లు,మెస్‌లను మూసి వేసి, ఇంటర్నెట్‌ను కట్‌ చేసి తానంటే ఏమిటో రుజువు చేసుకున్నారు. బహుశా దేశభక్త ఎబివిపి విద్యార్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వుంటారు, లేదా బయటి నుంచి సాయం తీసుకొని వుండాలి. తిరిగి వస్తూనే ఈనెల 24న జరగాల్సిన అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయటం ఆయన చేసిన తొలి ఘనకార్యంగా చెబుతున్నారు. ఆ సమావేశంలో వివక్ష వ ్యతిరేక కమిటీ ఏర్పాటు, వివిధ కమిటీలలో ఎస్‌సి,ఎస్‌టిల ప్రాతినిధ్యాన్ని పెంచటం, నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ ఎనిమిది నుంచి 25వేలకు పెంచే ప్రతిపాదనను పరిశీలించటం వంటి అంశాలు అజెండాగా వున్నాయి. అలాంటి ముఖ్యమైన సమావేశాన్ని వాయిదా వేయటం వుద్రిక్తతలను వుపశమించటానికి గాక మరింత ఎగదోయటానికే తోడ్పడతాయి.

   హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన తాజా వుదంతాలలో బోధనేతర సిబ్బందిని విద్యార్ధులకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు ప్రయత్నించటం కొత్త , ప్రమాదకర పరిణామం.వైస్‌ ఛాన్సలర్‌ నివాసంపై విద్యార్ధులు దాడి చేశారనే ఆరోపణతో బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగటం, మెస్‌లను మూసివేయటం సరైన చర్య అవుతుందా? అది సమర్ధనీయమే అనుకుంటే విద్యార్ధుల పట్ల వైస్‌ ఛాన్సలర్‌ అనుసరించిన వైఖరి,వాటి పర్యవసానాలకు కూడా వారు బాధ్యత వహిస్తారా ? ఇది విశ్వవిద్యాలయంలో పరిస్థితులు మరింత దిగజారటానికి దారితీయ వచ్చు. బోధనేతర సిబ్బంది-విద్యార్ధులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. పంచాయతీ వారి మధ్య కాదు, వున్నతాధికారులు-విద్యార్ధుల మధ్య కనుక విచక్షణతో వ్యవహరించటం అవసరం.