Tags

, , , , , , ,

చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు.

ఎం కోటేశ్వరరావు

    భారత మాతపై రెండు ఫత్వాలు జారీ అయ్యాయి. మెజారిటీ మతోన్మాదులు, మైనారిటీ మతోన్మాదులు ఎవరు చేసినా ఇవి రెండూ ఇప్పటికే సమాజంలో వున్న చీలికలు, అపోహలను మరింత గట్టిపరుస్తాయి. దేశానికి నష్టదాయకం. ప్రధాని నరేంద్రమోడీ బిజెపి జాతీయ సమావేశంలో వికాస మంత్రాన్ని జపిస్తే అదే సమావేశంలో పార్టీ మాత్రం దాని కంటే భారత మాతకు జై అనని వారు రాజ్యాంగాన్ని గౌరవించనివారిగా పరిగణించబడతారు అంటే దేశద్రోహుల కిందే లెక్క అన్న విడగొట్టే తీర్మానం చేసింది. దీన్నే మరో విధంగా ఆ పార్టీకి తెలిసిన భాషలో చెప్పాలంటే ఫత్వా జారీ చేసింది. దీనంతటికీ కారణం భారత మాతాకీ జై అనే నినాదాన్ని దేశభక్తిగా యువతరానికి బోధించాల్సిన అవసరం వుందని బిజెపి మాతృమూర్తి సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధిపతి మోహన్‌ భగత్‌ చిచ్చు రాజేశారు. దానికి ప్రతిగా మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తాను అలా నినదించను అని ప్రకటించి ఆజ్యం పోశారు. చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు. అధిపతి చెప్పిన తరువాత అనుచర గణం వూరికే ఎలా వుంటుంది? ఏకంగా బిజెపి సమావేశంలో తీర్మానం చేసింది. ఇదే సమయంలో హైదరాబాదుకు చెందిన అల్‌ మహద్‌ అల్‌ అలాలీ అల్‌ ఇస్లామీ, జామియా నిజామియా అనే మత సంస్థలు దీనికి ప్రతిగా భారత మాతకు జై అనటానికి ముస్లింలకు అనుమతి లేదని ఒక ఫత్వా జారీచేశాయి. దేశాన్ని ఒక మాతగా కొలవటానికి లేదని అవి పేర్కొన్నాయి. ప్రతి ముస్లిం తన దేశాన్ని ప్రేమిస్తారు, అందుకోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఇది వేరే విషయం, పూజించాల్సి వచ్చినపుడు అల్లాను తప్ప మరొకరిని ఇస్లాం అంగీకరించదని, రెండింటినీ కలగా పులగం చేయవద్దని ఆ సంస్ధలు చెబుతున్నాయి. భారత్‌కు జై, జై హింద్‌, హిందుస్తాన్‌ జిందాబాద్‌ అనటానికి తమకు ఇబ్బంది లేదని భారత మాత అంటే ఒక దేవతకు ప్రతిరూపంగా వున్నందున తాము జై కొట్టలేమని ముస్లిం నాయకులు ప్రకటించారు. ఇప్పుడు శిరోమణి అకాలీదళ్‌(అమృతసర్‌)కు చెందిన సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ కూడా సిక్కులు ఏ రూపంలోనూ మహిళలను పూజించరని అందువలన తాము భారత మాతాకి జై అనేది లేదని ప్రకటించారు. ‘దీని గురించి నేను వ్యాఖ్యానించాలనుకోవటం లేదు, ఇదొక వృధా వివాదం’ అని బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ విలేకర్లు అడిగిన దానికి బదులిస్తూ బుధవారం నాడు అహమ్మదాబాద్‌లో వ్యాఖ్యానించారు. భారత మాతాకీ జై అని ప్రతి ఒక్కరూ అనే విధంగా, గోవధను రాజ్యాంగంలో చేర్చాలని యధాప్రకారం బాబా రాందేవ్‌ డిమాండ్‌ చేశారు.

   హిందువుల అభ్యున్నతి కోసం (అది చెప్పే హిందూ అంటే భారత్‌ , భారత్‌ అంటే హిందూ అనే వ్యాఖ్యానానికి అర్ధం అదే) పని చేస్తున్నట్లు చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ విరుద్ధ ముఖాలను ఎందుకు ప్రదర్శిస్తున్నట్లు ? నరేంద్రమోడీ అంటే ‘గుజరాత్‌ మోడల’్‌ తప్ప రాజ్యాంగం గురించి అంతగా తెలిసిన వ్యక్తి కాదనుకోవచ్చు, మరి అరుణ్‌జైట్లీ వంటి సుప్రసిద్ద లాయర్లు వుండి కూడా అలాంటి తీర్మానాలు ఎందుకు చేయిస్తున్నట్లు ? నిద్ర పోయే వారిని లేపవచ్చు తప్ప నటించే వారిని లేపలేము అన్నట్లే ఇదంతా ఒక పధకం ప్రకారమే జరుగుతోందని అనేక మంది భావించటంలో ఆశ్చర్యం లేదు. భారత మాతకు జై అనేందుకు నిరాకరించిన మహారాష్ట్ర శాసనసభలో మజ్లిస్‌ పార్టీ సభ్యుడిని వర్తమాన సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. చట్ట సభలు చేసిన నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించటానికి వీలు లేదనే తీర్పులు వెలువడుతున్న తరుణంలో అది కోర్టు పరిధిలోకి రాదు. కానీ బయట ఎవరైనా భారత మాతకు జై అనను అంటే అలాంటి వారిపై చర్య తీసుకోవటం కుదరదు, ఎవరైనా అలాంటి పిచ్చిపనిచేస్తే అది కోర్టులో చెల్లదు.ఎందుకంటే మన రాజ్యాంగంలో భారత్‌ అనే పదం వుంది తప్ప భారతమాత లేదు.అయినా సరే బిజెపి తన తీర్మానంలో ఇలా పేర్కొన్నది.’మన రాజ్యాంగం ఇండియాను భారత్‌ అని కూడా వర్ణించింది.భారత్‌ విజయం గురించి నినదించకపోవటం మన రాజ్యాంగాన్నే అగౌరవపరచటంతో సమానం’ అని పేర్కొన్నది. భారత స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, రాజ్యాంగంతో గాని ఎలాంటి బీరకాయ పీచు సంబంధం కూడా లేని బిజెపి రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్దంగా వ్యవహరించటంలో ఆశ్చర్యం ఏముంది ?

   నినాదాలు చేయటం ద్వారా జాతీయ వాదాన్ని తయారు చేయలేమని వాజ్‌పేయి ప్రధానిగా వున్న కాలంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన సోలీ సోరాబ్జీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆయనే మరొక విషయాన్ని కూడా తెలిపారు. విజయ్‌ ఇమ్మాన్యుయెల్‌-కేరళ రాష్ట్ర వివాదంలో 1986లో మైలురాయిగా పేర్కొన దగిన తీర్పును సుప్రీం కోర్టు జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి ఇచ్చారు.యెహోవా విట్‌నెస్‌ అనే క్రైస్తవ తెగకు చెందిన వారు జాతీయ గీతం పాడేటపుడు గౌరవసూచకంగా లేచి నిలబడతారు తప్ప దానిని పాడకూడదని అందువలన తాము జాతీయ గీతాన్ని పాడలేదని విద్యార్ధులు చేసిన వాదనపై వివాదం కోర్టుకు ఎక్కింది.ఆ విద్యార్ధుల చర్యను సమర్ధిస్తూ ‘ మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తున్నది, మన తత్వశాస్త్రం సహనాన్ని బోధిస్తున్నది, మన రాజ్యాంగం సహనాన్ని ఆచరిస్తున్నది, మనం దాన్ని నీరు గార్చవద్దు’ అని న్యాయమూర్తి చిన్నప రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారంటూ సహనాన్ని స్పష్టంగా నిర్ధారించిన తీర్పు అని సొరాబ్జి వ్యాఖ్యానించారు.

   సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం రాజ్యాంగంపై బిజెపి పూర్తిగా తప్పుడు వైఖరి తీసుకున్నది అని వ్యాఖ్యానించారు. కేరళ విద్యార్ధి కేసునే వుదాహరిస్తూ జాతీయ గీతాన్ని పాడనందుకు విద్యార్ధులను స్కూలు నుంచి బహిష్కరించారు. వారు దేశం లేదా జాతీయ పతాకం పట్ల ఎలాంటి అగౌరవాన్ని ప్రదర్శించలేదని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నారు.అందువలన వర్తమాన వివాద పూర్వరంగంలో ఒక వ్యక్తి ఎవరైనా ఇతర విధాలుగా దేశాన్ని అగౌరవపరిస్తే తప్ప కొన్ని నినాదాలను నేను చేయను అంటే అది మొత్తంగా అగౌరవ పరిచినట్లు కాదని సుందరం చెప్పారు. దేన్నయినా నినదించాలా లేదా అనేది అతనికి లేదా ఆమెకు సంబంధించిన విషయం. రాజ్యాంగం ప్రకారం భారత మాతాకీ జై అని నినదించకపోవటం దేశాన్ని అగౌరవపరచటంగా నేను అంగీకరించను, ఇదంతా పూర్తిగా అనవసరమైన చీలికలను సృష్టిస్తున్నది. ఎవరైనా దేశాన్ని లేదా జాతీయ పతాకాన్ని అగౌరవ పరిస్థే చర్య తీసుకోవాలని నేను కూడా నమ్ముతాను, ప్రస్తుతం అలాంటిదేమీ నాకు కనిపించటంలేదు.అలాంటి చర్యలు చీలికలను మరింత గట్టిపరుస్తాయి అని సుందరం అన్నారు.

   ‘ రాజ్యాంగ ప్రకారం భారత మాతాకు జై అని జనం అనాల్సిన అవసరం లేదు,ఎక్కడా దాని గురించి చర్చించలేదు. బిజెపి తీర్మానం తప్పుడు వ్యాఖ్యానం. ఇండియా అంటే భారత్‌ అని మాత్రమే రాజ్యంగం చెప్పింది.అది భారత మాత గురించి పేర్కొనలేదు. కాబట్టి అలాంటి నినాదం చేయటం ప్రతి పౌరుడి ప్రాధమిక విధి కాదు,మనం అందరం దేశాన్ని ప్రేమిస్తాము, గౌరవిస్తాము, కానీ దానిని మన మీద రాసుకొని తిరగము’ అని మరో సీనియర్‌ న్యాయవాది కామినీ జైస్వాల్‌ అన్నారు.’ బిజెపి వారు అనవసరంగా ఒక వివాదాన్ని సృష్టించారు. ఎవరూ కోరుకోని దానిని వారు సృష్టించబోతున్నారు. వారు జనాన్ని విభజించేందుకు పూనుకున్నారు, ఈ సమస్యలను రేకెత్తించకూడదు’ అని కూడా ఆమె చెప్పారు.మహా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పూర్తిగా తప్పుడు నిర్ణయం, ఎవరైనా దానిని సవాలు చేయాలి’ అని కూడా అన్నారు.

    ముంబైకి చెందిన న్యాయవాది అబ్దుల్‌ మజీద్‌ మెమన్‌ మాట్లాడుతూ ‘ ఈ సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు బిజెపి అలాగే మజ్లిస్‌ రెండూ తప్పు చేస్తున్నాయి. రాజకీయాలు చేస్తున్నారు. నా వరకు భారత మాతాకి జై అనటం ఒక సమస్య కాదు. ఆ నినాదమిస్తే ఏం హాని జరుగుతుంది.అసెంబ్లీ నుంచి వారిస్‌ పఠాన్‌ను సస్పెండ్‌ చేయటం అతి ప్రతిస్పందన అనుకుంటున్నాను. నినదించటం తప్పుకాదని నమ్ముతున్నట్లు నేను అతనితో టీవీ చర్చలో కూడా చెప్పాను, అయితే బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ వత్తిడి చేసిన కారణంగా తానా పనిచేయనని అతను అన్నాడు. దీంతో ఆ సమస్య అక్కడితో ముగిసి వుండాల్సింది’ అన్నారు.

   ‘మజ్లిస్‌ మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించేది కాదని నేను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయదలచాను. వారి చర్యలతో వాతావరణాన్ని కలుషితం కానివ్వరాదు.ఈ సమస్యను అనవసరంగా రేకెత్తించారని నేను కూడా భావిస్తున్నాను. హైదరాబాదుకు చెందిన ఒక మత పెద్ద భారత మాతాకి జై అనటాన్ని అభ్యంతర పెట్టినట్లు నేను చదివాను. గత అరవై సంవత్సరాలుగా వారికి సమస్య లేదు. ఇప్పటికీ వారికి భారత్‌ లేదా జై అనటానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ సమస్య ఎక్కడంటే మాత లేదా తల్లి అని చెప్పటంలోనే. మాతృదేశం అన్న భావనలో ఇప్పుడు తప్పేమిటి ? భారత మాత అంటే మదర్‌ ఇండియా వంటిదే. కానీ ఒక ముస్లిం మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన మదర్‌ ఇండియా అవార్డు వచ్చిన సినిమా, దానిలో మరొక ముస్లిం అయిన నర్గీస్‌ దత్‌ ప్రధాన పోత్ర పోషించారు, దానితో ఎవరికీ ఇబ్బంది రాలేదు. కానీ అసలు సమస్య ప్రతిసారీ ముస్లింలు తమ విదేయత, దేశభక్తిని నిరూపించుకోవటంలో అలసి పోయారు. అందుకోసం వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి నుంచి సర్టిఫికెట్‌ అవసరం లేదు’ అని మెమెన్‌ స్పష్టం చేశారు. మరొక సుప్రీం కోర్టు లాయర్‌ రాజు రామచంద్రన్‌ కూడా జాతీయ గీతాన్ని ఆలపించకపోవటం అనుమతించదగినదే అని కేరళ విద్యార్ధుల కేసు స్పష్టం చేసింది. కొంత మంది డిమాండ్‌ చేసినంత మాత్రాన ఒక నినాదాన్ని పలకనంత మాత్రాన అది రాజ్యాంగాన్ని అగౌరవపరచినట్లు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. ‘తన తీర్మానంలో బిజెపి ఈ విధంగా ప్రస్తావించటం దురదృష్టకరం, ఒక న్యాయవాదిగా నాకు అరుణ్‌ జైట్లీ అంటే గౌరవం వుంది, పార్టీ తీర్మానంలో రాజ్యాంగాన్ని ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యానం చేయటాన్ని నిరోధించేందుకు ఆయన అయినా ప్రయత్నించి వుండాల్సింది’ అని మరో సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వ్యాఖ్యానించారు.

   భారత మాతాకీ జై అన్న నినాదం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కంటే ముందే స్వాతంత్య్ర వుద్యమంతో ముడిపడి వున్నదని, భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ ఆ నినాదాలతోనే వురి కంబం ఎక్కారు, ఇప్పుడు ఆ నినాదం గురించి చర్చించటమే ఒక విద్రోహం అని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా తన పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యా నించారు. నిజమే ఆంగ్లేయులు మన దేశాన్ని అక్రమించినందున దాస్యవిముక్తి చేయటానికి అనేక మంది దేశ భక్తులు జాతీయ వాదంలో భాగంగా అనేక నినాదాలు ఇచ్చిన మాట వాస్తవం. అదే భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని కూడా అన్నారు. మరి దాన్ని నినదించాలని సంఘపరివార్‌ లేదా బిజెపి ఎందుకు కోరటం లేదు. అన్నింటి కంటే భగత్‌ సింగ్‌ ఆ నినాదం చేస్తున్న తరుణంలో సంఘపరివార్‌ నేత సావర్కర్‌ ఆంగ్లమాతాకు జై అని నినాదాలు ఇస్తామని,తెల్ల దొరలకు సేవలు చేసుకుంటామని, బొలో స్వాతంత్య్ర భారత్‌కు జై అనే నినాదం మా నోట వెంట రానివ్వబోమని జైలు నుంచి బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన పచ్చినిజాన్ని కాదంటారా ? ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనటానికి ఏ మతానికి లేదా మరొకరికి అభ్యంతరం లేదు దాన్ని వదలి పెట్టి వివాదాస్పద అంశాలనే ఎందుకు అమ్ముల పొదిలోంచి బయటకు తీస్తున్నట్లు ?

  వందేమాతరం అన్నందుకు నాడు బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్ర సమర యోధులను జైల్లో పెట్టారు. ఇదే నినాదాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో అసందర్భంగా చేసినందుకు రాజీవ్‌ యాదవ్‌ అనే లాయర్‌ను న్యాయమూర్తులు మందలించటంతో అతను కోర్టుకు క్షమాపణ చెప్పాడు. అంటే దీని అర్ధం జడ్జీలకు దేశభక్తి లేదనా ? జాతీయ వాదులు కాదనా ? వందేమాతర గీతం, నినాదం ఒక వివాదాస్పద అంశం. స్వాతంత్య్ర వుద్యమ కాలంలోనే ముస్లింలు, సిక్కులు దానిని పాడేందుకు నిరాకరించారు.అంత మాత్రాన స్వాతంత్య్ర వుద్యమం వారిని దేశద్రోహులుగా లేక జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు. అక్కున చేర్చుకుంది. ఎందరో ముస్లింలు, సిక్కులు వందేమాతరం అనకుండానే తమ తమ పద్దతుల్లో స్వాతంత్య్ర వుద్యమంలో ఎన్నో త్యాగాలు చేయలేదా ? వారు దేశభక్తులు కాలేదా ?

   బిజెపి కనుక దేశభక్తి, జాతీయ వాదాలపై చట్టాలను సవరించి వాటిని గతం నుంచి వర్తింపచేయాలని గనుక నిర్ణయిస్తే జనగనమణ గీత రచయిత రవీంద్రనాధ ఠాగూర్‌ కూడా దేశద్రోహి వర్గీకరణకిందికే వస్తారు. ఒక గీతం జాతిని ఐక్య పరచాలి తప్ప విడదీయకూడదంటూ వందేమాతర గీతాన్ని రవీంద్రుడు తిరస్కరించారు. ‘ఈ అంశంపై బెంగాలీ హిందువులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు, కానీ ఇది ఒక్క హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు. రెండు వైపులా బలమైన భావనలు వున్నాయి. సమతుల్యమైన న్యాయం అవసరం. మన రాజకీయ లక్ష్యాల వుద్యమంలో మనం శాంతి, ఐక్యత, మంచితనం కోరుకుంటున్నాం, ఒక వర్గం చేసిన డిమాండ్లకు ప్రతిగా మరొక వర్గం చేసే డిమాండ్లతో అంతంలేని ఎదురుబొదురు బలప్రదర్శనలు తగదు.’అని రవీంద్రుడు సుభాస్‌ చంద్రబోస్‌కు రాసిన లేఖలో సూచించారు. చివరకు కాంగ్రెస్‌ వందేమాతర గీతంలో హిందూ దేవత దుర్గకు సంబంధించిన భాగాలు మినహా మిగతా భాగాన్ని ఆమోదించింది. చివరకు మన రాజ్యాంగసభలో కూడా ఇది వివాదాస్పదమైంది. 1950 జనవరి 24న రాజ్యాంగసభకు అధ్యక్షత వహించిన బాబూ రాజేంద్ర ప్రసాద్‌ జనగన మణను జాతీయ గీతంగానూ , స్వాతంత్య్ర వుద్యమంలో చారిత్రక పాత్ర వహించిన వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ దానికి కూడా జాతీయ పాటగా సమాన స్థాయిని కల్పించాలని అంతిమంగా ఆ వివాదానికి స్వస్తి పలికారు.

   తరువాత 2006లో వందేమాతరం 125వ వార్షికోత్సవం సందర్భంగా దానిని విధిగా ఆలపించాలా లేదా అన్న వివాదం ఏర్పడింది.ముస్లింలలోనే భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సిక్కులు దానిని ఆలపించవద్దని సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటి(ఎస్‌జిపిసి) కోరింది. వందేమాతరం గీతాలాపన స్వచ్చందం తప్ప విధికాదని పార్లమెంట్‌లో 2006 ఆగస్టు 22న ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్బంగా అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా విధిగా వందేమాతర గీతాన్ని ఆలపించాలని వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను బిజెపి సమర్ధించిందని, అయితే విధిగా చేయనవసరం లేదని నాడు వాజ్‌పేయి స్పష్టత ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ఆ నాడు పేర్కొన్నది.

  అందువలన ఇప్పుడు భారత మాతాకి జై అనటమే దేశభక్తికి, జాతీయతకు నిదర్శనం, చిహ్నమని బిజెపి వత్తిడి చేయటం దాని అజెండా ప్రకారం దేశం నడవాలని ఏకపక్షంగా నిర్ణయించటం నిరంకుశ ధోరణులకు నిదర్శనం తప్ప మరొకటి కాదు. తమ ప్రధాని మేకిండియా నినాదమిచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోతానంటుంటే బిజెపి మాత్రం బ్రేకిండియా నినాదాలతో దేశాన్ని విచ్చిన్నం చేయ చూస్తున్నది. ఎవరిది కుహనా జాతీయ వాదం,ఎవరు దేశభక్తులు? ఏది అభివృద్ధి పధం ? ఇదా దేశాన్ని ముందుకు తీసుకుపోయే మార్గం? దీన్నా నరేంద్రమోడీకి ఓటు వేసి జనం కోరుకున్నది ?

గమనిక: ఈ వ్యాసంలోని న్యాయవాదుల అభిప్రాయాలు ది వైర్‌.ఇన్‌లోని గౌరవ్‌ వివేక్‌ భట్నాగర్‌ వ్యాసం నుంచి స్వీకరించబడినవి. రచయితకు కృతజ్ఞతలు