Tags

, , , , ,

bhagat-singh-martyr-vs-vd-savarkar-traitor

ఎం కోటేశ్వరరావు

నువ్వొకందుకు పోస్తే నే ఒకందుకు తాగా అన్నట్లుగా సంఘపరివార్‌ ఎందుకు ప్రారంభించినప్పటికీ దేశానికి ఒక విధంగా మంచే జరుగుతోంది. దాని నాయకుల నిజరూపాలు దేశం ముందుంచటానికి మరొక అవకాశం ఇచ్చారు. కొలిమిలో ఇనుము బాగా కాగినపుడే దెబ్బ వేయాలన్నట్లుగా దేశంలో దేశ భక్తి, దేశద్రోహుల గురించి జరుగుతున్న చర్చ అనేక మందికి కొత్త విషయాలు తెలియచేస్తోంది. వీడియోలను ఎలా మార్చివేస్తారో అవగతం అయింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ ఎంతటి సాదాసీదా మనిషో అని జనంలో సానుభూతి పెంచటానికి మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న నరేంద్రమోడీ అంటూ ఒక ఫొటోను సామాజిక మీడియాలో పెట్టారు. 1988లో ఆయనొక సాధారణ వ్యక్తిగా వున్నపుడు రైల్వే స్టేషన్‌లో చాయ్‌ అమ్ముకున్నంత సేపు అమ్మి, మిగిలిన సమయాలలో చీవుర్లు పట్టి ఇళ్లను కూడా శుభ్రం చేసిన కష్టజీవి అని బిజెపి మద్దతుదార్లు ఆ చిత్రాన్ని దేశం మీదకు వదిలారు. అసలు వాస్తవం ఏమంటే అదే ఏడాది ఆయన గుజరాత్‌ రాష్ట్ర బిజెపి కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నరేంద్రమోడీ మీద వున్న మోజులో ఆభిమానులు వుబ్బితబ్బుయ్యారు. భక్తులు పులకరించి పోయారు. అప్పుడే అనేక మంది ఆ చిత్రం గురించి ప్రశ్నించినా మోడీ గాలిలో ఎవరూ ఖాతరు చేయలేదు. అహమ్మదాబాదుకు చెందిన ఒక సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నతో ఆ ఫొటో నకిలీ అని దానిలో వున్న వ్యక్తి నరేంద్రమోడీ కాదని, ఫొటోను మార్చి అలా తయారు చేశారని తేలింది.

Selection_24_03_2016_003

ఇప్పుడు మరొక అంశం బయటకు వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ భగత్‌ సింగ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ చిత్రాలను పక్కపక్కనే పెట్టి అమరజీవులు- విద్రోహులు అనే శీర్షికతో సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. బ్రిటన్‌-భారత్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. రెండవది మేం దానిలో పాల్గొన్నాం అందువలన మేము యుద్ధ ఖైదీలం అని బ్రిటీష్‌ ప్రభుత్వానికి భగత్‌ సింగ్‌ రాసిన చివరిలో పేర్కొన్న అంశాన్ని భగత్‌ సింగ్‌ పొటో కింద పెట్టారు. బ్రిటీష్‌ ప్రభుత్వం తనకు క్షమాభిక్ష పెట్టాలని, దాను ఆంగ్లేయులకు విధేయతతో వుంటానని సావర్కర్‌ రాసిన లేఖాంశాలను ఆయన ఫొటో కింద పెట్టారు. దాని మీద నిక్కర్ల బదులు పాంట్లు తొడుక్కోవాలని కొత్తగా నిర్ణయించుకున్న ‘స్వదేశీ’ (పాంట్లు భారతీయ దుస్తులా,ఏ చక్రవర్తీ వేసుకున్నట్లు మనకు కనిపించదు) సంఘపరివార్‌ యంత్రాంగం మా నేతను ఇంత మాట అంటారా అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక వున్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.