Tags

, , , ,

ఎంకెఆర్‌

    ఎక్కిరించబోయి వెల్లకిలా పడినట్లు బిజెపి దాని మిత్రపక్షాల వ్యవహారం వుంది. ప్రస్తుతం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్‌) వ్యవసాయంలో మంచి ప్రతిభ కనపరిచిన రైతులకు అవార్డులు ఇస్తున్నది. వాటికి ఆర్‌ఎస్‌ఎస్‌, భారతీయ జససంఘ మాజీ నేత అయిన పండిట్‌ దీన దయాళ్‌ వుపాధ్యాయ పేరు పెట్టే విషయాన్ని పరిశీలించమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ ఆ సంస్ధ అధికారులను కోరినట్లు పిటిఐ వార్తా సంస్ధ తెలిపింది. ఇప్పటికే కొన్ని పధకాలు, సంస్ధలకు ఆ పేరు పెట్టారు. పేర్లు పెట్టటమా లేదా , వున్న పేర్లు మార్చటమా, వాటికి తమకు అనుకూలమైన పేర్లు తగిలించటమా అన్నది ఆయా ప్రభుత్వాల విచక్షణకు సంబంధించిన ఒక వివాదాస్పద అంశం. ఏకంగా రంగులే మార్పించవచ్చు, ఏ అడ్డగోలు పని అయినా చేయవచ్చని ఇంతకాల అనుభవం తెలియ చేస్తున్నది. ఇక్కడ సమస్య ఏమంటే ప్రతి పధకానికి తమ నేతల పేర్లు పెట్టి లబ్ది పొందుతున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై బిజెపి, దాని మిత్రపక్షాలు ఇంతకాలం నానా యాగీ చేశాయి. అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పని చేశాడన్నట్లుగా అదే పని అవి చేస్తున్నాయి. ఎవరైనా ఒక మంచి సంప్రదాయాన్ని ప్రవేశపెడితే దాన్ని ఎవరైనా హర్షిస్తారు.తాము విమర్శించిన దానినే తాము చేసేవారిని ఏమనాలి ? ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల దుస్దితిని నివారించేందుకు ఇంతవరకు ఎలాంటి నిర్ధిష్ట చర్యలూ లేవు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు జరిపేందుకు అసలు ప్రయత్నమే లేదు. కానీ రైతులకు ఇచ్చే అవార్డులకు మాత్రం తమ నాయకుల పేర్లు పెట్టేందుకు మాత్రం ఎక్కడ లేని తహ తహ !

    మహారాష్ట్రలో బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం వున్నది. జనవరి నెలలో ఒక ఐదు పధకాలకు పెట్టిన పేర్లు ఎలా వున్నాయో చూడండి.1.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే కన్యాదాన యోజన. ఈ పధకం కింద రాష్ట్ర రవాణాసంస్ధ వుద్యోగుల ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాత లక్ష రూపాయలు ఇస్తారు.2.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే అప్‌గత్‌ సహాయ నిధి యోజన. ఆర్‌టిసి బస్సు ప్రమాదాలలో గాయపడిన, వికలాంగులైన, మరణించిన ప్రయాణీకులకు పరిహారం అందచేసే పధకమిది.3.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ కాలేజి.4.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి.5.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే నిరాధార్‌ స్వావలంబన్‌ యోజన.దీని కింద ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలకు ఆర్ధిక సాయం, ఆటో రిక్షాలు నడుపుకొనేందుకు పర్మిట్లు ఇస్తారు.

     ఒక మతం, పార్టీ పేరును ఏకంగా ప్రభుత్వ పధకానికి పెట్టిన బిజెపికి ఇతర పార్టీలను విమర్శించేందుకు ఎలాంటి నైతిక హక్కు వుంటుంది. ఇది లౌకిక రాజ్యమా, మత రాజ్యమా ? గతంలో వున్న కొన్ని సంక్షేమ పధకాల పేర్లను మార్చిన నరేంద్రమోడీ సర్కార్‌ వాటికి ప్రధాన మంత్రి అనే పేరును తగిలించింది. అది కూడా ప్రధానిగా నరేంద్రమోడీ ఖాతాలోకి ఆ ఖ్యాతిని బదలాయించే దూరాలోచన వున్నప్పటికీ ఆమోదనీయమే. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు బిజెపి మిత్రపక్షమైన పంజాబ్‌ అకాలీదళ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నాటి కేంద్ర ప్రభుత్వమైన యుపిఏపై ధ్వజమెత్తారు. కేంద్రం అమలు జరుపుతున్న పధకాలకు పేర్లు, ఫొటోలు పెట్టటంపై రాష్ట్రాలకు షరతులు విధించటంపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాల నుంచి వసూలు చేసిన నిధులు తప్ప కేంద్రానికి ప్రత్యేకంగా ఆ పధకాలకు నిధులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు.

UrjaUtsavOdisha Jana Amantrana Karyakram vehicles during flag off ceremony at Bhubaneswar -

    కొద్ది వారాల క్రితం ఒడిషాలోని పారాదీప్‌ ఐఓసి చమురుశుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ప్రధాని వచ్చిన సందర్బంగా దాన్ని బిజెపి కార్యక్రమం మాదిరిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించటం వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోయే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ పెద్ద బొమ్మ, దాని పక్కనే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బొమ్మలతో కూడిన వ్యాన్లను ఒడిషా అంతటా తిప్పారు. ప్రధాని వస్తున్న సందర్భంగా బిజెపి తన స్వంత నిధులతో ఎలాంటి ప్రచారం చేసుకున్నా ఎవరికీ ఇబ్బంది లేదు. ఒక ప్రతిపక్ష పార్టీ అధికారంలో వున్న రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారాన్ని తలపించే విధంగా ప్రచారం చేయటం కక్కుర్తి తప్ప వేరే కాదు.ఈ చర్యను స్ధానిక బిజెపి నాయకత్వం సమర్ధించుకుంది. ‘ వారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పధకాలన్నింటినీ హైజాక్‌ చేశారు. వారి చర్యలను మేము ప్రజల దృష్టికి తీసుకు వస్తుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్నే హైజాక్‌ చేసేందుకు పూనుకున్నారని’ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వసంత పాండా ఆరోపించారు. తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు అంటే ఇదేనా ?