Tags

, ,

ఎం కోటేశ్వరరావు

     పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలపటాన్ని కూడా మైనారిటీలను బుజ్జగించటంగా చిత్రించిన బిజెపి ఇప్పుడు అదే పని చేసి నవ్వుల పాలైంది. కడుపులో వుండాలి గాని కావిలించుకుంటే వస్తుందా అని పెద్దలు వూరికే చెప్పలేదు. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులు, బిజెపి అధికార ప్రతినిధి క్రైస్తవులకు ‘శుభాకాంక్షలు’ తెలిపారు. వీటిని చూసి బిజెపిలోని క్రైస్తవులకు నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకున్నారు. గుడ్‌ ఫ్రైడే అంటే ఏసుక్రీస్తుకు శిలువవేసిన రోజు కనుక వుత్సవం జరుపుకోరు. ఆ రోజు సంతాపంగా క్రైస్తవులు ప్రార్ధనలు జరుపుతారు. అలాంటి రోజున శుభాకాంక్షలు తెలిపిన వారిలో మన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్‌ శర్మ , మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా కూడా వుండటం సిగ్గు చేటు. శర్మతో పాటు రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మరో మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, బిజెపి అధికార ప్రతినిధి షా నవాజ్‌ హుస్సేన్‌ శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు. అయితే వెంటనే తీవ్రమైన విమర్శలు, స్పందనలు రావటంతో వాటిని వుపసంహరించుకొని సందేశాలను సవరించి పంపారు.తమది సాంస్కృతిక సంస్ధ అని చెప్పుకొనే సంఘపరివార్‌ తన నేతలకు ఇతర మతాల గురించి ఎలాంటి సంస్కృతి పాఠాలను బోధిస్తున్నదో ఈ వుదంతం వెల్లడించింది.

   ఇలాంటి సందేశాలను పంపటంలో బిజెపి నేతలే కాదు, ప్రతి సందర్భాన్ని సొమ్ము చేసుకోవాలని చూసే వ్యాపార సంస్ధలు కూడా కక్కుర్తి పడ్డాయి. ఫర్నిచర్‌ కంపెనీ అర్బన్‌ లాడర్‌, స్నాప్‌డీల్‌,మైంత్రా సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. తరువాత ఇవి క్షమాపణలు చెబుతూ తమ ఆఫర్లను వారాంతపు బహుమతులుగా మార్చాయి.

    కేంద్రమంత్రులు,బిజెపి నేతల ఈ చర్యపై క్రైస్తవ సంఘాలు, సంస్ధలు సంయమనం పాటించాయి.గుడ్‌ ఫ్రైడే రోజును క్షమా దినంగా కూడా పరిగణిస్తార కనుక అలాంటి శుభ సందేశాలు పంపిన వారి పట్ల తమకెలాంటి కోపం లేదని, అయితే బిజెపికి మైనారిటీ మతాల వారి గురించి కనీస పరిజ్ఞానం కూడా లేదనటానికి ఇది ఒక నిదర్శనమని కొందరు వ్యాఖ్యానించారు. షా నవాజ్‌ హుస్సేన్‌కు క్రైస్తవం గురించి తెలియకపోతే కనీసం ఖురాన్‌ చదివి వున్నా తేడా తెలిసి వుండేదని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యానించారు.

  మంత్రుల నిర్వాకంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.మంత్రులందరూ మోడీ విశ్వవిద్యాలయంలో పట్టాలు పుచ్చుకున్నారని వ్యంగ్య వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. వెనుకటికి ఒక మోతుబరి బండిలో ప్రయాణిస్తూ వెనుక నడిచే సేవకులకు జాగ్రత్తలు చెబుతూ ఏవైనా పడితే తీసి బండిలో వేయమని చెప్పాడట. ఏం పడినా వేయమన్నారు కనుక విశ్వాససాత్రులైన సేవకులు యజమానితో పేచీ ఎందుకని ఎద్దులు వేసిన పేడను కూడా తీసి బండిలోకి విసిరారట. అలాగే షానవాజ్‌ హుస్సేన్‌ శుభాకాంక్షల ట్వీట్‌ చేయగానే సిద్ధంగా వున్న ఆయన అభిమానులు అదే శుభాకాంక్షలను పెద్ద సంఖ్యలో తమ అనుచరులకు పంపారు. అంటే వారికి కూడా కనీస ఆలోచన లేకపోయింది.