Tags

, , , , , ,

 ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్‌ కూడా సంపాదించండి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు

ఎంకెఆర్‌

    తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ! మళ్లీ అదే, మళ్లీ మళ్లీ అదే !! నిర్మొహమాటంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచాన్ని వూపివేస్తున్న వినిమయదారీ తత్వం నేటి తరాలకు నేర్పుతున్నది అదే. మనకు తెలియకుండానే దీనిలో పడిపోతున్నాం. దీని ఒక లక్షణం ఏమంటే ప్రశ్నించేతత్వాన్ని మొదట అది నాశనం చేస్తుంది. ఇప్పుడు ప్రతి వారి చేతిలో కనిపించే సెల్‌ ఫోన్నే తీసుకుందాం. మనకు అంత వెల వున్న సెల్‌ఫోన్లు అవసరమా అని ఆలోచించేవారెందరు? ఫీచర్లు తక్కువ వున్న సెల్‌ ఫోన్‌ ఎవరి చేతుల్లో అన్నా చూస్తే వారిని పాతకాలం వారనుకుంటున్నామా లేదా ?

    ఇలాంటి స్థితిలో ఏ దేవుడు లేక దయ్యం వలన బుద్ధి పుట్టిందో గానీ కొంత మంది సైద్ధాంతిక యుద్ధానికి తెరలేపారు. యుద్ధం అంటే ముందు బలయ్యేది నిజం. వాస్తవాలు అడుగు దూరం ప్రయాణించేలోపు అవాస్తవాలు వంద అడుగులు వెళ్లి కొత్త రూపంలో మనదగ్గరకే తిరిగి వచ్చి మనలను కూడా అనుమానంలో పడేస్తాయి. మహాభారత, రామాయణాలు మనకు చెప్పినది అదే. అందువలన సైద్ధాంతిక యుద్ధంలోని ఒక పోరులో తాము విజయం సాధించామని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించేశారు. అలా వాదించకపోతే ఆయన ప్రముఖ లాయర్‌ ఎలా అవుతారు. హత్య చేసిన వ్యక్తి తరఫున వాదించటానికే పేరు మోసిన లాయర్లు అవసరం. మా కక్షిదారు ఎలాంటి వాడు అంటే అసలు కత్తి అనేదే తెలియని అమాయకుడు, అలాంటి వ్యక్తి ఆ రోజు అసలు అక్కడ లేడు, ఈ హత్య చేయలేదు అని బల్లచరిచి మరీ వాదిస్తాడు. సైద్దాంతిక పోరులో విజయం సాధించామని ఏకపక్షంగా ప్రకటించుకోవటంలో మతలబు అదే.

     చిత్రం ఏమంటే రెండు సంవత్సరాల క్రితం బిజెపి ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక, చేసిన వాగ్దానాలు, ప్రసంగాలలో ఎక్కడా దేశంలో తాము సైద్దాంతిక యుద్ధాన్ని ప్రారంభిస్తామని చెప్పలేదు. నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు పంచుతామని, రైతాంగానికి రెట్టింపు ఆదాయాలు సమకూర్చుతామని, ధరలు తగ్గిస్తామని, అన్నింటికీ మించి మేకిండియా పేరుతో ప్రపంచం మొత్తానికి వస్తువులను ఇక్కడే తయారు చేసి ఇక్కడి నుంచే సరఫరా చేస్తామని, ఆ విధంగా వుద్యోగ కల్పన చేస్తామంటూ ఎన్నోఎన్నో వాగ్దానాలు చేశారు.జౌరంగజేబును ఆదర్శంగా తీసుకొని జనం మీద చెత్తపన్ను వేశారు. అదేం చిత్రమో గాని పన్ను వసూలు చేస్తున్నారు గానీ చెత్తను తీయటం లేదు. వాటి అమలుకు అసలు ప్రయత్నమే లేదు గానీ చెప్పని అంశంలో మాత్రం విజయం సాధించారట !

    మీ పిచ్చిగానీ ఇవన్నీ ఎవరికి పట్టాయి. ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్‌ కూడా సంపాదించండి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు వచ్చాయని ఒక మిత్రుడు చలోక్తి విసిరాడు.

      మా పక్కింటి పెద్దాయన కూడా రోజులు బాగాలేవు సార్‌, సర్దుకు పోవాలి అన్నాడు. అదేంటి సార్‌ మరి ఆటు, పోట్లను ఎదుర్కొని నిలవటమే జీవితం అని కదా పెద్దలు చెప్పారు? ఆటు పోట్లను ఎదుర్కోవటం అంటే సాధారణ అర్ధంలో కష్ట సుఖాలు అని, అలాగాక నిజమైన అర్ధం ప్రకారం వాటికి ఎదురు నిలవమని కాదు. ఎవరైనా అలా నిలబడితే సముద్రం మింగేస్తుంది. ఆటు, పోట్లు వచ్చినపుడు వెనక్కి వంగి తప్పించుకోవాలి తప్ప ఎదురు నిలబడి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోమని కాదు అన్నారు.(పోటు అంటే సముద్రం మీద నుంచి లేచే అలలు తీరానికి రావటం, ఆటు అంటే తీరానికి వచ్చిన అలలు తిరిగి సముద్రంలోకి పోవటం, కొన్ని సందర్భాలలో అవి చాలా తీవ్రంగా వుంటాయి. వాటికి ఎదురు నిలబడితే ప్రాణాలకే ముప్పు)

     ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రంగాలలో ఎలాంటి సైద్ధాంతిక, మేథో,విద్యాపరమైన చర్చలు మృగ్యమైన కారణంగా ప్రతి ఒక్కరూ బి పాజిటివ్‌ అన్నట్లుగా వుంటున్నారు. ఏదైనా ఒక విషయంపై ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, విమర్శనాత్మకంగా చెప్పినా, చెప్పేందుకు ప్రయత్నించినా మీ రెందుకు ప్రతిదానికీ బస్తీమే సవాల్‌ అంటారు, కావాలంటే మీ అభిప్రాయాలు మీరు వుంచుకోండి, మాకు చెప్పండి, భరించక తప్పదు కదా, ఇతరులు ఏది నమ్మితే మీకెందుకు, వారిష్టం వచ్చినట్లు వారుంటే మనకు నష్టమేమిటి ? అని కుటుంబ సభ్యులే వెనక్కు లాగుతారు. ఇంకా కొందరు మనకెందుకులే దుష్టుడికి దూరంగా వుండాలన్నట్లు వినీ వినట్లు తప్పించుకుంటారు.

      అంటే దీని అర్ధం ఏమిటీ ఎక్కడ ఏం జరిగినా, ఎవరేం చెప్పినా మనం ఆలోచించకూడదు, బుర్రకు పని పెట్ట కూడదు, దేనినీ పట్టించుకోకూడదు, మన అభిప్రాయాలు వెల్లడించకూడదు, మనం అసలు మాట్లాడ కూడదు, ఏదైనా వుంటే మనలోనే అణచివేసుకోవాలి. అప్పుడే అంతా మనతో బాగుంటారు, మనమూ బాగుంటాము. ప్రతిదానికీ ఇతరులతో దెబ్బలాటలకు దిగటం ఎందుకు ? కానీ గత చరిత్ర అంతా అలా లేదే. పోరాటాల మయం ! ముందుకే మున్ముందుకే !! కౌరవులు దుష్టులు మన కెందుకులే వారి పాపాన వారు పోతారులే అని కృష్ణుడు వూరుకుంటే బకుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, కంసుడు మొదలైన వారందరిదీ పై చేయి వుండేది. ప్రపంచంలో తనకు ఎదురు లేదు అని విర్రవీగిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు అడ్డగించకపోతే, ఫాసిస్టు హిట్లర్‌ను కమ్యూనిస్టు స్టాలిన్‌ అడ్డుకొని వుండకపోతే ప్రపంచ పరిణామాలు ఎలా వుండేవి? చచ్చిన చేప వరదలో కొట్టుకుపోతుంది. బతికి వున్న చేప ఎదురు ఈదుతుంది. మనం ఎవరిగా వుండాలి?

    మహాభారతంలో సహనం, సంయమనం గురించి ఎన్నో పాఠాలు వున్నాయి.కంసుడి వంద తప్పుల వరకు కృష్డుడు సహించి సంయమనం పాటించాడు. అందువలన దేన్ని సహించాలి,దేన్ని సహించకూడదు అని ఈ రోజు మనం కొత్తగా ఆలోచించనవసరం లేదు. చరిత్రే మనకు నేర్పింది. పులి మనుషులకు హాని చేయనంతవరకు దాని మానాన దాన్ని అరణ్యంలో తిరగనివ్వాలి. అది జనారణ్యంలోకి వస్తే బోనులో బంధించి తిరిగి అడవిలో వదలి వేయాలి. అదే అదుపు తప్పితే ఏం చేయాలో చెప్పనవసరం లేదు.

    మీరు ప్రజల నమ్మకాలను గౌరవించాలి అంటారు. నిజమే ! భక్తితో అగ్ని గుండం మీద నుంచి నడిస్తే ఏమి కాదు అన్నది ఒక నమ్మకం. అది హిందువులు, ముస్లింలలోనూ వున్న ఒక మూఢనమ్మకం అని చెప్పేందుకు హేతువాదులకు హక్కు వుందా లేదా? అలాగాక మా విశ్వాసాన్ని, మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఎవరైనా దెబ్బలాటలకు వస్తే సహించాలా ? ఎదుటివారి అభిప్రాయాలను విను, సబబనిపిస్తే అంగీకరించు లేకుంటే అనుభవించు అని ముగించటం తప్ప చేసేదేముంది? హేతువాదుల మాటలను ఖాతరు చేయకుండా గతేడాది కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక కాళికాంబ ఆలయం దగ్గర బసవన నడక పేరుతో అగ్ని గుండంలో నడిచిన ఒక పూజారి గుండంలో పడిపోయి ఆరు రోజుల తరువాత దుర్మరణం చెందాడు. అందువలన మరొకరు అలాంటి పని చేస్తే వద్దని వారించకుండా వుండాలా, పోతే పోతాడు లెమ్మని చూస్తూ వూరుకోవాలా, పశువులకూ మనకూ తేడా ఏముంటుంది? అయితే వారికి ఎలా చెప్పాలి. చాలా మంది అలా నడుస్తున్నారు కదా వారికెందుకు ప్రాణాల మీదకు రాలేదు అనే వారిని ఒకరికైనా ఎందుకు వచ్చిందో, విశ్వాసం ఎందుకు కాపాడలేకపోయిందో చెప్పమనాలి.

    ఎవరైనా అలాంటి మూఢనమ్మకాలు కలిగి వుంటే బాబూ మంచిది కాదు అని చెప్పాలి. కాదు నా యిష్టం అంటే , నీ మనోభావాలను ఎందుకు దెబ్బ తీయాలి, ఎలాంటి అభిప్రాయాలు కలిగి వుండాలన్నది నీ హక్కు అంటూ దానిని గౌరవించటం తప్ప మరొక పద్దతి లేదు.వాటిని ఇతరులకు శాంతియుత పద్దతుల్లో వెల్లడించటాన్ని కూడా మనం గౌరవించాలి, సహించాలి.

    కానీ నీకు దేవుడి మీద నమ్మకం లేదు, మన కాలనీలో నువ్వుండటం వల్లనే ఈ ఏడాది వర్షాలు పడలేదు, నువ్వు మంచోడివి కాదు అనే ఎదుటి వారి నమ్మకాన్ని గౌరవించాలా ? వారి అభిప్రాయాన్ని వారిని వ్యక్తం చేయనివ్వండి, నష్టం లేదు, దానితో అంగీకరించాల్సిన అవసరం లేదు. సమాజంలో కొంత మంది చేత బడి చేస్తున్నారనే ఒక మూఢనమ్మకం వుంది. దానికి విరుగుడు పేరుతో లెక్కలేనన్ని పూజలు కూడా వున్నాయిగా నమ్మకం వున్న వారిని చేయించుకోనివ్వండి, డబ్బులు వదిలించుకోనివ్వండి. కానీ చేతబడి చేస్తున్నారనే పేరుతో ఎవరిమీదైనా దాడులు చేస్తే, చంపటానికి ప్రయత్నిస్తే సహించకూడదు. ఇలాంటి దాడులకు గురవుతున్నవారెరు. ఎక్కువ మంది దళితులు, ఇతర బలహీన వర్గాల వారే. నిజానికి వారికి అలాంటి శక్తులే గనుక వుంటే వారిపై దాడులు, అత్యాచారాలకు పాల్పతున్నవారిని ఎప్పుడో రిమోట్‌ కంట్రోలు మాదిరి తమ గుడిసెల్లో వుండే మట్టుబెట్టి వుండేవారు.

    కానీ వాస్తవానికి డబ్బున్నవారు, ధనికులు, డబ్బు లేక పోతే లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ బాబాలు, చేతులు, కాళ్లు చూసే జ్యోతిష్కుల వంటి రకరకాల వ్యక్తుల చేత క్షుద్రపూజలు, హోమాలు చేయిస్తున్నారా లేదా ? చేతబడికి, వాటికీ తేడా ఏమిటి? చేతబడి అంటే భయపడతారు, హోమం, పూజలు అంటే చేతులు కట్టుకు ప్రణమిల్లుతారు. మరి అలాంటి వాటిని గౌరవించాలా? అవసరం లేదు. అయితే అవి చేసే వారితో తగాదా తెచ్చుకోనవసరం లేదు.

    సహనం, అసహనం, దేశభక్తి, దేశ ద్రోహి, మాత, పిత వంటి అంశాలు సమాజంలో ఎప్పటి నుంచో వున్నాయి. అవి ఎప్పుడు వెలుగులోకి వస్తాయంటే ఏదైనా ఒక పరిణామం సంభవించినపుడు దాని స్వభావాన్ని బట్టి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. వుదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ , అది 1925లోనే ఒక స్వచ్చంద సంస్ధగా ఏర్పడింది. అయితే దానిలో ఒకప్పుడు సభ్యుడిగా వున్న గాడ్సే 1948 జనవరి 30న మహాత్మా గాంధీని హత్య చేసినపుడే దాని భావజాలమేమిటో దేశానికి తెలిసింది. తరువాత సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం దానిపై విధించిన నిషేధాన్ని తొలగించారు. అప్పుడు సుప్రీంకోర్టు విధించిన షరతు ప్రకారం దేశ రాజ్యాంగానికి బద్దులమై వుంటామని, త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా గౌరవిస్తామని రాతపూర్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ విధేయత పత్రాన్ని అందచేయాలి.ఈ విషయాలను బహిరంగంగా ప్రకటించాలి.ఆ మేరకు 1949 ఏప్రిల్‌ 11న నాటి అధిపతిగా వున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ఒక ముసాయిదా ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనావళిని కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. దానిని పరిశీలించి అంగీకరిస్తూ అదే ఏడాది జూలై 11న నిషేధాన్ని ఎత్తివేశారు.అంటే స్వాతంత్య్రం వచ్చిన రెండు సంవత్సరాల వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్రం లేదు, రాజ్యాంగం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవం లేదు, ఇవేవీ లేకపోయిన తరువాత వారి దేశభక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. దేశంలో అనేక సాంస్కృతిక సంస్ధలున్నాయి. ఏది కూడా ఇలా రాజకీయాలు చేయలేదు. పోనీ స్వాతంత్య్రానికి ముందు తమది స్వచ్చంద సంస్ధ అని చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణ పతాకం బదులు కాషాయ పతాకాన్ని జాతీయ జండాగా ఆమోదించాలని తన పత్రిక ఆర్గనైజర్‌లో 1947 జూలై 17న రాసింది. అదే నెల 22న రాజ్యాంగ పరిషత్‌ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. తరువాత స్వాతంత్య్రానికి ఒక రోజు ముందు ఆగస్టు 14 ఆగస్టు సంచికలో ఆర్గనైజర్‌ జాతీయ జెండా గురించి విషం కక్కింది. కాషాయ పతాకం వెనుక రహస్యం అనేపేరుతో రాసిన వ్యాసంలో ‘ ప్రారబ్దం కొద్దీ అధికారానికి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టి వుండవచ్చు, కానీ దానిని హిందువులెవ్వరూ గౌరవించరు, స్వంతం చేసుకోరు. మూడు అంటేనే కీడు, మూడు రంగులు కలిగిన ఒక జెండా అనివార్యంగా దేశంపై మానసికంగా తీవ్రమైన చెడు ప్రభావాన్ని , వుపద్రవాన్ని కలిగిస్తుంది.’ అని పేర్కొన్నది. పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ రోజైన 1947 ఆగస్టు 14న, 1950 జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌లోని తన ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. తరువాత నిలిపివేసింది. 2001లో రాష్ట్రప్రేమీ యువదళ్‌ పేరుతో వున్న ఒక సంస్ధకు చెందిన బాబా మెంధే, రమేష్‌ కుమార్‌ కాలంబే, దిలీప్‌ చట్టానీ అనే వారు రిపబ్లిక్‌ దినోత్సవం రోజున నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద బలవంతంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు, పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన తరువాత 2013లో విడుదలయ్యారు.ఆ వుదంతం తరువాత 2002 నుంచి అంటే స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాల తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.రాజ్యాంగం, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని రాతపూర్వంగా రాసి ఇచ్చిన సంస్ధ దేశభక్తి ఇది.

     ఇలాంటి వారు ఇప్పుడు రాజ్యాంగంలో లేని భారత మాతాకు జై అంటేనే దేశ భక్తి అని అనని వారు వారు దేశద్రోహులు అని చిత్రిస్తున్నారు. దాన్నొక సైద్ధాంతిక యుద్ధంగా వర్ణించి దానిలో తాము తొలి విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. చరిత్ర పట్ల, జనం జ్ఞాపక శక్తి పట్ల ఎంత చిన్న చూపు.వుల్లికి మల్లికి తేడా తెలియనంత అమాయకంగా జనం వున్నారనుకుంటున్నారా ? మల్లె తోటలో నాటి నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా ?