Tags

, , , , , , ,

యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది

ఎం కోటేశ్వరరావు

     2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ ఇండియా ఆర్ధిక

వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే

1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్‌

2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం

3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు

4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు

6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం

7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం

    ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.

     ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్‌కి బాత్‌ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్‌ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.

     ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్‌ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌ చెల్లించిన ధర 320 డాలర్లు.

    రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్‌ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్‌.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్‌లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?

     గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.

    రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్‌ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్‌, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్‌, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్‌ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?

    2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?

    పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?

   పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .