Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

    అమెరికాలోని చికాగో నగర టీచర్లు మరోసారి ఈనెల ఒకటిన సమ్మె చేశారు.ఈ ఆందోళన ప్రత్యేకత ఏమంటే కెనడా, అమెరికాలోని అనేక దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన కొంత మందితో సహా పాతికవేల మంది టీచర్లు తరగతులు బహిష్కరించి ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్ధులు, టీచర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తూ విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులను తగ్గించిన చర్యకు నిరసన ఇది. వుదయం ఆరున్నరకే ప్రతి స్కూలు వద్ద గుమికూడిన టీచర్లు చికాగో మేయర్‌ ఇమ్మాన్యుయేల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కూలు టీచర్లకు సంఘీభావంగా చికాగోలోని అనేక విశ్వవిద్యాలయాల సిబ్బంది రోజంతా ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌(మన ముఖ్యమంత్రి మాదిరి) విశ్వవిద్యాలయాలకు 30శాతం కోత విధించారని వారు విమర్శించారు. సమాజంలోని ఒక శాతం మందిపై పన్నులు ఎక్కువగా విధించి ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడాలన్నది టీచర్ల ప్రధాన నినాదం.చికాగో టీచర్ల సమ్మె స్కూళ్లకు, తమ పెన్షన్లకు నిధులు పెంచాలని మాత్రమే కాదు లేదా కార్పొరేట్‌ సంస్ధలపై పన్ను పెంచాలని జరపలేదు, వాటన్నింటికోసం జరిగింది. సామాజిక వనరులను ఎవరు స్వంతం చేసుకోవాలి, వాటికి సంబంధించిన నిర్ణయాలు ఎవరు చేయాలనే ప్రజాస్వామిక అంశంపై కూడా జరిగింది అని జాకోబిన్‌ పత్రిక వ్యాఖ్యానించింది.

     సమ్మె ప్రజాస్వామ్యం కోసమే కాదు, ప్రజాస్వామ్య బద్దంగా కూడా జరిగింది. నిజమైన ప్రజాస్వామ్యం ఎలా వుంటుందో టీచర్స్‌ యూనియన్‌ చూపింది. ఇల్లినాయిస్‌ రాష్ట్ర చట్ట ప్రకారం సమ్మె చేయాలంటే యూనియన్‌ సభ్యులలో 75శాతం మంది ఆమోదం తెలపాలి.ఆ మేరకు డిసెంబరులో జరిగిన ఓటింగ్‌లో 96శాతం మంది టీచర్లు పాల్గొన్నారు, వారిలో 92శాతం అనుకూలంగా ఓటు చేశారు. మార్చి 23న జరిగిన యూనియన్‌ కార్యవర్గంలో 486-124 తేడాతో సమ్మె నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

    నిధులను తగ్గించి వచ్చే ఏడాది అనేక స్కూళ్లను మూసివేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తలిదండ్రులు కూడా వ్యతిరేకిస్తున్నారు.ఈ సమ్మెను విచ్చిన్నం చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించి చర్యలు తీసుకుంటామని టీచర్లను బెదిరించటమే గాక కోర్టు ద్వారా నిలిపివేతకు సైతం ప్రయత్నించింది.మరోవైపున ఈ సమ్మె కేవలం టీచర్ల వుద్యోగాలకు సంబంధించిన అంశం గాక ఒక ప్రజా సమస్యగా మారింది. ఈ కారణంగానే ఎనిమిది ఇతర యూనియన్లు, అనేక సామాజిక బృందాలు టీచర్లకు బాసటగా నిలిచాయి.

    చికాగో కార్మికోద్యమ చరిత్రలో టీచర్స్‌ యూనియన్‌కు ఒక ప్రాధాన్యత వుంది. ప్రభుత్వ విధానాలపై పోరాడటం ద్వారా ప్రత్యేకతను సంతరించుకుంది. తాజా సమ్మె ఒక శాతం ధనికులు, 99శాతం కార్మికులకు సంబంధించిన సమస్యపై జరిగింది. అమెరికన్‌ పాలకవర్గం అందరికీ సామాజిక భద్రత కల్పించాల్సింది పోయి అలాంటి భద్రత కొంత మందికే ఎందుకు, అంటూ లేనివారిని రెచ్చగొడుతున్నది. చికాగో టీచర్లు, బస్‌ డ్రైవర్ల ఆరోగ్య పధకాలకు, పెన్షన్ల కోసం అందరూ పన్నులు చెల్లించాలా అంటూ ప్రచారం చేస్తున్నారు.యూనియన్లకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టే యత్నమిది.టీచర్లు సమ్మె చేస్తే ఆ రోజుల్లో మీ పిల్లల్ని ఎవరు చూస్తారంటూ గతంలో సమ్మె సందర్భంగా తలిదండ్రులను రెచ్చగొట్టారు. ఈ సారి ఒక్క రోజు సమ్మెకే పిలుపు ఇచ్చినప్పటికీ నాలుగు లక్షల మంది విద్యార్ధులకు తరగతులు పోయాయని కొంత మంది మొసలి కన్నీరు కార్చారు. నిజానికి దీని కంటే ప్రభుత్వ నిధులు తగ్గింపు వలన తమ బిడ్డలు ఎక్కువ ఇబ్బందులు పడతారని తలిదండ్రులు గ్రహించారు కాబట్టే ఈ సారి వారిని రెచ్చగొట్టే ప్రచారం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు, ప్రభావం చూపలేదు.

     ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఇలాంటి రెచ్చగొట్టుడు అంశాలు చోటు చేసుకుంటున్నాయి.వలసవచ్చిన వారు అమెరికన్లకు వుపాధి లేకుండా చేస్తున్నారని, మెక్సికో, చైనాలనుంచి దిగుమతులు కారణంగా వుద్యోగాలు అక్కడి వారికి కల్పిస్తున్నారన్న ప్రచారం ముఖ్యంగా రిపబ్లికన్లు చేస్తున్నారు.ప్రభుత్వ రంగ సంస్ధల వుద్యోగుల యూనియన్లకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. బేరసారాలాడే హక్కును దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోంది. తద్వారా కార్మికులను యూనియన్లకు దూరం చేసే ఎత్తుగడలో భాగమది. చికాగోలోని టీచర్లు, ఇతర కార్మిక సంఘాలు పోరాటాల నుంచి అనేక అనుభవాలు నేర్చుకున్నాయి. కార్పొరేట్‌ సంస్ధలు ప్రజా సేవల నుంచి పెద్ద మొత్తంలో ఎలా స్వాహా చేస్తున్నాయో ఎప్పటి కపుడు పౌరులకు తెలియ చేస్తున్నాయి. ధనికులపై పన్నులు ఎక్కువగా వసూలు చేయాల్సిన అవసరాన్ని పేర్కొంటున్నాయి.ఈ క్రమంలో పౌర సామాజిక బృందాలను కలుపుకోవటం ప్రత్యేకించి గమనించాల్సిన అంశం. దీనిలో భాగంగానే సేవారంగం, ఆరోగ్యరంగం, టీచర్ల యూనియన్లు తమకు మద్దతు కూడ గట్టేందుకు యునైటెడ్‌ వర్కింగ్‌ ఫ్యామిలీస్‌ పేరుతో ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేశాయి. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎన్నికల సమయంలో కార్మికవరగ్గాన్ని వుపయోగించుకోవటం తప్ప అధికారానికి వచ్చిన దాడులు జరపటంలో ఎవరికెరూ తీసిపోవటం లేదని, అందువలన తమకు అనుకూలమైన రాజకీయ వేదికలను ఏర్పాటు చేసుకోవాలని చికాగో కార్మికవర్గం నిర్ణయించుకుంది. 2012 నాటి టీచర్ల సమ్మె విజయం తరువాత చికాగో నగర పాలక సంస్ధ అనేక స్కూళ్లను మూసివేసి పెద్ద సంఖ్యలో టీచర్లను ఇంటికి పంపింది. దాంతో ఎన్నికలలో యునైటెడ్‌ వర్కింగ్‌ ఫ్యామిలీస్‌ సంస్ధ తన అభ్యర్ధులను నిలిపింది. తొమ్మిది కౌన్సిల్‌ స్ధానాలకు గాను మూడింటిలో విజయం సాధించింది. అయినప్పటికీ చికాగో కార్మికవర్గం నిరుత్సాహపడలేదు.

     ఈనెల ఒకటిన జరిగిన సమ్మెకు ముందు టీచర్స్‌ యూనియన్‌ సమ్మె బ్యాలట్‌ నిర్వహించగా 88శాతం మంది సమ్మెకు అనుకూలంగా ఓటు వేశారు. యూనియన్‌ను పటిష్ట పరచటం, ప్రతి చోటా స్ధానిక నాయకత్వాన్ని గుర్తించటం, సమస్యలపై వెంటనే స్పందించటం, ఇతర రంగ కార్మికులకు మద్దతు ప్రకటించటం వంటి చర్యలతో టీచర్స్‌యూనియన్‌ టీచర్ల విశ్వాసాన్ని చూరగొన్నది. ప్రతి ఒక్కరికీ నిర్ణయం, అమలులో పమేయం కల్పించటం ద్వారా గతంలో అనేక ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ఏప్రిల్‌ ఒకటవ తేదీ సమ్మె జయప్రదంగా ముగియటం వారిలో పోరాట పటిమ తగ్గలేదనటానికి నిదర్శనంగా చెప్పవచ్చు. చికాగో టీచర్స్‌ యూనియన్‌ చూపుతున్న మార్గం అన్ని దేశాలలోని కార్మిక, వుద్యోగ సంఘాలకు మార్గదర్శనం చేస్తున్నదని చెప్పవచ్చు. ఆ యూనియన్‌ ఇతర యూనియన్లతో పాటు సామాజిక న్యాయ తరగతులు అంటే తక్కువ వేతనాలకు పనిచేసే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల కార్మికుల నుంచి నల్లజాతీయుల జీవిత సమస్యల వరకు(మన దేశంలో షెడ్యూలు కులాలు, తరగతులు, ఇతర బలహీన వర్గాలు) వరకు వారు సంబంధాలు కలిగి వున్నారు.అమెరికా సమాజంలో పురోగామి మార్పునకు ఒక శక్తిగా వున్నారని జాకోబిన్‌ అనే పత్రిక వ్యాఖ్యానించింది.