Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

    కాంగ్రెస్‌ వర్ణించినట్లు తాలిబాన్‌ రామ్‌దేవ్‌ బాబా తన మనసులోని మాట బయట పెట్టుకున్నాడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు భారత మాత దేశభక్త బిజెపి అధిపతి అమిత్‌ షా తమ స్నేహితుడైన రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛ ఆయనకు వర్తించదా అని దాని గురించి మాట్లాడుతున్న వారిని అడుగుతున్నానని చాలా తెలివిగా ప్రశ్నించారు. ఇంతకీ తనను తానే బాబా అని పిలుచుకొనే రామ్‌దేవ్‌ నోటి నుంచి రాలిన స్వేచ్చా భావం ఏమిటట ! ఈ దేశంలో చట్టాలు వుండబట్టి గాని లేకపోతే భారత మాతకు జై అనని లక్షల మంది తలలు తెగనరికే వాడిని అన్నారు. తన మనసులోని మాటను పలికిన ఆ పెద్దమనిషిని షా సమర్ధించకపోతే ఆశ్చర్య పడాలి తప్ప మద్దతు పలకటం అత్యంత సహజం. భారత మాతకు జై అనని వారు ఈ దేశం వదలి వెళ్లాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు. మరెందుకోగాని వెంకయ్య నాయుడు మాత్రం ప్రజాస్వామ్యంలో అనేక మంది అనేకం మాట్లాడుతుంటారు, చివరకు ప్రభుత్వం చేసిన దానికే అందరూ కట్టుబడి వుండాలి అని ముక్తాయించారు.

    రామ్‌దేవ్‌, అమిత్‌ షా గ్రామాల్లోని మోతుబరులను గుర్తుకు తెచ్చారు. వారి హుకుంలను ఖాతరు చేయని దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాల పట్ల వారు ఇలాగే నోరు పారవేసుకుంటూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతుంటారు. పల్లెలు, పట్టణాల తేడా లేకుండా స్త్రీల వస్త్ర ధారణ, బయటకు రావటం గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసే కాషాయ తాలిబాన్లు మనకు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో నల్లుల సంతానంలా పెరిగిపోతున్నారు. నువ్వెలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నట్లు విద్వేషాలను రెచ్చగొట్టే రామ్‌దేవ్‌ వాచాలతను భావ ప్రకటనా స్వేచ్ఛ కాదా అని ప్రశ్నించిన అమిత్‌ షా గురించి చెప్పాల్సిందేముంది. రామ్‌దేవ్‌ బిజెపి నేతలకు స్నేహితుడు,సన్నిహితుడూ అన్నది లోకానికంతటికీ తెలిసిన నగ్న సత్యం.

    ప్రస్తుతం దేశంలో వివిధ అసెంబ్లీలు, పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికైన వారిలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు తమపై కేసులు వున్నట్లు స్వయంగా పేర్కొన్న 70 మందిలో మెజారిటీ తాలిబాన్లకు ఆశ్రయమిచ్చేదిగా పేరు తెచ్చుకున్న బిజెపి వారు 28 మంది వుంటే , మైనారిటీ తాలిబాన్లకు ఆలవాలంగా పేరు బడ్డ మజ్లిస్‌ పార్టీ వారు ఆరుగురు వున్నారు. ఇక కేసులున్న 399 మంది అభ్యర్ధుల వివరాలకు వస్తే వారిలో కూడా 97 మందితో బిజెపి టాప్‌లో వుంది. దాని మిత్రపక్షమైన శివసేన 14, మజ్లిస్‌కు చెందిన వారు 12 మంది వున్నారు. పోటీ చేసిన వారు, గెలిచిన వారిలో వివిధ పార్టీలకు చెందిన వారు వున్నారు. వాటిలో సిపిఎం వంటి వామపక్షాల వారు లేరని వేరే చెప్పనవసరం లేదు. వివిధ సందర్భాలలో విద్వేష ప్రసంగాలకు పెట్టింది పేరైన వారి నోళ్ల నుంచి రాలిన ముత్యాలు ఎలాంటివో చూడండి. ముందుగా అగ్రజుడు అమిత్‌ షాతోనే మొదలు పెడదాం.

   ‘ ఒక మనిషి తిండి లేదా నిద్ర లేకుండా జీవించ గలడు, అతనికి దాహం, ఆకలివేసినా బతక్కగలడు, కానీ అతను అవమానానికి గురైతే బతకలేడు, గతేడాది ఘర్షణల సందర్భంగా హత్యకు గురైన వారికి ప్రతీకారం తీర్చుకోవాలి. బిజెపికి ఓటేయండి : అమిత్‌ షా ( ఇండియా టుడే) ‘ఒక వేళ ఏ కారణంతో అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా, గెలిచినా పాట్నాలో జరుగుతుంది. పాకిస్తాన్‌లో బాణసంచా కాలుస్తారు: అమిత్‌ షా( లైవ్‌ మింట్‌)

   ‘ఎవరైనా పాకిస్తాన్‌ జిందాబాద్‌ నినాదాలు చేస్తే వారి తలలు తీసేస్తాం’ పశ్చిమ బెంగాల్‌ బిజెపి అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ( అఫింగ్టన్‌ పోస్ట్‌)

  ‘రాముడికి పుట్టిన వారి వారసులతో లేక అక్రమ సంతానానికి పుట్టిన వారితో కూడిన ప్రభుత్వం కావాలో మీరు తేల్చుకోవాలి: సాధ్వి నిరంజన జ్యోతి, కేంద్ర మంత్రి( ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌)

  ‘మనం పోరాటాన్ని ప్రారంభించాలి. మనం పోరాటాన్ని మొదలు పెట్టనట్లయితే ఈ రోజు మనం అరుణ్‌ను పోగొట్టుకున్నాం, రేపు మరొకరిని పోగొట్టుకుంటాం, మరొకర్ని పోగొట్టుకొనే ముందు మనం మన బలాన్ని ప్రదర్శించాలి, అదెలా వుండాలంటే ఈ హంతకులు తమంతట తామే అంతర్ధానం కావాలి,నేను ఒక మంత్రిని కనుక నా చేతులు కట్టివేయబడి వున్నాయి, అధికార యంత్రాంగం దానిని చూసుకుంటుంది.’ రామ శంకర్‌ కథేరియా, కేంద్ర మంత్రి (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌), ‘ కేసులను గనుక వుపసంహరించని పక్షంలో ఆగ్రా మరొక రకమైన హోలీని చూస్తుంది :రామ శంకర్‌ కథేరియా, కేంద్ర మంత్రి ( హిందూ)

   ‘ మూడు రోజుల్లోగా పరారీ అయిన వారిని పోలీసులు అరెస్టు చేయనట్లయితే తరువాత ఏం చేయాలో జనం నిర్ణయించుకుంటారు: సంజీవ్‌ బల్యాన్‌, కేంద్ర మంత్రి (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌)

     ‘నరేంద్రమోడీని వ్యతిరేకించేవారు పాకిస్థాన్‌ వెళ్లిపోవాలి: గిరిరాజ్‌ సింగ్‌, కేంద్ర మంత్రి( ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

    ‘ నలుగురు భార్యలు, నలభై మంది పిల్లలు అనేది ఇండియాలో పనిచేయదు, కానీ ప్రతి హిందూ మహిళ హిందూ మతాన్ని కాపాడు కొనేందుకు కనీసం నలుగుర్ని కనాల్సిన సమయమిది: సాక్షి మహరాజ్‌ , బిజెపి ఎంపీ (హిందూ) మన తల్లి కోసం చావటానికైనా, చంపటానికైనా సిద్ధం కావాలి:సాక్షి మహరాజ్‌ , బిజెపి ఎంపీ (ఐబిఎన్‌)

   ‘వారు ఒక హిందూ యువతిని తీసుకుపోతే మనం వంద మంది ముస్లిం యువతులను తీసుకురావాలి:యోగి ఆదిత్యనాధ్‌, బిజెపి ఎంపీ( ఇండియా టుడే)

   ‘శాంతి, ఇస్లాం పరస్పర విరుద్ధమైనవి ప్రపంచంలో ఇస్లాం వున్నంత వరకు వుగ్రవాదం వుంటుంది: అనంత కుమార్‌ హెగ్డే , కర్ణాటక బిజెపి ఎంపీ.(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

   ‘ మమ్మల్ని పరీక్షించేందుకు ప్రయత్నించవద్దు, మా సమాజాన్ని అవమానిస్తే సహించం, మేం అశాంతిని కోరుకోవటం లేదు, కానీ మీరు హిందువులను పరీక్షించాలనుకుంటే మనం ఒక తేదీ నిర్ణయించి ముస్లింలను ఎదుర్కోవాలి: బాబూలాల్‌, బిజెపి ఎంపీ (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ )

  ‘ మనం ముస్లింలం అని గుర్తుపెట్టుకోండి.. ముస్లింలు మరియు భయం సహజీవనం చేయలేవు, భయం లేదా ముస్లింలో బతకాలి. మనం బతుకుతాం ఆందోళన అవసరం లేదు:అసదుద్దీన్‌ ఒవైసీ, మజ్లిస్‌ ఎంపీ, 4 టీవీ.

   ‘ఈ (జాట్స్‌) పంది కొడుకులు అంబేద్కర్‌ మరియు లోహియాను పార్లమెంట్‌లో అడుగు పెట్టనివ్వలేదు: రాజ్‌ కుమార్‌ సయానీ, బిజెపి ఎంపీ.

   ‘రాహుల్‌ గాంధీ ఒక ద్రోహి అతన్ని వురి తీయాలి, కాల్చిపారేయాలి: రాజస్ధాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ

   ఇలాంటి వారితో నిత్యం కలిసి వుండే రామ్‌దేవ్‌ అలా నోరు పారవేసుకోవటంలో, ఆ పెద్దమనిషిని అమిత్‌ షా సమర్ధించటంలో ఇంకా ఆశ్చర్యం కలుగుతోందా ? ఇది భారత దేశం కనుక ఇలా రెచ్చగొట్టేవారు ఇంకా పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్నారు, చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. అన్నింటి కంటే అలాంటి వారిని ఏదో ఒక కారణంతో సమాజంలో కొంత మంది సమర్ధించటం విచారకరం.మజ్లిస్‌ నేతల ప్రసంగాలను చూపి బిజెపి వారు, వారి ప్రసంగాలను చూపిి మజ్లిస్‌ వారూ నోటిని విచక్షణా రహితంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం, రెచ్చగొట్టటం భారతీయ సంస్కృతి కాదు, ఐరోపా నుంచి ముఖ్యంగా జర్మనీ హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నది. కానీ వారే అదే నోటితో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం గురించి కూడా చెబుతారు. అవేమి నోళ్లో మరి !