సత్య
13న కొల్లాపూర్ మహలక్ష్మి దేవాలయ ప్రవేశం
తృప్తి దేశాయ్ ! భూమాత రాన్ రాగిణి బ్రిగేడ్ !! శని శింగనాపూర్ !!!
దేశంలో అనేక మంది నోళ్లలో నానుతున్న పేర్లివి. నాలుగు వందలఏళ్ళ నాటి శని దేవాలయంలో మహిళలకు ప్రవేశ నిషేధ శని శుక్రవారం సాయంత్రంతో వదలి పోయింది.ఈనెల ఒకటవ తేదీన బొంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శని దేవాలయ పాలకవర్గం మహిళలపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇది నిజంగా మహిళలు సాధించిన పెద్ద విజయాలలో ఒకటి. దీనితో వుత్తేజితులైన మహారాష్ట్ర మహిళలు ఇప్పుడు తమ దృష్టి ఇతర దేవాలయాలపై సారించారు. తదుపరి ఈనెల 13న తాము కొల్లాపూర్‌లోని మహలక్ష్మి దేవాలయ ప్రవేశం చేస్తామని, తరువాత నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయ ప్రవేశం చేస్తామని ఈ వుద్యమానికి నాయకత్వం వహిస్తున్న తృప్తి దేశాయ్ శనివారం నాడు ప్రకటించారు. ఒక చిన్న పల్లెటూరు శని శింగనాపూర్‌లో ప్రారంభమైన ఈ వుద్యమం దేశంలోని ఇతర పాంతాలకు విస్తరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో దళితులకు దేవాలయ ప్రవేశాలపై వున్న ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేవాలయ ప్రవేశ వుద్యమాలు సాగిన విషయం తెలిసిందే. ఇపుడు మహిళా ప్రవేశ వుద్యమానికి నాంది పలికారు.దీంతో మనువాదులు మింగా కక్కలేకుండా వున్నారు. రాజ్యాంగం చట్టాలు వుండబట్టిగాని లేకపోతే ఇలాంటి తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తుల అంతం చూసి వుండేవాళ్లం ప్రకటించే సర్వసంగ పరిత్యాగులమని ఫోజు పెట్టే సాధ్వులు, బాబాలు, యోగులు,యోగినులు మనకు దర్శనమిచ్చినా ఆశ్చర్యం లేదు.
చాలా మందికి సుపరిచితమైన షిరిడీకి దగ్గరలో అహమ్మద్ నగర్ జిల్లాలో ఈ శనిదేవాలయం వుంది. తమకు పట్టిన శని వదలాలని లేదా పట్టకుండా వుండాలని ముందస్తుగా కోరుకుంటూ వేలాది మంది నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహిళలు సాగిస్తున్న ఈ వుద్యమం ఆస్తికులకే గాక నాస్తికులకు కూడా అభ్యంతరకరంగా వున్నట్లు అక్కడక్కడా వినిపిస్తోంది. ఇక్కడ సమస్య మహిళలలో మూఢనమ్మకాలను ప్రోత్సహించటం కాదు. దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమానికి కమ్యూనిస్టు అగ్రనాయకులు అనేక మంది నాయకత్వం వహించారంటే అర్ధం దళితులను తీసుకువెళ్లి మనువాదానికి అప్పగించాలని కాదు. పుట్టుక కారణంగా వివక్ష ప్రదర్శించటాన్ని, తోటి మనిషిని మనిషిగా చూడాలనే ప్రజాతంత్ర డిమాండ్, హక్కును నిర్ధారించుకొనేందుకే ఆ వుద్యమాలు జరిగాయి.ఇప్పుడు మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న వుద్యమం, న్యాయపోరాటాలను కూడా అలాగే చూడాలి. ఒక వ్యక్తి దేవుడిని, మతాన్ని నమ్మటమా నమ్మకపోవటమా అన్నది వారి వ్యక్తిగతం.
ఈ వుద్యమానికి నాంది పలికిన 31 సంవత్సరాల యువతి ఆస్ధికురాలు. మహారాష్ట్రలో అధికారంలో వున్న బిజెపి-శివసేన సంకీర్ణ కూటమి ప్రభుత్వం శని ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొనేందుకు చేయని ప్రయత్నం లేదు. మహిళలను అడ్డుకొనేందుకు తొలిసారిగా ఆ దేవాలయానికి మహాళా ధర్మకర్తలను నియమించి వారి ద్వారా అడ్డుకోవాలని చౌకబారు ఎత్తుగడ వేసింది. మహిళలను సమీకరించేందుకు కూడా చేయూత నిచ్చింది.అయితే బోంబే హైకోర్టులో ప్రభుత్వం వివక్షకు వ్యతిరేకమని అఫిడవిట్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా తీర్పును అమలు జరిపేందుకు సిద్ధం కాకపోవటంతో ముఖ్య మంత్రిపై కోర్టు ధిక్కరణ నేరం కింద కోర్టుకు లాగుతామని తృప్తి దేశాయ్ ప్రకటించిన తరువాతే శని ఆలయ కమిటీ దిగివచ్చింది. ఇంత జరిగాక దేవాలయ ప్రవేశం కోసం మహిళలు ఆందోళన చేయాల్సి రావటం సిగ్గుచేటని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించటం విశేషం. వివక్షను పాటిస్తున్న ఇతర దేవాలయాల ప్రవేశం సందర్భంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాల్సి వుంది.
కాలం చెల్లిన మనువాదులను వుక్కిరి బిక్కిరి చేస్తున్న తృప్తి దేశాయ్ ఒక సాధారణ కుటుంబానికి చెందిన గృహిణి. కర్ణాటక సరిహద్దులోని నిపానీ తాలుకాలో జన్మించిన తృప్తి కుటుంబం తరువాత పూనాలో స్ధిరపడింది. ముంబైలో హోం సైన్సు కోర్సులో చేరిన ఆమె కుటుంబ పరిస్ధితుల కారణంగా ఒక ఏడాది తరువాత విద్యను మానుకోవాల్సి వచ్చింది.తరువాత తాను నివసించే పరిసరాలలో క్రాంతి వీర్ అనే ఒక సంస్ధలో చేరి దానికి అధ్యక్షురాలైంది. పేదలకు రేషన్ కార్డులు ఇప్పించేందుకు, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి, వుపాధికి తోడ్పటం వంటి కార్యకలాపాలను ఆ సంస్ధ నిర్వహించేది.ఈ క్రమంలోనే 2007లో ఆమె ఎన్‌సిపి అగ్రనేత అజిత్ పవార్ కుటుంబ ఆధ్వర్యంలో నడిచే అజిత్ సహకార బ్యాంకులో జరిగిన 50 కోట్ల అవినీతికి వ్యతిరేకంగా తృప్తి దేశాయ్ గళం విప్పింది.బ్యాంకు డిపాజిట్‌దార్లతో పోరాట సమితిని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల తరువాత 29వేల మందికి తమ డిపాజిట్లు వచ్చేట్లు చేయటంతో ఆమె వెలుగులోకి వచ్చారు. దాంతో కొంత మంది ఆమెకు ఏదైనా సామాజిక సంస్ధను ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు.
అలా ఏర్పడిందే భూమాత బ్రిగేడ్.నలభై మందితో 2010 సెప్టెంబరు 27న ప్రారంభమైన ఈ సంస్ధలో ఇపుడు ఐదువేల మందికి పైగా స్త్రీ, పురుష సభ్యులున్నారు. అనేక అంశాలపై ఈ సంస్ధ పని చేస్తుంది.అన్నా హజారే జనలోక్‌పాల్ ఆందోళనలోనూ వారు పాల్గొన్నారు. శని దేవాలయ ప్రవేశం కోసం భూమాత బ్రిగేడ్ ఒక వుప విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి భూమాత రాన్‌రాగిణి బ్రిగేడ్ అని పేరు పెట్టారు. నవంబరు 29న ప్రారంభమైన ఈ వుద్యమం ఏప్రిల్ ఎనిమిదిన దేవాలయ ప్రవేశంతో విజయం సాధించింది. తృప్తి దేశాయ్ 2006లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇప్పుడు ఆరు సంవత్సరాల కుమారుడు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. తన భార్య కార్యకలాపాలను చూసి తాము గర్వ పడుతున్నట్లు ఆమె భర్త ప్రశాంత్ దేశాయ్ చెప్పాడు.