ఎం కోటేశ్వరరావు
ప్రపంచ నేతలు, పేరు మోసిన ప్రముఖులను గడ గడలాడిస్తున్న పత్రాలను కలిగి వున్న కంపెనీ మొసాక్ ఫోన్సెకా కథ, కమామిషు ఏమిటి ? అనగా అనగా ఒక భూ ప్రపంచం, దానిలో ఒక ఖండం పేరు దక్షిణ అమెరికా, దానికి ఇంకొక పేరు లాటిన్ అమెరికా.దీనిని వుత్తర అమెరికా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు వున్న ఖండం) ఖండాన్ని కలుపుతూ మధ్యలో వున్న చిన్న దేశాలలో ఇదొకటి. అందుకని దీనిని మధ్య అమెరికా దేశం అని కూడా అంటారు గానీ ఖండాల వారీ చూస్తే దక్షిణ అమెరికాకే చెందుతుంది. పసిఫిక్-అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ ఒక కాలువను తవ్వారు అదే పనామా కాలువ.అంతకు ముందు ఐరోపా, ఆఫ్రికా ఖండాల నుంచి దూరప్రాచ్య దేశాలకు వెళ్లాలంటే దక్షిణ అమెరికాలోని చిలీలో వున్న కేప్ హారన్‌ను చుట్టి రావాల్సి వుండేది. అది ఖర్చు, సమయం వృధాతో పాటు ప్రమాదకర మార్గంగా వుండేది. దాంతో ఆఫ్రికా ఖండంపై ఆధిపత్యం సంపాదించిన ఫ్రెంచి పాలకులు పనామా కాలువకు రూప కల్పన చేశారు. ఈ కధ వేరే. అలాంటి పనామా తమ దేశంలో తవ్విన కాలువను జాతీయ చేసిన తరువాత ఆ కాలువ గుండా ప్రయాణించే ఓడల నుంచి టోలు వసూలు చేసుకోవటంతో పాటు సులభంగా డబ్బు సంపాదించేందుకు తమ దేశంలో కంపెనీలను ఏర్పాటు చేస్తే ఎలాంటి పన్నులు విధించబోమని ప్రకటించింది. పరిశ్రమలు పెడితే, వ్యాపారాలు నిర్వహించి తమ జనానికి వుపాధి కల్పిస్తే రాయితీలు ఇస్తామని ప్రకటించే దేశాల గురించి చాలా మందికి తెలుసు గానీ ఇలా కేవలం కంపెనీలను రిజిస్టర్ చేస్తే రాయితీలిచ్చే దేశాలు, ప్రాంతాలు ప్రపంచంలో చాలా తక్కువగా వున్నాయి.
ఇంతకీ పనామా జనాభా ఎంత అనుకుంటున్నారు. నలభై లక్షల లోపు, వారిలో సగం మంది రాజధాని పనామా సిటీలోనే వుంటారు.కార్పొరేట్ కంపెనీలకు సేవలు అందించేందుకు 1977లో జర్మన్ లాయర్ జర్గన్ మొసాక్ తన పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. పది సంవత్సరాల తరువాత పనామాకు చెందిన లాయర్ రామొన్ ఫొన్సేకా దానిలో చేరటంతో అది మొసాక్ ఫొన్సేకా కంపెనీగా మారింది. తరువాత స్విడ్జర్లాండ్‌కు చెందిన మరో లాయర్ క్రిస్టోఫ్ జోలింగర్ వారితో భాగస్వామిగా చేరాడు. ఇంకేముంది ముగ్గురు లాయర్లు అరవై కక్షిదారులుగా వారి వ్యాపారం విస్తరించింది. వాణిజ్య , ట్రస్ట్ చట్టాలు, కంపెనీ రిజిస్ట్రేషన్లు,మదుపు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్ధల గురించి సలహాలు అందించటంలో అది పేరు తెచ్చుకుంది.దానికి ప్రపంచంలో 40 కార్యాలయాలు వాటిలో 500 మంది సిబ్బంది వున్నారు. గుట్టుగా లావాదేవీలు నిర్వహించే ఈ సంస్ధలో 1977-2015 మధ్యకాలంలో దాని సేవలు పొందిన, పొందుతున్న ఖాతాదారుల వివరాల పత్రాలు వెల్లడి కావటంతో ప్రపంచ వ్యాపితంగా దాని పేరు తెలిసిపోయింది. పనామాలో ఇంకా ఇలాంటి సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి.పనామాలో నమోదైన మొత్తం కంపెనీలలో సగం ఇలాంటి ఏడు పెద్ద సంస్ధల సేవలు పొందుతున్నాయి.
ఎంత ఎదిగినా ఒదిగి వుండాలన్నట్లుగా అబ్బే మా కంపెనీ చాలా చిన్నదండీ ప్రపంచ ఆర్ధిక సేవల సలహాలలో కేవలం ఐదుశాతమే మా వాటా అని మొసాక్ ఫొన్సేకా చెప్పుకుంటుంది. కానీ పదిశాతం వరకు వుంటుందని ఒక అంచనా.కరీబియన్ ప్రాంతంలో బ్రిటీష్ వారి ఏలుబడిలో వున్న వర్జిన్ ఐలాండ్స్ అనే దీవిలో కూడా మొసాక్ ఫొన్సెకా కార్యకలాపాలు వున్నాయి. ఇక్కడ అది లక్షకు పైగా కంపెనీలను నమోదు చేసింది. ఇవి అక్కడి జనాభాకు నాలుగు రెట్లు ఎక్కువంటే ఆశ్చర్యపోవద్దు. వీటిని సూట్ కేస్ కంపెనీలని కూడా అంటారు. వాటికి కార్యాలయాలు వుండవు, సిబ్బంది వుండరు.పేరుకు అక్కడ ఆఫీసులు, ఇతర చోట్ల కార్యకలాపాలు, పన్నుల చెల్లింపు విషయానికి వస్తే అక్కడి చిరునామాను చూపి తప్పించుకుంటాయి. బినామీ, సూట్ కేసు కంపెనీల ఏర్పాటుకు సలహాలు ఇచ్చే మొసాక్ ఫోన్సెకా వంటి కంపెనీలు కూడా నకిలీలను ఏర్పాటు చేసుకుంటాయి. అర్జెంటీనా అక్రమాల విచారణలో ఇది ఎంఎఫ్ అనే మరో సూట్ కేసు కంపెనీ ఏర్పాటు చేసినట్లు బయటపడింది. బ్రెజిల్లో జరిగిన అక్రమాలలో కూడా ఇలాంటిదే బయట పడింది. అయితే అక్కడి కార్యాలయం తమ ఏజంట్ తప్ప తమ ప్రధాన కార్యాలయంనుంచి పనిచేయదని తప్పించుకుంది. ఈ కంపెనీ యజమానులలో ఒకరు పనామా సలహాదారుగా వుండి, ఈ కుంభకోణం బయటపడటంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
మనదేశ చరిత్రలో అనేక కుంభకోణాలు జరిగాయి. వాటన్నింటినీ ఇక్కడ పేర్కొనటం సాధ్యం కాదు. వాటిలో దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించి అవినీతి మైలు రాళ్లుగా (ఇప్పుడు కిలోమీటర్ రాళ్లు అనుకోవాలి) చెప్పుకొనే కొన్నింటిని రేఖా మాత్రంగా ఇక్కడ చూద్దాం. నయా వుదారవాద విధానం లేదా నూతన ఆర్ధిక విధానాల పేరుతో 99శాతం ప్రజలకు చెందాల్సిన వనరులను ఒక శాతం కార్పొరేట్లకు కట్టపెట్టటం జరుగుతోంది.
రాజ్యాంగ సంస్ధ అయిన కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ (కాగ్) నివేదికల ప్రకారం మన దేశంలో అపారంగంగా వున్న బొగ్గు నిల్వలను వేలం పాట లేకుండా అడ్డదారుల్లో, అవినీతి మార్గాలలో ప్రయివేటు సంస్ధలకు కట్టపెట్టటం పెద్ద కుంభకోణం.దీనికి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం రూపకల్పన చేస్తే మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం అమలు జరిపింది. పనిలో పనిగా విమర్శలను తప్పించుకొనేందుకు కొన్ని ప్రభుత్వ రంగ సంస్ధలకు కూడా ఇచ్చారు. దాని వలన నష్టం లేదు. వచ్చే లాభాలు తిరిగి ప్రభుత్వానికే చేరతాయి.ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల నష్టమని కాగ్‌పేర్కొనగా మీడియా అంచనా పదిలక్షల కోట్లకు పైగానే వుంది. ఇదంతా 2004-09 మఢ్యనే జరిగింది. అదీ స్వయంగా ప్రధాని ఆధ్వర్యంలోనే అని తెలుసుకోవాలి.
బాగా చర్చజరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణం కారణంగా ఖజానాకు లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. పెరిగిన 2008 రేట్లు వున్నప్పటికీ నిబంధనలను పక్కదారి పట్టించి 2001 రేట్ల ప్రకారం కేటాయింపులు జరిపి ఈ అక్రమానికి తెరతీశారు.
హవాలా కుంభకోణం. పన్ను ఎగవేసేందుకు, విదేశాల్లో డబ్బు దాచుకొనేందుకు అనుసరించిన విధానాన్ని హవాలా అంటారు. ఒక వ్యక్తి మన దేశం నుంచి అమెరికాకు డబ్బు పంపాలి. మరొకరు అక్కడి నుంచి మన దేశానికి పంపాలి. చట్ట బద్దమైన పద్దతులలో పంపితే లెక్కలు చూపాలి, పన్ను కట్టాలి.ఇవేమీ లేకుండానే కొంత కమిషన్ తీసుకొని అక్కడా ఇక్కడా డబ్బు సర్దుబాటు చేసే ఏజంట్లు వుంటారు.ఇందుకు గాను మన దేశంలో రాజకీయ నాయకులకు కోటీ ఎనభైలక్షల డాలర్ల మేర ముడుపులు ఇచ్చారని 1996లో వెల్లడయింది. దీనిలో అద్వానీ పేరు కూడా చోటు చేసుకుంది. తరువాత కాదని తేల్చారు. ఈ కుంభకోణం ఇప్పుడు కూడా నడుస్తున్నది.
పెద్ద గీతను చిన్నదానిగా చేయాలంటే దాని పక్కనే మరింత పెద్దగీత గీయాలి. ఒకప్పుడు హర్షద్ మెహతా పెద్ద గీత ఇప్పుడు అంతకంటే ఎన్నో పెద్ద గీతలు.బ్యాంకులు, బోంబే స్టాక్ మార్కెట్‌ను మోసం చేసి దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన హర్షద్ మెహతా బీమా కంపెనీలో ఒక చిన్న వుద్యోగి. ఆర్ధిక లావాదేవీలలో లొసుగులను కనిపెట్టి వాటిని వుపయోగించుకున్నాడు.మొత్తం 28 కేసులు నమోదు చేయగా నాలుగింటిలోనే శిక్ష పడింది. 47ఏళ్ల వయసులో జైల్లో మరణించాడు. ఆ కేసులు మాత్రం ఇంకా నడుస్తూనే వున్నాయి.
రక్షణ రంగంలో ముడుపులు లేని లావాదేవీ వుండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాటిని బహిర్గతం చేసింది బోఫోర్స్ కుంభకోణం. పెద్ద తుపాకుల కొనుగోలు కాంట్రాక్టులో 80 కోట్ల రూపాయల కమిషన్లు పొందిన వారిలో రాజీవ్ గాంధీ వున్నట్లు వెల్లడైంది. దీంతో పెద్ద సంచలనం. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలతో పోలిస్తే ఇది మరీ చిన్నగీత.
కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా చివరికి గడ్డిలో కూడా కోట్లు సంపాదించవచ్చుని బీహార్‌లో జరిగిన 900 కోట్ల రూపాయల ఈ కుంభకోణం నిరూపించింది. దీని పేరు చెబితే వెంటనే లాలూ ప్రసాద్ యూదవ్ గుర్తుకు రాక మానరు.. బ్యాంకింగ్ రంగంలో వున్న లొసుగులను వుపయోగించుకొని బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేతన్ పరేఖ్ అనే పెద్ద ఒక విధంగా వందల కోట్ల రూపాయలకు ముంచాడు.
దాదాపు పది సంవత్సరాల పాటు విదేశీ, స్వదేశీ జనాలు, కంపెనీలను దాదాపు 14వేల కోట్ల రూపాయలకు ముంచిన సత్యం కంప్యూటర్స్ గురించి పెద్దగా చెప్పుకోనవసరం లేద. బిల్‌గేట్స్,చంద్రబాబు నాయుడు వంటి వారు ఈ మోసగాడిని తమ పక్కన కూర్చో పెట్టుకొని అందలమెక్కించారు. నకిలీ స్టాంపుల ముద్రణతో 20వేల కోట్లకు పైగా ముంచిన తెల్గి, దాదాపు పదివేల కోట్ల రూపాయలను స్వాహా చేసిన కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం వంటివి మన కళ్ల ముందే జరిగాయి. వీటిలో భాగస్వాములైన వారిని శిక్షిస్తారా ? పోయిన ప్రజల సొమ్మును తిరిగి రాబడతారా ? అప్పనంగా సొమ్మును అప్పగించటమే అవినీతి కాదు, అలా తేలిన సొమ్మును రాబట్టకపోవటం కూడా అవినీతిలో భాగమే అవుతుంది.