Tags

, , ,

ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

ఎం కోటేశ్వరరావు

   లైసన్సులు, పర్మిట్లు ఇప్పించినందుకు లంచాలు తీసుకోవటం, బల్లకింద చెయ్యి పెట్టటం నాటి పద్దతి ! ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు, భూములు, రుణాలు ఇప్పించి నీకది-నాకిది, నీకింత -నాకింత అని పంచుకోవటం నేటి పద్దతి !! ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకుంటుంటే అవినీతి నిరోధకశాఖ సిబ్బంది నాటకీయంగా వలపన్నటం లెక్కలేనన్ని సినిమాల్లో అందరూ చూసింది మోటు పద్దతి. ఇప్పుడు అంతా చట్టబద్దమే, బల్లమీది వ్యవహారమే.

    రాజకీయ నేత, పారిశ్రామికవేత్త, వ్యాపారి, సినిమా యాక్టర్‌ ఇలా ఎందరో మహాను భావులు , చిదిమితే దేశ భక్తి కారిపోతుంటుంది. ప్రతిదానినీ వ్యాపారం-లాభం లెక్కలలో చూసుకొనేవారు ఎవరైనా ఇదే పద్దతి. గజం పాతికవేల రూపాయల స్ధలాన్ని కంపెనీ పేరుతో పాతిక రూపాయలకే అప్పనంగా పొందవచ్చు. దీన్ని కేటాయించిన సదరు మంత్రి కుమారుడు, కుమార్తెల పేరుతో (ఎందుకంటే ఇప్పుడు బావమరుదులను కూడా నమ్మటం లేదు మరి) ముందుగానే ఏర్పాటు చేసిన సూట్‌ కేసు కంపెనీలలో పది రూపాయల వాటాను వెయ్యి రూపాయలకు కొనటం లేదా సదరు కంపెనీకి ఎలాంటి వడ్డీ లేకుండా వందల కోట్ల రుణం పేరుతో డబ్బు బదలాయించి చట్టబద్దంగానే లంచం చెల్లించటం నేటి పద్దతి.

     ఇక అలా సంపాదించిన దానిని స్నేహితులు, బంధువుల పేరుతోనో మరొక పేరుతోనో దాస్తే, ఎవరినీ నమ్మే రోజులు కావివి, తీరా గడ్డితిని సంపాదించిన దానిని వారు నొక్కేస్తే ? డబ్బూపోయె శనీ పట్టె అన్నట్లు ఎందుకొచ్చిన తిప్పలు ! విదేశాల్లో దాచుకుంటే ఏ గొడవా వుండదు. అందుకే ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

     మనకు బాగా తెలిసి పన్నుల స్వర్గం స్విడ్జర్లాండ్‌. అక్కడి బ్యాంకుల నిబంధనల ప్రకారం ఎవరైనా ఎంతైనా డబ్బు దాచుకోవచ్చు. అది ఎక్కడిది, అక్రమమా, సక్రమమా అని ఎవరూ అడగటానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించారు.అందుకని ఎవరైనా స్విడ్జర్లాండ్‌ వెళ్లారంటే అక్కడ లావాదేవీలు చూసుకొని రావటానికే అని అనుమానించటం సహజం. ఇపుడు స్విడ్జర్లాండ్‌ నిబంధనలు మార్చారు.ఎవరైనాఅడిగితే సమాచారాన్ని తెలియచేయాల్సి వుంటుంది. ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేని పనామా వంటి దేశాలు, దీవులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. డబ్బుంటే చాలు, దానిని ఎలా దాచుకోవాలో, ఎలా పన్నులు ఎగ్గొట్టాలో సలహాల సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి. అదిగో అలాంటి వాటిలో పనామాలోని ఒక పెద్ద సంస్ధ మోసాక్‌ ఫొన్సెకా. దాని దగ్గర వున్న లక్షలాది లావాదేవీల పత్రాలు బయటికి వచ్చాయి. ఆ కంపెనీ పనామాలో వుంది కనుక వాటిని పనామా పత్రాలని పిలుస్తున్నారు.రెండులక్షలకు పైగా కంపెనీల వివరాలు ఇపుడు బయటకు వచ్చాయి. తమ కంప్యూటర్లను హాక్‌ చేశారని మొసాక్‌ ఫొన్సేకా ప్రకటించింది.

    ఏప్రిల్‌ మొదటివారంలో ఈ పత్రాలు వెలువడగానే దాదాపు అన్ని పత్రికలు ఆ వార్తను పతాక శీర్షికలతో పెట్టాయి. తరువాత వాటి గురించి దాదాపు మరిచి పోయాయి ? పెట్టుబడిదారుల పుత్రికలైన పత్రికలు కొనసాగింపు వార్తలను ఇస్తాయని ఎవరైనా ఆశిస్తే అది దురాశే.మన దేశానికి చెందిన పెద్దల పేర్లు కూడా పనామా పత్రాలలో వుండటంతో మన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. వాటి వెనుక కారణాలు ఏవున్నప్పటికీ ఆ మేరకు స్పందించినందుకు కొంత మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు పంచుతామని ఎన్నికలకు ముందు చెప్పిన ప్రధాని రెండేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదనే విమర్శలను తప్పించుకోవటానికే మొక్కుబడిగా ఆ ప్రకటన చేశారని ఎందరో భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం చాలా పరిమితమే. రానున్న రోజుల్లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరింత సమాచారాన్ని వెల్లడించనుంది.అందువలన ఇది అంతంకాదు ఆరంభం మాత్రమే. వస్తున్న విశ్లేషణలు, నిబంధనలను పరిశీలిస్తే ఎవరెంత మన దేశంలో దోచుకున్నారో విదేశాల్లో దాచుకున్నారో వివరాలు కొంతమేరకు తెలుసుకోవచ్చేమో తప్ప సరిహద్దులు దాటిపోయిన ధనం ఏమేరకు తిరిగి వస్తుందన్నది అనుమానమే.

     పనామా పత్రాలు ప్రపంచంలో అనేక మంది రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఐస్లాండ్‌ ప్రధాని రాజీనామా చేశాడు.నలభై లక్షల డాలర్ల అక్రమ బాండ్ల వివరాలు బయటకు రావటంతో తోకముడిచాడు. బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ పన్నులకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చినట్లు బయటకు రావటంతో ఇబ్బందులలో పడ్డాడు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.ఇలాంటి వారు 45 దేశాధినేతల పేర్లు ఈ పత్రాలలో ప్రస్తావనకు వచ్చాయి.న్యూస్‌ వీక్‌ పత్రిక సమాచారం ప్రకారం ప్రపంచంలోని పన్నుల స్వర్గాలలో 21నుంచి 32లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రపంచ సంపన్నులు, కార్పొరేట్లు అక్రమంగా దాచుకున్నారు. స్విడ్జర్లాండ్‌, హాంకాంగ్‌, అమెరికా, సింగపూర్‌, కేమాన్‌ దీవులు ప్రధమ స్ధానాలలో వుండగా పనామా 13,బ్రిటన్‌ 15వ స్ధానంలో వుంది.బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో పన్ను చెల్లించనవసరం లేకపోవటంతో ఎఫ్‌డిఐలు అక్కడికి లక్షా ఇరవైవేల కోట్ల పౌండ్ల మేరకు వచ్చాయి. అక్కడ 6,72,500 కంపెనీలు లేదా ఖాతాలు వున్నాయి. దారి జనాభా 30వేలకు లోపు. ఇలాంటి అక్రమలావాదేవీలకు ప్రధాన కేంద్రంగా బ్రిటన్‌ వుంది. పనామా పత్రాల తీవ్రత ‘పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేదిగా వుందని’ టైమ్‌ పత్రిక వ్యాఖ్యానించింది.’21వ శతాబ్దపు పెట్టుబడిదారీ విధాన వాహనం అడ్డుగోడను ఢీకొట్టేందుకు శబ్దం చేస్తూ వెళ్లే దారిలో మొసాక్‌ ఫొన్సెకా వ్యవహారం ఒక మైలు రాయి అని ‘ జీన్‌ పెరీ లేమాన్‌ అనే పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించాడు.

     ఆర్ధిక అసమానతలను పరిష్కరించని పక్షంలో మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్ధకే ముప్పు వస్తుందని తీవ్ర హెచ్చరిక చేసిన ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ పన్నుల స్వర్గాలను అదుపు చేయని పక్షంలో మొత్తం ప్రపంచ వ్యవస్తే కుప్పకూలి పోతుందని అది జరగక ముందే వాటిని తక్షణమే అదుపు చేయాలని,నిబంధనలు పాటించని దేశాలపై అవసరమైతే ఆర్ధిక ఆంక్షలు విధించాలని పనామా పత్రాల వెల్లడి గురించి వ్యాఖ్యానించారు. పన్నుల స్వర్గాలలో జరుగుతున్న అక్రమాల గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయని ప్రభుత్వాలు చేసే ప్రకటనలకు, ఆచరణకు నక్కకూ నాగలోకానికి వున్నంత దూరం వుందని పికెటీ పేర్కొన్నారు. 2014లో లక్సెంబర్గ్‌ లీక్స్‌ లేదా లక్స్‌లీక్స్‌ దర్యాప్తులో ఐరోపాలోని కార్పారేట్‌ కంపెనీలేవీ పన్నులు కట్టటం లేదని తేలింది. పనామా పత్రాల ప్రకారం ధనిక, పేద దేశాల ఆర్ధిక, రాజకీయ పెద్దలు తమ ఆస్థులను ఎలా దాచుకుంటున్నారో వెల్లడి అయింది. జర్నలిస్టులు తమ విధి నిర్వహిస్తున్నందుకు మనం సంతోషించాలి.సమస్య ఎక్కడంటే ప్రభుత్వాలే తమపని తాము చేయటం లేదు. వాస్తవం ఏమంటే 2008లో ప్రారంభమైన సంక్షోభం తరువాత అసలు చేసిందేమీ లేదు.మరో విధంగా చెప్పాలంటే పరిణామాలు మరింతగా దిగజారాయి.తమ ఆధీనంలోని వర్జిన్‌ దీవులు, ఇతర ప్రాంతాలలో కొల్లగొట్టే పనులు చేస్తూనే బ్రిటన్‌ తన పన్ను రేటును 17శాతానికి తగ్గించబోతున్నది. ఒక పెద్ద దేశం ఇలా చేయటాన్ని ఎక్కడా వినలేదు. దీని గురించి ఏమీ చేయకపోతే మనమందరం ఐర్లండ్‌ మాదిరి 12శాతం లేదా సున్నా లేకపోతే పెట్టుబడులు పెట్టిన వారికి గ్రాంట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అని కూడా పికెటీ వ్యాఖ్యానించారు.

      పన్నుల స్వర్గాలలో ప్రయివేటు ఆస్ధులను దాచుకోవటంపై ఇప్పటికీ పూర్తి పారదర్శకత లేదు, 2008 నుంచి ఆర్ధిక వ్యవస్ధల కంటే ఆస్తులు వేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వారు ఇతరుల కంటే తక్కువ పన్ను చెల్లించటం ఒక కారణం.ప్రభుత్వం ఎలాగూ దర్యాప్తు చేయదనే భయంతో ప్రాన్స్‌లో ఒక జూనియర్‌ మంత్రి తనకు స్విడ్జర్లాండ్స్‌లో ఖాతాలు లేవని 2013లో మంత్రి తాపీగా చెప్పాడు. జర్నలిస్టులు వాస్తవాలను వెల్లడించారు. తమ దగ్గర వున్న సమాచారాన్ని వున్నది వున్నట్లు అధికారికంగా తెలియచేసేందుకు స్విడ్జర్లాండ్‌ అంగీకరించింది. పనామా ఇప్పటికీ తిరస్కరిస్తున్నది. సమాచారాన్ని వెల్లడి చేయటమంటే అదొక ప్రభావ వంతమైన సామాజిక నిరసన అనే సిద్ధాంతం గతంలో లేని విధంగా నేడు పరీక్షకు గురి అవుతోంది. అది పెట్టుబడిదారీ విధానం రానున్న రోజుల్లో మరింత తీవ్ర సంక్షోభంలో పడవేయటానికి తోడ్పడుతుందని పికెటీ హెచ్చరించారు.

మన జర్నలిస్టులూ భాగస్వాములే

      ఈ శతాబ్ది జర్నలిజం ప్రాజెక్టుగా పేరుతెచ్చుకున్న పనామా పత్రాలను బయట పెట్టిన జర్నలిస్టులలో మన దేశానికి చెందిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన వారు ముగ్గురు వున్నారు. పి వైద్యనాధన్‌, రితు శరీన్‌, జయ్‌ మజుందార్‌ దాదాపు ఎనిమిది నెలల పాటు పనామా పత్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు.యాజమాన్యం వారిని అందుకు అనుమతించింది. విలేకర్లు తెచ్చిన సమాచారాన్ని తీసుకొని డబ్బున్న, అక్రమాలకు పాల్పడిన వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు సంపాదించే మీడియా సంస్ధల యజమానులు విచ్చల విడిగా వున్న ఈ రోజుల్లో విశ్వసనీయత ముఖ్యమైనది. అందుకు గాను గతంలో వారి పరిశోధనలు, వెల్లడించిన సమాచారం, వ్యక్తిగత నిజాయితీల రికార్డు ఆధారంగా ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసిఐజె) తన బృందాన్ని ఎంపిక చేసుకుంటుంది. దీనిలో అలా రాటు దేలిన వారు 25 భాషలు, 70 దేశాలకు చెందిన 250 మంది జర్నలిస్టులు భాగస్వాములయ్యారు. వీరికి అందుబాటులోకి వచ్చిన సమాచారం గురించి వింటే పడిపోవాల్సిందే. 1977 నుంచి 2015 డిసెంబరు వరకు వున్న నలభై ఎనిమిది లక్షల ఇమెయిల్స్‌, 21లక్షల పిడిఎఫ్‌ పైల్స్‌ను వారు వడపోశారు.ఒక జర్మన్‌ పత్రిక సమాచారం ప్రకారం కోటీ 15లక్షల రహస్య పత్రాలు జర్నలిస్టులకు అందుబాటులోకి వచ్చాయి. తామేం చేస్తున్నామో, తాము పరిశీలిస్తున్న మొసాక్‌ ఫోన్సెకా పేరు కూడా తమ స్వంత సంస్ధలోని వారికి కూడా పత్రాలను బహిర్గతం చేసేవారికి కూడా తెలియదని రీతు శరీన్‌ చెప్పారు. ఆమె గత నలభై సంవత్సరాలుగా ఇలాంటి వార్తలను సేకరించటంలో నిమగ్నమయ్యారు.ఆమె అంతకు ముందు బ్రిటన్‌లోని పెద్ద బ్యాంకు అయిన హెచ్‌ఎస్‌బిసి-స్విస్‌ బ్యాంకు, వర్జిన్‌ ఐలాండ్‌లోని భారతీయుల ఖాతాల లోగుట్టును బయటపెట్టారు.ఇది ఐసిఐజెతో ఆమెకు మూడవ ప్రాజెక్టు. నీరారాడియా టేపులను బహిర్గతంలో చేయటంలో చేయితిరిగిన రీతు తన బృందంలో బ్యాంకింగ్‌, ఆర్ధిక రంగాలలో సమగ్రపరిజ్ఞానం వున్న వారిని ఎంపిక చేసుకున్నారు. వారికి మరో 22 మంది వివిధ రాష్ట్రాల రిపోర్టర్లు తోడ్పడ్డారు. అయితే వారంతా ఈ ముగ్గురు బృందం అడిగిన సమాచారం అంటే పనామా పత్రాలలో వున్న భారతీయుల చిరునామాలు, ఇతర సమాచారాన్ని ఇవ్వటం తప్ప తామెందుకు ఆ సమాచారం ఇస్తున్నారో కూడా వారికి తెలియదు. మన దేశానికి సంబంధించిన 36వేల పత్రాలను ఎక్స్‌ప్రెస్‌ బృందం పరిశీలించింది.ఎప్పటి కప్పుడు సమాచారం బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. రీతు రెండు అంతర్జాతీయ రహస్యసమావేశాలకు వెళ్లి పత్రాల పరిశీలనలో శిక్షణ కూడా తీసుకున్నారు.

      నరేంద్రమోడీ సర్కార్‌ విదేశాల్లో వున్న నల్లధనం తెస్తానని రంకెలు వేయటం, అక్రమార్కులను సర్దుకోమని చెప్పటం తప్ప మరొకటి కాదని తేలిపోయింది. పనామా పత్రాల ప్రకారం గతేడాది కూడా అనేక మంది నల్లధన కుబేరులు పనామాలో ఖాతాలు తెరిచినట్లు బయట పడింది. మన చట్టాలు ఎంత లోప భూయిష్టంగా వున్నాయంటే పనామా వంటి పన్ను స్వర్గాలలో కంపెనీలు తెరవటానికి అనుమతించవు గానీ వాటిలో వాటాలు, ఏకంగా కంపెనీలనే కొనుగోలు చేయవచ్చు. అంటే చట్టబద్దంగానే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం సులభమైంది కనుకనే అనేక మంది తాపీగా తమ లావాదేవీలన్నీ చట్టబద్దమే అని చెబుతున్నారు. దాదాపు ఐదు వందల మంది భారతీయులకు పనామాలో ఖాతాలున్నట్లు అంచనా. వారిలో పద్మభూషన్‌ కౌశల్‌ పాల్‌ సింగ్‌ నుంచి ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ, కాంగ్రెస్‌కు సన్నిహితుడైన సమీర్‌ గెహ్లట్‌, బిగ్‌బి అమితాబ్‌,ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ తదితరులు ఈ జాబితాలో వున్నారు. వాణిజ్య వేత్తలు తాము అధికారులకు అన్నింటినీ వెల్లడించామని, అంతా చట్టబద్దంగానే జరిగిందని చెబుతుండగా అమితాబ్‌ మాత్రం అస్సలు తమకేమీ తెలియదని ప్రకటించారు.మరికొందరు ప్రవాస భారతీయులు తమకు భారత చట్టాలు వర్తించవని తమ దేశభక్తిని ప్రకటించుకున్నారు.