Tags

, , , ,

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గారికి

    మీ అభిమాని ఎం కోటేశ్వరరావు  వ్రాయు బహిరంగ లేఖ. అన్నా ఇలా రాస్తున్నందుకు మీరు అన్యధా భావించవలదు. ఎంతో బిజీగా వుంటారు కనుక లేఖలను మీరు చూసే అవకాశం వుండదు. మీ సిబ్బంది కూడా అభిమానుల లేఖలన్నింటినీ పూర్తిగా చదువుతారో లేదో అనే అనుమానంతో ఇలా రాయాల్సి వస్తోంది. మీరేమీ అనుకోరని అనుకుంటున్నా.

    మీ అభిమానులందరం రాజా గబ్బర్‌ సింగ్‌ కోసం ఎదురు చూస్తూ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా చూస్తూ ఆనందిస్తున్నాం. అన్నదానాలు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం. మీ (మా) సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్‌లో భాగంగా వివిధ టీవీ చానల్స్‌ , పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించి ఖుషీ కలిగించి అభిమానులలో వున్న అనుమానాలను తొలగించారు. గత రెండు సంవత్సరాలుగా లేస్తే మనిషిని కాను అన్న కుంటి మల్లయ్య మాదిరి మీ పీకె మాటలు తప్ప ఇంతవరకు పీకిందేమీ లేదని అంటుంటే ఎంత గుడ్డి అభిమానులమైనా అడ్డగోలుగా మిమ్మల్ని సమర్ధించలేక, కాదని ఖండించలేక చచ్చిపోతున్నాము. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మీకు తెలుసు. రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఎవరు ఏమి అన్నా పడాల్సిన పరిస్థితి.ఎన్నికలలో మీ పోటీ ప్రకటన తరువాత ఇప్పటిదాకా మనకు అత్తారింటికి దారేదో చూపిన మీ పవర్‌ స్టార్‌ ఇప్పుడు తన పదవికి మార్గమేదో వెతుక్కుంటున్నాడని కొంత మంది వ్యంగ్యంగా అంటున్నారు. పదవి కోసం పాకులాడని వాడెవడు, అదేపని మా పీకే చేస్తే తప్పేమిటి అని ఎదురుదాడి చేస్తున్నాం. ఇంకా అవసరమైతే వుధృతం చేస్తాం మీరు ఫికరు పడకండి.

   గతంలో తెలుగు దేశం పార్టీ వారు తాము పార్టీ పెట్టిన ఎనిమిది నెలలో అధికారానికి వచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. అదొక పెద్ద గొప్పేంటి మే మసలు అధికారానికి వచ్చిన తరువాతే పార్టీ పెట్టామని(జనతా) మరొకరు బదులిచ్చారు. మన ప్రత్యేకత ఏమిటన్నా ? మీరు గత అసెంబ్లీ , పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామంటున్నారు. ఇది చాలా చిత్రంగా వుందన్నా.

    ఈ మధ్య కాలం ఐదు సంవత్సరాలో ఏం పీకారంటే ఏం చెప్పాలన్నా ! ఎన్నికలపుడు చెప్పుకోవటానికి ఏదైనా వుండాలి కదన్నా. జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పటికైనా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించితే మంచిది. అన్నా మనలో మాట, హైదరాబాదులో వున్నన్ని రోజులు మరొకచోట ఎక్కడా జీవించలేదని మీరు ఒక మాట అన్నారు. ఇంతకీ మన పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేస్తుందన్నా, రెండు తెలుగు రాష్ట్రాలలోనా ? ఒక్క ఏపిలోనేనా ? వైఎస్‌ఆర్‌ సిపి, తెలుగుదేశం పార్టీ పాట్లు చూసిన తరువాత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్నా.

     ఏపికి ప్రత్యేక హోదా ఇతర విషయాల గురించి మీకింకా గుర్తుందని చెప్పినందుకు ఒకవైపు సంతోషంగా వున్నా మరో వైపు మాత్రం విచారంగా వుందన్నా. పేదరాసి పెద్దమ్మ కథలలో చెప్పే రాజహంస ఎంతో అందంగా వుంటుంది గానీ దానిని ఎవరూ చూసిన వారు లేరన్నా, ఏపికి ప్రత్యేక హోదా కూడా అలాంటిదే అంటున్నారు. అది రాదని మీకు ఎన్ని సార్లు చెప్పాలి పదే పదే అడుగుతారు ఒకసారి చెబితే అర్ధం కాదా అంటూ కేంద్ర మంత్రులు విసుక్కుంటున్నారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తద్దినం రోజు తప్ప మిగతా రోజులలో విస్మరించే మాదిరి పట్టించుకోవటం లేదు. జనం కూడా దాని గురించి మరిచి పోయి అంతకంటే మంచి రోజులు వస్తాయని సర్దుకు పోతున్న రోజులలో అదింకా గుర్తుందని మీరెందుకన్నా చెప్పటం.మీరేమైనా అనుకోండి ఇది అశుభ సూచకం అన్నా. జనానికి పట్టని దాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నిబంధనలు మారిన కారణంగా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదని అందరికీ అర్ధమైనా మీ పీకెకు అర్ధం కాలేదా, కాదా అని ఎవరైనా అడిగితే మీరేమో గానీ మేం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నా. ఇంతవరకు లేదు అని కేంద్రం చెప్పలేదు కనుక మాట్లాడటం లేదుతప్ప మరొకటి కాదని మీరు చెప్పారు.

     అన్నా ! కాదని కేంద్రం ఎప్పుడు చెప్పేను మీరు ఎప్పుడు నోరు విప్పేను ! అది జరిగేది కాదన్నా ! ఆంధ్రప్రదేశ్‌ అంటే కేవలం ప్రత్యేక హోదా ఒక్కటే కాదన్నా. జనానికి సంబంధించిన సమస్యలు అనేకం వున్నాయి. దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అని ఎన్నో పుస్తకాలు చదివిన మీకు మేం చెప్పాలా అన్నా ! రాజకీయ పార్టీలు ముఖ్యంగా మీరు చెప్పిన నిబద్దతగా వుండే కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగతావి ఏనాడన్నా ఫలానిది చేయం అని ఎప్పుడైనా చెప్పాయా అన్నా ? మీకెందుకన్నా ఆ పార్టీల మీద అంత భ్రమ ? లేదు తమ్ముడూ నిజం చెప్పాలంటే మన దగ్గర చెప్పేందుకు ఇప్పుడేమీ లేదు, ఏం చెప్పాలో ఎటు పోవాలో తెలియటం లేదు అందుకే అలా చెప్పి కాలం గడుపుదాం అంటే అభిమానులంగా మేం సరే అనక చస్తామా అన్నా ? అన్నో ! అసలు విషయం మరొకటి వుంది !

    ఇంటర్వ్యూలలో మీకు ఖర్చులు ఎక్కువని, తగినంత ఆదాయంలేక రోజులు గడవటం కష్టంగా వుందని చెప్పారు. పార్టీ కోసం కూడా డబ్బు లేదన్నారు. డబ్బులేనోడు డుబ్బుకు కొరగాడని తెలియనిదేముందన్నా ! అలా అయితే మన పార్టీ వెనుక ఎవరు చేరతారన్నా ? లేదా మీరు చెప్పినట్లు చెప్పిన దానికి కట్టుబడి వుండే కమ్యూనిస్టు పార్టీల మాదిరి సమస్యలపై పని చేసి జనం దగ్గరకన్నా వెళ్లాలి. మీరది చెయ్యరు ఇది చెయ్యకుండా డబ్బు లేదంటే కష్టం అన్నా. తమ్ముడు తనోడు కావచ్చు కాని న్యాయం న్యాయమే అన్నట్లుగా చిరంజీవి మా అన్న కావచ్చు గానీ ఆయన కాంగ్రెస్‌లో వున్న కారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించను అని చెప్పారు. అదేంటన్నా ఆలూలేదు చూలు లేదు అన్నట్లు అప్పుడే దారులు మూసేస్తే ఎలా ? ఏ పార్టీ వాసన అంటని వీర భోగ వసంతరాయుళ్లు మన పార్టీకి దొరుకుతారంటావా అన్నా ? మీ దగ్గర డబ్బూ లేక మీ అన్న వంటి వారిని దరిచేరనీయక వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానంటే జనం నమ్మరేమో అన్నా. ఎందుకంటే గతంలో లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పై ఎన్నికలలో కేంద్రంలో పదవి చేపట్టటం నా లక్ష్యం అని చెప్పారు. చివరకు లోక్‌సత్తా దుకాణాన్నే ఎత్తివేశారు. మన పార్టీ పరిస్ధితి అలాకాకుండా చూడండన్నా, ఒకవేళ అదే జరిగితే మీరు తిరిగి సినిమాల్లోకి పోతారు, మేం ఏం కావాలో అలోచించండన్నా ? రాజకీయాలలోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేసిన తరువాత ఇంక సినిమాలు చేయను అంటున్నారు, వినటానికి బాగానే వున్నా అలాంటి ప్రకటనలు మంచివి కాదేమో, అటూ ఇటూ కాకుండా పోతారేమో చూసుకోండన్నా ?

    ఇక పోటీ విషయానికి వస్తే స్వంతంగా చేస్తారా? బిజెపితో కలుస్తారా ? తెలుగుదేశంతో దోస్తీ చేస్తారా అని వూహాగానాలు మొదలయ్యాయి. కొందరేమో మీకు కులముద్ర వేసి కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగు దేశం, బిజెపికి మీరు అలాగే వుపయోగపడ్డారని అందరూ అనుకుంటున్నారు. ఇపుడు పార్టీల ఫిరాయింపులు, ఎత్తులు, జిత్తులు చూస్తుంటే కుల సమీకరణల చుట్టూ తిరుగుతున్నట్లే కనిపిస్తోంది. తోక, తోరెలు అధికార, ప్రతిపక్ష పార్టీలవైపు సమీకరణయ్యారని, తోకా లమద్దతు ఎవరు పొందితే వారికి వచ్చేసారి అధికారం ఖాయం అన్నట్లుగా లెక్కలు వేసుకుంటున్నారు.(తోక అంటే తోటి కమ్మ, తోరె అంటే తోటి రెడ్డి, తోకా అంటే తోటి కాపు, ఇలా ప్రతి కులానికి ఒక సాంకేతిక నామం) రాబోయే ఎన్నికలలో సినిమా రంగాన్ని కూడా తమవైపు తిప్పుకొనేందుకు పార్టీల ప్రయత్నాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నాయి అన్నా. చివరిగా మరొక విషయం అన్నా. ప్రతి ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య రష్యాలోని సైబీరియానుంచి వలస పక్షులు వచ్చి వెళతాయి. అలాగే ఎన్నికలపుడు మాత్రమే కనిపించేవారిని ఎన్నికల పక్షులని పిలుస్తారన్నా. మీరు ఆ పేరు తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం అవసరం అన్నా. వుంటా మరి మరోసారి మరో లేఖ రాస్తా

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు