Tags

, , , ,

ఎంకెఆర్‌

    ఆ పెద్దమనిషి వయసేమీ చిన్నది కాదు.తొమ్మిది పదులు దాటాయి. పైగా శంకరాచార్యులలో ఒకరిగా కొందరు పరిగణించే ద్వారకా పీఠాధిపతి.వయస్సువచ్చిన తరువాత పరిణితి పొందుతారని పెద్దలు చెబుతారు. కానీ ఆయన మాట్లాడిన దానిని చూస్తే ఇంకా తగిన వయస్సు రాలేదేమో అనిపిస్తోంది.మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌ శని దేవాలయంలోకి మహిళలు ప్రవేశిస్తే వారిపై మానభంగాలు పెరుగుతాయని శంకరాచార్య స్వరూపానంద సెలవిచ్చారు.’ ఈ అపవిత్రకరమైన చర్యకు పాల్పడిన వారిని శని సహించడు. వారిపై దాడులు, మానభంగాల వంటివి పెరుగుతాయి’ అని భోపాల్‌లో చెప్పారు. తన దేవాలయ గర్భగుడిలోకి మహిళలు ప్రవేశిస్తే శని సహనం నశించి ఆడవారిపై దాడులు, మానభంఘాలు చేసే విచ్చలవిడి ఆంబోతులను మరింతగా ఎగదోస్తాడని శంకరాచార్య చెబుతున్నారు. శనికి వేరే పనేమీ లేదా ? మహిళలమీద ఎందుకంత ఆగ్రహం? ఎంత అన్యాయమైన వ్యాఖ్యలు ! అంతేనా ! మహిళలు సాంప్రదాయాలను వుల్లంఘించిన కారణంగానే కేరళలోని పుట్టింగల్‌ దేవాలయంలో110 మంది మరణించారని కూడా ప్రకటించేశారు. మహిళలు సాంప్రదాయాలను వుల్లంఘించి దేవాలయాల ప్రవేశం చేయటం కంటే మద్యం తాగి మాన భంగం వంటి నేరాలకు పాల్పడుతున్న పురుషులను తాగకుండా మాన్పించేందుకు పూనుకోవాలని కూడా సలహా ఇచ్చారు.

    ఇంతే కాదు, అర్హతలేని షిరిడీ సాయిబాబాను పూజిస్తూ నిజమైన దేవుళ్లను విస్మరిస్తున్న కారణంగానే ప్రస్తుతం మహారాష్ట్రలో కరవు కాటకాలు సంభవించాయని కూడా సంపూర్ణానంద ఆరోపించారు.సాయిబాబా మాంసం తిన్నాడని, ముస్లిం అని పూజించటానికి అనర్హుడని, అతినికి విగ్రహాలు పెట్టటం, గళ్లు, గోపురాలు కట్టవద్దని, కట్టిన వాటిని కూల్చివేయాలని, ఇతర గుళ్లలోని విగ్రహాలను తొలగించాలని కూడా గతంలో మాట్లాడిన పెద్దమనిషి. నిజానికి ముదిమది తప్పిన స్ధితిలో ఆయనే కాదు, ఇంకా చాలా మంది బాబాలు, గురువులు, పీఠాధిపతులుగా చెప్పుకొనే, ఇలాంటి అభిప్రాయాలు లిగి వున్నవారు ఇటీవలి కాలంలో మనకు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తారు.వారికెందుకీ ఆగ్రహం ? ప్రపంచంలో ప్రతి మతం మహిళల పట్ల వివక్ష చూపుతున్నది. మతాల భాష్యకారులుగా చెప్పుకొనే వారు ఇలాంటి అభిప్రాయాలను మతాల పేరుతో వ్యక్తీకరిస్తున్న కారణంగా మతాలపైనే విమర్శలు చేయాల్సి వస్తున్నది.

     చిత్రం ఏమిటంటే హిందూ మతాన్ని, అది పేర్కొన దేవుడు, దేవతలను తిరస్కరించి నూతన మతాన్ని(తత్వశాస్త్రాన్ని) ముందుకు తెచ్చిన గౌతమ బుద్ధుడిని కూడా హిందూ దేవతల అవతారాలలో ఒకటిగా మార్చివేశారు.అదే కోవలో అసలు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేని ఒక ముస్లిం సూఫీ ఫకీరు సాయిబాబాను కూడా ఒక దేవుడిగా మార్చివేసి, ఆయనకు కూడా విగ్రహాలు పెట్టి పూజలు, పురస్కారాలు చేయటంలో జయప్రదమయ్యారు. ఈ రోజు తిరుమల వెంకటేశ్వరుడి తరువాత ఆదాయం పెద్ద మొత్తంలో తెచ్చే దేవుడిగా షిరిడీ సాయిబాబా మారిపోయారు.అనేక చోట్ల మిగతా దేవుళ్ల కంటే ఎక్కువగా మందిరాలు వెలుస్తున్నాయి.ఒకవైపు సంఘపరివార్‌ శక్తులు హిందూత్వ పునరుద్ధరణ పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న స్ధితిలో సమాంతరంగా ఇటువంటి పరిణామం చోటు చేసుకోవటం నిజంగా మన సమాజ ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. మతోన్మాదం ప్రత్యేక అజెండాగా వున్న శక్తుల మాదిరి సామాన్యజనానికి కూడా ఎక్కి వుంటే ఇలా జరిగి వుండేదా ?

    1830లో ఎక్కడి నుంచి వచ్చారో తెలియని సాయిబాబా 1918వరకు షిరిడీలో జీవించారు.కాలి నడకనే తిరిగి జనం పెట్టింది తిన్నారు.చివరికి మరణించేటపుడు ఒంటిమీది దుస్తులు తప్ప మరేమీ లేకుండా లేకుండా జీవించాడు.ఒక ఫకీరుగా మసీదులోనే కాలం గడిపాడు.

    సంపూర్ణానంద్‌ వంటి ఛాందసులు ఆగ్రహించటానికి షిరిడీ మందిరానికి కుల,మత,స్త్రీ, పురుష లింగబేధం లేకుండా అందరినీ అనుమతించటం కూడా కావచ్చు.షిరిడీ వెళ్లిన వారు పక్కనే వున్న శని శింగనాపూర్‌ వెళ్లి అక్కడ మహిళలకు ప్రవేశం లేదని తెలిసి చాలా మంది నిరాశపడుతుంటారు. షిరిడీ స్ఫూర్తి కూడా శని శింగనాపూర్‌లో తమకెందుకు ప్రవేశం కల్పించరనే ఆందోళనకు మహారాష్ట్ర మహిళలను పురికొల్పి వుండవచ్చు.

    మన దేశంలో సర్వాంగీకార లేదా చారిత్రక సమ్మేళన సంప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షిరిడీ సాయిబాబాకు ఇంతటి ఆదరణ కలగటానికి కారణం ఏమిటి? అతనేమీ ఒక ప్రత్యేక పూజా విధానం లేదా ప్రక్రియ, బోధనల వంటిమేమీ చెప్పలేదు. ఎవరినీ తన వారసుడిగా నియమించలేదు. ఒక సందర్భంలో తాను 15వ శతాబ్ది నాటి కబీర్‌ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. నిజానికి ాసాయిబాబా పుట్టుకతో హిందువో, ముస్లిమో తెలియదు. తన జీవిత కాలంలో భగవద్‌ గీత, ఖురాన్‌లోని అంశాలను చెబుతుండేవారు.అల్లా దేవుడు అంటూనే అందరికీ దేవుడు ఒక్కరే, విశ్వాసం మరియు సహనం గురించి బోధించాడు. తన జీవిత కాలంలో పడుకోవటానికి ఒక పాత దుప్పటి, వేసుకోవటానికి ముతక బట్టలు తప్ప మరొకటి లేని సాయిబాబా నేడు ఏటా వందల కోట్ల ఆదాయం రావటానికి కారకుడయ్యాడు.క్రమంగా ఒక హిందూ దేవుడిగా మార్చివేయ బడ్డాడు.నేడు అన్ని మతాలకు చెందిన వారు సాయిబాబా భక్తులుగా వున్నప్పటికీ అత్యధికులు హిందువులే.ఆయన జీవిత కాలంలోనే ఆయనను హిందూకరణ చేయటం ప్రారంభించారు. మరణానంతరం అది వేగం అందుకుంది. ఇప్పుడు మరింత వూపందుకుంది.

    సాయిబాబా మరణించినపుడు ఆయనకు అంత్య క్రియలు ఏ పద్దతిలో జరపాలన్న వివాదం తలెత్తింది. ముస్లింలు తమ పద్దతిలో అంటే హిందువులు కాదు తమ పద్దతి అని పట్టుబట్టారు. అంతగా హిందూ ముస్లిం బోధనలను సాయిబాబా జనంలో ప్రచారం చేశారు. చివరకు అంత్యక్రియల వివాదం కూడా అసాధారణ రీతిలో రాజీతో ముగిసింది. ఆయన మరణించే నాటికి ఆయన నివశించిన మసీదు సమీపంలోనే ఒక దేవాలయ నిర్మాణం జరిగింది. దానిని ఆయన చేతులతోనే ప్రారంభించాలని అంతకు ముందే నిర్ణయించారు. అది జరగక ముందే మరణించారు. రాజీ మార్గంగా ఆ దేవాలయంలో కృష్ణుడు విగ్రహం సమీపంలో సాయిబాబాను ఖననం చేయాలని ముస్లింలు అంగీకరించారు.ఆయన మరణించిన తరువాత ఆ మందిరాన్ని ఒక దశాబ్దం పాటు ముస్లిం అయిన అబ్దుల్‌ పర్యవేక్షించారు. తరువాత క్రమంగా సాయిబాబాకు పూజలు ప్రారంభమయ్యాయి.నిజానికి ఇదేదో ఒక పధకం ప్రకారమో లేక ప్రయోజనాలకోసమో ప్రారంభమైన ప్రక్రియ కాదు, ఒక ప్రత్యేకతగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. హిందూ, ముస్లిం సూఫీ సంప్రదాయాల మేలు కలయికగా వర్ధిల్లుతున్నది. ముందే చెప్పుకున్నట్లు ప్రతి మతంలోనూ ఛాందసవాదం, వాదులు పెరిగిపోతున్న సమయంలో షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు కూడా అంతకంటే ఎక్కువగా పెరిగారు,పెరుగుతున్నారు. అనేక మంది పుట్టపర్తి సాయిబాబాకు బదులు షిరిడీ సాయిబాబా భక్తులుగా చెప్పుకోవటానికి గర్వపడతారు.మహిళల శని దేవాలయ ప్రవేశం, సాయిబాబాను పూజించటమే మహారాష్ట్రలో కరవుకు కారణం అని నోరుపారవేసుకున్న సంపూర్ణానంద తన వ్యాఖ్యలు అసంపూర్ణంగా వున్నాయను కున్నారేమో, 2013 కేదార్‌నాధ్‌లో వరదలకు కారణం హనీమూన్‌, పిక్నిక్‌లకు జనం రావటమే అని మరోవ్యాఖ్య చేశాడు. ‘ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దేవ భూమి(వుత్తరా ఖండ్‌)లోని వివిధ పుణ్య స్ధలాలకు హనీమూన్‌, వి హార యాత్రలకు వచ్చి అపవిత్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగానే కేదార్‌ నాధ్‌ వరదలు వచ్చాయని, వాటిని ఆపకపోతే అలాంటి వుదంతాలు జరుగుతూనే వుంటాయ’న్నాడు.

    షిరిడీ సాయిబాబాను పూజించటం వల్లనే కరవు వచ్చిందన్న వ్యాఖ్య హాస్యాస్పదం అని షిరిడీ సంస్ధాన్‌ ట్రస్టు మాజీ సభ్యుడుకొరు ఖండించారు.తన దర్శనానికి జనం రాకపోవటంతో స్వరూపానంద అభద్రతా భావంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఏకనాధ్‌ గోండకర్‌ వ్యాఖ్యానించారు. సాయిబాబా తన జీవిత కాలంలో సామరస్యత గురించి ప్రచారం చేశారని, ప్రచారం కోసం స్వరూపానందలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని సాయిబాబా భక్తుడు అదిత్య దామ్లే చెప్పారు..సాయిబాబాను పూజించి నందువలన షిరిడీ ప్రాంతంలో కరువు వస్తే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఎందుకు వచ్చిందని దామ్లే ప్రశ్నించారు.

   రెండు సంవత్సరాల క్రితం సాయిబాబాకు వ్యతిరేకంగా సంపూర్ణానంద విమర్శలు చేయటంతో ఒక సాయిబాబా భక్తుడి ఫిర్యాదు మేరకు ఒక కేసు కూడా నమోదు చేశారు. అనేక చోట్ల సాయి భక్తులు సంపూర్ణానంద్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. కొన్ని చోట్ల వాటికి పోటీ ప్రదర్శనలు కూడా నిర్వహించారు.తన వ్యాఖ్యలను జనం అంగీకరించటం లేదని గ్రహించిన సంపూర్ణానంద తరువాత ఒక ప్రకటన చేస్తూ సాయిబాబా గొప్ప వ్యక్తి అని,ఆయన మానవుడు తప్ప దేవుడు కాదని, గోపురాలు కట్టటం, విగ్రహాలు పెట్టటం ద్వారా ఆయనను అవమానిస్తున్నారని అంటూనే ఎవరైనా ఆయనను పూజించుకోవచ్చు గాని అలాంటి వారు హిందూ దేవాలయాలకు వెళ్ల కూడదని ముక్తాయింపు ఇచ్చాడు.చిత్రం ఏమంటే గుజరాత్‌లోని ద్వారకలో పీఠాధిపతి అయిన సంపూర్ణానంద గత లోక్‌ సభ ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగిన ఒక విలేకరిని ప్రశ్న పూర్తి కాక ముందే చెంపదెబ్బ కొట్టి మాట్లాడవద్దని కోపగించుకున్నాడు.తాను ఒక మతపరమైన సమావేశానికి వచ్చినప్పటికీ పదే పదే నరేంద్రమోడీ గురించి ప్రస్తావించినందున తాను కొట్టానని తరువాత వివరణ ఇచ్చాడు. ప్రధానిగా నరేంద్రమోడీని వ్యతిరేకించటానికి సంపూర్ణానందకు కాంగ్రెస్‌వారితో సంబంధాలు వుండటమే కారణమని బిజెపి వారు చెబుతారు. మొత్తం మీద తమ మద్దతుదారు కాదనో ఏమో గాని శని శింగనాపూర్‌ ఆలయ ప్రవేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తాము సమర్ధించటం లేదని నరేంద్రమోడీ భక్తాగ్రేసరుడు వెంకయ్య నాయుడు ప్రకటించారు.అనేక మహిళా సంఘాలు, ప్రముఖులు ఖండించినప్పటికీ సంపూర్ణానందలో ఎలాంటి మార్పులేదు.

    ఇటీవలి కాలంలో మోడ్రన్‌ బాబాలు, కుర్ర యోగులు, యోగినులకు వున్న అనుచర గణం పీఠాధిపతులకు వుండటం లేదు. అన్నింటికీ మించి ఎవరికి వారే తామే సాధికార భాష్యకారులుగా చెప్పుకుంటున్న స్ధితి. శని సింగనాపూర్‌లో మహిళలకు ప్రవేశ నిషేధంపై బొంబే హైకోర్టు వ్యతిరేక తీర్పు నిచ్చింది. దాంతో అనేక దేవాలయాలు అలాంటి అర్ధం లేని నిషేధాలను ఎత్తివేస్తున్నాయి. రాన్ను రోజులలో ఈ పరిణామం ఇంకా వూపందుకుంటుంది. శబరి మల దేవాలయంలో ప్ర వేశ నిషేధం గురించి ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారిస్తున్నది. ఈ సందర్బంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఛాందస వాదులకు డడ పుడుతున్నది. అక్కడ కూడా నిషేధానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే అది దేశమొత్తం మీద ప్రభావం కలిగిస్తుంది. అలాంటి అన్ని చోట్లా ప్రవేశం కోసం మహిళలు వుద్యమిస్తారు. సంపూర్ణానంద్‌ వంటి శక్తులకు ఈ పరిణామం సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది.