Tags

, , , , , , ,

లవ్‌జీహాద్‌ ముసుగులో రాజకీయం చేస్తున్న బిజెపి, సంఘపరివార్‌

ఎం కోటేశ్వరరావు

    లవ్‌ జీహాద్‌ పేరుతో సంఘపరివార్‌ శక్తులు సమాజంలో మతపరమైన చీలికలు తెచ్చేందుకు, మెజారిటీ మత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు చాలా కాలంగా వినపడుతున్న విషయం తెలిసిందే. లవ్‌ జీహాద్‌ అంటే హిందూ మతానికి చెందిన బాలికలను వివాహం పేరుతో ముస్లిం యువకులు ఆకర్షించి వారిని మతమార్పిడి చేస్తున్నారనే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని మైసూరు సమీపంలోని మాండ్యకు చెందిన రెండు కుటుంబాలు తమ బిడ్డలకు మతాంతర వివాహం చేయటాన్ని సహించలేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మత శక్తులు, వక్కలిగ కులశక్తులు శనివారం నాడు జిల్లా బంద్‌కు ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. మాండ్య పట్టణానికి చెందిన అషిత(28), ఆమె చిన్ననాటి నుంచి స్నేహితుడు, పొరుగున వున్న షకీల్‌ (28) వివాహం సందర్బంగా ఆదివారం సాయంత్రం ఏడున్నరకు మైసూరులో విందు ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన సంఘపరివార్‌ శక్తులు మాండ్యలో అషిత నివాసం ముందు వివాహ వ్యతిరేక ప్రదర్శన చేశారు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించటంతో శనివారం నాడు లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకం అనే పేరుతో మాండ్య జిల్లా బంద్‌కు పిలుపునిచ్చి అభాసు పాలయ్యారు.ఈ వివాహానికి వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తూ మత, కుల శక్తుల వైఖరిని ఖండించాయి. వధూవరుల, తలిదండ్రులు రక్షణ కల్పించమని ఎలాంటి వినతి చేయనప్పటికీ తామే ముందు జాగ్రత్త చర్యగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    భజరంగదళ్‌, బిజెపి కార్యకర్తలు పోలీసు డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు.వారి గురించి పట్టించుకోని ఇరు కుటుంబాల వారు వివాహ ఏర్పాట్లు కొనసాగించారు. శుక్రవారం నాడు పసుపు, శనివారం నాడు మెహందీ క్రతువులను నిర్వహించారు. వధువు తండ్రి, పిల్లల డాక్టర్‌ నరేంద్రబాబు పత్రికలవారితో మాట్లాడుతూ ‘నేను పూర్తిగా లౌకిక వాదిని. దేవుడు అంటే ఒక శక్తి(బలం) అని నమ్మేవాడిని, ఆచారాల పట్ల నాకు విశ్వాసం లేదు. వివాహంలో హిందూ లేదా ముస్లిం సంప్రదాయాలను పాటించటం లేదు. దేవుడి ముందు ఒక కార్యక్రమం వుంటుంది. తరువాత మైసూరులో విందు ఏర్పాటు చేశాము ‘ అని చెప్పారు. ‘వరుడు షకీల్‌ తండ్రి ముక్తార్‌ అహ్మద్‌, నేను 50 సంవత్సరాలుగా స్నేహితులం. మా ఇంటి సమీపంలోనే ముక్తార్‌ వ్యాపారం చేస్తాడు. నా కంటే ముక్తార్‌ రెండు సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ మేం ఇద్దరం కలిసే స్కూలుకు వెళ్లాము. నా కుమార్తె అషిత, ముక్తార్‌ రెండవ కుమారుడు షకీల్‌ చిన్నతనం నుంచి స్నేహితులు, పియుసి నుంచి ఎంబియే వరకు కలిసే చదువుకున్నారు. హెచ్‌ ఆర్‌లో ఎంబిఏ చదివిన తరువాత అషిత ఎంఎస్‌ చేయటం కోసం ఇంగ్లండ్‌ వెళ్లింది. షకీల్‌ కూడా మార్కెటింగ్‌లో ఎంబియే చదివాడు. మాండ్యలోనే వుంటూ తన తండ్రి చేస్తున్న బియ్యం, బెల్లం వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు, డక్కన్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధకు యజమానిగా వున్నాడు. తనకు వివాహం చేసుకోవాలని లేదని మా కుమార్తె చాలా కాలంగా చెబుతోంది. అయితే తరువాత తాను షకీల్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. మేమందరం సంతోషంగా అంగీకరించాం. మా వైపు మరియు షకీల్‌ తరఫు బంధువులు కూడా సంతోషంగా వున్నారు. ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా వివాహం ఆగదు. వివాహం అంటే రెండు హృదయాల కలయిక దానిని నెవరూ వేరు చేయలేరు.’అని కూడా అషిత తండ్రి చెప్పారు.

   ఈ వివాహాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భజరంగ దళ్‌ నేత సిటి మంజునాధ మాట్లాడుతూ ఈ వివాహం పట్ల తమకు అభ్యంతరం లేదని అయితే తాము లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నామని, అషిత మతం మార్చేందుకుగాను ఆమెకు ఖురాన్‌ నేర్పుతున్నారని ఆరోపించాడు. తాము మత మార్పిడులకు వ్యతిరేకం తప్ప వివాహానికి కాదన్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా అనేక మంది వక్కలిగ కులపు అమ్మాయిలు లవ్‌జీహాద్‌కు గురయ్యారని ఆరోపించాడు. అషిత ఇప్పటికే మతంతో పాటు పేరు కూడా మార్చుకుందని తమకు తెలిసిందని, అబ్బాయే ఎందుకు మతం మార్చుకోకూడదు లేదా వివాహం తరువాత ఎవరి మతాన్ని వారు ఎందుకు అనుసరించకూడదని మాత్రమే తాము చెబుతున్నామన్నారు.

    ఇది వ్యక్తిగత వ్యవహారాలను మతపరంగా నియంత్రించేందుకు పూనుకోవటం తప్ప మరొకటి కాదు. మేజర్లయిన స్త్రీ,పురుషులు తమ వివాహం, మతం కలిగి వుండటం లేదా లేకుండా వుండటం అన్నది వారి వ్యక్తిగత వ్యహారం తప్ప బిజెపి, సంఘపరివార్‌ చెప్పినట్లు నడవాలనటం నిరంకుశ ధోరణులకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. దీన్ని సహిస్తే ఇలాంటి శక్తులు మరింతగా పేట్రేగి పోతాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో హిందూ మతానికే చెందినప్పటికీ దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన యువకులను అగ్రవర్ణాలవారని చెప్పుకొనే కుటుంబాల యువతులను వివాహం చేసుకుంటే వారిని హత్య చేయటానికి కూడా వెనుకాడని వుదంతాలు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. అందువలన భజరంగదళ వంటి కాషాయతాలిబాన్లు ముస్లిం లేదా క్రైస్తవ మతాల వారినే కాదు, హిందూ మతంలో కులాంతర వివాహాలను కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే మనువాద వ్యవస్ధను సజీవంగా వుంచాలని ప్రయత్నిస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు.జనాన్ని మతపరంగా చీల్చి తమ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నించే ఇలాంటి శక్తులను వ్యతిరేకించి ధైర్యంగా తమ బిడ్డలకు మతాంతర వివాహం చేస్తున్న అషిత,షకీల్‌ తలిదండ్రులు ఎంతైనా అభినందనీయులు.