ఎంకెఆర్
1965లో కమ్యూనిస్టుల వూచకోతకు సంబంధించిన వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించవద్దని ఇండోనేషియా మానవ హక్కుల కార్యకర్తలు, మేథావులు, చరిత్రకారులు డిమాండ్ చేశారు.ఐదు లక్షల మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను సామూహిక హత్య చేయించిన మిలిటరీ నియంత సుహార్తో ఆ దుర్మార్గాన్ని మరుగుపరచేందుకు తన జీవితకాలంలో తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ దుర్మార్గుడి పతనం తరువాత నాటి ఘటనలకు సంబంధించి వాస్తవాలను బయట పెట్టాలనే డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. దీంతో వత్తిడికి తట్టుకోలేని ప్రభుత్వం నాటి దమనకాండను తక్కువ చేసి చూపేందుకు, విచారం వెలిబుచ్చి వాస్తవాలను మరుగు పరచేందుకు పూనుకుందని అనేక మంది భావిస్తున్నారు.
ఇండోనేషియా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1965 నాటి ఘటనలపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సెమినార్‌ను హోంమంత్రి లుహుత్ పంజైతన్ సోమవారం నాడు ప్రారంభిస్తారు. 1965-66 సంవత్సరాలలో ఐదు నుంచి పదిలక్షల మంది కమ్యూనిస్టులు, పార్టీ సానుభూతిపరులు, చైనా జాతీయులను హత్య కావించటమో, నిర్భంధ శిబిరాలలో చిత్రహింసలకు గురిచేయటమో చేశారు. అమెరికా సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన మిలిటరీ అధికారి సుహార్తో కొంత మంది మిలిటరీ జనరల్స్‌ను హత్య చేయించి అందుకు కమ్యూనిస్టుపార్టీ బాధ్యురాలంటూ నిందవేసి దేశ వ్యాపితంగా దమనకాండకు పూనుకున్నాడు. ఆదంతా నాటి అధ్యక్షుడు సుకర్ణో ఆదేశాల మేరకే జరిగిందని ప్రపంచాన్ని నమ్మించాడు.
సెమినార్ నిర్వాహకులలో ఒకరైన రిటైర్డ్ మిలిటరీ జనరల్ అగస్ మాట్లాడుతూ గతంలో జరిగినదానిని పునరావృతం కానివ్వబోమని,అయితే వాటిని మరిచి పోరాదని అన్నారు. నాటి ఊచకోతలో మరణించిన కమ్యూనిస్టుల- హత్యకు గురైనట్లు చెబుతున్న సైనిక జనరల్స్, ఇతర బాధిత కుటుంబాల పిల్లల మధ్య చర్చలకు, సర్దుబాటు చేసేందుకు ఏర్పడిన ఒక సంస్ధను అగస్ నిర్వహిస్తున్నారు. నాడు జరిగిన కుట్రలో మిలిటరీ జనరల్‌గా వున్న అగస్ తండ్రి కూడా మరణించాడు. సెమినార్‌లో చర్చలు.సర్దుబాట్లకు ప్రయత్నం చేసినందువలన ప్రయోజనం వుండదని అసలు ఏం జరిగిందన్నది వెల్లడి కావాలని, ప్రభుత్వం దేన్నీ దాచకూడదని అనేక మంది కోరుతున్నారు. ఊచకోతపై గతేడాది హేగ్ నగరంలో ప్రజా విచారణ నిర్వహించిన మానవ హక్కుల లాయర్ నూర్‌సియాబానీ కాట్‌జసుంగ్‌కానా ఈ సెమినార్‌ను స్వాగతిస్తూ జాతీయ చర్చకు, సర్దుబాటుకు దోహదం చేస్తుందని అయితే అందుకు గాను ముందుగా నిజాలను వెల్లడించాలని అన్నారు.
న్యూయార్క్, జకర్తాలోని మానవ హక్కుల బృందాలు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ 1965 నాటి హంతకులు, అమెరికా ప్రభుత్వం మధ్య వున్న సంబంధాలు ఎలాంటివో బయట పెట్టాలని డిమాండ్ చేశాయి. 1998లోనే నియంత సుహార్తో పాలన అంతమైనా మానవ హక్కుల వుల్లంఘనకు సంబంధించిన వివరాలను ఇంతవరకు ప్రభుత్వం బయటకు రానివ్వటం లేదు. ఆ హత్యాకాండలో మిలిటరీతో పాటు ఇస్లామిక్ సంస్ధలకు చెందిన వారు కూడా భాగస్వాములయ్యారు. వారిలో కొందరు ఇప్పటికీ సజీవులుగా వున్నారు. వారి వివరాలు బయటకు వస్తే వారిని విచారించి శిక్షించాలనే వుద్యమం తలెత్తుతుందని పాలకులు, మిలిటరీ భయపడుతున్నది.
జాతీయ సెమినార్‌కు సన్నాహంగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ఏర్పాటు చేసిన సమావేశాన్ని ముస్లిం తీవ్రవాదులుగా వున్న వారు అడ్డుకున్నారని సంస్ధ అధ్యక్షుడు బిజో అంటుంగ్ చెప్పారు. తమ సభ్యులు జకర్తా నగరానికి చేరుకోక ముందే మిలిటరీ గూఢచారులు వారిని విచారించారని కూడా వెల్లడించారు. బాధితులకు చెందిన వారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రభుత్వం ముఖ్యంగా మిలిటరీ బెదిరింపులకు దిగుతున్నదని బిజో వెల్లడించారు. సెమినార్‌లో వాస్తవాలను వెల్లడిచేయకపోతే ఎవరు హంతకులు, ఎవరు బాధితులో, ఎవరికి పునరావాసం కల్పించాలో ఎలా తెలుస్తుందని సెటా పరిశోధనా సంస్ధకు చెందిన అహమ్మద్ ఫనానీ రోజ్‌యిదీ ప్రశ్నించారు. నిందితులను కప్పి పుచ్చి బాధితులకు వూరట కల్పిస్తే ప్రయోజనం ఏముందని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. 1965 నాటి వాస్తవాలకు సంబంధించి అమెరికా వద్ద వున్న సమాచారాన్ని తెప్పించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం పూనుకోవాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం వుందని ఒకవైపు చెబుతున్నప్పటికీ దానికి ప్రభుత్వం, మిలిటరీ, అధికార యంత్రాంగంలోని కొన్ని శక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన కూడా వున్నదని వార్తలు వస్తున్నాయి. వియత్నాంపై దురాక్రమణ తీవ్రంగా సాగుతున్న సమయంలో ఇండోనేషియాలో బలంగా వున్న కమ్యూనిస్టు పార్టీతో నాటి అధ్యక్షుడు సుకర్ణో సఖ్యతగా వుండటంతో మరో ఆగ్నేయాసియా దేశం కమ్యూనిస్టుల ప్రభావంలోకి వెళుతుందేమో అన్న భయంతో అమెరికాయే మిలిటరీ జనరల్ సుహార్తోను వుపయోగించి కుట్ర చేసి కమ్యూనిస్టుల వూచకోతకు తెరలేపిందనే అభిప్రాయం కూడా వుంది. అమెరికా వద్ద వున్న ఫైళ్లు, వుత్తర ప్రత్యుత్తరాలను బయట పెడితే అసలేం జరిగిందనే వాస్తవాలు బయటకు వస్తాయి. అమెరికా తన వద్ద వున్న సమాచారంలో తనకు హాని కరం కాని వాటిని బహిర్గతం చేస్తున్నప్పటికీ ఇండోనేషియా వూచకోత వంటి వాటిని ఇంతవరకు వెల్లడించలేదు.
ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వంతంగా దర్యాప్తును ప్రారంభించింది.అయితే అది చేసిన సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.రెండు రోజుల పాటు జరిగే సెమినార్‌లో ఎనిమిది అంశాల గురించి చర్చిస్తారు.
we should also demand reveal mass murders by stalin, mao and lenin too, bcoz oppression is oppression any where and by any one,,
LikeLike