Tags

, , , , , ,

 

ఎంకెఆర్‌

1965-66లో జరిగిన మరణాలపై చర్చలు తప్ప క్షమాపణ చెప్పేది లేదని సోమవారం నాడు ఇండోనేషియా సర్కార్‌ ప్రకటించింది. ఆ సంవత్సరాలలో ఐదులక్షల మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు, అనుమానం వున్న వారిని, కొంత మంది సైనిక అధికారులను హత్య కావించిన వుదంతంపై వారి వారసులతో సర్దుబాటు పేరుతో రెండు రోజుల జాతీయ సెమినార్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సభను ప్రారంభించిన హోంమంత్రి లహుట్‌ పంజైటన్‌ మాట్లాడుతూ గతంతో శాంతిని కోరుకుంటున్నాం తప్ప జరిగినదానికి క్షమాపణ చెప్పేది లేదని చెప్పారు.’ క్షమాపణ చెప్పేంత బుద్దిహీనులం కాదు మేము, ప్రతిదానికీ ప్రభుత్వం క్షమాపణ చెబుతుందని మీరు అనుకోవద్దు, దేశం హితం కోసం మంచి ఏమిచేయాలో మాకు తెలుసు.గతంలో జరిగిన ముఖ్యంగా 1965లో జరిగిన మానవ హక్కుల దుర్వినియోగం కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం కోరుకుంటోంది, అదెంతో సంక్లిష్టతతో కూడుకున్నదని తెలుసు’ అన్నారు.

‘ప్రపంచ వ్యాపితంగా ఎన్నో దేశాలు నిజనిర్ధారణ కమిషన్లు వేశాయి, అవి గతంలో జరిగిన అత్యాచారాలను వెల్లడించాయి. ఇలాంటి విషయాలెప్పుడూ క్లిష్టంగానే వుంటాయి అది ఇండోనేషియాలో ఎందుకు సాధ్యం కాదు, ఇప్పుడు కావలసింది వాస్తవాల వెల్లడి ‘ అని మానవహక్కుల నిఘా సంస్ధ డైరెక్టర్‌ కెన్నెత్‌ ప్రశ్నించారు. మానవహక్కుల కోర్టును ఏర్పాటు చేసి నేర విచారణ జరపాలని ఇండోనేషియా మానవ హక్కుల కమిషన్‌ 2012లోనే సిఫార్సు చేసింది. వూచకోతకు పురికొల్పినవారెవరూ నేడు లేరని, నాటి వుదంతాల గురించి సాక్ష్యం చెప్పేవారెవరూ లేరని, ఎంతో సమయం వృధా అవుతుందనే సాకులతో ప్రభుత్వం దానిని తిరస్కరించింది.

ఈ సెమినార్‌ సందర్భంగా కమ్యూనిస్టుల వూచకోతను సమర్ధించే మాజీ జనరల్స్‌, ప్రభుత్వ అధికారులు ఊచకోత వాస్తవాలను వెల్లడించి, దోషులను శిక్షించాలని కోరుతున్న మానవ హక్కుల కార్యకర్తలు, బాధితుల కుటుంబ సభ్యులు, మారణ కాండ నుంచి తప్పించుకున్న వారిలో కొంత మంది సెమినార్‌ జరిగే ప్రాంగణం వెలుపల గుమికూడి తమ వాదనలను వినిపించారు.

హత్యాకాండకు పాల్పడిన వారిగా ఆరోపణలున్న అనేక మంది నేడు ప్రభుత్వ వున్నత పదవులలో వున్నారని, అందువలన వారిని శిక్షించటం అంతసులభం కాదంటూ, అయితే మానవ హక్కుల వుల్లంఘన సమస్యను పరిష్కారించాల్సి వుందని ప్రభుత్వం గుర్తించింది, కోర్టు వెలుపల వివాదాలను పరిష్కరించుకోవాలన్నది ప్రభుత్వ అభిమతమని మంత్రి చెప్పారు. గతంలో ఈ వుదంతాలపై రూపొందించిన సినిమాలను బలవంతంగా నిషేధించటం భద్రతా కారణాలతో పాటు ప్రజా జీవనంలో వున్న ప్రముఖుల వత్తిడి కూడా తోడైందని భవిష్యత్‌లో అటువంటి పరిస్ధితి వుండదని మంత్రి అన్నారు. అందరూ చెబుతున్నట్లు మరణించిన వారు లక్షలలో లేరంటూ సైనిక జనరల్స్‌ చెబుతున్న కధలను పునరుద్ఘాటించారు.

రిటైర్డ్‌ జనరల్‌ సింటోంగ్‌ పంజాయిటిన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టుల కోసం వేటాడారని, హత్యకు గురైన వారు కేవలం 80వేల మందే అన్నారు.తాను పనిచేసిన ఆర్మీ కమాండో రెజిమెంట్‌ను సెంట్రల్‌ జావాలో ఏర్పాటు చేశారని, తమకు ముస్లిం యువకులతో కూడిన అసోర్‌ యూత్‌ అండ్‌ మహమ్మదీయ సంస్ధకు చెందిన వారు తోడ్పడిన మాట వాస్తవమని చెప్పారు. కమ్యూనిస్టులం కాదని చెప్పిన వారిని వెంటనే విడుదల చేశారన్నారు. మానవ హక్కుల న్యాయవాది టోడంగ్‌ ముల్యా మాట్లాడుతూ ఊచకోతకు గురైన వారి సంఖ్య గురించి చెబుతున్న వాటిని తాము అంగీకరించటం లేదన్నారు. భయంతో అనేక మంది దేశం వదలి వెళ్లారని వారు తిరిగి వచ్చిన తరువాత అనుమానంతో వుద్యోగాలలోకి తీసుకొనేందుకు తిరస్కరించారని చెప్పారు. నాటి ప్రభుత్వమే విదేశాలలో విద్య కోసం పంపిన విద్యార్ధులు దేశంలోకి తిరిగి రావటానికి అనుమతించలేదని అందువలన వాస్తవాలను మరుగుపరచవద్దని కోరారు.మిలియన్ల మందిపట్ల వివక్షను ప్రదర్శించారని, మానవ హక్కుల వుల్లంఘన తీవ్రంగా జరిగిందని, వాటిని న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తారా మరొక పద్దదా అన్నది సమస్య కాదని, చరిత్ర చరిత్రగానే వుంటుందని, అది బయటకు రావాలని తరువాతే సర్దుబాటు, పునరావాసం లేదా పరిహారం గురించి మాట్లాడుకోవచ్చన్నారు.

ఈ సెమినార్‌ను వ్యతిరేకిస్తున్నట్లు పంచశీల ఫ్రంట్‌ అనే సంస్ధ ప్రకటించింది. ఇదంతా కమ్యూనిస్టు సిద్దాంతాన్ని తిరిగి పునరుజ్జీవింప చేయటానికి, కమ్యూనిస్టులను హత్య చేసినందుకు ప్రభుత్వంతో క్షమాపణలు చెప్పించే యత్నమిదని ఆరోపించింది. 1945 నాటి రాజ్యాంగం ప్రకారం కమ్యూనిస్టుపార్టీ, మార్క్సిజం లేదా లెనిజం నిషేధించబడ్డాయని సంస్ధ చైర్మన్‌ సిద్దికి విలేకర్ల సమావేశంలో చెప్పాడు.ఈ సెమినార్‌లో పాల్గొనేవారిలో 85-90శాతం కమ్యూనిస్టుపార్టీ సానుభూతిపరులే వున్నారని ఆరోపించాడు. కమ్యూనిస్టు పార్టీ తప్పేమీ లేదని నిర్ధారించేందుకు, పార్టీ సభ్యుల కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప చేసేందుకు చేస్తున్న యత్నంగా వున్నందున తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు.అనేక మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, వారి వారసులు ప్రస్తుతం పార్లమెంట్‌, ప్రాంతీయ మండళ్లూ, స్దానిక సంస్ధలలో ప్రతినిధులుగా వున్నారని కూడా సిద్దికి చెప్పాడు.