Tags

, , , , , , ,

Poster from the campaign “O Grito dos Excluídos” (“The Scream of the Excluded”). Some rights reserved.

ఏప్రిల్‌ 17 అంతర్జాతీయ భూ పోరాట దీక్షా దిన ప్రాధాన్యత

ఎం కోటేశ్వరరావు

    చెదురుమదురుగా వున్న చిన్న భూ కమతాలను ఒకటిగా చేయాల్సిన అవసరం వుందని నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు అరవింద్‌ పంగారియా చెప్పారు. సోమవారం నాడు జమ్మూలోని కాశ్మీర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసంలో భూ కమతాలను పెద్దవిగా రూపొందించాల్సిన అవసరం గురించి చెప్పారు. ఇది జరగాలంటే రైతులు భూములను అమ్ముకొని ఇతర పనులను చూసుకోవాలి, అయితే భూమి కలిగి వుంటే రక్షణ వుంటుందని భావిస్తున్న కారణంగా వారు విక్రయానికి ముందుకు రారు, అందువలన యజమానులకు భూములపై చట్టపరమైన రక్షణ కల్పించి వాటిని కౌలుకు ఇచ్చే విధంగా చట్టాలను సవరించాల్సిన అవసరం వుందని పంగారియా చెప్పారు. ఈ మేరకు కేంద్రం ఒక నమూనా బిల్లును రూపొందించిందని దానిని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకొని చట్ట సవరణ చేయవచ్చని చెప్పారు. ఇది జరిగితే చిందరవందరగా వున్న కమతాలను కౌలుకు తీసుకొని పెద్దవిగా రూపొందించటం సులభం అవుతుందని తెలిపారు. దేశంలో2011-12 సమాచారాన్ని బట్టి భూమిపై 49శాతం కార్మికవర్గం ఆధారపడుతున్నదని, జిడిపిలో వ్యవసాయ వాటా 15శాతం మాత్రమే వుందని, వ్యవసాయ రంగం ఏటా ఐదు శాతం వృద్ధి చెందినా రాబోయే రోజులలో జిడిపి వాటా తగ్గనుందని కూడా ఆయన చెప్పారు.

     పంగారియా మాటలు, కౌలు రైతు నమూనా బిల్లును బట్టి రైతాంగం నుంచి ముఖ్యంగా చిన్న రైతాంగం నుంచి ఏదో ఒక రూపంలో భూములను విడిపించి ధనిక, కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించటాన్ని వేగవంతం చేయాలన్నది నరేంద్రమోడీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ఇది అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య కార్పొరేట్‌ సంస్ధలు, ద్రవ్య పెట్టుబడిదారుల వత్తిడి మేరకు వాటి ప్రతినిధులుగా వున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలు ఎప్పటి నుంచో సూచిస్తున్న విధానం. మన దేశంలో భూమి కోసం జరిగిన మహత్తర పోరాటాలు, ప్రాణత్యాగాల పూర్వరంగం, భూస్వామ్య విధానాన్ని రద్దు చేస్తే తప్ప పెట్టుబడిదారీ విధానం వృద్ధి చెందదన్న సాంప్రదాయ అవగాహన మేరకు ఒకవైపు భూస్వాములతో రాజీ పడుతూనే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు భూసంస్కరణల చట్టాలను చేయకతప్పలేదు. ముందే చెప్పుకున్నట్లు భూస్వాములతో రాజీ కారణంగా ఆ చట్టాలను నీరు గార్చారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ వంటి పార్టీలు అసలు భూ సంస్కరణల గురించి మాట్లాడటానికే సిద్ధం కానందున ఆ చట్టాలను అమలు జరిపే ప్రసక్తే వుండదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా నయా వుదారవాద విధానాలు అమలులోకి వచ్చిన కారణంగా సిపిఎం వంటి కమ్యూనిస్టు, ఇతర వామపక్ష పార్టీలు తప్ప కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు భూముల నుంచి రైతాంగాన్ని తొలగించేందుకు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దారులు వెతుకుతున్నాయి. మన దేశంలోని సంక్లిష్ట పరిస్ధితులు, ముందే చెప్పుకున్నట్లు గ్రామీణ ప్రాంతాలలో భూ దాహం కారణంగా వారు అనుకున్నది వెంటనే సాధ్యం కావటం లేదు. పొమ్మనకుండా పొగ పెట్టినట్లు చిన్న,సన్నకారు రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి వారు భూములను వదులుకొనేట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే వ్యవసాయం రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెట్టటం మానివేశారు. ఎరువులు, డీజిల్‌ వంటి వాటికి ఇస్తున్న రాయితీలు,సబ్సిడీలను ఎత్తివేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల కార్యకలాపాలను నిర్వీర్యం చేస్తున్నారు. ధాన్య సేకరణ వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకొంటోంది. వాటి స్ధానంలో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తోంది.ఇవన్నీ భూముల నుంచి రైతాంగాన్ని తప్పించేందుకు, కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు చేస్తున్న ప్రయతాలు.

     అటువంటి యత్నాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను సమీక్షించేందుకు ఈ నెల 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటాల దీక్షా దినం పాటించబడింది.ఈ సందర్బంగా అనేక దేశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్‌ 17న బ్రెజిల్‌లో భూమికోసం, భుక్తి కోసం శిరమెత్తిన రైతాంగంపై కార్పొరేట్లకు వత్తాసుగా రంగంలోకి దిగిన మిలిటరీ,పోలీసులు భూమిలేని పేదల వుద్యమ సంస్ధ(ఎంఎస్‌టి) సభ్యులు, మద్దతుదార్లపై జరిపిన కాల్పులలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎందరో గాయపడ్డారు.ఈ హత్యాకాండ జరిగిన సమయంలోనే మెక్సికోలోని లాక్సాకాలాలో వివిధ దేశాల రైతు సంఘాల ప్రతినిధుల రెండవ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే అంతర్జాతీయ రైతుపోరాటాల దినం పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు బ్రెజిల్‌లో హత్యాకాండకు పాల్పడిన వారికి ఇంత వరకు ఎలాంటి శిక్షలు పడలేదు. ప్రతి ఏటా అప్పటి నుంచి ఆ రోజును రైతాంగ పోరాటాల దీక్షా దినంగా పాటిస్తున్నారు.

    ప్రపంచ పెట్టుబడిదారీ వర్గ లాభాల రేటును కాపాడేందుకు దాని ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ రూపొందించిన అజెండా, విధానాల మేరకుముందుకు తెచ్చిన సరికొత్త విధానాలకే ముద్దుగా సంస్కరణలు అని పేరు పెట్టారు. వాటినే నయా వుదారవాదం అని ప్రపంచీకరణ అని రకరకాలుగా పిలుస్తున్నారు. పేరులోనేమున్నది పెన్నిది అన్నట్లుగా ఏం చెప్పినా కార్పొరేట్ల లాభాల సంరక్షణే వీటి ప్రధాన లక్షణం, ధ్యేయం. తమ లాభాల కోసమే పెట్టుబడిదారీ వర్గం తమ పెరుగుదలకు అడ్డంగా వున్న ఫ్యూడల్‌ విధానాన్ని బద్దలు కొట్టింది. భూసంస్కరణలను ప్రోత్సహించింది. అదే పెట్టుబడిదారీ వర్గం బహుళజాతి గుత్త సంస్థలు(కార్పొరేట్‌లు)గా మారి ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేస్తున్నాయి. వాటి కన్ను ఇప్పుడు పరిశ్రమలు, వాణిజ్యంతో పాటు వ్యవసాయంపై పడింది.ఈ రంగాన్ని కూడా కార్పొరేటీకరణ చేయటం ద్వారా దాని నుంచి కూడా లాభాలు పిండాలని చూస్తోంది. దానిలో భాగంగా రైతులను భూములనుంచి వెళ్లగొట్టి కార్పొరేట్‌ భూస్వాములను తయారు చేసేందుకు పూనుకుంది. ఈ ప్రయోగాలకు ముందుగా లాటిన్‌ అమెరికాను ఎంచుకుంది.

    గుండు సూది నుంచి వూరంత ఓడల నిర్మాణాల మొదలు, వాటిని విక్రయించే వాణిజ్య సంస్ధలుగానూ, వాటికి అవసరమైన ముడి సరకులు అందించే, వ్యవసాయానికి అవసరమైన విత్తనాల నుంచి, పురుగుమందులవరకు తయారీ, సరఫరా, చివరకు వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు చేసి వాటిని ఆహారంగా మార్చి విక్రయించటం వరకు కార్పొరేట్‌ కంపెనీలు వివిధ అవతారాలు ఎత్తుతున్నాయి. అందువలన వర్తమానంలో పోరాటాలు కూడా వివిధ తరగతుల కార్మికులు, రైతులు, వినియోగదారులు అందరూ ఐక్యంగా తమను ప్రభావితం చేస్తున్న కార్పొరేట్లకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో శత్రువు ప్రత్యక్షంగా కనపడే వాడు, ఇప్పుడు అలా కాదు. వ్యవసాయ రంగంలో పారిశ్రామిక పెట్టుబడిదారులతో పాటు ద్రవ్య పెట్టుబడిదారులు కూడా ప్రవేశిస్తున్నారు. ఎక్కడో అమెరికాలో వుండి అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను, మదనపల్లిలోని టమోటా, కర్నూలు వుల్లిపాయల, నిజామాబాద్‌ పసుపు మార్కెట్‌లను కూడా అదుపు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.ఈ సంక్లిష్ట,నూతన పరిస్ధితులను అర్ధం చేసుకోవటానికి, కార్యాచరణకు పూనుకోవటానికి నూతన పద్దతులు, రూపాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే నయావుదారవాద విధానాల ప్రయోగం మొదలయిందో అక్కడే వికటించి ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. అందుకనే నయావుదారవాద విధానాలకు వ్యతిరేేక వేదికగా లాటిన్‌ అమెరికా తయారైంది. వుద్యమాలు, వాటి రూపాలు అన్నింటిలోనూ నూతన విధానాలు, పద్దతులు వునికిలోకి వస్తున్నాయి. రాబోయే రోజులలో ఇంకా వస్తాయి.భూమి హక్కుతో పాటు ఆహార హక్కును కూడా కార్పొరేట్‌లు హరించేందుకు పూనుకున్నాయి. భూములను కబళిస్తున్న కార్పొరేట్‌ సంస్ధల బకాసురులకు వ్యతిరేకంగా నేడు భూ పోరాటం చేయటం అంటే ఒక్క రైతులే కాదు, సదరు కార్పొరేట్‌ కంపెనీ వలన ప్రభావితమయ్యే తరగతులందరూ కలిసి వస్తేనే అవి సంపూర్ణం అవుతాయి. అంటే రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, మధ్యతరగతి వుద్యోగులు, వినియోగదారులూ భాగస్వామలు కావాల్సి వుంది.

    గత కొద్ది దశాబ్దాలుగా అనుసరించిన స్వేచ్ఛా వ్యవసాయ వాణిజ్య విధానాలు సామాన్య రైతు వుత్పత్తి ఖర్చులకంటే తక్కువకు వ్యవసాయ వుత్పత్తుల ధరలను నెట్టి గిట్టుబాటు కాకుండా చేస్తున్నాయి.ఒకే రకమైన పంటల సాగు క్రమంగా పెరుగుతోంది. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎరువులు,పురుగు మందుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పర్యవసానంగా చిన్న రైతులు వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారు. 1935లో అమెరికాలో 70లక్షల కమతాలు వుండగా నేడు 21లక్షలకు తగ్గిపోయాయి. రానున్న పది-ఇరవై సంవత్సరాలలో 40 కోట్ల ఎకరాల మేరకు చేతులు మారవచ్చని అంచనా. అమెరికాలో 30లక్షల మంది వ్యవసాయ కార్మికులు తక్కువ వేతనాలు, మానవ హక్కులకు నోచుకోకుండా గడుపుతున్నారు. అమెరికాలో మరొక ముఖ్యాంశాన్ని కూడా చూడాల్సి వుంది. మన దేశంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారి మాదిరే అమెరికాలో రెడ్‌ ఇండియన్లు, లాటినోలు, ఆసియన్‌ అమెరికన్లు, ఆఫ్రో అమెరికన్ల వంటి వారందరూ కేవలం ఏడు శాతం భూమి కలిగి వుండగా తెల్లజాతీయులు 93శాతం భూమి కలిగి వున్నారు.

     భూ కేంద్రీకరణ ఒక్క అమెరికాలోనే కాదు ఐరోపాలోనూ జరుగుతోంది. అక్కడ వంద హెక్టార్లు, అంతకు పైబడినవి కోటీ 20లక్షల కమతాలున్నట్లు అంచనా. అవి మొత్తం కమతాలలో కేవలం మూడు శాతమే అయినా అక్కడి భూమిలో సగం వాటిలోనే వుంది. జర్మనీలో 1966-67లో 12,46,000 కమతాలుండగా 2010 నాటికి 2,99,100కు పడిపోయాయి. వీటిలో కూడా రెండు హెక్టార్లకు లోపు వున్నవి 1990లో 1,23,670 వుండగా 2007 నాటికి 20,110కి తగ్గాయి. యాభై హెక్టార్లు అంతకంటే ఎక్కువ వున్న కమతాలలోని భూమి 1990లో 92లక్షల హెక్టార్లు వుండగా 2007 నాటికి కోటీ 26లక్షల హెక్టార్లకు పెరిగింది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తూర్పు ఐరోపా దేశాలు ఐరోపా యూనియన్‌లో చేరినందున రైతాంగం దివాలా తీసింది. పశ్చిమ ధనిక దేశాల నుంచి భారీ సబ్సిడీలతో కూడిన వ్యవసాయ వుత్పత్తులు వరదలా తూర్పు దేశాలను ముంచెత్తాయి. దానికి తోడు ఐరోపా యూనియన్‌ అందచేసే సబ్సిడీలను పొందేందుకు చిన్న రైతులు అనర్హులు అన్న నిబంధన కారణంగా వారంతా గిట్టుబాటు గాక భూములను అమ్ముకున్నారు. ఈ పరిస్ధితిని స్పెక్యులేటర్లు, కార్పొరేట్‌ మదుపుదార్లు సొమ్ము చేసుకున్నారు.

    ఐరోపా వుమ్మడి వ్యవసాయ విధానం పేరుతో అందచేసిన సబ్సిడీలు పెద్ద రైతాంగమే దక్కించుకుంటోంది.ఇటలీలోని 0.29శాతం కమతాలు 2011లో అందచేసిన మొత్తం రాయితీలలో 18శాతం మొత్తాన్ని దక్కించుకున్నాయి. వాటిలో 0.000 శాతం(150 కమతాలు) అన్ని రకాల సబ్సిడీలలో ఆరుశాతాన్ని దక్కించుకున్నాయి. స్పెయిన్‌లో 75శాతం సబ్సిడీలను 16శాతం, హంగరీలో 72శాతం మొత్తాలను 8.6 శాతం పెద్ద కమతాల రైతులు దక్కించుకున్నారు. ఈ పరిణామాలను చూసిన తరువాత ప్రస్తుతం ప్రతి హెక్టారుకు ఇంత అనే పద్దతిలో సబ్సిడీలు ఇచ్చేందుకు నిబంధనలను సవరిస్తున్నారు. భూమి మాత్రమే కాదు కార్పొరేట్లు సముద్రాలను కూడా కబళిస్తున్నారు.చేపలు పట్టుకొనే హక్కును వేలం వేయటంతో బడా బ్యాంకులు, కార్పొరేట్లు రంగంలోకి దిగి చిన్నచిన్న మత్స్యకారులను వెనక్కు నెట్టివేస్తున్నాయి.

   లా వియా కంపేసినా (స్పానిష్‌) అంటే రైతు మార్గం పేరుతో 1993లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్ధ ప్రతి ఏటా ఏప్రిల్‌ 17న రైతాంగ పోరాటాలను సమీక్షిస్తున్నది. భూమికోసం, భూ రక్షణ పోరాటంలో భవిష్యత్‌లో మరొక ప్రాణం పోరాదన్నది దాని నినాదం. ప్రస్తుతం 73 దేశాలు, 164 జాతులకు చెందిన సంస్దలు , ఎన్‌జీవోలు ఈ వుద్యమంలో భాగస్వాములుగా వున్నాయి. ఏటేటా మరింతగా విస్తరించటంతో పాటు మరిన్ని పోరాటాలకు వేదికగా ఈ వుద్యమం మారుతున్నది.