Tags
BJP, Hinduthwa, manuvadam, manuvadis, Modi Critics, moditva manuvadi's, Narendra Modi Failures, narendra modi's ruling, RSS, RSS game
ఎం కోటేశ్వరరావు
రెండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన వుత్సవాలు త్వరలో జరగబోతున్నాయి. తొలి ఏడాది మాదిరి ఈ సారి హడావుడి వుంటుందా ? లేక వైఫల్యాల మనోవైకల్యంతో సాదాసీదాగా వుంటుందా? మోడీని దేవదూతగా వర్ణించిన వెంకయ్య నాయుడి వంటి వారు సాదాసీదాగా జరగనిస్తారా ? వదిలేయండి ఎలా అయితేనేం, దేశానికి జరిగిందేమిటి? సామాన్యులకు ఒరిగిందేమిటన్నదే ముఖ్యం ! గత ఎన్నికలలో గుజరాత్ మోడల్ పాలన అనే ఎండమావులను చూసి భ్రమలు పెంచుకున్నవారు కొందరైతే, అంతకు ముందు గుజరాత్ మారణకాండతో వుత్సాహం పొంది హిందూత్వకు పెద్ద పీట వేస్తారని చూస్తున్న మనువాదులు ఎలాగూ వున్నారు. రెండు సంవత్సరాల సంబరాల సందర్భంగా వారేమనుకుంటున్నారు ?
‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.’ ఈ మాటలు స్వరాజ్య అనే మితవాదుల పత్రికలో మురళీ ధరన్ అనే కాలమిస్టు రాసినవి.ఆ పత్రిక నరేంద్రమోడీ, హిందూత్వవాదుల అనధికార వాణిగా వుంది. అలాంటి దీనిలో ఇలాంటి వ్యాసం ప్రచురించటం ఏమిటి అని ఆశ్చర్య పోయిన వారు కూడా వున్నారు. నిజానికి ఇది మోడీకి వ్యతిరేకంగా రాసినది కాదు, ఆయనను హెచ్చరిస్తూ ఇష్టం లేకున్నా వెళ్ల బోసుకున్న ఆవేదన. బిజెపి, నరేంద్రమోడీని రాజకీయంగా, విధాన పరంగా వ్యతిరేకించే వారే కాదు, సమర్ధించేవారిలో కూడా ‘అసంతృప్తి’ ఎలా పెరుగుతోందో ఈ వ్యాసంపై వెలువడిన అభిప్రాయాలు మోడీ-మనువాదుల మనోగతాన్ని వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్నింటి సారాంశాన్ని చూద్దాం.
అమెరికన్లు అంతరిక్షంలో చంద్రుడి వద్దకు వెళ్లాలని అనుకున్నపుడు వారిదగ్గర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏమీ లేదు, కాని వారు ఆ మేరకు కలకన్నారు,జనాన్ని ఆ వైపుగా నడిపించి సాధించారు.మన చేతుల్లో చేయాల్సిన పని చాలా వుంది.ఇప్పటికీ రోడ్ల మీద చెత్తవేయటాన్ని చూస్తున్నాం, దీని గురించి మోడీ పెద్దగా చేయగలిగిందేమీ లేదు. దిశను నిర్ధేశించటమే ఆయన బాధ్యత.మోడీ దగ్గర పెద్ద సైన్యం వుంది వారు ఎంతగానో కష్టపడాల్సి వుంది. సమస్య ఏమంటే వారంతా ఆయన చుట్టూ కుర్చుంటున్నారు తప్ప చేస్తున్నది తక్కువ. నాకు తెలిసినంత వరకు నరేంద్రమోడీ మంత్రివర్గంలో పని చేస్తున్న అధికారులందరూ పధకాలను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.నరేంద్రమోడీ నిర్దిష్ట కాలంలో ఫలితాలు రావాలని కోరుకొనే నేత, ఆయన మంత్రులందరూ కష్టపడి పని చేస్తున్నారు. 2017 నుంచి నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, మీనాక్షి లేఖి, స్మృతి ఇరానీ లను టీవీ చర్చలకు పంపటం నరేంద్రమోడీకి మంచి వ్యూహంగా వుంటుంది.తద్వారా సాధించిన మంచి గురించి చైతన్యాన్ని కలిగించవచ్చు.
నిజంగా మంచిని సాధిస్తే జనానికి తెలుస్తుంది, జరిగినట్లు భావిస్తారు, సాధించిన వాటి గురించి చెప్పటానికి డజను మందిని పంపనవసరం లేదు. ఫలితాలే స్వయంగా వెల్లడిస్తాయి.
మీడియా, ప్రతిపక్షాలు దెబ్బతీసే పనిలో వున్నపుడు మనం అలాంటి పనులు చేయాల్సి వుంటుంది.
యుపిఏ పాలనా కాలంలో ప్రతివారం లూటీ జరిగినా ఎన్నికల ఫలితాలలో మోడీ వచ్చేంతవరకు అది కాంగ్రెస్‌ను ప్రభావితం చేయలేదు. మీడియా మద్దతు లేకుండా తాము చేసిన దానిని ప్రజలకు చెప్పుకోగలమని బిజెపి నాయకులు అనుకుంటే భ్రమలో వున్నట్లే. కనీసం వామపక్షాలకు మద్దతు ఇచ్చే నెట్‌వర్క్‌ను అయినా ధ్వంసం చేయాలి. వారు వాటితో బతగ్గలగటమే కాదు వృద్ధి చెందుతున్నారు.
కేవలం విద్యుత్, మౌలిక సదుపాయాలు, రైల్వేలు, అవినీతి రహిత పాలన కారణంగానే ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలలో గెలుస్తారు.
మోడీ పాలనాయంత్రాంగం అత్యంత ముఖ్యమైన సమస్యలను కూడా పట్టించుకోవటం లేదు.భారత్‌లో హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారు. మైనారిటీలతో సమంగా హిందువుల దేవాలయాలను స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.ఆయన ఓటర్లందరూ హిందువులే, వారిని విస్మరిస్తున్నారు.
మోడీ హిందూ హృదయ సామ్రాట్‌గా వుండాలని అంగీకరిస్తా. మన హిందువులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని నేను ఇంకా వేచి చూస్తున్నా.
హిందువులను విస్మరించటం లేదు. కానీ దేవాలయ ట్రస్టులు డబ్బును వెనక్కి తీసుకోవటం అంత సులభం కాదు, అది 1949లోనో ఎప్పుడో జరిగింది. అందరూ ఇంతకాలం ఎందుకు నోర్మూసుకున్నారు.
సమస్య రాష్ట్ర ప్రభుత్వాలతో వుంది. ప్రధాన రాజకీయాలు, పధకాల అమలు రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చౌకబారు స్థానిక రాజకీయాల మీద తప్ప పధకాల అమలు మీద ఎప్పుడో తప్ప శ్రద్ధ పెట్టటం లేదు. మోడీ లేదా బిజెపి తన సమయం, డబ్బును పశ్చిమబెంగాల్, కేరళ వంటి ప్రయోజనం లేని రాష్ట్రాల మీద వెచ్చించే కంటే తమ పాలనలో వున్న వాటిమీద పెట్టటం మంచిది. మోడీ గుజరాత్‌లో చేసిన మాదిరి ఆ రాష్ట్రాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 2019 ఎన్నికలలో ఆ విజయాలను ముందుకు తేవటం మంచిది.
వారి స్వంత రాష్ట్రాలపైనే పూర్తిగా కేంద్రీకరించటం మంచిది. చివరికి చత్తీస్‌ఘర్ కూడా మారిపోతే ఇతర రాష్ట్రాలలోని జనం వాటిని చూసి ఈర్ష్య పడతారు, ఇతర పార్టీలను అపహాస్యం చేస్తారు.
ఒంటి చేత్తో దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. సమయాన్ని వృధా చేస్తూ ముందుగా వ్యవస్ధలను నిర్మించి తరువాత పధకాలను ప్రారంభించాలని అనుకుంటే ఫలితాలు సంపూర్తిగా వుండకపోవచ్చు. మార్కెట్లోను, జనంలోనూ ఆశాభావాన్ని కలిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. స్వంత ప్రభుత్వంలో ప్రతిభలేమిని ఆయన ఎదుర్కొంటున్నారు, కానీ ఆయన ప్రతి పధకానికి వున్న ఆటంకాలను తొలగించగలరు.ఆయన పద్దతి కొద్దిగా తేడాగా వుండవచ్చు కానీ కాంగ్రెస్‌కు ఇచ్చిన మాదిరి ఆయనకు మరింత సమయాన్ని ఇవ్వాలి. భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్గతంగా తన ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటంపై మోడీ జయప్రదంగా పోరాడారు. ఇది పశ్చిమ దేశాలకు కోపకారణమైంది. వారి, మన మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నది.ఆయనను వూపిరి సలుపుకోనివ్వండి.
ప్రకటించటంతో పాటు పధకాల అమలుపై కూడా శ్రద్ధ పెడితే అవి పని చేస్తాయి. దిగువ స్ధాయిలో అటువంటి ప్రయత్నాలకు కొన్ని సమస్యలు ఎదురౌతాయి, ముందుకు పోతే వాటిని సరిచేసుకోవచ్చు.వాటిని అమలు జరిపితేనే పురోగతి వుంటుంది, చరిత్రను చూస్తే సన్నాహాలు లేకుండా ప్రారంభిస్తే పనిచేయవని చాలా మంది చెప్పటం జరుగుతూనే వుంటుంది.మోడీ అందుకు మార్గం చూపారు.మోడీ ప్రచారం కారణంగా విజయం సాధిస్తారు. విజయం దానంత అదే రాదు.
బిజెపి వారు (ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి తదితరులతో సహా) నిజానికి భిన్నమైన వారేమీ కాదు. వాగాడంబర నినాదాలు తదుపరి చర్యలు, ఫలితాలు వుండటం లేదు.టీవీలలో జనాన్ని మెప్పించే ఒప్పించే మేథావంతులు కొద్ది మందే వున్నారు. ప్రచారాన్ని ప్రారంభించటం వాటిని చివరిదాకా పూర్తి చేయకుండా వదలి వేయటం లేదా ప్రతి వుదంతంలోనూ వెనక్కి తగ్గటం గురించి అనేక వుదాహరణలు చెప్పుకోవచ్చు.
1. ఘర్ వాపసీ: దానిని ప్రారంభించారు తరువాత వదలివేశారు. గత రెండు సంవత్సరాలుగా తిరిగి అది వినపడటం లేదు.
2.జెఎన్‌యు వుదంతం: కన్నయ్య ఇతరుల గురించి ఎంతో మాట్లాడారు, వారేమో చేయదలచుకున్నది చేస్తూనే వున్నారు.
3. భారత మాతాకీ జై : పసలేని నినాదం, నిట్‌లో భారత అనుకూల విద్యార్ధులను రక్షించటానికి కూడా బిజెపి ముందుకు రాలేకపోయింది. ఒక నినాదంపై పిల్లచేష్టమాదిరి చర్చలు తెలివి తక్కువ వారిగా చేస్తున్నాయి తప్ప దేశభక్తులుగా కాదు.
4. గొడ్డు మాంస నిషేధం: గేదెలు, ఆవులు మేకలు,ఎద్దులు, కోళ్లు, పందులను వధించవచ్చు గానీ ఆవులను మాత్రం కాదు, ఏమిటీ తర్కం. గోవాలో బిజెపి ప్రభుత్వం గొడ్డు మాంసాన్ని అనుమతించవచ్చా, ఏమిటీ అసంబద్ధ ద్వంద్వ ప్రమాణాలు.
5.అనుపమ ఖేర్ : అతనికి ఏమైంది. కేంద్రం, రాష్ట్రంలోనూ రెండు చోట్లా బిజెపి అధికారంలో వున్న తన స్వంత దేశంలో శ్రీనగర్‌లో కనీసం ప్రవేశించనివ్వకుడా వెనక్కి తిప్పి పంపారు.
6.వెర్రి వారిగా పిలువబడే బిజెపి వారు:అసహ్యంగా మాట్లాడేవారి గురించి ఏం చేశారు ?
7. వుమ్మడి పౌర స్మృతి: ముస్లిం మహిళలకు బిజెపి ప్రభుత్వ మద్దతు ఎక్కడ ?
8. పాకిస్ధాన్‌పై విధానం: పాకిస్థాన్ ఏ టు ఇ ని నాకటం తప్ప బిజెపి చేసిందేముంది. ప్రతిఘటన ఎక్కడ ? పఠాన్ కోట్ వైమానికి స్ధావరంపై వారు చేసిన దాడి గురించి దర్యాప్తు చేయటానికి ఐఎస్‌ఐని ఆహ్వానించటం కంటే దారుణం ఇంకేముంటుంది? ముందే చెప్పినట్లు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు లేదు. బిజెపి,మోడీలపై జనం పెట్టుకున్న ఆశలు వేగంగా అంతరిస్తున్నాయి. ఈ బుద్దిలేని గుంపుతో పోలిస్తే 2019 రాహుల్ గాంధీ ఒక గొప్ప రాజకీయవేత్తగా కనిపిస్తారేమో ఎవరికి తెలుసు !!
(ఈ వ్యాఖ్యల గురించి ఎవరికైనా అనుమానం వుంటే మురళీధరన్ వ్యాసం పూర్తిగా చదువుకొనేందుకు, దానిపై వెలువడిన అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ లింక్‌ను చూడవచ్చు)