Tags

, , ,

Image result for may day

ఎం కోటేశ్వరరావు

     చరిత్ర ఎంత చిత్రమైనదో కదా ! అనేక మంది వాటి గురించి ప్రస్తావించారు.చుంచెలుక ఎప్పుడూ భూమిలో తవ్వుతూనే వుంటుంది. అది దాని స్వభావం, ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు.కొన్నిసార్లు మనకు అలా కనిపించి ఇలా మాయమై పోతుంటుంది. కానీ నిరంతరం అది తవ్వుతూనే వుంటుంది. ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్‌ ఈ జీవి గురించి తన హామ్లెట్‌ నాటకటంలో ప్రస్తావించారు. కారల్‌ మార్క్సు దానిని విప్లవానికి అన్వయించారు. ఆయన ఊహించిన విధంగా బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలలో విప్లవం రాలేదు. కానీ అందుకు భిన్నంగా అంతకంటే తక్కువ అభివృద్ధి చెందిన రష్యాలో వచ్చింది. తరువాత అత్యంత వెనుకబడిన ఫ్యూడల్‌ చైనాలో వచ్చింది. చరిత్ర చిత్రాల గురించి ఎంగెల్స్‌ ఇలా పేర్కొన్నారు.’మన కంటికి ఆకస్మికంగా కనిపించే గొప్ప విప్లవాలన్నింటికీ ముందు కాలపు ఆలోచనలు, సాహిత్యం, రాజకీయాల ఫలితంగా నిశ్చల మరియు రహస్య విప్లవాలు జరిగే తప్పనిసరిగా జరిగి వుంటాయి. విప్లవం ప్రతి కంటికీ కనిపించదు.’

     ఈఏడాది నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బెర్నీ శాండర్స్‌ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడటం ఒక అనూహ్య పరిణామం. అవును మేం కూడా శాండర్స్‌ మాదిరి డెమోక్రటిక్‌ సోషలిస్టులమే అంటూ మిలియన్ల కొలదీ యువతరం ఆయనకు జేజేలు పలకటం ఎవరైనా వూహించారా? అదీ సోషలిజంపై సాగించిన ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని, కమ్యూనిజానికి సమాధి కట్టా మని, తమకు ఇంక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా పాలకవర్గానికి చెమటలు పట్టిస్తారని ఎవరైనా కలగన్నారా ? సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటేనే శతృవులుగా చూసే అమెరికన్లు సోషలిస్టులు, కమ్యూనిస్టులా అయితే ఏమిటి అంటూ రోజురోజుకూ వారి పట్ల సానుకూలతను పెంచుకుంటున్నారని స్వయంగా అమెరికా సంస్ధల సర్వేలే వెల్లడించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అయితే ఇవన్నీ యాదృచ్చికంగా జరిగాయా ?ఎంగెల్స్‌ చెప్పినట్లు ఎన్నో కారణాలు,ఎన్నెన్నో పరిణామాలు దోహదం చేశాయి.అంటే చుంచెలుక అమెరికాలో అంతర్గతంగా తొలుస్తోందా ? ఏమో చరిత్ర చిత్రాలను ఎవరు వూహించగలరు ?

    అమెరికా ఖండాల చరిత్రను చూస్తే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యం గొలపవు. మొత్తంగా వలస వచ్చిన వారితో, బానిసలుగా ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా పట్టుకు వచ్చిన వారితో ఏర్పడిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో(యుఎస్‌ఏ) ఇప్పుడు రిపబ్లికన్‌ పార్టీ నేతలు భారత్‌ వంటి దేశాల నుంచి వుపాధికోసం వచ్చే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నూతన ప్రపంచం పేరుతో అక్కడి ప్రకృతి సంపదలను స్వంతం చేసుకున్న ఐరోపా పాలకవర్గం తమకు అవసరమైన పని వారి కోసం పెద్ద ఎత్తున ఐరోపా నుంచి వలసలను ప్రోత్సహించింది. వలస కార్మికులకు రంగుల కలలను చూపింది.ఆఫ్రికా నుంచి అక్కడి జనాన్ని బానిసలుగా పట్టుకు వచ్చింది.పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు నిత్యకృత్యం.

    1870దశకంలో ఐరోపాలో తీవ్రమైన ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. దాని ప్రభావం అమెరికాపై పడింది. దానిలో భాగంగా 1873 సెప్టెంబరు 18న అమెరికాలోని అగ్రశ్రేణి బ్యాంకింగ్‌ సంస్ధ జె కూక్‌ అండ్‌ కంపెనీ కుప్పకూలింది.ఈ కంపెనీ అమెరికాలో రైలు మార్గాలకు పెట్టుబడులు పెట్టింది.అంతకు ముందు అమెరికా జరిపిన అనేక యుద్ధాల సమయంలో రుణలావాదేవీలను నిర్వహించటంలో కీలక పాత్ర పోషించింది.అమెరికాపై ఈ మాంద్య ప్రభావం ఆ నాడు ఎంత తీవ్రంగా వుందంటే ఈ బ్యాంకు కుప్పకూలటంతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ పది రోజుల పాటు మూత పడింది. కంపెనీలకు అప్పులు కరవయ్యాయి.పద్దెనిమిదివేల వ్యాపార సంస్ధలు దివాలా తీశాయి. నిరుద్యోగం 1876 నాటికి 14శాతానికి పెరిగింది. పని దొరికిన కార్మికులకు కూడా ఆరునెలలు మాత్రమే, అదీ 45శాతం వేతన కోతతో రోజుకు ఒక డాలరు కంటే తక్కువకే పనిచేశారు. దేశంలోని 364 రైలు మార్గ కంపెనీలలో 89 దివాలా తీశాయి.అంతకు ముందు ప్రభుత్వం రైలు మార్గాల నిర్మాణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.అందుకుగాను పెద్ద విస్తీర్ణంలో భూమి, ఇతర సబ్సిడీలను ఇచ్చింది.దాంతో మదుపుదార్లందరూ రైలు మార్గ కంపెనీలకు తమ పెట్టుబడులను మరల్చారు. బ్యాంకులన్నీ డబ్బును ఇటు మళ్లించాయి. మాంద్యం అటు రైలు మార్గ కంపెనీలు, ఇటు వాటిలో పెట్టుబడులు పెట్టిన వారినీ తీవ్రంగా దెబ్బతీశాయి. అవసరాలకు మించి ఎంతగా రైలు మార్గాలను నిర్మించారంటే సబ్సిడీ రూపంలో రాయితీలను పొందేందుకు 1866-73 మధ్య 55వేల కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను నిర్మించారు. ఈ పూర్వరంగంలో ఒకే ఏడాది మూడుసార్లు కార్మికుల వేతనాలను తగ్గించారు. దానికి నిరసనగా 1877లో అమెరికాలో జరిగిన రైల్వే కార్మికుల సమ్మెలను కొంత మంది మహా తిరుగుబాటుగా వర్ణించారు.ఇదే తరువాత కాలంలో ప్రపంచ కార్మికవర్గ దీక్షా దినమైన ‘మే డే ‘కు నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు.

     పశ్చిమ వర్జీనియాలోని మార్టినెస్‌బర్గ్‌లో 1877 జూలై 14న ప్రారంభమైన రైల్వే కార్మిక సమ్మె అనేక ప్రాంతాలకు విస్తరించి 45 రోజుల పాటు జరిగింది. దీనికి ఏ కార్మిక సంఘమూ పిలుపునివ్వలేదు. ఏ పార్టీ మద్దతు పలకలేదు. మాంద్యంతో కార్మికుల నుంచి వెల్లువెత్తిన నిరసన నుంచి చెలరేగిన ఈ సమ్మె, హింసాకాండను అణచివేసేందుకు స్ధానిక, రాష్ట్ర, కేంద్ర పోలీసు, మిలిటరీ బలగాలను దించారు. మాంద్యం 1878-79 నాటికి తగ్గిపోయింది. అయితే ఆ సందర్భంగా కార్మికుల్లో తలెత్తిన నిరసనను పాలకులు అణచివేసినా కార్మికవర్గం అనేక పాఠాలు నేర్చుకుంది. పశ్చిమ వర్జీనియాలో ప్రారంభమైన సమ్మె అణచివేతకు ఆ రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్ర పారామిలిటరీ బలగాలను ఆదేశించాడు. బల ప్రయోగానికి ఆ దళాలు నిరాకరించాయి. దాంతో కేంద్ర దళాలను దించాడు. ఇలా అనేక రాష్ట్రాలలో జరిగింది. పలుచోట్ల కార్మికులు, మిలిటరీ దళాలతో తలపడ్డారు.మేరీలాండ్‌లో మిలిటరీ కాల్పులలో పది మంది కార్మికులు మరణించారు.పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక రైలు మార్గ యజమాని అయిన థామస్‌ అలెగ్జాండర్‌ స్కాట్‌ కార్మికులకు కొద్ది రోజుల పాటు ‘తూటాల భోజనం పెట్టండి ఎలా వుంటుందో రుచి చూస్తారు’ అని వ్యాఖ్యానించాడు.దాంతో జరిపిన కాల్పులలో 20 మంది మరణించారు.ఇలా అనేక చోట్ల స్ధానిక ప్రభుత్వాల ఆదేశాల కంటే రైలు కంపెనీల యజమానుల ఆదేశాలమేరకు సాయుధ దళాలు కార్మికులను అణచివేశాయి.

    ముందే చెప్పుకున్నట్లు ఈ సమ్మె అనేక అనుభవాలను నేర్పింది. మిస్సోరీ రాష్ట్రంలో సెయింట్‌ లూయీస్‌ వర్కింగ్‌ మెన్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మిస్సోరీ నది పరిసర ప్రాంతాలలో అనేక మంది ఇతర కార్మికులు సానుభూతిగా సమ్మె చేశారు. చివరకు రోజుకు ఎనిమిది గంటల పని, బాలకార్మికుల నిషేధం డిమాండ్లతో అమెరికాలోనే తొలి సాధారణ సమ్మెగా అది మారిపోయింది. నది రెండువైపులా ఎనిమిది వేల మంది సాయుధ బలగాలను దించి సమ్మెను అణచివేశారు. కనీసం పద్దెనిమిది మందిని కాల్పులలో చంపివేశారు.

     ఈ సమ్మె అణచివేత తరువాత భవిష్యత్‌లో ఆందోళనలను ఎలా నిర్వహించాలా అని కార్మికవర్గం ఆలోచించింది. మరోసారి ఇలాంటి ఆందోళనలు పునరావృతం కాకుండా ఎలా చూడాలా అని యజమానులు పధకాలు వేశారు. కార్మికుల పట్ల మరింత కఠిన వైఖరిని అనుసరించాలని నిర్ణయించారు. అనేక రాష్ట్రాలలో కొత్త సాయుధ దళాలను తయారు చేశారు. జాతీయ సాయుధ దళాలకు అనేక పట్టణాలలో కేంద్రాలను నిర్మించారు. కార్మికులను అణచివేసేందుకు కొన్ని చట్టాలను కూడా కొత్తగా రూపొందించారు. ఇదే సమయంలో కార్పొరేట్‌ శక్తులను ఎదుర్కోవటంలో కార్మికవర్గం కూడా తనలో ఇమిడి వున్న శక్తిని గుర్తించింది.పిట్స్‌ బర్గ్‌లో సమ్మె అణచివేతకు సారధ్యం వహించిన సాయుధ దళాధికారి మాటల్లోనే ‘ ఒకే లక్ష్యం, ఒకే స్ఫూర్తి వారిలో కనిపించింది. కార్పొరేషన్ల శక్తిని దెబ్బతీసేందుకు ఏ పద్దతి అయినా అనుసరించవచ్చని వారు సమర్ధించుకున్నారు’ అన్నాడు. కార్మికులలో పెరిగిన చైతన్యం కారణంగా యజమానులు కూడా తెగేదాకా లాగితే తమకూ నష్టమే అని కూడా గ్రహించకతప్పలేదు. ఈ పూర్వరంగంలోనే బాల్టిమోర్‌ అండ్‌ ఓహియో రైలు మార్గ కంపెనీ 1880 మే ఒకటిన వుద్యోగుల సహాయ విభాగాన్ని ప్రారంభించి అనారోగ్యం, ప్రమాదాలకు గురైనపుడు సాయం, మరణిస్తే పరిహారం చెల్లించేందుకు ఏర్పాటు చేసింది. అదే కంపెనీ మరో నాలుగు సంవత్సరాల తరువాత పెన్షన్‌ పధకాన్ని ప్రారంభించిన తొలి పెద్ద యాజమాన్యంగా పేరు తెచ్చుకుంది.

   రైల్వే కార్మికుల ఆందోళన తరువాత అనేక పరిశ్రమలలో సమ్మెలు గణనీయంగా పెరిగాయి. 1886లో దాదాపు పదివేల సమ్మెలలో ఏడులక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. అదే ఏడాది పనిగంటలను పన్నెండు నుంచి ఎనిమిదికి తగ్గించాలని కోరుతూ జరిగిన జాతీయ సమ్మెలో 12వేల కంపెనీల కార్మికులు పాల్గొన్నారు. చికాగోలోని హే మార్కెట్‌ ప్రాంతంలో కార్మికులపై దమన కాండ జరిపారు.ఆందోళన అణచివేతలో భాగంగా పోలీసులే బాంబులు వేసి తమ అధికారి ఒకరిని చంపివేశారు.ఆ నెపాన్ని కార్మిక నేతలపై నెట్టి నలుగుర్ని వురితీశారు.ఆ చర్య కార్మికవర్గాన్ని మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. జాతీయ కార్మిక వుద్యమం మరింత విస్తరించింది. మే డేను వునికి లోకి తెచ్చింది.

   1870దశకపు మాంద్యం తరువాత మరో రెండు దశాబ్దాలకు 1893-94లో అమెరికాను మరో మాంద్యం కుదిపేసింది. దేశవ్యాపితంగా సమ్మెలు వెల్లువెత్తాయి. ఇరవై ఆరు రాష్ట్రాలలో కార్మికులు-భద్రతా దళాలు తలపడేంతగా పరిస్ధితులు దిగజారాయి.ఈ సందర్భంగా పుల్‌మాన్‌ అనే రైల్వే కంపెనీలో జరిగిన సమ్మె వైఫల్యం కార్మికోద్యమంలో కొత్త పరిణామాలకు నాంది పలికింది.అప్పటి వరకు కార్మికులు ఏ విభాగంలో పనిచేసినా ఒకే యూనియన్‌లో వుండే వారు. ఈ సమ్మె సందర్బంగా కొన్ని విభాగాల వారు సమ్మెలో పాల్గొనలేదు. అది విభాగాల వారీ యూనియన్ల ఏర్పాటుకు దారి తీసింది.(వుదా కండక్లరు, డ్రైవర్లు, మెకానిక్‌ల యూనియన్ల వంటివి) దీని వలన వుపయోగాలతో పాటు కార్మికవర్గానికి జరిగిన నష్టాలు కూడా వున్నాయి. ఇప్పటికీ ఈ మంచి చెడ్డల గురించి చర్చలు జరుగుతూనే వున్నాయి.

ఈ సందర్భంగానే అమెరికా కార్మికోద్యమ చరిత్రలో పది గొప్ప సమ్మెలుగా పరిగణించబడే వాటి గురించి తెలుసుకుందాం.

నైరుతి రైల్వే కార్మిక సమ్మె

    ఇది 1886 మార్చి-సెప్టెంబరు మాసాలలో జరిగింది. రెండులక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. రబ్బరు కంపెనీల యజమాని అయిన జే గౌల్డ్‌కు రైలు మార్గాల కంపెనీలు కూడా వున్నాయి. ఐదు రాష్ట్రాలలోని కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.అనేక చోట్ల వీధి పోరాటాలు జరిగాయి.ఇతర రైల్వే కంపెనీల కార్మికుల సహకారం లేకపోవటం, పోటీ కార్మికులను పనిలోకి దించటం, కార్మికులపై హింసాకాండ, భయపెట్టటం వంటి అనేక కారణాలతో ఈ సమ్మె విఫలమైంది.తరువాత కార్మిక సంఘాన్నే నిషేధించారు.

పుల్‌ మాన్‌ సమ్మె

    ఇది 1894 మే-జూలై మాసాల మధ్య జరిగింది. పన్నెండు గంటల పని,వేతనకోతలకు వ్యతిరేకంగా రైలు పెట్టెలను తయారు చేసే పుల్‌ మాన్‌ పాలెస్‌ కార్‌ కంపెనీలో చికాగో, ఇల్లినాయిస్‌ కేంద్రాలుగా రెండున్నరలక్షల మంది కార్మికులు సమ్మె చేశారు. వారికి అమెరికన్‌ రైల్వే యూనియన్‌ కార్మికులు కూడా తోడై రైళ్లు నడపటానికి తిరస్కరించారు.ఈ సమ్మెను అణచటానికి నాటి అమెరికా అధ్యక్షుడు చికాగోకు సైన్యాన్ని పంపాడు. సమ్మె విఫలమైంది కానీ, దేశ వ్యాపితంగా కార్మికుల పట్ల సానుభూతి పెరిగింది.

అంత్రాసైట్‌ బొగ్గు కార్మిక సమ్మె

   తూర్పు పెన్సిల్వేనియాలో 1902 మే-అక్టోబరులో జరిగిన సమ్మెలో 147000 మంది పాల్గొన్నారు.మెరుగైన వేతనాలు, పని పరిస్ధితుల కోసం జరిగిన ఈ సమ్మెతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తే పరిస్ధితి ఏర్పడింది.దాంతో దేశాధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ చలికాలంలో సమ్మె జరిగితే పరిస్థితి మరింత దిగజారుతుందని భావించి యాజమాన్యాన్ని హెచ్చరించాడు. ఇదే సమయంలో పారిశ్రామికవేత్త అయిన జెపి మోర్గాన్‌ సమ్మె కొనసాగటం తన ప్రయోజనాలకు కూడా దెబ్బ అని గ్రహించి కార్మికులు కోరిన 20శాతం వేతన పెంపుదలకు బదులు పదిశాతానికి అంగీకరించి ఒప్పందం చేసుకున్నాడు.

వుక్కు కార్మికుల సమ్మె

    మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అమెరికా వుక్కు పరిశ్రమలో దిగజారిన పరిస్థితులపై నిరసనతో కార్మికులు 1919 సెప్టెంబరు 22 నుంచి 1920 జనవరి ఎనిమిది వరకు మూడున్నరలక్షల మంది సమ్మె చేశారు. ఎక్కువ పని గంటలు, తక్కువ వేతన, యూనియన్‌పై వేధింపులకు నిరసనగా ఈ ఆందోళన జరిగింది. సోవియట్‌ యూనియన్‌లో తొలి సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడిన పూర్వరంగంలో యజమానులు,ప్రభుత్వం కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, తదితర కారణాలతో సమ్మె విఫలమైంది. దీంతో తరువాత పది హేను సంవత్సరాల వరకూ వుక్కు పరిశ్రమలో ఎలాంటి ఆందోళనలూ జరగలేదు.

రైల్వే వర్క్‌షాప్‌ కార్మికుల సమ్మె

    1922లో అమెరికా రైల్వే వర్క్‌షాప్‌ కార్మికులకు వేతనంలో ఏడు సెంట్లు తగ్గిస్తూ చేసిన నిర్ణయం కార్మికులను ఆగ్రహానికి గురిచేసింది. దేశవ్యాపితంగా నాలుగు లక్షల మంది జూలై -అక్టోబరులో జసమ్మె చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులను క్వార్టర్ల నుంచి గెంటి వేయటం, పోటీ కార్మికులతో పనిచేయించటం, సమ్మెను నిషేధిస్తూ కోర్టు ప్రకటించటం వంటి కార్మిక వ్యతిరేక వాతావరణంలో ఐదు సెంట్ల వేతన కోతకు అంగీకరిస్తూ కార్మికుల సమ్మెను విరమించారు.

1934 వస్త్ర కార్మికుల సమ్మె

    ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు నిరసనగా 1934 సెప్టెంబరులో నాలుగు లక్షల మంది వస్త్ర కార్మికులు సమ్మె చేశారు. బయటి కార్మికుల మద్దతు లేకపోవటంతో సమ్మె విఫలమైంది.యూనియన్ల పట్ల కార్మికులలో విశ్వాసం సన్నగిల్లింది. దాంతో యజమానులు కార్మికులను మరింతగా లొంగదీసుకొనేందుకు అనేక మంది కార్మికులను బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

బిటుమినస్‌ బొగ్గు సమ్మె

     1946 ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో 26రాష్ట్రాలలోని నాలుగు లక్షల మంది బొగ్గు గని బిట్‌మినస్‌ కార్మికులు సమ్మె చేశారు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అప్పుడే కోలుకుంటున్న స్థితిలో సమ్మెలు ఏమిటనే సాకుతో సమ్మెను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. అధ్యక్షుడు ట్రూమన్‌ జోక్యం చేసుకున్నాడు. కార్మికులు తిరస్కరించారు. సమ్మె పాక్షిక విజయం సాధించింది.

1959 వుక్కు కార్మికుల సమ్మె

   1959లో వుక్కు పరిశ్రమలో లాభాలు విపరీతంగా వచ్చాయి. దాంతో కార్మికులు అధిక వేతనాల కోసం డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో యాజమాన్యాలు ఒప్పందంలో వుద్యోగ భద్రత, పని గంటల గురించి వున్న అంశాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు.దాంతో ఐదు లక్షల మంది జూలై 15 నుంచి నవంబరు ఆరు వరకు సమ్మె చేశారు. చివరకు వేతనాలు పెరిగాయి.

1970 పోస్టల్‌ సమ్మె

    తమ పని పరిస్థితులు, వేతనాలు, తదితర అంశాలపై బేరసారాలాడేందుకు నిరాకరించినందుకు నిరసనగా 1970 మార్చినెలలో రెండు వారాల పాటు 2,10,000 మంది పోస్టల్‌ కార్మికులు సమ్మె చేశారు.తొలుత న్యూయార్క్‌లో ప్రారంభమై దేశవ్యాపితంగా విస్తరించింది.అధ్యక్షుడు నిక్సన్‌ నేషనల్‌ గార్డులను దించి సమ్మె విచ్చిన్నానికి పూనుకున్నాడు. పోస్టల్‌ సేవలు నిలిచిపోవటంతో చివరకు ఒప్పందం చేసుకొని బేరసారాల హక్కుతో సహా అనేక డిమాండ్లను అంగీకరించారు.

యుపిఎస్‌ వర్కర్ల సమ్మె

    1997 ఆగస్టులో 1,85,000 టీమ్‌స్టర్‌ కార్మికులు వేతన పెంపుదల, ఫుల్‌టైమ్‌ వుద్యోగాలివ్వాలనే డిమాండ్లతో సమ్మె చేసి విజయం సాధించారు. ఈ సమ్మెకు పౌరుల నుంచి మంచి మద్దతు లభించింది.