Tags

, ,

చికాగో టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు కరేన్‌ లెవిస్‌

ఎం కోటేశ్వరరావు

    చరిత్ర ఎంతో చిత్రమైనది ! ఆదిమానవ దశలో ప్రకృతిని జయించి దానిని తన అదుపులో పెట్టుకొనేందుకు పోరు సాగించటమే ఏకైక కర్తవ్యం. కుటుంబం, వ్యక్తిగత ఆస్ధి, దానిని కాపాడుకొనేందుకు రాజ్యాంగాల పుట్టుక తరువాత సమాజాన్ని జయించి తమ అదుపులో పెట్టుకొనేందుకు మానవాళిలోనే ఒక వర్గం పూనుకున్న తరువాత మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే. దానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో ఏ వైరుధ్యం ఎప్పుడు ముందుకు వస్తుందో, ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, అది ఎలా పరిష్కారమౌతుందో ఎవరూ జోస్యం చెప్పలేరు. అందుకే చరిత్ర ఎంతో చిత్రమైనది. అనేక మంది ఆ చిత్రాల గురించి ప్రస్తావించారు.

   చుంచెలుక జీవిత పర్యంతం నిరంతరం భూమిలో ఎక్కడో అక్కడ తవ్వుతూనే వుంటుంది. అది దాని స్వభావం, ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు.కొన్నిసార్లు మనకు అలా కనిపించి ఇలా మాయమై పోతుంటుంది. కానీ నిరంతరం అది తవ్వుతూనే వుంటుంది. ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్‌ ఈ చిత్రమైన జీవి గురించి తన హామ్లెట్‌ నాటకంలో ప్రస్తావించారు. కారల్‌ మార్క్సు దానిని విప్లవానికి అన్వయించారు. ఆయన ఊహించిన విధంగా బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలలో విప్లవం రాలేదు. కానీ అందుకు భిన్నంగా అంతకంటే తక్కువ అభివృద్ధి చెందిన రష్యాలో వచ్చింది. తరువాత అత్యంత వెనుకబడిన ఫ్యూడల్‌ చైనాలో వచ్చింది. చరిత్ర చిత్రాల గురించి ఎంగెల్స్‌ ఇలా పేర్కొన్నారు.’మన కంటికి ఆకస్మికంగా కనిపించే గొప్ప విప్లవాలన్నింటికీ ముందు కాలపు ఆలోచనలు, సాహిత్యం, రాజకీయాల ఫలితంగా నిశ్చల మరియు రహస్య విప్లవాలు జరిగే తప్పనిసరిగా జరిగి వుంటాయి. విప్లవం ప్రతి కంటికీ కనిపించదు.’

    ఈఏడాది నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బెర్నీ శాండర్స్‌ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడటం ఒక అనూహ్య పరిణామం. అమెరికాలో సోషలిస్టు, కమ్యూనిస్టు అని ఎవరైనా చెప్పుకుంటే వారిని ఎయిడ్స్‌ రోగి మాదిరి చూసేట్లు అక్కడి పాలకులు చేశారు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని నూరిపోశారు. అభ్యుదయ వాదులు, మ్యూనిస్టులుగా పేరు పడిన వారు నిరంతరం ఎప్పుడు ఏ కమ్యూనిస్టు వ్యతిరేక వున్మాది దాడి చేస్తాడా అని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు వుండేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి గడ్డలో నేను సోషలిస్టును, కమ్యూనిస్టును అని బహిరంగంగా ప్రకటించి సియాటిల్‌ నగర పాలక సంస్ధ ఎన్నికలలో భారతీయ సంతితికి చెందిన కష్మా సావంత్‌ ఒకసారి కాదు రెండు సార్లు 2013,15లో పోటీ చేసి విజయం సాధించారు.ఆమె ఒక టీచర్‌గా పనిచేసింది. బెర్ని శాండర్స్‌ తనను సోషలిస్టుగా, అభ్యుదయ వాదిగా స్వయంగా ప్రకటించుకున్న డెమోక్రటిక్‌పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా తనను నిలపాలని తనకు అందుకు అన్ని రకాల అర్హతలు వున్నాయని పార్టీలో మద్దతు సంపాదించేందుకు హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడుతున్నారు. అందుకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు మన మీడియాలో అప్పుడపుడూ మనం చూస్తున్నాం.

     సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకతకు పురిటి గడ్డగా పేరు మోసిన అమెరికాలో అవును మేం కూడా శాండర్స్‌ మాదిరి డెమోక్రటిక్‌ సోషలిస్టులమే అంటూ మిలియన్ల కొలదీ యువతరం ఆయనకు జేజేలు పలకటం ఎవరైనా వూహించారా? అదీ సోషలిజంపై సాగించిన ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని, కమ్యూనిజానికి సమాధి కట్టా మని, తమకు ఇంక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా పాలకవర్గానికి చెమటలు పట్టిస్తారని ఎవరైనా కలగన్నారా ? బెర్నీ శాండర్స్‌ పచ్చి కమ్యూనిస్టు తెలుసా అంటూ ఆయన గురించి చిలవల పలవలతో కూడిన వ్యతిరేక కధనాలు రాయని కార్పొరేట్‌ పత్రికలు, రేడియోలు, టీవీలు లేవంటే అతిశయోక్తి కాదు. బెర్నీ, ఆయన మద్దతుదారులు సోషలిస్టులు, కమ్యూనిస్టులా అయితే ఏమిటట, మా గురించేగా మాట్లాడుతున్నారు అంటూ రోజురోజుకూ వారి పట్ల సానుకూలతను పెంచుకుంటున్నారని స్వయంగా అమెరికా సంస్ధల సర్వేలే వెల్లడించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అయితే ఇవన్నీ యాదృచ్చికంగా జరిగాయా ?ఎంగెల్స్‌ చెప్పినట్లు ఎన్నో కారణాలు,ఎన్నెన్నో పరిణామాలు దోహదం చేశాయి.అంటే చుంచెలుక అమెరికాలో మరోసారి అంతర్గతంగా తొలుస్తోందా ? ఏమో చరిత్ర చిత్రాలను ఎవరు వూహించగలరు ?

      అమెరికా ఖండాల చరిత్రను చూస్తే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యం గొలపవు. మొత్తంగా వలస వచ్చిన వారితో, బానిసలుగా ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా పట్టుకు వచ్చిన వారితో ఏర్పడిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో(యుఎస్‌ఏ) ఇప్పుడు రిపబ్లికన్‌ పార్టీ నేతలు భారత్‌ వంటి దేశాల నుంచి వుపాధికోసం వచ్చే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు నిత్యకృత్యం. వాటి నుంచి బయట పడటానికి ఒక నాడు వలసలను స్వయంగా ప్రోత్సహించింది. నూతన ప్రపంచం పేరుతో అమెరికా ఖండాలలోని ప్రకృతి సంపదలను స్వంతం చేసుకున్న ఐరోపా పాలకవర్గం తమకు అవసరమైన పని వారి కోసం పెద్ద ఎత్తున ఐరోపా నుంచి వలసలను ప్రోత్సహించింది. వలస కార్మికులకు రంగుల కలలను చూపింది.ఆఫ్రికా నుంచి అక్కడి జనాన్ని బానిసలుగా పట్టుకు వచ్చింది.అలాంటి పెట్టుబడిదారీ వర్గానికి ప్రతినిధిగా ముందుకు వస్తున్న రిపబ్లికన్‌ పార్టీ వలసలకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఎందుకు ?

     1870దశకంలో ఐరోపాలో తీవ్రమైన ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. దాని ప్రభావం అమెరికాపై పడింది. దానిలో భాగంగా 1873 సెప్టెంబరు 18న అమెరికాలోని అగ్రశ్రేణి బ్యాంకింగ్‌ సంస్ధ జె కూక్‌ అండ్‌ కంపెనీ కుప్పకూలింది.ఈ కంపెనీ అమెరికాలో రైలు మార్గాలకు పెట్టుబడులు పెట్టింది.అంతకు ముందు ప్రపంచ ఆక్రమణలో తమ వాటా కోసం ఆధిపత్య పోరులోఅమెరికా జరిపిన అనేక యుద్ధాల సమయంలో రుణ లావాదేవీలను నిర్వహించటంలో కీలక పాత్ర పోషించింది.అమెరికాపై ఈ మాంద్య ప్రభావం ఆ నాడు ఎంత తీవ్రంగా వుందంటే ఈ బ్యాంకు కుప్పకూలటంతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ పది రోజుల పాటు మూత పడింది. కంపెనీలకు అప్పులు కరవయ్యాయి.పద్దెనిమిదివేల వ్యాపార సంస్ధలు దివాలా తీశాయి. నిరుద్యోగం 1876 నాటికి 14శాతానికి పెరిగింది. పని దొరికిన కార్మికులకు కూడా ఆరునెలలు మాత్రమే, అదీ 45శాతం వేతన కోతతో రోజుకు ఒక డాలరు కంటే తక్కువకే పనిచేశారు. దేశంలోని 364 రైలు మార్గ కంపెనీలలో 89 దివాలా తీశాయి.అంతకు ముందు ప్రభుత్వం రైలు మార్గాల నిర్మాణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.అందుకుగాను పెద్ద విస్తీర్ణంలో భూమి, ఇతర సబ్సిడీలను ఇచ్చింది.దాంతో మదుపుదార్లందరూ రైలు మార్గ కంపెనీలకు తమ పెట్టుబడులను మరల్చారు. బ్యాంకులన్నీ డబ్బును ఇటు మళ్లించాయి. మాంద్యం అటు రైలు మార్గ కంపెనీలు, ఇటు వాటిలో పెట్టుబడులు పెట్టిన వారినీ తీవ్రంగా దెబ్బతీసింది. సబ్సిడీ రూపంలో రాయితీలను పొందేందుకు ఆ సమయంలో అంత విస్తరణ అవసరమా లేదా అని చూడకుండా పెట్టుబడిదారులు 1866-73 మధ్య 55వేల కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను నిర్మించారు. ఈ పూర్వరంగంలో మాంద్యం కారణంగా ఒకే ఏడాది మూడుసార్లు కార్మికుల వేతనాలను తగ్గించారు. దానికి నిరసనగా 1877లో అమెరికాలో జరిగిన రైల్వే కార్మికుల సమ్మెలను కొంత మంది మహా తిరుగుబాటుగా వర్ణించారు.ఇదే తరువాత కాలంలో ప్రపంచ కార్మికవర్గ దీక్షా దినమైన ‘మే డే ‘కు నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు.

      పశ్చిమ వర్జీనియాలోని మార్టినెస్‌బర్గ్‌లో 1877 జూలై 14న ప్రారంభమైన రైల్వే కార్మిక సమ్మె అనేక ప్రాంతాలకు విస్తరించి 45 రోజుల పాటు జరిగింది. దీనికి ఏ కార్మిక సంఘమూ పిలుపునివ్వలేదు. ఏ పార్టీ మద్దతు పలకలేదు. మాంద్యంతో కార్మికుల నుంచి వెల్లువెత్తిన నిరసన నుంచి చెలరేగిన ఈ సమ్మె, హింసాకాండను అణచివేసేందుకు స్ధానిక, రాష్ట్ర, కేంద్ర పోలీసు, మిలిటరీ బలగాలను దించారు. మాంద్యం 1878-79 నాటికి తగ్గిపోయింది. అయితే ఆ సందర్భంగా కార్మికుల్లో తలెత్తిన నిరసనను పాలకులు అణచివేసినా కార్మికవర్గం అనేక పాఠాలు నేర్చుకుంది. పశ్చిమ వర్జీనియాలో ప్రారంభమైన సమ్మె అణచివేతకు ఆ రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్ర పారామిలిటరీ బలగాలను ఆదేశించాడు. బల ప్రయోగానికి ఆ దళాలు నిరాకరించాయి. దాంతో కేంద్ర దళాలను దించాడు. ఇలా అనేక రాష్ట్రాలలో జరిగింది. పలుచోట్ల కార్మికులు, మిలిటరీ దళాలతో తలపడ్డారు.మేరీలాండ్‌లో మిలిటరీ కాల్పులలో పది మంది కార్మికులు మరణించారు.పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక రైలు మార్గ యజమాని అయిన థామస్‌ అలెగ్జాండర్‌ స్కాట్‌ కార్మికులకు కొద్ది రోజుల పాటు ‘తూటాల భోజనం పెట్టండి ఎలా వుంటుందో రుచి చూస్తారు’ అని వ్యాఖ్యానించాడు.దాంతో జరిపిన కాల్పులలో 20 మంది మరణించారు.ఇలా అనేక చోట్ల స్ధానిక ప్రభుత్వాల ఆదేశాల కంటే రైలు కంపెనీల యజమానుల ఆదేశాలమేరకు సాయుధ దళాలు కార్మికులను అణచివేశాయి.

     ముందే చెప్పుకున్నట్లు ఈ సమ్మె అనేక అనుభవాలను నేర్పింది. మిస్సోరీ రాష్ట్రంలో సెయింట్‌ లూయీస్‌ వర్కింగ్‌ మెన్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మిస్సోరీ నది పరిసర ప్రాంతాలలో అనేక మంది ఇతర కార్మికులు సానుభూతిగా సమ్మె చేశారు. చివరకు రోజుకు ఎనిమిది గంటల పని, బాలకార్మికుల నిషేధం డిమాండ్లతో అమెరికాలోనే తొలి సాధారణ సమ్మెగా అది మారిపోయింది. నది రెండువైపులా ఎనిమిది వేల మంది సాయుధ బలగాలను దించి సమ్మెను అణచివేశారు. కనీసం పద్దెనిమిది మందిని కాల్పులలో చంపివేశారు.

     ఈ సమ్మె అణచివేత తరువాత భవిష్యత్‌లో ఆందోళనలను ఎలా నిర్వహించాలా అని కార్మికవర్గం ఆలోచించింది. మరోసారి ఇలాంటి ఆందోళనలు పునరావృతం కాకుండా ఎలా చూడాలా అని యజమానులు పధకాలు వేశారు. కార్మికుల పట్ల మరింత కఠిన వైఖరిని అనుసరించాలని నిర్ణయించారు. అనేక రాష్ట్రాలలో కొత్త సాయుధ దళాలను తయారు చేశారు. జాతీయ సాయుధ దళాలకు అనేక పట్టణాలలో కేంద్రాలను నిర్మించారు. కార్మికులను అణచివేసేందుకు కొన్ని చట్టాలను కూడా కొత్తగా రూపొందించారు. ఇదే సమయంలో కార్పొరేట్‌ శక్తులను ఎదుర్కోవటంలో కార్మికవర్గం కూడా తనలో ఇమిడి వున్న శక్తిని గుర్తించింది.పిట్స్‌ బర్గ్‌లో సమ్మె అణచివేతకు సారధ్యం వహించిన సాయుధ దళాధికారి మాటల్లోనే ‘ ఒకే లక్ష్యం, ఒకే స్ఫూర్తి వారిలో కనిపించింది. కార్పొరేషన్ల శక్తిని దెబ్బతీసేందుకు ఏ పద్దతి అయినా అనుసరించవచ్చని వారు సమర్ధించుకున్నారు’ అన్నాడు. కార్మికులలో పెరిగిన చైతన్యం కారణంగా యజమానులు కూడా తెగేదాకా లాగితే తమకూ నష్టమే అని కూడా గ్రహించకతప్పలేదు. ఈ పూర్వరంగంలోనే బాల్టిమోర్‌ అండ్‌ ఓహియో రైలు మార్గ కంపెనీ 1880 మే ఒకటిన వుద్యోగుల సహాయ విభాగాన్ని ప్రారంభించి అనారోగ్యం, ప్రమాదాలకు గురైనపుడు సాయం, మరణిస్తే పరిహారం చెల్లించేందుకు ఏర్పాటు చేసింది. అదే కంపెనీ మరో నాలుగు సంవత్సరాల తరువాత పెన్షన్‌ పధకాన్ని ప్రారంభించిన తొలి పెద్ద యాజమాన్యంగా పేరు తెచ్చుకుంది.

  రైల్వే కార్మికుల ఆందోళన తరువాత అనేక పరిశ్రమలలో సమ్మెలు గణనీయంగా పెరిగాయి.1884అక్టోబరు ఏడున అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య 1886 మే ఒకటవ తేదీ నుంచి రోజుకు ఎనిమిది గంటల పని విధానం అమలులో వుండేట్లుగా ఎక్కడి కక్కడ కార్మిక సంఘాలు తీర్మానించి అమలు జరిపించుకోవాలని ఒక తీర్మానంలో అమెరికా, కెనడా కార్మికవర్గాన్ని కోరింది. మరుసటి ఏడాది సమావేశంలో కూడా అదే తీర్మానాన్ని పునరుద్ఘాటించింది. ఈ పిలుపు కార్మికవర్గంలో ఎంతో విశ్వాసాన్ని, వుత్సాహాన్ని నింపింది. రెండు సంవత్సరాల కాలంలోనే కార్మిక సంఘాల సభ్యత్వం రెండు నుంచి ఏడులక్షలకు పెరగటమే దానికి నిదర్శనం. ఎంగెల్స్‌ చెప్పినట్లుగా ‘మన కంటికి ఆకస్మికంగా కనిపించే గొప్ప విప్లవాలన్నింటికీ ముందు కాలపు ఆలోచనలు, సాహిత్యం, రాజకీయాల ఫలితంగా నిశ్చల మరియు రహస్య విప్లవాలు జరిగే తప్పనిసరిగా జరిగి వుంటాయి. విప్లవం ప్రతి కంటికీ కనిపించదు.’

   ప్రపంచాన్ని మరో మలుపు తిప్పిన మే డే పూర్వరంగం కూడా అలాంటిదే. 1881-84 మధ్య కాలంలో అమెరికాలో ఏడాదికి సమ్మెలు, లాకౌట్లు ఏడాదికి 150 జరగ్గా వాటిలో వున్న కార్మికులు లక్షా 50వేల మంది వున్నారు. తరువాత క్రమంగా పెరిగాయి 1886లో దాదాపు పదివేల సమ్మెలలో ఏడులక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. అదే ఏడాది పనిగంటలను పన్నెండు నుంచి ఎనిమిదికి తగ్గించాలని కోరుతూ మే ఒకటిన జరిగిన జాతీయ సమ్మెలో 12వేల కంపెనీల కార్మికులు పాల్గొన్నారు.ఈ ఆందోళనకు కేంద్రంగా చికాగో మారింది. మే మూడవ తేదీన మెకార్మిక్‌ రీపర్‌ వర్క్స్‌ పరిశ్రమ వద్ద పోలీసులు కార్మికులను రెచ్చగొడుతూ జరిపిన కాల్పులలో ఆరుగురు మరణించారు. దానికి నిరసనగా మే నాలుగవ తేదీన చికాగోలోని హే మార్కెట్‌ ప్రాంతంలో కార్మికులు ప్రశాంతంగా సభ జరిపారు. కుట్రలో భాగంగా పోలీసులే బాంబులు వేసి తమ అధికారి ఒకరిని చంపివేశారు. దాన్ని సాకుగా చూపి కార్మికులపై తిరిగి కాల్పులు జరిపారు. ఆ సందర్భంగా నలుగు కార్మికులు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అంతకంటే ఎక్కువ మంది కనిపించలేదు. ఆ సందర్భంగానే ఒక పోలీసు మరణించాడు. తరువాత గాయాలతో మరో ఆరుగురు మరణించారు. తరువాత వెల్లడైన అంశమేమంటే గాయాలతో మరణించిన ఆరుగురు కూడా పోలీసులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల తూటాలకు గాయపడిన వారే అని తేలింది. ఈ వుదంతంలో ఎనిమిది మంది కార్మికులును బాధ్యులుగా చేస్తూ కేసు పెట్టి, విచారణ తతంగం జరిపి వారిని వురి తీశారు. నిజానికి వారు కాల్పులు జరిగిన సమయంలో హే మార్కెట్‌ ప్రాంతంలోనే లేరు. ఆ చర్య అమెరికన్లనే గాక యావత్‌ ప్రపంచ కార్మికవర్గాన్ని మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. తరువాత 1889 జూలై 14న పారిస్‌లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్‌ సమావేశం చికాగో కార్మిక పోరాటాన్ని సమీక్షించి, అమెరికా కార్మిక సంఘ సూచనను ఆమోదిస్తూ మరుసటి ఏడాది 1890 నుంచి మే ఒకటవ తేదీని అంతర్జాతీయ కార్మిక దీక్షా దినంగా పాటించాలని తీర్మానించింది.

    1870దశకపు మాంద్యం తరువాత మరో రెండు దశాబ్దాలకు 1893-94లో అమెరికాను మరో మాంద్యం కుదిపేసింది. దేశవ్యాపితంగా సమ్మెలు వెల్లువెత్తాయి. ఇరవై ఆరు రాష్ట్రాలలో కార్మికులు-భద్రతా దళాలు తలపడేంతగా పరిస్ధితులు దిగజారాయి.ఈ సందర్భంగా పుల్‌మాన్‌ అనే రైల్వే కంపెనీలో జరిగిన సమ్మె వైఫల్యం కార్మికోద్యమంలో కొత్త పరిణామాలకు నాంది పలికింది.అప్పటి వరకు కార్మికులు ఏ విభాగంలో పనిచేసినా ఒకే యూనియన్‌లో వుండే వారు. ఈ సమ్మె సందర్బంగా కొన్ని విభాగాల వారు సమ్మెలో పాల్గొనలేదు. అది విభాగాల వారీ యూనియన్ల ఏర్పాటుకు దారి తీసింది.(వుదా టీచర్లలో కాడర్‌ సంఘాలు ఏర్పడిన మాదిరి ) దీనివలన వుపయోగాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి. ఇప్పటికీ ఈ మంచి చెడ్డల గురించి చర్చలు జరుగుతూనే వున్నాయి.

     సరిగ్గా 130 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో రోజుకు ఎనిమిది గంటల పని విధానాన్ని కోరుతూ జరిగిన ఆందోళనతో మే డే వునికిలోకి వచ్చింది. అదే చికాగో నగరం ప్రస్తుతం ఈ ఏడాది మేడే సందర్భంగా టీచర్ల ఆందోళనకు సమాయత్తం అవుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా, ప్రపంచ వుపాధ్యాయ వుద్యమంలో చికాగో టీచర్స్‌ యూనియన్‌ ఒక ప్రత్యేక స్ధానం సంపాదించుకుందంటే అతిశయోక్తి కాదు.జూన్‌ 30వ తేదీతో గత ఒప్పంద గడువు ముగుస్తున్నా కొత్త ఒప్పందం చేసుకొనేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవటంతో ఏప్రిల్‌ ఒకటవ తేదీన సమ్మె చేసిన టీచర్లు మే పదహారవ తేదీన మరోసారి సమ్మెకు దిగే విధంగా అక్కడి ప్రభుత్వం, మేయర్‌ చర్యలు వున్నాయి. చికాగో టీచర్ల వుద్యమం ప్రపంచ టీచర్లకు వేగు చుక్కగా, కొత్తదారి చూపుతున్నది. అమెరికా పాలకుల నయా వుదారవాద విధానాలలో భాగంగా ఇప్పటికే వున్నత విద్యత బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వం పాఠశాల విద్య నుంచి కూడా తప్పుకొనేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందించటం లేదనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రయివేటు సంస్ధలకు స్కూళ్ల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నది. దానికి ముద్దుగా చార్టర్‌ స్కూళ్లు అని పేరు పెట్టింది. నిధులను పెద్ద మొత్తంలో వాటికి మళ్లిస్తున్నది. ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్ధులను దూరం చేయాలంటే అక్కడి సౌకర్యాలకు కోత పెట్టాలి. అందుకు గాను అవసరమైన నిధులను కోత పెట్టటం ప్రారంభించింది. రాజ్యాంగం ప్రకారం నగరపాల సంస్ధలు కూడా ప్రభుత్వాల మాదిరి బాండ్ల జారీ ద్వారా అప్పులు తీసుకోవచ్చు.( మన దేశంలో గ్రేటర్‌ కార్పొరేషన్ల పేరుతో పెద్ద మున్సిపాలిటీలలో పరిసర ప్రాంతాలను కలిపి పెద్ద నగర పాలక సంస్ధలుగా మార్చటంలో అసలు లక్ష్యం అదే). మీరు స్కూళ్లు నడపాలనుకుంటే అప్పులు చేయండి, వాటిని తీర్చటానికి ప్రజలపై పన్నులు, ఇతర భారాలు మోపండని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వత్తిడి చేస్తున్నాయి. పన్నులు, భారాలు మోపటం అంటే జనాన్ని రెచ్చగొట్టటం తప్ప వేరు కాదు. అసలే 2008 నుంచి తీవ్ర ఆర్ధిక మాంద్యం, నిజవేతనాలు పడిపోతున్న స్ధితిలో పౌరులు స్కూళ్ల కోసం అప్పులు, పన్నుల భారాలను వ్యతిరేకించటం సహజం.

     అమెరికాలో వున్న పరిస్థితులలో టీచర్ల సమ్మె ఒక రోజు జరిగినా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఎక్కడైనా టీచర్లు ఆందోళనకు దిగితే ఆ రోజు మా పిల్లలను ఎవరు చూస్తారంటూ తలితండ్రులు టీచర్లపై దెబ్బలాటకు వస్తారు. పాలకులు కూడా అదే రెచ్చగొడతారు. దీన్ని గమనించే గత కొద్ది సంవత్సరాలుగా చికాగో టీచర్స్‌ యూనియన్‌ తాము చేస్తున్న ఆందోళన కేవలం తమ బిల్లు-బెల్లుకే కాకుండా మొత్తం కార్మికవర్గ ప్రయోజనాలకే అని తలిదండ్రులు, కార్మికవర్గాన్ని ఒప్పించటంలో చాలా వరకు సఫలీకృతం అయింది. ఇదే సమయంలో ప్రయివేటు స్కూళ్లు తమపై ఎంత భారం మోపుతున్నాయో గ్రహించటం కూడా తలిదండ్రులలో ప్రారంభమైంది. ఈ కారణంగానే ఏప్రిల్‌లో సమ్మె చేసిన వుపాధ్యాయులు తిరిగి మేనెలలో మరో సమ్మెకు సన్నద్దం అవుతున్నారు. ప్రభుత్వం సంప్రదింపులు జరిపేందుకు అవసరమైన గడువు ముగిసిన తరువాత ఏరోజైనా పది రోజుల సమ్మె నోటీసు ఇచ్చి మే 16న సమ్మె చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. చికాగో నగరం ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో వుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ల అప్పు ప్రస్తుతం 20 బిలియన్‌ డాలర్లకు చేరిందని అంచనా.(బిలియన్‌ అంటే వంద కోట్లు, ఒక డాలర్‌ మన రూపాయలలో 68కి సమానం) దీనిలో ఒక్క చికాగో నగర అప్పు మూడో వంతు వుంది.ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్ధిపై సగటున పదివేల డాలర్ల అప్పు వున్నట్లు ఒక పత్రిక అంచనా వేసింది.అనేక నగరపాలక సంస్ధలలో స్ధానికంగా వసూలు చేసిన పన్నుల మొత్తం అప్పులపై వడ్డీలకే సరిపోతోందట.

   ఈ పూర్వరంగంలో టీచర్లు తమ ప్రతిపాదనలను అంగీకరిస్తే వారి వేతనాల పెంపుదలకు అంగీకరిస్తామని ప్రభుత్వం లంకె పెడుతోంది. పొమ్మన కుండా పొగపెట్టినట్లు మరోవైపు రుణం దొరక్కుండా చేసి స్కూళ్ల మూతలకు రంగం సిద్దం చేస్తోంది. పరోక్షంగా పాఠశాలల ప్రయివేటీకరణ, మూతలకు అంగీకరించాలని వత్తిడి చేస్తోంది. దీనిని చికాగో టీచర్స్‌ యూనియన్‌ అంగీకరించటం లేదు. దీంతో ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. ఏప్రిల్‌ ఒకటవ తేదీన జరిపిన సమ్మె చట్ట బద్దమా కాదా అని తాము విచారించే ముందు తాత్కాలికంగా అయినా చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని ప్రభుత్వమే కోర్టును కోరింది. ఒక స్వతంత్రం వాస్తవాల విచారణ సంస్ధ రూపొందించిన నివేదికను టీచర్ల యూనియన్‌ ఆమోదించాలని చికాగో నగర ప్రభుత్వ పాఠశాలల సిఇఓ ఫారెస్ట్‌ క్లేపూల్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయని పక్షంలో స్కూళ్ల మూత, తరగతి సైజు పెంపు, లేఆ ఫ్‌లు తప్పవని అన్నారు. స్వతంత్ర వాస్తవాల వెల్లడి బృందం సమర్పించిన నివేదిక ప్రకారం రానున్న నాలుగు సంవత్సరాలలో టీచర్ల వేతనం 8.75శాతం పెంచుతారు. దానికి కూడా కొన్ని షరతులు వున్నాయి. మన దేశంలో 2004 తరువాత సర్వీసులో చేరిన వారికి నూతన కంట్రి బ్యూటరీ పెన్షన్‌ విధానం వర్తింప చేస్తున్నట్లే 1980 దశకం నుంచి అమలులో వున్న పెన్షన్‌ విధానం బదులు టీచర్లు తమ పెన్షన్ల కోసం ఏడు శాతం మొత్తాలను చెల్లించాల్సి వుంటుంది. ఏటా రెండు శాతం మూల వేతనం పెంపుదల చొప్పున రెండు సంవత్సరాలకు ఒప్పందం చేసుకోవాలని, ఇతర లబ్దులను కొనసాగించాలని, చార్టర్‌ స్కూళ్ల సంఖ్యను పరిమితం చేయాలని, తరగతి గదిలో పిల్లల సంఖ్యను పెంచకూడదని టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. తాజా పరిణామాలపై చికాగో టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు కరేన్‌ లెవిస్‌ మాట్లాడుతూ ‘సమ్మె చేయాలని టీచర్లెవరూ కోరుకోవటం లేదు. ఇదేమీ సంతోషించాల్సిన సందర్భం కాదు, మా విద్యార్ధుల ముందు మేము ప్రేమించే బోధన చేయటానికి ఇష్ట పడతాము. కానీ ఈ బోర్డు (ప్రభుత్వం) ప్రభుత్వ పాఠశాల విద్యను రక్షించుకొనేందుకు గాను మా విద్యార్ధులు, తలిదండ్రులు, పాఠశాల కమిటీలను సంఘటితర పరచటం తప్ప మాకు మరొక అవకాశం లేకుండా చేస్తున్నది. పాఠశాల విద్యకు మరిన్ని నిధులు రాబట్టే విషయంలో బోర్డు, టీచర్ల యూనియన్‌ ఒకటే, అయితే అది ఒప్పందం కుదిరిన తరువాత.మేము నిధుల గురించే కాదు, స్కూళ్ల మూసివేత ద్వారా పెద్ద సంఖ్యలో టీచర్లను కోల్పోకుండా లోపాలు లేని హామీలు కోరుతున్నాం, మేము హామీలు కోరుతుంటే వారే వేరే భాషలో ఇతర విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మేము ఎంతో ఆశాభావంతో వున్నాం, మేము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సివుంది’ అన్నారు. మరోవైపున పాఠశాల బోర్డు సిఇఓ యూనియన్‌పై ఆరోపణలు చేస్తూ వాస్తవాలకు అనుగుణంగా ఆలోచించటం లేదని, ఊహా ప్రపంచంలో వుందని వ్యాఖ్యానించారు.

     అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ తరతమ తేడాలతో తీవ్రమైన నిధుల కోత, రుణ సమస్యను ఎదుర్కొంటున్నాయి. బలమైన చికాగో టీచర్స్‌ యూనియన్‌ను లొంగదీసుకోవటం లేదా యూనియన్‌ను దెబ్బతీస్తే మిగతా ప్రాంతాలలో పాఠశాల విద్యపై వేటు వేయటం సులభం అవుతుంది. అందుకు ప్రభుత్వం అడ్డదారులు వెతుకుతుంటే వాటిని అధిగమించటానికి చికాగో టీచర్స్‌ యూనియన్‌ కూడా అంతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందుకే అది పటిష్టం కావటం, విజయం సాధించటంపై అనేక అంశాలు ఆధారపడి వున్నాయి.

గమనిక : ఈ వ్యాసం వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణా టీచర్‌ మాస పత్రిక మే నెల సంచిక నిమిత్తం రాసినది.