Tags

, ,

ఎంకెఆర్‌

   ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన అనేక వాగ్దానాలలో రెండు ప్రాధాన్యతగలిగినవి. ఒకటి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కు తెచ్చి ప్రతి వారి ఖాతాలో పదిహేనులక్షలు వేస్తామన్నది ఒకటి. రెండవది 2022 నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది మరొకటి. ఇవి రెండూ ఎంతో ముఖ్యమైనవి. మొదటి దాని గురించి అసలు సాబ్‌ అలా చెప్పలేదు అనే వారు కొందరు, ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఎన్నికల సమయంలో చెప్పిన వాటినన్నింటినీ అమలు జరపలేరంటూ సమర్ధించేవారు మరి కొందరు. ఇంకొందరున్నారు చెప్పినట్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేకపోయినా కొత్తగా విదేశాలకు తరల కుండా చేశారంటారు. అయితే అది కూడా వాస్తవం కాదని, గత రెండు సంవత్సరాలలో కొత్తగా భారతీయులు బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి కనుక అది కూడా వాస్తవం కాదని తేలిపోయింది. బహుశా వారికి అచ్చేదిన్‌ వచ్చి వుంటాయి. రెండవది రైతుల ఆదాయాలు రెట్టింపు చేయటం. ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనమౌతున్న తరుణంలో ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఓట్లను కొల్ల గొట్టేందుకు నరేంద్రమోడీ చెప్పటం మరో నల్లధనం వెలికితీత వంటిదే. మోడీ అంతరంగమైన అమిత్‌ షా ఏదో మాయాజాలం చేసి వాగ్దానాలు అమలు చేస్తారు అని నమ్ముతున్నవారు ఇంకా వున్నారు. అయితే తాజాగా మంగళవారం నాడు ప్రపంచ బ్యాంకు 2016 జోశ్యం గురించి చేసిన ప్రకటన ఆ ఆశల మీద కూడా నీళ్లు చల్లింది.జనం మీద భారం మోపే చమురు ధరలు పెరుగుతాయన్నది ఒకటి. కోట్లాది మంది రైతులు నోట్లే రాబోయే రోజుల్లో కూడా మట్టే అని మరొకటి. జనవరి జోశ్యంలో 2016-17లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు గతేడాదితో పోల్చితే 1.8శాతం పెరుగుతాయని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. మూడు నెలలు తిరిగే సరికి రెండవ సవరింపులో 2016లో 1.8, 2017లో 1.7శాతం మేరకు ధరలు పతనమౌతాయని పేర్కొన్నది. తదుపరి అంచనాలలో ఏం చెబుతుందో తెలియదు. ఇప్పుడు చెప్పిన రెండూ జనానికి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాల రానున్నాయని వెల్లడిస్తున్నాయి.

    సరిగ్గా బ్యాంకు ఈ నివేదికను రూపొందిస్తున్న తరుణంలోనే ఇక నుంచి రైతులు తమ వుత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అందుకు గాను ఏప్రిల్‌ 14న ‘ఇనామ్‌’ ప్రారంభించారు. దీన్ని ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ అని పిలుస్తున్నారు. రైతులు సమీప మార్కెట్లో అక్కడి వ్యాపారులు చెప్పిన అతి తక్కువ ధరలకు తమ వుత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తున్నదని ఇనామ్‌ ద్వారా కోరుకున్న ధరకు అమ్ముకొని అధికంగా సంపాదించుకోవచ్చని ప్రధాని ప్రకటించారు. తొలి దశలో ఎనిమిది రాష్ట్రాలలోని 22 మార్కెట్‌ యార్డులను అనుసంధానించారు.మొత్తం 585 వ్యవసాయ మార్కెట్‌ యార్డులను 2018 నాటికి పూర్తిగా అనుసంధానిస్తారు. అయితే ఇందుకు రాష్ట్రాలు చట్టాలను సవరించి అనుసంధానానికి ఆమోదం తెలపాల్సివుంటుంది. తొలి దశలో గుజరాత్‌, తెలంగాణా, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, హర్యానా , జార్ఖండ్‌, హిమచల్‌ ప్రదేశ్‌కు చెందిన మార్కెట్లను అనుసంధానించారు. ఇరవై అయిదు రకాల పంటలను విక్రయించుకోవచ్చు. తొలి దశలో ఆయా రాష్ట్రంలోని మార్కెట్లలో మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో క్రయ విక్రయాల ద్వారా ఆయా రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. వాటిని కోల్పోవటానికి ఏ రాష్ట్రమూ అంగీకరించదు. అందువలన ఈ సమస్యను ఎలా పరిష్కరించేది చూడాల్సి వుంది. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న విధానం అమలులోకి రావటం అంత సులభం కాదని చెబుతున్నారు.

   గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ పంటలపై రైతాంగానికి వస్తున్న ఆదాయాలు పడిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా తమ బాధ్యతల నుంచి ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఈ మార్కెట్లు కూడా దానిలో భాగమే. ఈ ఏడాది బడ్జెట్‌లో రైతాంగానికి పెద్ద పీట వేసినట్లు ప్రభుత్వం, మీడియా కూడా డబ్బా కొట్టాయి. బడ్జెట్‌ను అంకెల గారడీ అని కూడా వర్ణిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 2022 రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని పదే పదే చెబుతున్నారు. దీనిలో రెండు అర్ధాలు వున్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఆ మేరకు రైతాంగ వుత్పత్తుల ధరలు పెరిగితే రైతులకు ఎక్కువ డబ్బు వచ్చినట్లు కనిపించవచ్చుగానీ అదే సమయంలో వారి పెట్టుబడులు కూడా అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. స్ధిర ధరలలో పెరుగుదల ఎంత అన్నదే నిజమైన కొలబద్ద అవుతుంది. అలా జరగాలంటే ప్రభుత్వాలు అది కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఎంత మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరిపాయన్నదానిని బట్టే వుంటుంది.

    ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది కంటే విలువ తగ్గిన రూపాయల కేటాయింపు అంకెల్లో ఎక్కువగా కనిపించినా, దేశ స్ధూలాదాయంలో శాతాలలో చూస్తే గతేడాది కంటే వ్యవసాయంలో భాగమైన గ్రామీణ వుపాధికి కేటాయింపు 0.3శాతం తగ్గింది. వాటిలో గతేడాది బకాయిల మొత్తం, యంత్రాల వినియోగానికి అనుమతుల వంటి వాటిని చూస్తే వాస్తవానికి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఆదాయంలో ఇది కూడా ఒక భాగంగా మారిన విషయం తెలిసిందే. అందువలన ఆదిలోనే హంసపాదు అన్నట్లు గ్రామీణ బడ్జెట్‌గా వర్ణించిన దానిలో దానికి ప్రాధాన్యత ఇవ్వలేదని తేలిపోయింది.

                                     వ్యవసాయ రంగంలో సంక్షోభం

     గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సంక్షోభ తీవ్రత పెరుగుతోంది. అందువలననే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కూడా రైతుల ఆత్మహత్యల తీవ్రత పెరిగింది తప్ప తగ్గటం లేదు.గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది.వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ హయాంలో వ్యవసాయరంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నది. దానిని మరుగు పరచి దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారంతో ఎన్‌డిఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంతో తీవ్ర ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే.సరిగ్గా అటు వంటి పరిస్థితి మరోసారి ప్రారంభమై దిగజారటం వేగం పుంజుకుంటున్న స్ధితిలో నరేంద్రమోడీ రైతాంగానికి ఆదాయాల రెట్టింపు వంటి అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చారు. రైతాంగం సంక్షోభంలో భాగంగా రుణవూబిలో కూరుకుపోయిన కారణంగానే రుణాల రద్దు నినాదానికి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడికి పీఠం అప్పగించారు.

     2004ఎన్నికలలో ఎన్‌డిఏ రైతుల ఆగ్రహాన్ని చూసిన తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నది. గ్రామీణ వుపాధి కార్యక్రమం దాని పర్యవసానమే. దీనికి తోడు ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం మన దేశంపై కూడా పడి రైతుల ఆదాయాలు పెరిగాయి.అది మరో నిర్మాణ రంగం పెరుగుదలకు దోహదం చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారికి వేతన రూపంలో ఆదాయాలు పెరగటానికి కూడా దారితీసింది. ఇది కొంత మేరకు సంక్షోభాన్ని పెరగకుండా చేసింది తప్ప పూర్తిగా పరిష్కరించలేదు. యుపిఏ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత లోటు తగ్గింపు పేరుతో కోతలు విధించటం ప్రారంభించింది. ఇదే సమయంలో వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ఆగిపోయి మరోసారి వెనుక పట్టు పట్టింది. బడ్జెట్‌ కోతలో భాగంగా వ్యవసాయానికి పెట్టుబడులు తగ్గాయి. 2010-11 నుంచి అప్పటి వరకు స్ధిరంగా వున్న వ్యవసాయ సంక్షోభం తిరిగి పెరగటం ప్రారంభమైంది. మోడీ హయాంలో ఇంకా పెరుగుతోంది. మాంద్యం లేదా సంక్షోభం తలెత్తినపుడు పెట్టుబడిదారులకు రాయితీలు తప్ప ప్రజా సంక్షేమానికి కోత పెడతారు. దానిలో వ్యవసాయం కూడా ఒకటని వేరే చెప్పనవసరం లేదు. వ్యవసాయ రంగం సంక్షోభంలో వున్న వర్తమాన తరుణంలో కొన్ని విభాగాలకు కొంత కేటాయింపులు పెంచినంత మాత్రాన రానున్న ఆరు సంవత్సరాలలో రైతుల అదాయాలు రెట్టింపు అవుతాయంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి వుండదు. నిజానికి ఎరువులు,డీజిల్‌, ఇతర పెట్టుబడులపై ఇస్తున్న రాయితీలను ఎత్తివేసిన తరువాత బడ్జెట్‌లో నామమాత్రంగా కేటాయింపులు పెంచినా దాని వలన రైతాంగానికి ఎలాంటి వుపయోగం వుండదు.

      నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో విదేశీ పెట్టుబడుల గురించి జపం చేస్తోంది. ఆయనను ప్రధాని గద్దెపై కూర్చొనేందుకు ఎంపిక చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ మరోవైపు స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో కబుర్లు చెబుతోంది. ఆహార వుత్పత్తుల రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తామని అరుణ్‌ జెట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పటం ఆచరణలో విదేశీ ఆదరణ మంచగా దేశాన్ని మార్చటమే. . ఇది చిన్న సన్నకారు రైతాంగానికేమీ వుపయోగపడదని ముఖ్యంగా పండ్లు, కూరగాయల రైతాంగానికేమీ ప్రయోజనం లేదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ రంగంలో పెట్టుబడులను పెంచితేనే వారికి లబ్ది చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు అంటే ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధన, పేదరిక నిర్మూలన కూడా ఇమిడి వుంది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం అంటే విదేశీ కార్పొరేట్‌, ప్రయివేటు శక్తులకు పెద్ద పీట వేయటమే. విదేశీ పెట్టుబడులు వ్యవసాయరంగంలో ప్రవేశించటం వాటి లాభాల కోసం తప్ప మన బాగుకోసం కాదు. బ్రిటీష్‌ వారు తమ ఆక్రమిత దేశాలైన భారత్‌, చైనా వంటి చోట్ల తమ లాభాల కోసం నల్లమందు సాగు, తయారీని ప్రోత్సహించి జనాన్ని నల్లమందు భాయీలుగా మార్చటమే కాదు చివరకు నల్లమందు యుద్ధాలు చేసిన విషయం చరిత్ర చెబుతోంది.

      అంతెందుకు వర్తమాన చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వుగ్రవాదులను పెంచి పోషించేందుకు అమెరికన్లు అక్కడ వారిచేత అదే పని చేయించారు. ఇప్పుడు మత్తుమందుల రవాణాలో ఆఫ్ఘనిస్తాన్‌ ఒక కీలక ప్రాంతంగా మారింది. తాలిబాన్లకు అవసరమైన ఆదాయ వనరుగా మారింది. వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులంటే మరో విధంగా చెప్పాలంటే ఈ విధానం వెనుక వున్న పరమార్ధం తన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవటం, మార్కెట్‌ శక్తులకు రైతాంగాన్ని అప్పగించటమే. దానిలో అంతర్బాగంగానే రైతులకు ఏమాత్రం వుపయోగపడకుండా ఇప్పుటికే వున్న పంటల బీమా పధకంలో మార్పులతో అందుకు శ్రీకారం చుట్టింది. రైతాంగానికి రక్షణ కల్పించే అనేక అంశాలలో బీమా ఒకటి మాత్రమే. బీమా సంస్ధలు ప్రీమియం స్వీకరించే ముందు చెప్పే కబుర్లకు తరువాత చెల్లించాల్సిన సమయంలో పెట్టే షరతులకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. అయినా వ్యవసాయ సంక్షోభానికి సమగ్ర పంటల బీమా అన్నది ఒక తోడ్పాటు మాత్రమే తప్ప జిందా తిలిస్మాత్‌ కాదు. మరో విధంగా చెప్పాలంటే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని రైతాంగాన్ని ఒక ఆర్ధిక సరకుగా ద్రవ్య వ్యాపారులకు అప్పగించే నయా వుదారవాద విధానం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాలలో మనకంటే మెరుగైన వ్యవసాయ బీమా పధకాలు వున్నప్పటికీ ఏదో ఒక పేరుతో ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇవ్వటమే గత దశాబ్దన్నర కాలంగా దోహా చర్చలు ముందుకు పోకపోవటానికి అడ్డుపడుతున్న కారణాలలో ఒకటని గుర్తించాలి. మోడీ సర్కార్‌ ఆ సబ్సిడీల గురించి మాట్లాడటం లేదు, వున్నవాటిని క్రమంగా రద్దు చేస్తోంది.

    ప్రపంచ బ్యాంకు వ్యవసాయం గురించి తాజాగా చెప్పిన అంశాల గురించి చూద్దాం. గత ఎనిమిది త్రైమాసకాలుగా (రెండు సంవత్సరాలుగా) ప్రపంచంలో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పడిపోతూనే వున్నాయి.గతేడాది కంటే తొమ్మిదిశాతం తక్కువ. ఎక్కువ భాగం వ్యవసాయ వుత్పత్తుల ధరలు ఈ ఏడాది పతనం అవుతాయి. ధాన్యం ధరలు 3.4శాతం తగ్గుతాయని జనవరిలో వేసిన అంచనాను తాజాగా 5.3శాతానికి పెంచింది. వ్యవసాయ ధరలు తగ్గటంతో పాటు చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుతాయని చెప్పటం అంటే అంటే పరోక్షంగా రైతులపై మరింత భారం మోపటమే. ఎరువుల ధరలు తక్షణమే పెరుగుతాయి.ఇది ఒక విష వలయం. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి అన్నింటినీ దెబ్బతీస్తాయి.