ఎం కోటేశ్వరరావు
రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్రమోడీకి వుపయోగపడతారా? సమస్యలను కొని తెస్తారా అన్న చర్చ జరుగుతోంది. పూవు పుట్టగానే పరిమళిస్తుంది ! తలిదండ్రులు తమకు బిడ్డలు పుట్టినపుడు కంటే వారు ప్రయోజకులైనపుడు ఎక్కువ సంతోషిస్తారు !! పది సంవత్సరాల తరువాత పార్లమెంట్లో అడుగు పెట్టి నోరు విప్పిన 15 సెకన్లలోనే రాజ్యసభ వాయిదా పడిందంటే ఆయన నోరు ఎంతటి ప్రతిభావంతమైనదో వేరే చెప్పనవసరం లేదు. అఫ్కోర్సు ఆయన మాటలను రికార్డులనుంచి తొలగించారనుకోండి. సభా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున జనానికి ఆ సమాచారం చేరిపోతుంది, మాట్లాడిన వారి ప్రయోజనం నెరవేరుతుంది. ఆ తరువాత అధికారిక రికార్డులలో వుంటేనేం లేకుంటేనేం ! సభ వాయిదా పడటం, కార్యకలాపాలు కుంటుపడటం, సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా చూడటం అదేగా పాలకపార్టీ వ్యూహం. నరేంద్రమోడీ నాయకత్వం అదే కోరుకొంటోందా ?
సుబ్రమణ్య స్వామి రాజకీయంగా జనసంఘంలో పుట్టి దీపంలా వెలిగి, తరువాత జనతా పార్టీలో నాగలి పట్టిన రైతు అవతారమెత్తి, తరువాత దానిని బిజెపిలో విలీనం చేసి కమలం పువ్వుతో పరిమళిస్తున్నారు. తాజాగా నామినేటెడ్ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టి తనకు రాజకీయ జన్మనిచ్చిన ఆర్ఎస్ఎస్కు ఆనందం కలిగిస్తున్నారు. అచ్చ తెలుగులో నోటి తుత్తర గాడిగా పిలిపించుకొంటూ నిత్యం ముస్లింలపై విరుచుకుపడే ఈ తమిళ బ్రాహ్మణుడు కుటుంబ విషయాలలో అందుకు భిన్నమైన వ్యక్తి అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
సంఘపరివార్ సంస్థలలో శిక్షణ పొందిన వారి పరిభాషలో చెప్పాలంటే స్వయంగా ‘లవ్ జీహాదీ’. పార్సీ మతస్థులను ‘సంతృప్తి పరచటానికి’ ఆ మతానికి చెందిన రుక్సానాను చదువుకునే సమయంలో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ముస్లింలను ‘సంతృప్తి పరచటానికి’ తన ఒక కుమార్తెను ఒక ముస్లింకు ఇచ్చి వివాహం చేశాడు.’హిందువులను సంతృప్తి పరచటానికి ‘ మరో కుమార్తెను విశాఖ పట్టణానికి చెందిన ప్రముఖ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇఏఎస్ శర్మ కుమారుడు, ప్రొఫెసర్ అయిన సంజయ శర్మతో వివాహం చేశారు . అయినా సరే నిత్యం తోటి లవ్ జీహాదీలతో కలసి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే ఈ పెద్దమనిషిని హిందూ తాలిబాన్ అంటే అతికినట్లు సరిపోతుందేమో.
అంతకు ముందు జనసంఘం, జనతా పార్టీ ఎంపీ. కేంద్రమంత్రిగా పని చేసిన ఆయనను తాజాగా బిజెపి రాజ్యసభకు నామినేట్ చేసింది. బిజెపి సభ్యుడైన స్వామి సాంకేతికగా ప్రస్తుతం రాజ్యసభలో స్వతంత్రుడు. అలాంటి వారు ఏదో ఒక పార్టీని ఎంచుకోవచ్చు. ఈ స్వామి స్వభావం, పార్టీలోని నాయకులతో వున్న వైరుధ్యాలను బట్టి ఏం చేస్తారో చూడాల్సి వుంది. ఇలాంటి వారిని పిల్లిని చంకన పెట్టుకు వచ్చే వారు అనికూడా అంటారు.
సంఘపరివార్ విధేయుడిగా తనను తాను రుజువు చేసుకున్న స్వామి హార్వర్డ్ ఆర్ధిక శాస్త్రవేత్త. ఎవరికి వుపయోగపడతారన్నది వేరే విషయం. ఆయన బదులు ఒక న్యాయవాది అయిన అరుణ్ జెట్లీని ఆర్ధిక మంత్రిగా తీసుకున్నపుడు స్వామిని ఎందుకు విస్మరించారని గతంలో చర్చ జరిగింది.డెబ్బయి ఆరు సంవత్సరాల సదరు స్వామి బిజెపికి నష్టం చేస్తాడా, లాభం చేకూరుస్తాడా? అసలు ఆయనను రాజ్యసభకు ఎందుకు ఎంచుకున్నారు అన్నది ఇప్పుడు చర్చ కావటం కూడా స్వామి ప్రత్యేకతల్లో ఒకటి. జెట్లీ -స్వామి వుప్పునిప్పులా , ఒక గదిలో ఎవరో ఒకరు మాత్రమే వుంటారని చెబుతారు. అలాంటిది ఇప్పుడు రాజ్యసభలో జెట్లీ నాయకత్వంలో స్వామి పనిచేయాల్సి వస్తోంది. తాను నల్లధనాన్ని వెలికి తెచ్చేందుకు ఆరు అంశాలతో కూడిన లేఖను ప్రభుత్వానికి రాశానని, ఆర్ధిక మంత్రి తీసుకున్న చర్యలను చూస్తే నల్లధనం వెనక్కు రాదని ఆరునెలల క్రితం జైట్లీపై ధ్వజమెత్తిన స్వామి, తనకు బాధ్యతలు ఇస్తే ఆరునెలల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని అయితే మనకు ఒక ఆర్ధిక మంత్రి ఇప్పటికే వుండి పోయారే అని వ్యంగ్యంగా అన్నారు. తన జనతా పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు జైట్లీ అడ్డు పడ్డారని, తరువాత 2014 ఎన్నికలలో న్యూఢిల్లీ నుంచి పోటీ చేసేందుకు సీటు రాకుండా చేశారని స్వామి మండిపడుతూ వుంటారు.
ఇవన్నీ బహిరంగ రహస్యాలే. అయినా స్వామిని నామినేట్ చేయటానికి నరేంద్రమోడీ ఎందుకు సుముఖత చూపారన్నది ప్రశ్న. బిజెపిలో అరుణ్ జైట్లీ వృద్ధ నేత ఎల్‌కె అద్వానీ శిష్యుడు అన్నది బహిరంగ రహస్యం. అంటే నరేంద్రమోడీకి వ్యతిరేకం కాకపోయినా అనుకూలం కాదు.మోడీకి తగినంత ఆంగ్ల పరిజ్ఞానం లేని కారణంగా ఎవరైనా విదేశీయలు, ఇతర ప్రముఖులు వచ్చినపుడు అంతా అరుణ్‌జెట్లీ మాట్లాడతారని చెబుతారు. రెండవది తనకు వ్యతిరేకంగా పార్టీలో, ప్రభుత్వంలో మరొక అధికార కేంద్రం ఏర్పడకుండా చూసుకోవాలని నిరంతరం మోడీ చూస్తుంటారని వార్తలు. సుబ్రమణ్యస్వామి పట్ల ఆర్ఎస్ఎస్లో ప్రత్యేక అభిమానం చూపే వారు వున్నారని మోడీకి తెలుసు. అందువలన అటు వారిని సంతృప్తి పరచటానికి, ఇటు జైట్లీను అదుపులో వుంచటానికి సుబ్రమణ్యస్వామి తగిన వ్యక్తని భావించారని విశ్లేషణ.ఇదే కోవకు చెందిన వారు ఇంకా అరుణ్ శౌరీ, రామ్‌జత్మలానీ, యశ్వంత సిన్హా వంటి వారు ఇంకా వున్నారు. వారందరికీ కూడా పునరావాసం కల్పిస్తారా ? వారి నోరు మూయించకపోతే బిజెపిని విమర్శించటానికి ప్రతిపక్షాలు అవసరం లేదని ఇంతకు ముందే వారు తమ సత్తా ఏమిటో వెల్లడించుకున్నారు.
సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు అనేక విషయాలను ఆఫ్ ద రికార్డు అని చెప్పి మరీ విలేకర్లకు ఎంతో వినోదంతో పాటు అనేక వాస్తవాలు చెబుతారు. సుబ్రమణ్యస్వామి సాఫ్ట్‌వేర్‌లో ఆఫ్ ద రికార్డు లేదు, దేన్నీ దాచుకోరు. తనకు ఆర్ధిక మంత్రి పదవి, బ్రిక్స్ బ్యాంకు గవర్నర్ పదవి, జెఎన్‌యు వైస్ ఛాన్సలర్ పదవి ఇస్తామని వాగ్దానం చేశారని స్వయంగా చెప్పారు. పేరు మోసిన కోర్టు పక్షిగా ప్రాచుర్యంలోకి వచ్చిన సుబ్రమణ్యస్వామి ఎప్పుడో ఎవరూ దొరకనపుడు తన మీదే ఒక కేసు వేసుకున్నా ఆశ్చర్యం లేదని జోక్స్ వెలువడ్డాయి.
రాజ్యసభలో తొలిసారిగా నోరు విప్పి అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియా గాంధీ పాత్ర గురించి మాట్లాడి సభ వాయిదాకు కారకుడైన స్వామి తన చర్యకు ఏ మాత్రం విచార పడలేదట.నేనేదో మంచి బాలుడిని అనా నన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది అని తోటి సభ్యుడితో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ ముఖ్యంగా సోనియా గాంధీపై దాడి చేస్తున్న స్వామిని భీష్ముడిపై దాడికి శిఖండిని వినియోగించినట్లే రాజ్యసభలో బలంగా వున్న కాంగ్రెస్‌పై దాడికి సుబ్రమణ్యస్వామిని ఆయుధంగా వాడుకోవాలని బిజెపిలోని ఒక బలమైన తరగతి కోరుకుందట. ఇలాంటివారితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు వడ్డీతో సహా చెల్లిస్తాం, కేవలం మాపై దాడి కోసమే రాజ్యసభకు నామినేట్ చేశారు. అని కాంగ్రెస్ ఎంపి ఒకరు వ్యాఖ్యానించారు.