Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

     తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమాలకు పంచ్‌ డైలాగులు అందించే విధంగా పాలక రాజకీయ పార్టీల నేతలు తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారుతున్నా అని గతంలో చెప్పేవారు. కార్యకర్తలు తప్ప ఓటర్ల తీర్పును పట్టించుకోరా అన్న విమర్శలు రావటంతో నియోజక వర్గ అభివృద్ది కోసమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇంకా గట్టిగా గతంలో తిట్టిన పార్టీలోనే ఇప్పుడు ఎందుకు చేరుతున్నావంటే అప్పుడు మా నాయకుడు ప్రత్యర్ధులను తిట్టమన్నారు గనుక తిట్టాను తప్ప నిజానికి నా కలాంటి అభిప్రాయం లేదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఇప్పుడు సీనియర్‌ నేత కనుక మైసూరా రెడ్డి మరో పెద్ద ముందడుగు వేశారు.

   తనకు ఈ వయస్సులో పార్టీలు మారి చెడ్డ పేరు తెచ్చుకోకూదని వుందని, రచనా వ్యాసంగం పెట్టుకోవాలని అనుకుంటున్నానని చెబుతున్నా మధ్యవర్తులు వైఎస్‌ జగన్‌ ఇంటికి వుదయం ఫలహారానికి తీసుకు వెళ్లారట. వెళ్లీ వెళ్లగానే తన ప్రమేయం లేకుండానే ఘటనలు జరిగాయట. వెళుతుండగానే టీవీలలో వార్తలు రావటం, వెళ్లగానే కండువా కప్పటం, ఆ వెంటనే తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయటం అన్నీ జరిగిపోయాయట. తుదకు మానవతా దృక్పధంతో సర్దుకొని వైఎస్‌ఆర్‌సిపి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారట. ఇంత కాలం తరువాత తెలిసో తెలియకో వేసిన తప్పటడుగు వెనుకకు తీసుకుంటే గౌరవ ప్రదంగా వుంటుందని అనుకున్నారట. అందుకే రాజీనామా చేశారట. ఈ వార్తలను చూసిన తరువాత మైసూరా రెడ్డిలో అవసరాలకు అనుగుణంగా సర్దుకు పోయే పక్కా అధికార రాజకీయ నాయకుడే గాక మంచి సినిమా కథకుడు కూడా దాగి వున్నట్లు వెల్లడైంది.

   బట్ట తొలిగితే సరి చేసుకో అని ఎవరైనా చెబుతారు, అసలు బట్టలు లేకుండా తిరిగే వారికి చెప్పేందుకు ఎవరు ముందుకు వస్తారు. మహాకవి శ్రీశ్రీ బతికి వున్నా, మరో రూపంలో జన్మించినా

పదండి ముందుకు పదండి తోసుకు

కనపడలేదా అధికార గద్దెలు, వినపడలేదా రా రమ్మని బాబు పిలుపులు

సిగ్గు ఎగ్గులు, నీతి నియమాలూ, ఫిరాయింపు నిరోధ చట్టాలు,

వయస్సులు, వంకాయలా మనకడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు

పోదాం పోదాం అధికార పార్టీలోకి

   అంటూ మహాప్రస్తానాన్ని తిరిగి రాసి వుండేవారు. ఒకసారి పార్టీ మారిన తరువాత మరోసారి ఫిరాయించటానికి కూడా తటపటాయింపులు వుంటాయని మైసూరా చెప్పటం వింతలలో వింత. పదవి వస్తుందా రాదా, పది కోట్లు సంపాదించుకుంటామా లేదా అన్నది తేలలేదు అంటే మెరుగ్గా వుండేది.

    కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన మైసూరా అక్కడ పూర్తిగా అధికారాన్ని, ఫ్యాక్షన్‌ రాజకీయాలను అనుభవించారు. తాను తీవ్రంగా వ్యతిరేకించే రాజశేఖరెడ్డి తిరుగులేని నేతగా ఎదగటంతో కాంగ్రెస్‌ నుంచి బయట పడి తెలుగు దేశంలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. తరువాత వైఎస్‌ జగన్‌కు పరిస్థితులు అనుకూలంగా వున్నట్లు కనిపించటంతో వైఎస్‌ఆర్‌సిపిలో చేరారని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. భవిష్యత్‌లో పార్టీ మారే వారికి మరొక మహత్తర అస్త్రాన్ని అందిస్తున్నాననే విషయం బహుశా ఆయనకు తెలియకుండానే జరిగి వుంటుంది.అదే మంటే తాను అయోమయంలో వున్న స్థితిలో టిఫిన్‌కు తీసుకు వెళ్లి కండువా కప్పారన్న భయంకర పచ్చి నిజాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయించిన వారిని ఎందుకు మారారు అంటే ఆ బలహీన క్షణంలో ఏం జరిగిందో తెలియలేదు, లేచి చూస్తే పరాయి పార్టీ కండువా కప్పి వుండటం కనిపించింది. పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు ఇష్టం లేకపోయినా దానిలోనే వుండాల్సి వచ్చింది. ఆ పార్టీ యజమాని ఏదో మానవత్వం లేనివాడే అనుకున్నా మానవతా వైఖరితో అక్కడే కొనసాగా గానీ ఇంత మానవత్వం లేని వాడని తెలిసిన తరువాత అక్కడ వుండటం మానవత్వానికే మచ్చ అని బయటకు వచ్చా అని అమాయకంగా చెప్పవచ్చు, సానుభూతి పొందవచ్చు. ఇప్పటికే ఫిరాయింపుల పర్వంలో వున్న వారూ, రాబోయే తరాలకూ ఇది ఒక హెచ్చరిక వంటిది కూడా. ఎప్పుడూ అయోమయంలో, లేదా తెలియని మైకంలో వుండ కూడదని, వుంటే ఎవరైనా తీసుకుపోయి కండువాలు కప్పేస్తారని గ్రహించాలి. లేదా తెలిసినా తెలియనట్లు నటించాలి.

    రచనలు చేయాలనుకున్నారు మైసూరా ఆందోళన చెందనక్కర లేదు. అయితే రాయలసీమ ఫ్యాక్షన్‌ గురించి ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇదే సమయంలో తెలుగు సినిమాలకు అసలే కధల కొరత వుంది. తమ కోసం పైరవీలు చేస్తే తప్ప వ్యాసాలు రాస్తే తెలుగు పత్రికలు డబ్బులు ఇవ్వవని మైసూరా రెడ్డికి చెప్పనవసరం లేదు. టీవీ ఛానల్స్‌ రేటింగ్‌లు పెంచే సంచలనాలు బయట పెట్టేందుకు ఆయన దగ్గర అలనాటి జ్ఞాపకాలు వున్నా ఆ వ్యక్తులు లేరు కనుక ఇప్పుడు చెప్పినా ప్రయోజనం వుండదు. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోయింది కనుక అదీ వృధా ప్రయాసే.ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మైసూరా రెడ్డి వంటి నేతల రాజకీయ జీవితాలన్నీ తెరిచిన పుస్తకాలే. రాబోయే తరాలు కొత్తగా తెలుసుకోవాల్సింది, అనుసరించాల్సిన ఆదర్శాలేమి వున్నాయి గనుక. దాని బదులు దర్శక, నిర్మాతలకు తన సరికొత్త పిట్ట కథలను వినిపిస్తే డబ్బుకు డబ్బు పేరుకు పేరు వస్తుందేమో ఆలోచిస్తే మంచిది.

     చంద్రబాబు నాయుడు తనకు తరువాత తన కుమారుడికీ, మనవడికీ రాజకీయంగా ప్రతిపక్షం లేకుండా చేయాలనే విజన్‌ 2030,2050తో పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు గాను ఎవరు వస్తే వారికి పచ్చ కండువాలు కప్పుతున్నారు. గతంలో పార్టీలు మారిన వారు తన దగ్గరకు రావటమే తడవుగా అభివృద్ధి ముద్రవేస్తున్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసిన పచ్చి నిజం ఇలాంటి వారి గురించి చంద్రబాబుకు తెలియక కాదు.ముందు మైండ్‌ గేమ్‌తో ఎదుటి వారిని దెబ్బతీయాలి. అందుకు ఎవరినైనా ఆకర్షించు, అందుబాటులోకి వస్తే వాడుకో, అవసరం తీరగానే వదిలెయ్‌. చంద్రబాబు నాయుడు విద్యార్ధిగా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ సిద్ధాంతాన్నే నమ్ముకున్నారని, తు.చ తప్పకుండా ఆచరిస్తున్నారని చెబుతారు. ఇలాంటి వారి లక్షణం ఏమంటే ఎవరినీ ఒక పట్టాన నమ్మరు. విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటారు. ఒక మంచి వ్యక్తి పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి వస్తే సమర్ధించుకోవటం కష్టం. అదే నాలుగు పార్టీలు మారిన అవలక్షణం వున్న వారు పోతే వారికి తాను ఎంత చేసినా పార్టీ మారారని తేలికగా ఒకమాటతో తుడిచి వేసుకోవచ్చు.

     ఇక వైఎస్‌ఆర్‌సిపి విషయానికి వస్తే ఆ దుకాణంలో ఎందరుంటారో లేదో తెలియదు. ఫిరాయించిన వారెవరి సభ్యత్వమూ పోకుండా స్పీకర్లు కాపాడగలరని రెండు తెలుగు రాష్ట్రాలే గాక దేశమంతటా రుజువైంది.అధికార రాజకీయాలలో ఎవరూ అంటరాని వారు, శాశ్వత శత్రువులు వుండరు, బొబ్బిలి , విజయనగరం రాజాలే ఒక ఒరలో ఇమిడిపోయినపుడు మిగతావారి పౌరుషాలు ఏపాటి? అందువలన రాబోయే రోజుల్లో ఎవరైనా పార్టీలో మిగిలితేనే ఆశ్చర్యం. తెలుసు కోవాల్సిన నీతి ఏమంటే ఎలుకలు అన్న తరువాత కలుగుల్లోకి పోకుండా వుంటాయా అధికార పార్టీలన్న తరువాత జనం పార్టీలు మారకుండా వుంటారా అనే వైరాగ్యం అలవరచుకుంటే మంచిది. అంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. కొందరు మట్టివాసన పసిగట్టి వర్షం వస్తుందని గ్రహిస్తారు. అలాగే ఎన్నికల సమయం వచ్చినపుడు అధికారం వచ్చేట్లు వుంటే పసిగట్టిన వారు తిరిగి వస్తారు, నిజంగానే అధికారం వస్తే నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని మిగిలిన వారూ కాళ్ల ముందు వాలతారు. ఎలాగూ ప్రజా సమస్యల మీద చేసే పనేమీ లేదు. చేయాలనే దృష్టీ లేదు కనుక 2019 వరకు కోర్టు కేసులను చూసుకుంటూ, గతంలో వెనకేసుకున్నదానిని కాపాడుకుంటూ వచ్చే ఎన్నికలలో పెట్టుబడులు లాభాల గురించి ఇప్పటి నుంచే కసరత్తు చేయమని కొత్త ఆడిటర్లను నియమించుకుంటే మంచిది.