Tags

, , ,

సత్య

   తృప్తి దేశాయ్‌ ! భూమాత రాన్‌ రాగిణి బ్రిగేడ్‌ నాయకురాలు !! శని శింగనాపూర్‌ శని దేవాలయ ప్రవేశం కోసం వుద్యమించి విజయం సాధించిన యోధురాలు. తరువాత కొల్లా పూర్‌ మహలక్ష్మి, నాసిక్‌ త్రయంబకేశ్వర దేవాలయాలలో జయప్రదంగా ప్రవేశించి పూజలు నిర్వహించారు. ప్రార్ధనా మందిరాలలో మహిళల ప్రవేశంపై నిషేధాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తృప్తి దేశాయ్‌కు సుప్రసిద్ధ సినీ గీత రచయిత జావేద్‌ అక్తర్‌ మద్దతు ప్రకటించారు. దేవాలయాలు, దర్గాలు అన్న విచక్షణ లేకుండా చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా సభ్యులుగా చేరేందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు సంస్ధ అధిపతి మోహన్‌ భగవత్‌కు లేఖ రాయాలని అక్తర్‌ సూచించారు. అంతకు నాలుగు రోజుల ముందు తృప్తి దేశాయ్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా మహిళలను అనుమతించాలని కోరుతూ తాను సంస్ధ అధిపతికి లేఖ రాస్తానని ప్రకటించారు. ఏ ప్రిల్‌ 28వ తేదీన ముంబైలోని పురాతన హాజీ అలీ దర్గాలో ప్రవేశించేందుకు తృప్తి నాయకత్వంలోని మహిళల బృందం ప్రయత్నించింది. మహిళలకు ప్రవేశం లేదనే పేరుతో దర్గా పాలకవర్గం ఆమెను అనుమతించలేదు. దేశాయ్‌తో పాటు అనేక సంస్ధలకు చెందిన మహిళలు ప్రార్దనలు చేసేందుకు సాయంత్రం ఐదు గంటలకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు వారిని అడ్డుకొని కారునుంచి దిగకుండా చుట్టుముట్టారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటమే గాక కారు దిగవద్దంటూ సలహా ఇచ్చారు. రాత్రి ఏడున్నరకు దర్గాను మూసివేశారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే నంటూ తాము శాంతియుతంగా వివక్ష పాటించే అన్ని ప్రార్ధనా మందిరాలు, ప్రాంతాలలో ప్రవేశానికి ఆందోళన చేస్తామని ప్రకటించి వెనుదిరిగారు. ఇది తొలి రోజు మాత్రమే. మాకేమీ తొందర లేదు, 2012 నుంచి దర్గా అంశం కోర్టులో వుంది అన్నారు.తమ ఆందోళనకు మద్దతు ప్రకటించాలని సినీ హీరోలు షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌లకు తృప్తి దేశాయ్‌ విజ్ఞప్తి చేశారు. వారు తమ వైఖరి ఏమిటో ప్రకటిస్తే వారి అభిమానులందరూ తమతో కలసి వస్తారని అన్నారు.

  దాంతో తాము ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రకటించి ముఖ్యమంత్రిని కలుసుకొనేందుకు ఆయన నివాసం వద్దకు వెళ్లింది. ముందస్తు అనుమతి లేదనే పేరుతో నివాసంలోకి పోలీసులూ రానివ్వలేదు. ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటంపై తృప్తి దేశాయ్‌ నిరసన వ్యక్తం చేశారు. దర్గాదగ్గర నాపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారు. దాని గురించి ముఖ్యమంత్రికి విన్నవించుకుందామని వెళుతుంటే ముందస్తు అనుమతి లేదని అడ్డగించుతున్నారు, ఇదేమి ప్రజాస్వామ్యం, బిజెపి చెప్పే మహిళలకు మంచి రోజులంటే ఇవేనా ‘ అని ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.

    దర్గాలో ప్రవేశించేందుకు వచ్చిన వారిని అవసరమైతే బలప్రయోగంతో అడ్డుకుంటామని దర్గా దగ్గర తన బృందంతో వున్న సమాజవాది పార్టీ నాయకురాలు రుక్సానా సిద్దికీ చెప్పారు.తృప్తిపై సిరాతో దాడి చేస్తామని మజ్లిస్‌ పార్టీ నేత హాజీ రఫత్‌ హుస్సేన్‌ హెచ్చరించారు. దీనికి కొద్ది రోజుల ముందు శివసేన నేత అరాఫత్‌ షేక్‌ మాట్లాడుతూ ఆమె గనుక దర్గాలోకి ప్రవేశిస్తే చెప్పులతో కొడతామని బెదిరించారు. అయితే అరాఫత్‌ ప్రకటనతో తమ పార్టీకి సంబంధం లేదని తరువాత శివసేన చెప్పుకుంది.

    అసలు ఈ సమస్యను అనవసర పెద్ద వివాదంగా చేశారని దర్గా పాలక మండలి సభ్యుడు రిజ్వాన్‌ మర్చంట్‌ అంటున్నారు. దర్గాను సందర్శించకుండా సోదరీ మణులను నిషేధించలేదు, ఆపలేదు. వారికి ప్రత్యేక మార్గాలు, హుండీలు వున్నాయి. వారి కోసం ప్రత్యేకంగా స్థలం కూడా కేటాయించాము. ఒక పురుష ముస్లిం ఫకీరు సమాధి దగ్గరకు మహిళలను అనుమతించటం, దానిని తాకటం ఇస్లాం ప్రకారం తీవ్రమైన పాపం, అందుకే వారిని దాని దగ్గరకు అనుమతించటం లేదు.’ అన్నారు.

    దర్గాలో ప్రవేశం నిషేధంపై విచారణ జరుపుతున్న బొంబై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. శబరి మల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశ నిషేధంపై ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది. బహుశా ఈ తీర్పు వచ్చిన తరువాత దర్గా కేసుపై కూడా తీర్పు వస్తుందని భావిస్తున్నారు.