Tags

, , , ,

సత్య

    యాభై సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోసి, లక్షలాది మందిని చిత్రహింసలు, జైలు పాలు చేసిన దుర్మార్గంపై దర్యాప్తు జరిపి వాస్తవాలను వెల్లడించటంతో పాటు దోషులను శిక్షించాలన్న డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. దానికి అనుగుణ్యంగానే ఈ వారంలో దేశాధ్యక్షుడు జోకోవి దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చిందని భావిస్తున్నారు. మిలిటరీతో పాటు నాడు హత్యాకాండలో మిలిటరీకి సహకరించి నేడు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారు దర్యాప్తును సాధ్యమైన మేరకు అడ్డుకోవాలని, వీలుకానపుడు దానినొక ప్రహసంగా మార్చాలని మరోవైపు నుంచి వత్తిడి తెస్తున్నారు. కమ్యూనిస్టులను హత్య చేసి సామూహికంగా పూడ్చిపెట్టిన ప్రాంతాల గురించి వివరాలు సేకరించాలని అధ్యక్షుడు తమను ఆదేశించినట్లు సీనియర్‌ మంత్రులు జోకో విడోడో, లుహుత్‌ పాండజైటన్‌ ప్రకటించారు. సమాచారం గురించి ప్రభుత్వం తమను, ఇతరులను కూడా సంప్రదిస్తున్నదని ఇండోనేసియన్‌ పరిశోధనా సంస్ధ అధిపతి హరీస్‌ అజహర్‌ వెల్లడించారు.

    మాజీ జనరల్‌ అయిన మంత్రి లుహుట్‌ దర్యాప్తు గురించి మాట్లాడుతూ ఇంతకాలంగా లక్షల మంది మరణించారని చెబుతున్నాం, అయితే అందుకు సంబంధించిన ఒక్క సామూహిక ఖనన ప్రాంతాన్ని కూడా కనుగొనలేదన్నారు. అలాంటివి ఏమైనా వుంటే కనుగొనమని అధ్యక్షుడు నాకు చెప్పారు అన్నారు.స్పష్ట మైన ఆధారాలున్నాయని మానవ హక్కుల బృందాలు చెబుతున్నాయి.

    దుష్టులైన కొంత మంది మిలిటరీ జనరల్స్‌తో కలసి కమ్యూనిస్టులు కొందరు జనరల్స్‌ను హత్య చేసి తిరుగుబాటు చేశారని, దాన్ని అణచివేసే క్రమంలో కొంతమంది మరణించి వుండవచ్చని ఇప్పటి వరకూ మిలిటరీ చెబుతోంది. దాని గురించి మాట్లాడిన వారిని వేధింపులకు గురి చేసింది. అసలు చర్చకే అవకాశం ఇవ్వలేదు. అమెరికా పన్నిన పెద్ద కుట్రలో భాగంగా సైనిక జనరల్స్‌ను కొంత మందిని పధకం ప్రకారం హత్యగావించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై మోపి వూచకోతకు పాల్పడ్డారన్నది వాస్తవం. చైనీస్‌ ఇండోనేషియన్స్‌ను, కమ్యూనిస్టులు కాని వారిని కూడా అనుమానంతో మిలిటరీ, దానికి సహకరించిన మతోన్మాదశక్తులు హత్యకావించాయి. ఎన్నో లక్షల మందిని అనుమానంతో చిత్రహింసలు పెట్టారు. జైలు పాలు గావించారు. వారికి వుద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. విదేశాలలో తలదాచుకున్నవారిలో వేలమంది ఇప్పటికీ స్వదేశానికి రాలేదు.

   ఇంతవరకు అసలు ఈ దుర్మార్గం గురించి మాట్లాడటానికి, చర్చించటానికి అనుమతించని ఇండోనేషియా ప్రభుత్వం ఏకంగా తానే గతవారంలో ఒక సెమినార్‌ను ఏర్పాటు చేసింది. వాస్తవాల వెల్లడికి ప్రభుత్వం పూనుకుంటుందన్న ఆశాభావం కొందరు వెల్లడిస్తే, ఈ సమస్య గురించి భవిష్యత్‌లో ఎవరూ మాట్లాడకుండా దీనికి ముగింపు పలికేందుకే ఈ తతంగం నడిపిందని భావించేవారు కూడా వున్నారు.ఈ వూచకోతపై నేర విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన నివేదికను ప్రస్తుతం ప్రభుత్వం తిరస్కరించి పక్కన బెట్టటమే దీనికి మూలం. సమాచారం సేకరించి ప్రభుత్వం ఏమి చేయనుందని అనేక హక్కుల బృందాలు సందేహిస్తున్నాయి. అన్నింటికీ మించి ఎవరైనా సాక్ష్యాలు చెప్పటానికి ముందుకు వస్తే వారికి రక్షణ, వేధించకుండా హామీ ఏమిటన్నది కీలకమైన సమస్య.

   ప్రపంచానికంతటికీ మానవ హక్కుల గురించి సుద్దులు చెప్పే అమెరికా ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత గురించి తన వద్ద వున్న వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తోంది. ఇండోనేషియా స్వాతంత్య్ర వుద్యమనేత, జాతిపితగా పరిగణించబడే సుకర్ణో కమ్యూనిస్టుల పట్ల సానుకూల వైఖరితో వుండేవారు.ఈ పూర్వరంగంలో 30లక్షల మంది సభ్యులను కలిగి వున్న కమ్యూనిస్టు పార్టీ ఆయనకు బాసటగా వుండేది. ఈ పూర్వరంగంలోనే 1963లో సిఐఏ సలహాదారు అమెరికాను హెచ్చరించాడు.’ కమ్యూనిస్టుపార్టీని ఇలాగే కొనసాగనిస్తే ఆగ్నేయాసియాలో చట్టబద్దంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇండోనేషియాలో ఏర్పడే అవకాశం వుందని’ పేర్కొన్నాడు. అది జరిగిన రెండు సంవత్సరాల తరువాతే మిలిటరీ నాయకత్వంలో వూచ జరిగింది. అనేక దేశాలకు సంబంధించి తన వద్ద వున్న సమాచారాన్ని 30 సంవత్సరాల తరువాత బహిరంగ పరచటాన్ని ఒక విధానంగా అమెరికా పాటిస్తోంది.అయితే ఇండోనేషియా విషయంలో మాత్రం ఆ పని చేసేందుకు నిరాకరించటం గమనించాల్సిన అంశం. ఈ దారుణంలో అమెరికా అధికారుల ప్రమేయం వుందని వెల్లడైన కొన్ని ప్రాధమిక పత్రాలు వెల్లడించటమే దీనికి కారణం.

     సహజ సంపదలు, రబ్బరు తోటలకు ప్రసిద్ధి చెందిన కారణంగా 1940 దశకం నుంచీ అమెరికన్లు ఇండోనేషియాపై కన్ను వేశారు. 1958లో సుకర్ణో ప్రభుత్వంపై జరిగిన విఫల కుట్రకు అమెరికా ఆర్ధిక సాయం చేసింది. దాంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా ఆర్ధిక ఆంక్షలకు పాల్పడింది. 1965 కుట్రకు ముందు అమెరికా విదేశాంగశాఖ అధికారులు పార్లమెంటరీ కమిటీ ముందు మాట్లాడుతూ సుకర్నో రంగం నుంచి తప్పుకుంటే మిలిటరీ ఆ స్ధానాన్ని భర్తీ చేస్తుందని అందువలన అమెరికా తన తలపులను తెరిచి వుంచాలని చెప్పారు. ముందస్తుగా వేసుకున్న పధకంలో భాగంగా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా గూఢచార సంస్థలు కట్టుకధలను ప్రచారంలో పెట్టాయి. మిలిటరీ జనరల్స్‌ను హత్య చేసేందుకు, చైనా నుంచి ఆయుధాలను సేకరించేందుకు, ముస్లిం మత నేతలను హతమార్చేందుకు కమ్యూనిస్టు పార్టీ పధకం వేసిందన్న కధనాలను ప్రచారంలో పెట్టాయి.

    వూచకోత తరువాత తనకేమీ సంబంధం లేనట్లు అమెరికా మౌనం పాటించింది.కొద్ది నెలల తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో జేమ్స్‌ రెస్టన్‌ అనే వ్యాఖ్యాత ‘ ఇండోనేషియాలో తిరుగుబాటు వెనుక తాను వున్నట్లు చెప్పుకోకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించింది. అయితే దీనర్ధం వాషింగ్టన్‌కు దీనితో ఏ సంబంధమూ లేదని కాదు’ అని పేర్కొన్నారు. వూచకోతకు ముందుగా చేసిన ప్రచారంలో పేర్కొన్న అంశాలనే మిలిటరీ జనరల్‌ సుహార్తో కూడా ప్రచారంలో పెట్టి కమ్యూనిస్టులపైకి ముస్లింలను వుసిగొల్పాడు. ఇదే విషయాన్ని ఆనాడు ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా వున్న మార్షల్‌ గ్రీన్‌ తన వర్తమానాలలో తెలియ చేశాడు. తిరుగుబాటుదార్లకు ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం చేయాలని కూడా పేర్కొన్నాడు.ఈ తిరుగుబాటులో కమ్యూనిస్టులు, చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ప్రచార విభాగాలను రంగంలోకి దించాలని కూడా సూచించాడు. వియత్నాంలో గ్రామ పెద్దలను మట్టుపెట్టి కమ్యూనిస్టులపై నెపం మోపిన పద్దతులలో ఇండోనేషియాలో జనరల్స్‌, మత పెద్దల విషయంలోనూ కమ్యూనిస్టులపై ప్రచారం చేయాలని సూచించాడు. తమతో సంబంధాలలో వున్న మిలిటరీ, ఇస్లామిక్‌ నేతలతో రాయబార కార్యాలయం వ్యూహం గురించి చర్చలు జరిపిందని, ముస్లిం దళాల సాయంతో మిలిటరీ పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టులను అరెస్టు చేసి హతమార్చిందని పేర్కొన్నాడు.

      1965 డిసెంబరులో టైమ్‌ పత్రిక వూచకోత గురించి తన వార్తలో ఇలా పేర్కొన్నది.’ వేలాది మంది కమ్యూనిస్టులు, ఎరుపు సానుభూతి పరులు, వారి కుటుంబాలను వూచకోశారు. మారు మూల జైళ్లలో వేలాది కమ్యూనిస్టు కుటుంబాలను ప్రశ్నించి బాక్‌లాండ్స్‌ సైనిక యూనిట్లు వురి తీసినట్లు తెలుస్తోంది. రాత్రి పూట కమ్యూనిస్టుల ఇండ్లకు ముస్లిం పట్టీలను గుర్తులుగా వేలాడదీసిి ‘పరాంగ్స్‌’ అని పిలిచే పదునైన త్తులతో మొత్తం కుటుంబాలన్నింటినీ పొడిచి చంపి శవాలను లోతైన గోతులలో పూడ్చి పెట్టారు. తూర్పు జావా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో హత్యాకాండ బహిరంగంగా సాగింది. కమ్యూనిస్టులుగా భావించిన వారిని పట్టుకొని వారి నుదుళ్లకు పట్టీలు పెట్టి వారిని పొడవైన స్ధంభాలకు కట్టి గ్రామాలలో వూరేగించి తరువాత చంపివేశారు. తూర్పు జావా, సుమత్రా వుత్తర ప్రాంతంలో ఎంత భారీగా హత్యలు జరిగాయంటే పూడ్చిన శవాలు కుళ్లిపోయి, దుర్వాసనలతో తీవ్రమైన పారిశుధ్య సమస్యలు తలెత్తాయి.ఆ ప్రాంత నదులు, వాగులు వంకలన్నీ శవాలతో నిండిపోయాయి. అనేక చోట్ల నదులలో ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని ప్రయాణీకులు తెలిపారు.’

    1966 ఫిబ్రవరి నాటికి కనీసంగా నాలుగు లక్షలమందిని హతమార్చినట్లు అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది. అంటే హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబు వేసినపుడు మరణించిన వారి కంటే ఎక్కువ.’ఇక్కడి (అమెరికా ) నుంచి రహస్యంగా పరోక్ష సాయం లేకుండా ఇది జరిగి వుండేది కాదు’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో జేమ్స్‌ రెస్టన్‌ వ్యాఖ్యానించారు. 1960 దశకంలో ఇండోనేషియాతో అమెరికా సంబంధాల గురించి చరిత్రకారుడు బ్రాడ్లే సింప్సన్‌ 2008లో వెల్లడించిన తన అధ్యయనంలో సిఐఏ రికార్డులలో బయటకు వచ్చినవి చాలా తక్కువని, అంతకంటే చాలా ఎక్కువగా సిఐఏ రహస్య కార్యకలాపాలు వున్నట్లు వీటిని బట్టి చెప్పవచ్చని పేర్కొన్నాడు. ఇరవయ్యవ శతాబ్దంలో అత్యంత దుర్మార్గమైన రాక్షస కాండలలో ఒకటిగా పరిగణించబడే ఇండోనేషియా వుదంతాలలో అమెరికా ప్రత్యక్ష, ప్రరోక్ష ప్రమేయం ఎంత వుందో వెల్లడి కావాలంటే వారి దగ్గర వున్న పత్రాలన్నింటినీ బయట పెడితే తప్ప మరొక మార్గం లేదు. అమెరికాపై ఇండోనేషియా సర్కార్‌ ఆమేరకు వత్తిడి తెస్తుందా, తన పాత్రను బయటకు రాకుండా చేసేందుకు వాటిని అమెరికా భూస్తాపితం చేస్తుందా ?