Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

   మూడు ఆకర్షణలు-ఆరు ఫిరాయింపులుగా లాహిరి లాహిరిలో ఓ హో జగ(నే)మే వూగెనుగా వూగెనుగా అంటూ ఆనందంతో తేలియాడుతున్నపుడు అంతరాయం కలిగిస్తే ఎవరికైనా ఎలా వుంటుంది? వున్న రెండు కళ్లలో ఒకదానిని పొడుస్తున్నా ఎంతో సహనంగా అదీ మనమంచికే అన్నట్లు ,తాపీగా కుమారుడు లోకేష్‌కు అధికార పదవిని ఎలా, ఎపుడు కట్టబెట్టాలా అని చూస్తున్న చంద్రబాబుకు మధ్యలో అంతరాయం కలిగిస్తే చిరుకోపం కూడా రాకుండా వుంటుందా ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి రాష్ట్రహోదా గురించి మరిచి పొమ్మని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టం చేసిన తరువాత ‘ ఏ మాటలవి ‘ అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటూ తమలపాకుతో చంద్రబాబు నాయుడు చిరుకోపం ప్రకటించారు. మామ వాగ్దానం నెరవేర్చనందుకు కాదు, తోడల్లుడు కిసుక్కు మన్నందుకు అన్నట్లు ఇంతకాలం ఏమీ చేయకపోగా దాని గురించి మరిచిపోండి అన్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వదలి కేసుల కోసం తప్ప ఏనాడైనా జగన్‌ రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లారా అని చంద్రబాబు ఆగ్రహించారు. జగన్‌ తన కేసుల కోసమే తిరుగుతున్నారనుకుందాం. అందులో తప్పేముంది? కేంద్రంలో వున్న చంద్రబాబు మిత్ర పక్షం, స్వయంగా తెలుగు దేశం మంత్రులు కాబినెట్‌లో వున్నారు. అందువలన జగన్‌ ఢిల్లీ వచ్చి తన కేసుల గురించి ఏం పైరవీలు చేసుకుంటున్నారో, వాటిని తామెలా ఎదుర్కొంటున్నారో చెబితే వుపయోగం. కేవలం తిరుగుతున్నారంటే అర్ధం లేదు.

      నిజమే చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పినట్లు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే 30 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రంపై అదనపు భారం మోపే దారి ఖర్చులు దండగతప్ప అదనంగా సాధించిందేమిటి అన్నది అసలు ప్రశ్న. పదహారు వేల కోట్ల రూపాయల లోటుకు కేవలం 2,800 కోట్లు మాత్రమే కేంద్రం సాయంగా అందించిందని చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంటే ఆ మిగతా మొత్తం కూడా రాదన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి అలా పదే పదే ఢిల్లీ తిరగటం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాట్టు పెట్టిన గత పాలకులు, పాలనను గుర్తు చేయటం లేదా ?వారికీ వీరికీ వున్న తేడా ఏమిటి ? తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్‌ష్‌ గానీ వీటికి సమాధానాలు చెప్పాలి. అలాగాకుండా రోజంతా జగన్‌ భజన చేస్తూ వుంటే సామాన్య జనానికే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు కూడా విసుగు పుడుతుంది. 1978లో జనతా పార్టీ ఎంఎల్‌ఏలను కాంగ్రెస్‌ పూర్తిగా తనలో చేర్చుకున్నట్లుగా మరికొద్ది రోజుల్లో మిగిలిన వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఏలను కూడా ‘అభివృద్ధి’ ముసుగులో తెలుగుదేశంలోకి ఆకర్షిస్తారు.ఆ తరువాత చెప్పుకోవటానికి ఏమీ వుండదు.

    రాష్ట్ర తాత్కాలిక రాజధాని నిర్మాణంలో ఇటుక ఇటుకనూ పేరుస్తూ నిమగ్నమైన చంద్రబాబుకు కేంద్రంపై ఆగ్రహం కలిగించటానికి తప్పితే తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ప్రయివేటు బిల్లుపెట్టటం ఏమిటి ? పెట్టెను పో దాని మీద చర్చ జరగనీయటం ఏమిటి? జరిగెను పో ఆంధ్రకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేరుస్తుంది, కావాలంటే ఇంకా అదనంగా కూడా ఏం కావాలంటే అది చేస్తాం అని లాలీపప్‌ సమాధానం చెప్పటం గాక వాటి గురించి మరిచి పోండి అని కేంద్ర మంత్రి కట్టెవిరిచినట్లు మాట్లాడటం ఏమిటి ? మోడీ బాబా నోరు విప్పకుండా శిష్యులతో ఇలాంటి ప్రకటనలు చేయించటం కావాలని చంద్రబాబుకు ఇబ్బంది కలిగించటం కాదా ?

   తానొవ్వ, ఇతరులను నొప్పించక సజావుగా సాగిపోవాలనుకుంటున్న తనకు మధ్య మధ్యలో తలనొప్పి కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడికి తీయని కోపం వస్తోందా? అది శ్రీకృష్ణుడి మీద సత్యభామకు వచ్చినటువంటిదేనా ? తాను ఏం చెప్పినా, ఏం చేసినా ప్రశ్నించేవారు వుండకూడదు, అలా వుండాలంటే చంద్రబాబుకు ప్రతిపక్షం లేకుండా పోవాలి, అది జరగాలంటే అన్ని పార్టీల వారూ తన పార్టీలో చేరి నోర్మూసుకోవాలి.అందుకే ఇతర పార్టీల వారికి గాలం.లొంగని వామపక్ష పార్టీల వారిపై కేసులు, దమనకాండ, దాడులు.

    ప్రత్యేక రాష్ట్ర హోదా చర్చ తలెత్తినపుడల్లా ఇబ్బంది పడుతున్నవారిలో చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ ఒకరు. కాంగ్రెస్‌ మాదిరి తప్పు చేయవద్దని బిజెపికి సలహా ఇస్తూ ట్వీటర్‌లో తన అభిప్రాయం వెల్లడించారు. బిజెపిలో చేరిన కామెడీ హీరో శివాజీ వంటి వారికి కూడా కోపం వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడికీ తెలిసినంతగా మరొకరికెవ్వరికీ తెలియదు.

    ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా పొందాలంటే అందుకు ఎలాంటి పరిస్థితులు వుండాలో అసలు ప్రత్యేక రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశం ఎజండాలో లేక ముందే నిర్ణయించారు. అననుకూల పరిస్ధితులు వున్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించి, పన్నుల రాయితీలు కల్పించాలని ఐదవ ఆర్ధిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు 1969తో జమ్ము-కాశ్మీర్‌, అస్సాం, నాగాలండ్‌ను ఈ తరగతిలో చేర్చారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, మణిపూర్‌, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, హిమచల ప్రదేశ్‌, వుత్తరా ఖండ్‌కు కూడా దానిని వర్తింప చేశారు. 1. కొండలూ,లోయలతో సంచరించటానికి కష్టంగా వుండే ప్రాంతాలు, 2. జనాభా సాంద్రత తక్కువ లేదా గణనీయ సంఖ్యలో గిరిజనులు వుండటం, 3. పొరుగు దేశాల సరిహద్దులతో వుండి వ్యూహాత్మక ప్రాంతాలలో వుండటం, 4.ఆర్ధిక, మౌలిక వసతుల విషయంలో వెనుకబడి వుండటం, 5. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు గిట్టుబాటు కాకపోవటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డిసి) ఆమోదం మేరకు ఈ హోదా కల్పిస్తారు.

    ఈ హోదాను పొందిన రాష్ట్రాలకు నిధులు ఎలా కేటాయించాలన్నదానిపై కూడా మార్గదర్శక సూత్రాలు వున్నాయి. ప్రణాళికా సంఘం సాయాన్ని మూడు తరగతులుగా విభజించింది. 1.సాధారణ కేంద్ర సాయం(ఎన్‌సిఏ), 2. అదనపు కేంద్ర సాయం(ఎసిఏ) 3.ప్రత్యేక కేంద్ర సాయం(ఎస్‌సిఏ). కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రాలకు కేటాయించే సాధారణ కేంద్ర సాయం 100 అనుకుంటే ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు 30, మిగతా వాటికి 70 అందచేస్తారు.ప్రత్యేక రాష్ట్రాలకు కేటాయించే నిధుల కేటాయింపునకు ప్రత్యేక నిబంధనలు వుంటాయి. సాధారణ సాయం ఈ రాష్ట్రాలకు 90శాతం గ్రాంటు, పదిశాతం రుణంగా వుంటుంది. అదే సాధారణ రాష్ట్రాలకు 30,70 శాతాలుగా వుంటుంది. సాధారణ రాష్ట్రాలకు కేటాయించే నిధులలో నిధులు 100 అనుకుంటే వాటిలో జనాభా మాషాకు 60, తలసరి ఆదాయాన్ని బట్టి 25, ఆర్ధిక వ్యవస్ధ పనితీరును బట్టి, ప్రత్యేక సమస్యలుంటే ఏడున్నర శాతం చొప్పున కేటాయిస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో ప్రత్యేక ప్రాతిపదికలేమీ లేవు. మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధులలో 2010-11 లెక్కల ప్రకారం సాధారణ కేంద్ర సాయం కేవలం ఐదుశాతం మాత్రమే వుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు, గిరిజన వుప ప్రణాళికలు, సరిహద్దు వుండేట్లయితే ఆ రాష్ట్రాలు ప్రత్యేక సాయం అందుకుంటాయి. ఈ సదుపాయాలు కాకుండా ఈ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయించిన విధంగా ఎక్సయిజ్‌, కస్టమ్స్‌, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను రాయితీలు పొందుతాయి. విదేశీ నిధులతో ఏర్పాటయ్యే పధకాలు, కేంద్ర ప్రభుత్వ పధకాల సాయం కూడా పొందుతాయి.

      నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రణాళికా సంఘం స్ధానంలో నీతి ఆయోగ్‌ వునికిలోకి వచ్చింది. అదింకా పూర్తిగా కుదుట పడలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తెలివిగా నీతి ఆయోగ్‌కు బాధ్యతను అప్పగించింది. అది ఇంకా పరిశీలిస్తూనే వుంది. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశ పెట్టిన సందర్బంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మౌఖికంగా హామీ ఇచ్చింది తప్ప ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని బిల్లులో చేర్చలేదు. దీనిని బిజెపి లేదా తెలుగు దేశం పార్టీలు అప్పుడు మౌనంగా వుండి ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నాయి. నిజానికి వాటికి చిత్త శుద్ధి వుంటే ఇప్పుడైనా విభజన చట్టానికి సవరణలు చేయవచ్చు. అయితే విభజన కారణంగా ప్రత్యేక హోదాలు కల్పించేట్లయితే అనేక కొత్త సమస్యలు వస్తాయి. వాటితో నిమిత్తం లేకుండానే ఒడిషా వంటి రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కల్పించమని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాయి. నిజానికి ఈ విషయాలు విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్‌, బిజెపిల పెద్దలతో పాటు తెలుగు దేశం నేతలకు కూడా తెలియనివి కావు. అప్పుడు మాకు తెలియ లేదన్నా లేదా తెలుసన్నా జనంలో అభాసుపాలు కావాల్సి వస్తుంది కనుక రాజకీయంగా కాంగ్రెస్‌ మీద నెపం వేస్తున్నారు. దానికి వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితి. తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది తామే అనుకున్నా ఇక్కడా జనం ఓడించారు, రాష్ట్రాన్ని చీల్చారనే కోపంతో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దానికి శాసనసభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్‌ జనాన్ని ఈ పార్టీలన్నీ బకరాలుగా చేసి వాడుకున్నాయి, ఇప్పుడు రాజకీయంతో ఆడుకుంటున్నాయి.