Tags

, , , ,

ఎంకెఆర్‌

   మానవాళి చరిత్ర సమస్తం పోరాటాల మయం. తన మనుగడ కోసమే మానవుడు కొన్ని లక్షల సంవత్సరాలు పోరాడి ప్రకృతిలోని అనేక అంశాలను తన అదుపు లోకి తెచ్చుకోగలిగాడు. ఈ విజయం వెనుక ఎన్ని ప్రాణాలు బలయ్యాయో, ఎంత రక్తం ఏరులై పారిందో ఎవరు చెప్పగలరు ! చరిత్ర ముందుకు తప్ప వెనక్కు నడవదని తెలిసినా, ప్రత్యక్షంగా కనిపిస్తున్నా వెనక్కు నడిపించాలని చూసే శక్తులు ప్రతి తరంలోనూ వుద్భవిస్తూనే వుంటాయి. పురోగమన వాదులను భౌతికంగా అంతం చేస్తే, వారు నిర్మించిన సమాజాలు, వ్యవస్థలను కూల్చివేస్తే , వారి భావాలు, వ్యవస్థలూ కూడా నాశనం అవుతాయని అలాంటి శక్తులు విశ్వసిస్తాయి. అందుకే దాడులకు పూనుకుంటాయి. భౌతికంగా వారిని సహించినా భావ పోరాటంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి.

   ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం నిరంతరం తమను వ్యతిరేకించే శక్తులను అణచివేసేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో దోపిడీకి గురయ్యే వర్గం తనను తాను విముక్తి చేసుకొనేందుకు నిరంతరం పోరాడుతుంది. పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన పెట్టుబడిదారీ వర్గం సోషలిజం, కమ్యూనిజాలపై తిరుగులేని అంతిమ విజయం సాధించామని ప్రకటించుకొని పాతిక సంవత్సరాలు దాటింది. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా వున్నాయి? అక్కడి పరిణామాల గురించి ఎవరేమంటున్నారు ?

   ‘ అధికారం కోసం ప్రయత్నించే సమయం వచ్చిందంటున్న రష్యా యువ కమ్యూనిస్టులు ‘అనే శీర్షికతో ఏప్రిల్‌ చివరి వారంలో అమెరికా నుంచి వెలువుడే ‘క్రిస్టియన్‌ సైన్స్‌ మానిటర్‌ ‘ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఆర్ధిక సంక్షోభ ప్రభావం, ప్రభుత్వ ఆస్థులన్నింటినీ విక్రయించే పాలక పెద్దల ఆప్తుల ఆధిపత్యాన్ని సహించలేని కమ్యూనిస్టు పార్టీ యువ సభ్యులు పుటినిజానికి తాము ప్రత్యామ్నాయాన్ని చూపుతామని చెబుతున్నారు అని పేర్కొన్నది.ఆ పత్రిక వార్త సారాంశం ఇలా వుంది.’ సోవియట్‌ జీవితం గురించి ఎలాంటి జ్ఞాపకాలు లేని అతి చిన్న వయస్కుడు నికితా పొపొవ్‌. రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్‌, ఇంటర్నెట్‌ న్యూస్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఇతగాడు తాను పుట్టిన సమయానికి అంతరించి పోయిన కమ్యూనిస్టు వ్యవస్ధ రష్యా భవిష్యత్‌కు కీలకమని భావిస్తున్నాడు. అతనొక్కడే కాదు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయినపుడు ఏర్పడిన ఆశలన్నీ కుప్పకూలటంతో పెద్ద సంఖ్యలో యువకులు మరియు బాగా చదువుకున్న నూతన కార్యకర్తలు రష్యాలోని కమ్యూనిస్టుపార్టీలోకి తరలుతున్నారు. దాని రూపం, అవకాశాల పునరుద్ధరణను ప్రారంభించారు.కళ్ల ముందున్న సెప్టెంబరు పార్లమెంటరీ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అవకాశాలు పెరుగుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత రెండు ఎన్నికలలో పార్టీ తన ఓటింగ్‌ను 12 నుంచి 20శాతానికి పెంచుకుంది. ఈ సారి కూడా పెద్ద విజయాలు సాధించనుంది.’చరిత్ర, వుమ్మడి స్వభావం రీత్యా రష్యన్లు వామపక్షం వైపు మొగ్గుతారు. జనం నానాటికీ మరింత పేదలు అవుతున్నారు. లాభాలను కొద్ది మందిగా వున్న అధ్యక్షుడి స్నేహితులు పొందుతున్నారు. ప్రతి ఏడాదీ పుతిన్‌ టీవీలలో ప్రసారం చేసే నగర వేదికల మీద అన్ని సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలుకుతారు. అది కేవలం నాటకం మాత్రమే. వాస్తవానికి సామాజిక సంక్షేమానికి కోత పెడుతున్నారు, జనాన్ని దరిద్రులుగా మార్చుతున్నారు.ఇప్పుడో తరువాతో ఏదో బద్దలు కాబోతోంది. నా వరకైతే 1917 తరహా విప్లవానికి సిద్ధంగా వున్నాను.’ అని పొపోవ్‌ చెప్పాడు.

   రష్యాలో కమ్యూనిస్టు పార్టీ రెండవ పెద్ద పార్టీ. వంద మంది ఎంపీలు వున్నారు. పార్టీలోని మొత్తం లక్షా 60వేల సభ్యులలో 40శాతం మంది 35 ఏండ్ల లోపువారేనని యువజన విధాన విభాగపు నేత యరస్లోవ్‌ లిస్టోవ్‌ చెప్పారు. ‘ నేను వాస్తవానికి పశ్చిమ దేశాల సాహిత్యం ఫ్రాయిడ్‌, ఫ్రోమ్‌, మార్కస్‌ వంటి వారి రచనలు చదవటం ద్వారానే కమ్యూనిస్టుపార్టీలోకి వచ్చాను. ఇంకా ఎక్కువగా చదవాలనుకుంటున్నాను. ఈ పార్టీలో వున్న వారు ఈ అంశాల గురించి ఎంతో వుత్సాహంగా వుండటాన్ని నేను కనుగొన్నాను. వీరంతా నా కామ్రేడ్స్‌, మేము సంగీతం, నాటకాలు, సినిమాలు, విప్లవ రాజకీయాలు, ఏం జరుగుతోందో వాటన్నింటి గురించీ మాట్లాడుకుంటాం. మేము భావపరంగా ఒక్కటే, ముందుకు వెళ్లటం గురిచి మార్గం వెతుకుతున్నాం. మా దృష్టిలో విప్లవం అంటే ఒక నేత బదులు మరొక నేత రావటం కాదు, ప్రజల భాగస్వామ్యంలో సామాజిక మార్పు, ఆ క్రమంలో ఎన్నికలలో పాల్గొనటం ఒక అంశం మాత్రమే ‘ అని న్యాయ శాస్త్ర విద్యార్ధి కానస్టాంటిన్‌ కోపెలోవ్‌ చెప్పాడు.

     ‘ ఒక సారి రష్యాను సూపర్‌ పవర్‌ స్ధాయికి తీసుకు వెళ్లిన వంద సంవత్సరాల పార్టీని తేలికగా తోసి పుచ్చటం కష్టం. అన్ని శక్తులూ దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ తిరిగి పుంజుకుంటున్నది.పరిస్థితులు ఎంత దిగజారాయో ఇక్కడ మాస్కోలో తెలుసుకోవటం కష్టం. నేను ఒక గనులున్న ప్రాంతంలోని పట్టణం నుంచి వచ్చాను. అత్యధిక గనులు, ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. ప్రస్తుతం అధికారంలో వున్నవారు అవినీతి పరులని, వారు జనాన్ని పట్టించుకోరని ప్రజలకు తెలుసు. బతికి బట్టకట్టటం ఎలా అన్న స్థితిలో అత్యధిక రష్యన్లు వున్నారు. తరువాత జరిగేది రాజకీయ సమీకరణే. కమ్యూనిస్టుపార్టీ వైపుగాక జనం మరోవైపు ఎలా వెళతారు ‘ అని మాస్కో స్టేట్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధి గ్రెగరీ అఝోగిన్‌ వ్యాఖ్యానించారు.

    కమ్యూనిస్టు పార్టీ స్ధానంలో తనకు పూర్తి విధేయురాలిగా వుండే ఫెయిర్‌ రష్యా పార్టీని తయారు చేయాలని పది సంవత్సరాల క్రితం రష్యా పాలకవర్గం ప్రయత్నించింది. అయితే అది ఎన్నికలలో విజయం సాధించలేదు. కమ్యూనిస్టుల వైపు జనం మరల కుండా వుండేందుకు కనీస వేతనం, పెన్షన్ల పెంపుదల వంటి చర్యలను తీసుకుంది. ఇతర ఐరోపా కమ్యూనిస్టు పార్టీల మాదిరి రష్యన్‌ కమ్యూనిస్టులు పూర్తిగా పార్లమెంటేరియనిజానికి అంటుకుపోలేదు. సోషలిజానికి తిరిగి రష్యా రావాలంటే సామాజిక విప్లవం అవసరం అని భావిస్తున్నది.ఈ విషయంలో వృద్ధతరం కంటే యువతరం కమ్యూనిస్టులు మరింత గట్టిగా వున్నారు.’ అని క్రిస్టియన్స్‌ సైన్స్‌ మానిటర్‌ పత్రిక పేర్కొన్నది.