Tags

, , , , , ,

బాబు గారూ మీరు మెతక మనిషని ఎవరన్నారు ?

      చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో అపర చాణుక్యుడు, సర్దార్‌ పటేల్‌ కంటే గట్టి పిండం, గ్రీకు వీరుడు హెర్క్యులస్‌ను మించిన బలశాలి అనుకుంటున్న మీ అభిమానులను ఒక్కసారిగా నాగలోకం నుంచి నక్కల మధ్య పడేశారు. సందేహ సముద్రంలో ముంచేశారు. నేను మెతక మనిషినేం కాదు, ధృడచిత్తంతో వున్నాను అని స్వయంగా మీరు చెప్పటంతో మా చిత్తాలు చిత్తడి అయిపోతున్నాయి. బాబు గారూ అసలు మీరు మెతక మనిషని ఎవరన్నారు ? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారు ? వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పోటీ పడి వస్తున్నా మీ కోసం పేరుతో మీరు చేసిన పాదయాత్ర మెతక మనుషులకు సాధ్యమా ? బిజెపి, నరేంద్రమోడీ పట్ల ఒకసారి కఠినంగా మరోసారి మెతకగా వున్నట్లు మీపై విమర్శలు వస్తే వచ్చి వుండవచ్చుగాక, అవి రాజకీయాలు, నిరంతరం మీరు కలలు కనే రాష్ట్రం కోసం తప్ప మీ మెతక తనానికి నిదర్శనాలు ఎలా అవుతాయి ? మామ అని కూడా చూడకుండా ఎన్‌టి రామారావు పట్ల కూడా ఎంత కఠినంగా వ్యవహరించారో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన మాకు మీరు మెతక మనుషులని అనుకోవటానికే ఏదోగా వుంది.

    అసలు మీకు ఏమైంది ? మీరు ఏనుగు వంటి వారు. ఒక వేళ ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ ప్రత్యర్ధులు మీ వెనుక ఏదో అంటే మిమ్మల్ని సమర్ధించటంలో మీ మంత్రులు సరిగా వ్యవహరించనందుకు మందలించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి గానీ మా వంటి అభిమానులు ఎక్కడైనా తగ్గినట్లు విన్నారా? మేం ఎన్నడైనా అంగీకరించామా? లేదే ! అటువంటిది నేను మెతక మనిషిని కాదు అని బేలగా, జాలిగా మీరు అనటం ఏమిటి బాబూ ! మేం ఏం కావాలి ? కష్టపడటం నా తప్పా అని మీరు అంటుంటే చివరికి మనప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌సిపికి, జగన్‌కు సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదురా బాబూ అన్నట్లు మా కడుపు తరుక్కు పోతోంది.

   మిమ్మల్ని (మనల్ని )నమ్ముకొని అనేక మంది తమ నియోజకవర్గాలను కూడా తెల్లారేసరికి సింగపూరో, మలేషియానో, జపానో, అమెరికాగానో మార్చేద్దామనే కదా వైసిపినుంచి ఎంఎల్‌సీలు, ఎంఎల్‌ఏలు, కాంగ్రెస్‌ నుంచి గాదె వెంకట రెడ్డి వంటి నేతలు సైతం పార్టీకిలోకి ప్రవాహాలుగా వస్తున్నారు.నేను మెతక మనిషిని కాదు అన్న మాట ఏ వుద్ధేశ్యంతో అన్నారో గానీ లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య సామెతను గుర్తుకు తెస్తోందని ప్రతిపక్ష పార్టీల వారు అంటుంటే అటు కాదనలేక ఇటు అవుననలేక మేం మెత్తపడక పడక తప్పటం లేదు. రెండు సంవత్సరాలు చూశాం కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించటం తప్ప రాష్ట్రానికి ఏం పనులు జరిగాయి, ఏం పీకారు అంటుంటే వెర్రి మొహాలు వేసుకొని ఇంకా ఎంతకాలం సమర్ధించాలో అర్ధం కావటం లేదు. దీనికి తోడు పార్టీ అధికారానికి వస్తే గడ్డ పెరుగు ముక్కల మాదిరి తిందామని అనుకుంటుంటే ఎదుటి పార్టీల నుంచి ఎందరు వస్తే అంత మందినీ కలుపుకోండని, అంతా మనమంచికే అని చెబుతున్నారు. మీకేం బాబూ ! మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. గత ఎన్నికలలో ఎంత ఖర్చు చేశామో మీకు తెలియనిది కాదు. ఇది ఎప్పుడూ వుండేదే . కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి, ఎన్నికల సమయంలో వున్న కార్యకర్తల కంటే తరువాత ఫిరాయించిన వారు ముద్దు , ఓడమల్లయ్య బోడి మల్లయ్య వంటి ఈ విషయాల గురించి తరువాత మరోసారి విన్నవించుకుంటా.

    మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి ప్రధానికి సరైన సమాచారం అందుతోందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు చదివాం. బాబు గారూ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీరు బాగానే చేస్తున్నా మంత్రులు, అధికారులు సక్రమంగా లేరని మన శ్రేయోభిలాషుల మాదిరి వుండే కొందరు జర్నలిస్టులు రాసిందానిని నిజమే అని గతంలో నమ్మారని ఇప్పుడూ అనుకుంటున్నారని వింటున్నాం. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే అదే జర్నలిస్టులు ఇటు మిమ్మల్ని, అటు కేంద్రంలో అంతకంటే ప్రధాన మంత్రిని ఎక్కువగా సమర్ధిస్తున్నారు. అందువలన కేంద్ర అధికారులు ప్రధానికి సరిగా తెలియచేయటం లేదనే పాట మీ కోసం కాదేమో చూడండి. లేక ప్రధాని మీద మాట పడకుండా మిమ్మల్ని ‘సంతృప్తి ‘ పరుస్తున్నారా? బిజెపికి సంతృప్తి రాజకీయాలు గిట్టవని తెలుసు కదా ! జర జాగ్రత్త, జనం నమ్మేట్లు లేరు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్ర మనోగతం ఏమిటో అర్ధం కావటం లేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా లేక సమస్య తీవ్రత తెలియక పట్టించుకోవటం లేదా అన్నది అర్ధం చేసుకోలేకపోతున్నాం. వెళ్లి కలిసినపుడు బాగా మాట్లాడుతున్నారు, కాని ఫలితం రావటం లేదు అన్నారు.

   ముందు మన శాసన మండలి, అసెంబ్లీ తీర్మానాలు చేయటమేనా, అసలు వాటిని మన అధికారులు కేంద్రానికి పంపారా ? అన్న అనుమానం కలుగుతోంది. మరి పంపితే వాటికి వచ్చిన సమాధానాలు ఏమిటి , మన మంత్రులు, ఎంపీలు కలిసినపుడు ఏం చెప్పారు. మన అధికారులు వచ్చిన వర్తమానాలను పూర్తిగా చూపటం లేదా అన్న సందేహం తలెత్తుతోంది. పార్లమెంట్‌లో సమాధానాలు, ఇతర లోగుట్టు కధనాల పేరుతో రాసిన వార్తలు తప్ప మాకు నిజం తెలియటం లేదు. రాష్ట్రం పంపిన తీర్మానాలేమిటి ? వాటికి కేంద్రం నుంచి వస్తున్న సమాధానాలు ఏమిటో అధికారికంగా తెలియచేస్తే అభిమానులం మేం కూడా ఒక పట్టు పడతాం కదా? అదేం వుండటం లేదు. అసలూ మనకు కేంద్రంలో ఇద్దరు మంత్రులు, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా వున్నారు. వారు రోజూ కేంద్రంతో సంప్రదించవచ్చు. మరి వారేమి చేస్తున్నట్లు ? మీరు అనేక సార్లు ప్రధాన మంత్రిని కలిశారు. మీకేమో గుజరాతీ, హిందీ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. అందువలన అసలు మీరు ఏ భాషలో మాట్లాడుకున్నారు అన్న అనుమానం కలుగుతోంది. ఆవో బాబూ ఆవో మై హూనా కాఫీ, చాయ్‌ పానీ పీనేకే బాద్‌ తుమ్‌ ఏపి జావో, బాద్‌మే అచ్చే దిన్‌ ఆ రహా హయ్‌ అంటే మీరు మంచిగా మాట్లాడుతున్నట్లు అనుకుంటున్నారా ఏమిటి ? ఇలా అయితే మీరు మరో 30 సార్లు ఢిల్లీ వెళ్లినా ఇదే జరుగుతుందన్న నీరసం వస్తోంది మాకు. మీరు నిరాశగా మాట్లాడటం చూస్తుంటే ఏదో దాస్తున్నట్లు , చెప్పుకోలేని బాధ, కేంద్రంలో మీకు అవమానం జరిగిందేమో అన్న అనుమాన బీజం మాలో పడింది.

    కేంద్రంలో వున్న మన వెంకయ్య నాయుడు గారేమో తాను రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఒక సమస్య పరిష్కారమో, కొత్త పధకమో తెస్తున్నట్లు చెబుతారు.ప్రధాని ఆయన ఎంత చెబితే అంత అంటారు. మీరేమో ప్రధాన మంత్రి దృష్టిపెడితే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయంటున్నారు.అంటే మీరు ప్రధాని దృష్టిని, కనీసం తోటి వెంకయ్య నాయుడి దృష్టిని సైతం ఆంధ్రప్రదేశ్‌పై మళ్లించటంలో రెండు సంవత్సరాలుగా విఫలమయినట్లేనా అన్న వూహనే తట్టుకోలేకపోతున్నాము.

    ఇంతవరకు జరిగిందానిని బట్టి, అనేక రాష్ట్రాలలో జరుగుతున్నదానిని బట్టి మన వంటి వారిపై ఆధారపడే కంటే స్వంతంగా బలపడాలని, అందుకు గాను వచ్చే ఎన్నికల నాటికి బిజెపిని మరింత బలపరుచుకోవాలన్నది మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది.ఎదుటి పార్టీ వారిని ఆకర్షించటం మాకూ చేతనవును అని అనేక రాష్ట్రాలలో చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు అర్ధం అయ్యేట్లు చేయాలని బిజెపి నేతలకు అర్ధం అయింది. ఈ విషయం మీకు అర్ధం అయినా మరొక దారి లేక బింకాలు పోతున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు.

    బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తున్నది అనే ప్రచారం క్రమంగా పెంచుతున్నారు. కేంద్రం సహకరించినా దానిని వినియోగించుకోవటంలో బాబు గారు విఫలమయ్యారు కనుక ఒక అవకాశం మాకే ఇవ్వండి అని వారు ముందుకు వస్తారా ? వస్తే మన పార్టీలో ఎందరు మిగులుతారు అన్నవి ప్రస్తుతానికి వూహా జనిత ప్రశ్నలే కావచ్చు కానీ, ప్రస్తుతం మన వంటి పార్టీల నేతలు డొల్లుపుచ్చకాయల వంటి వారు, ఎటైనా దొర్ల వచ్చు. ఇంతకు ముందు మన పార్టీలో కాంగ్రెస్‌ రక్తం ఎంత వ్యతిరేక రక్తం ఎంత అని కొలిచేవారు, ఇప్పుడు కాక్‌టెయిల్‌ మందు మాదిరి, ఏది ఎంతో తెలియటం లేదు.

   చివరగా ఒక్క మాట. అధికారంలో లేనపుడు అభిమానుల సూచనలు పట్టించుకుంటారని, అధికారం వచ్చిన తరువాత ఇతరుల మాటలు వింటారని మీ గురించి గిట్టని వారూ, గిట్టే వారు కూడా చెబుతుంటారు. ఈ సంవత్సరం కూడా నవ నిర్మాణ దీక్ష చేపడతామని ప్రకటించారు.ఏదో తొలి ఏడాది దీక్ష అంటే అర్ధం వుంది, ప్రతి ఏడాదీ దీక్షలేమిటంటే ఏం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు దీక్షలు చేయటం అంటే అర్ధం వుంది. అధికారంలో వున్నవారు దీక్షలు చేస్తే చాలా బాగోదు. బరువు తగ్గటానికైతే ఓకే. ప్రత్యేక తరగతి రాష్ట్ర హోదా, రైల్వే జోన్‌, లోటు బడ్జెట్‌ పూడ్చేందుకు సాయం వంటి వాటిపై దీక్ష చేస్తేనన్నా ప్రధాని రాష్ట్రం వైపు దృష్టి పెడతారేమో చూడండి బాబు గారూ.ప్రావిడెంట్‌ ఫండ్‌ వుపసంహరణ, వడ్డీ తగ్గింపుపై కార్మికుల తడాఖాను చూసిన తరువాతే ప్రధాని వాటిపై దృష్టి సారించారు.వెనక్కు తగ్గారు. కేసుపోయినా మన ప్లీడరు గట్టిగా వాదించాడు అని వచ్చే ఎన్నికలలో మేమంతా చెప్పుకోవటానికి దారులు వెతుక్కోవటం మంచిదేమో చూడండి మరి.

    వుంటా బాబూ ! రెండు సంవత్సరాల నుంచి మన రాష్ట్రం, మన అమరావతి , మన ఇటుకలు, మన మట్టి, మన నీరు అంటూ వుత్సాహంతో, వుద్వేగంతో ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మా వాడు జాబు గురించి హైదరాబాదో, బెంగలూరో పోవాలంటున్నాడు. దాని సంగతేదో చూడాల, మన అమరావతిలో జాబులు వచ్చినపుడు వాడిని ఇక్కడికే రప్పిస్తాలే, అప్పటి దాకా వుంచుకోలేకం కదా ! ఎంతైనా పెళ్లి కావాల్సిన పిల్లాడు కదా !

మీ అభిమాని

ఎం కోటేశ్వరరావు