Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

    పేరు మోసిన అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగి మరణించిన తరువాత కూడా సొమ్ము చేసుకొనేందుకు వెంటిలేటర్‌లు పెట్టి బంధువులను మోసం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా పరిస్థితి వుంది. తేడా ఏమంటే అక్కడ డబ్బు రాబట్టుకోవటం కోసం అయితే, ఇక్కడ జనం మద్దతు పోగొట్టుకోకుండా వుండటం కోసం. ప్రత్యేక హోదా ఇవ్వటం నిబంధనల రీత్యా సాధ్యం కాదని తెలిసినా నాడు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఐదు కాదు పది అంటూ పెద్ద రాయితీని రాబట్టినట్లు బిజెపి పెద్ద నాటకం ఆడింది. తీరా బిల్లు విషయానికి వచ్చే సరికి అటు కాంగ్రెస్‌ దానిని దానిలో చేర్చలేదు, ఇటు బిజెపి, తెలుగుదేశం పార్టీ కూడా నోరు మెదపలేదు.ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం మోపి తప్పుకొనేందుకు చూస్తున్నాయి. మొత్తం మీద రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు, ప్రత్యేక హోదా రాయితీల నాటకంతో బిజెపి, అందరూ కోరుతున్నారు, కలిసి వస్తున్నారు కదా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ వారు వారందరితో కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలియనంత అమాయకంగా ఈ పార్టీలలో తలలు పండిన పెద్దలు వున్నారా ?

     అటు కేంద్రం-ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న పార్టీలు రెండు సంవత్సరాల పాటు ఆశ పెట్టాయి. ఇంకెంత మాత్రమూ మోసం చేయలేవు.మరణించిన రోగిని వెంటిలేటర్‌పై పెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అసలు విషయం చెప్పదు, చేయాల్సిందంతా చేస్తున్నాం అని మాత్రమే చెబుతుంది. రోగి బతికి బట్ట కట్టే ఆశ చచ్చి, అంతకు మించి వెంటిలేటర్‌ ఖర్చు భరించలేక బంధువులకు ఏం చేయాలో తెలియదు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలానే వుంది.

    పార్లమెంట్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ సీనియర్‌ లాయర్‌ కనుక కేసు గెలుస్తామని గానీ ఓడిపోతామని గాని చెప్పకుండా నర్మగర్బంగా అసలు కేసే లేదు అని చెప్పేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు, ఇతరులు అందరితో మాట్లాడుతున్నా అని చెబుతున్నారు. ఆయన మాట్లాడటం లేదని ఎవరూ అనటం లేదు. దేన్ని గురించి, ఏం మాట్లాడుతున్నారో జనానికి తెలియాలి కదా? కనీసం ఆయనను వెన్నంటి వుండే లేదా మేనేజిమెంట్‌లో వుండే మీడియా కూడా లీకుల కధనాలు కూడా ఇవ్వకపోవటంతో వాటికి అలవాటు పడిన వారు మత్తుకు బానిసలైన వారు గంజాయి దొరక్క పోతే ఎలా విలవిల్లాడి పోతారో అలా జుట్టు పీక్కుంటున్నారు.

    గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు పరిస్థితి వేరు. కారణాలేమైనా కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు అలా కాదే. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడి మాదిరి మీడియా సంస్ధలు అటు కేంద్రంలోని బిజెపి- ఇటు రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ మధ్య వున్నాయి. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ నొప్పి లేదా రాజకీయంగా నష్టం జరగకుండా తమ ప్రావీణ్యాన్ని వుపయోగించి ఏం రాస్తాయో, ఎలా చూపుతాయో తెలియదు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల గడువు వుంది. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పుల్లుగా వాగ్దానాలు చేసి, రంగుల కలలను జనం ముందుంచారు. ఏ రంగంలో చూసినా ఎదురుగాలి తప్ప మరొకటి కనపడటం లేదు. గత ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో తనపై ఆధారపడే ప్రభుత్వం వుంటుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్యసభలో తనకు తగినంత బలం లేదు కనుక బిజెపి కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నది. మరొక మార్గం లేదు కనుక తెలుగుదేశం కూడా అధికారాన్ని పంచుకొని, తాను కూడా పంచి ఇచ్చింది.

    గత రెండు సంవత్సరాల అనుభవం చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది పిడికెడు మట్టి, ముంతెడు నీళ్లు అని అమరావతి శంకుస్ధాపన సభలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో శాశ్వత రాజధానిని పక్కన పెట్టి తాత్కాలిక రాజధానిని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేక తరగతి హోదా రాదని చంద్రబాబుకు ఎప్పుడో అవగతం అయినా దానిని అంగీకరిస్తే రాజకీయంగా నష్టం కనుక. సాధ్యమైన మేరకు దాని ప్రస్తావన, దానిపై ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారు.అసలు ప్రస్తావించకపోతే అదీ నష్టమే కను తద్దినం మాదిరి స్మరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర పెద్దలు గత ఏడాది కాలంగా పరోక్షంగా చెబుతూ లీకులను వదులుతూనే వున్నారు. ఇక లాభం లేదని గత వారంలో చిన్న మంత్రుల ద్వారా పెద్ద విషయాన్ని చెప్పించారు.

    ఈ పూర్వరంగంలో గత వారం రోజులుగా చంద్రబాబుకు పాలుపోవటం లేదు. స్పందన ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే రాజకీయంగా ఒంటరి పాటు కావటంతో పాటు కేంద్రం నుంచి ప్రతి రోజూ అధికారికంగా తలనొప్పులే. సఖ్యంగా వున్న ఇపుడే వుదయం సాయంత్రం ఢిల్లీ ప్రభువుల దర్శనం చేసుకున్నా ఫలితం వుండటం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో చూస్తే రాజకీయంగా కలసి వచ్చే స్నేహితులు కనిపించటం లేదు. గత ఎన్నికలలో తోడ్పడిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు వీలైతే నాలుగు మాటలు, కాఫీ, ఆశకు పిసినారి తనం ఎందుకన్నట్లు వీలైతే ముఖ్యమంత్రి పదవి కోసం దారి వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడపుడే కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి మార్గం అగమ్యగోచరం. వైఎస్‌ కుటుంబంతో వున్న ఆర్ధిక లావాదేవీలు పరిష్కారం కాని వారు అవి తేలేంత వరకు అదే పార్టీలో కొనసాగవచ్చు.ఆ బాదర బందీ లేనివారు, తెలుగు దేశం పార్టీతో సర్దుబాటుకు వచ్చిన వారు ఇప్పటికే ఫిరాయించారు, రానున్న రోజుల్లో మరికొందరు రావచ్చు.

    తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా అంత సజావుగా, వుత్సాహంతో, వుద్వేగంతో వురకలు వేసే పరిస్థితి వుండదు.కేంద్రంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు వున్నవారు దానితో వైరం తెచ్చుకొనేందుకు సుతరామూ అంగీకరించరు. రెండవది చంద్రబాబు నాయుడు అప్పుచేసి పప్పుకూడు అన్న పద్దతుల్లో రాజధాని అమరావతిని కూడా అప్పులతో నిర్మించేందుకు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఇంతవరకు ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అలా జరగలేదు.ఒక వేళ ఆ ప్రాంత భూములన్నీ తాకట్టు పెట్టి లేక భారీ రాయితీలు ఇచ్చో విదేశీ సంస్దల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. లక్షల వుద్యోగాలు సృష్టించలేకపోయినా కనీసం రాజధాని నిర్మాణం చేయకుండా వచ్చే ఎన్నికలలో ఓటర్ల ముందుకు పోలేరు. చంద్రబాబు మరొకసారి విశ్వసనీయత సమస్యను ఎదుర్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.

     ఈ పూర్వరంగంలో ఏదో ఒక దారి లేదా సాకు వెతుక్కొని బిజెపి, కేంద్రంతో సర్దుకు పోదాం లెండి అన్నట్లు ఎన్నికల ముందు వరకు లొంగి పోవటం ఒక మార్గం. చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు కనుక అప్పటి పరిస్థితిని బట్టి ఏదారి పట్టాలో నిర్ణయించుకోవటం ఒకటి.లేదూ తెగేదాకా లాగితే తెలుగు దేశం పార్టీ సంగతి తేల్చటానికి బిజెపి వెనుకాడదు. కాంగ్రెస్‌ బాటలోనే అది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వెనుకాడదు అని ఇప్పటికే రుజువు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఫిరాయింపు జనాలతో నిండి వుంది. అలాంటి వారికి మరొక జంప్‌ చేయటం కష్టం కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం.అది సాధ్యం కాదని తేలిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పటానికి ఎలాంటి జంకూ గొంకూ వుండదు. తొలిసారి తప్పు చేసినపుడు సిగ్గు పడతారేమో గాని తరువాత అలవాటుగా మారిపోతుంది. అధికారానికి బానిసలుగా మారితే ఎంతకైనా తెగిస్తారు.

     చంద్రబాబు ముందున్న మరొక మార్గం జనానికి వాస్తవాలు చెప్పి విశ్వసనీయత కల్పించుకొని వారి మద్దతు పొందటానికి ప్రయత్నించటం. చంద్రబాబు చాణక్యంలో ఇంతవరకు అలాంటి అధ్యాయం లేదు. చిత్రం ఏమంటే ఏది జరిగినా చంద్రబాబు, తెలుగుదేశం బలహీనపడే పరిస్థితులను స్వయంగా సృష్టించుకున్నారు. రెండో మార్గాన్ని అనుసరించితే కనీసం కొంత మంది సానుభూతి అయినా పొందవచ్చు.

      రాష్ట్రంలో బిజెపి కూడా మునుపటి మాదిరి లేదు. కేంద్రంలో ఎవరి దయా దాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తప్ప రాష్ట్రంలో బలపడటానికి దానికి మరొక మంచి అవకాశం లేదు, రాదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిందనే తొందర వారిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో సాంప్రదాయ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్త సంబంధీకులే కాకుండా, కొత్తగా కాంగ్రెస్‌ రక్తం కూడా కలిసింది. వుపయోగించుకోవటం, లాభం లేదనుకున్నపుడు వదలి వేసిన గత అనుభవాల రీత్యా చంద్రబాబు నాయుడు వారికి నమ్మదగిన స్నేహితుడు కాదు. అన్నింటికీ మించి మర్రి చెట్టు నీడన మరొక మొక్క ఎదగదు అన్నట్లు తెలుగు దేశం నీడలో బిజెపి పెరగటం అసాధ్యం అని రెండు సంవత్సరాల అనుభవం వారికి నేర్పింది. అందువలన తమకు లొంగిపోయి అధికారంలో మరింత వాటా పెడితే సరి లేకపోతే తెలుగుదేశం మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. అధికారం ఎంతపని అయినా చేయిస్తుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు నాంది పలికింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో, రాష్ట్ర రాజకీయాలను ఎటు మళ్లిస్తుందో , ఏ ప్రస్తానానికి దారితీస్తుందో !