Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

    నాస్తిక వాదం నలిగిపోతోందా అనే శీర్షికన మే ఐదవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో గీతాంజలి మూర్తి కొన్ని అంశాలను లేవనెత్తారు.నిరతంతరంగా జరిగే నాస్తిక, ఆస్థిక వాదం చర్చలో అనేక మంది లేవనెత్తుతున్న పాత విషయాలే అవి. నాస్తికులైన తండ్రుల బిడ్డలు ఆస్థికులుగా ఎందుకు మారుతున్నారు? అంటూ అక్కినేని నాగేశ్వరరావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, శ్రీశ్రీ, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి వంటి పేర్లను ప్రస్తావించారు.తరిచి చూస్తే వారి ప్రశ్నలోనే సమాధానం వుంది. పైన పేర్కొన్న ప్రముఖ నాస్థికుల తలిదండ్రులందరూ మామూలు ఆస్థికులు, ఆ కుటుంబాలలో అంతకు ముందేమీ పండిత చర్చలు జరిగిన దాఖలాలు లేవు. అటువంటపుడు వారి బిడ్డలు ప్రముఖ నాస్థికులుగా ఎలా మారారు, మూర్తిగారు స్వయంగా హేతువాది అయిన ఆస్థికుడిని అని చెప్పుకున్నారు, వారి తలిదండ్రులు ఏ భావజాలంతో వుండేవారో తెలియదు. మరి ఆయనెందుకు అలా మారారు? ఎందుకు అని ప్రశ్నించుకొని సరైన సమాధానం పొందేవరకు వదలని తత్వం నాది అని మూర్తిగారు అన్నారు కను సమాధానం ఏం పొందారో కూడా ఆయనే చెప్పి వుండాల్సింది.లేక నాస్థికుల నుంచి సమాధానం వచ్చే వరకు వదలను అని చెబుతున్నారా ? ఆయన చెప్పినట్లు నిజంగా హేతువాదే అయి వుంటే ఆస్థికుడిగా వుండే వారే కాదు, ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.

   ఆస్థిపాస్తులకు, భావజాలానికి వారసత్వం వుంటుంది. కానీ రెండింటికీ మౌలిక తేడా వుంది. తలిదండ్రుల ఆస్థులపై బిడ్డలకు లేదా దాయాదులకు వారసత్వం హక్కుగా వస్తుంది. కానీ భావజాలం కొనసాగింపు బిడ్డల, ఇతర కుటుంబ సభ్యుల హక్కు లేదా బాధ్యత, విధి కాదు. ఎలా అంటే మూర్తిగారు నాస్థికులను సమర్ధిస్తూనో, విమర్శిస్తూనో ఒక పెద్ద గ్రంధం రాస్తే దాని ప్రచురణపై ఆయన వారసులకు కాపీ రైట్‌ చట్ట ప్రకారం హక్కు వుంటుంది. అంతమాత్రాన దానిలో పేర్కొన్న భావజాలానికి వారు కట్టుబడి వుండాలని లేదు. ఆ పుస్తకం అచ్చువేస్తే వచ్చే డబ్బుకు మాత్రమే వారసులు, కానీ దానిలోని భావజాలానికి నిబద్దులైన ఇతరులు వారసులు అవుతారు.

   కారల్‌ మార్క్స్‌ తంaడ్రి లాయర్‌ ,తన బిడ్డను కూడా లాయర్‌ను చేయాలనుకున్నాడు. కానీ ప్రపంచగతినే మార్చే ఒక అపూర్వ తత్వశాస్త్రానికి ఆద్యుడు అయ్యాడు. మార్క్స్‌తో పాటు విడదీయరాని మేథావి ఎంగెల్స్‌. ఆయనొక పెట్టుబడిదారుడి తనయుడు. కానీ ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు తన ఫ్యాక్టరీ నుంచే పాఠాలు తీసుకున్నాడు. కారల్‌ మార్క్స్‌ను వివాహం చేసుకున్న జెన్నీ రాజకుటుంబాల నుంచి వచ్చిన యువతి. మార్క్స్‌ను వివాహం చేసుకొని జీవితాంతం అష్టకష్టాలను ఎందుకు అనుభవించింది? మధ్యలోనే విడాకులిచ్చి మరొక ధనవంతుడిని వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇలాంటి వన్నీ ఎందుకు జరుగుతాయో మూర్తి వంటి వారు అర్ధం చేసుకుంటే ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం కూడా దొరుకుతుంది.

     భాగవతాన్ని నమ్మటమా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. దానిలో పేర్కొన్న హిరణ్యకశ్యపుడు విష్ణు ద్వేషి. కుమారుడు విష్ణు భక్తుడు. వారికి ఆస్థి, రాచరికం దగ్గర పేచీ రాలేదు, విష్ణువును కొలవటమా లేదా అన్న భావజాలం దగ్గరే వచ్చింది. అందువలన ఆస్థికుల పిల్లలు నాస్తికులుగా మారినా, అటుదిటు అయినా, పెట్టుబడిదారుల కొడుకులు కార్మికవర్గ పక్షపాతులైనా, లేదా ఏమీ లేని వారు పెట్టుబడిదారులుగా మారి ఆ భావజాలాన్ని అనుసరించినా ఆయా కాలాల్లో వుండే అనేక పరిస్థితులు, ముందుకు వచ్చిన అంశాల ప్రభావం వారిపై పడుతుంది.ఏది ఎక్కువ ప్రభావం చూపితే ఆ భావజాలాన్ని అలవరుచుకుంటారు. త్రిపురనేని రామస్వామి నాస్తికుడిగా, హేతువాదిగా మారిన సమయంలో ఆంధ్రదేశంలో, కృష్ణా.గుంటూరు జిల్లాలలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా వున్నా ఆయన కమ్యూనిస్టుగా మారలేదు. అదే సమయంలో అనేక మంది నాస్తికులు కమ్యూనిస్టులుగా మారారు. అంత మాత్రాన ఇతర భావజాలాలు అంతరించినట్లో నలిగిపోయినట్లో అవుతుందా ? తమిళనాడులో డిఎంకె నేతలు గుడులు,గోపురాలకు వెళ్లినంత మాత్రాన నాస్తికత్వ వాదం నశిస్తుందనుకుంటే అంతకంటే అమాయకత్వం వుండదు.

    మనది వేద భూమి అంటారు కొందరు. వేదాలు వునికిలోకి వచ్చినపుడే వాటిని వాటిని తిరస్కరించిన హేతువాదులు కూడా ఇక్కడే పుట్టారు, అందువలన హేతు భూమి అని కూడా ఎందుకు పిలవకూడదు? బుద్దుడు కూడా ఇక్కడే పుట్టినందున కొందరు బుద్ధ భూమి అనటం లేదా ? వేద ప్రమాణాన్ని తిరస్కరించిన చార్వాకులు, లోకాయతులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా ధ్వంసం చేశారు. అయితేనేం తరువాత వేమన అవతరించలేదా, ఆ చార్వాక, లోకాయత, వేమన్నవాద భావజాల వారసులు దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారా లేదా ? వేదాలను నమ్మేవారు ఎక్కువ, నాస్తికులు, హేతువాదులు తక్కువ ఎందుకు వున్నారు అని ఎవరైనా అడగొచ్చు. వేదాలు కొన్ని దేశాలు, ప్రాంతాలకే పరిమితం, అన్ని రకాల మతాలను,దేవుళ్లను వ్యతిరేకించే నాస్తికులు, హేతువాదులు ప్రపంచవ్యాపితంగా వున్నారు. గరిటెడైనను చాలు గంగిగోవు పాలు అన్న వేమన్న సమాధానం వుండనే వుంది. ఎవరూ విత్త కుండానే వర్షాలు పడి, రుతువు రాగానే అనేక మొక్కలు మొలుస్తాయి, వాటిలో పనికిరాని కలుపు , ప్రయోజనం చేకూర్చే మంచి మొక్కలూ వుంటాయి. అదే వర్షాలు లేకపోతే ఆ విత్తనాలు అలాగే భూమిలో వుండిపోతాయి. అలాగే ఏ భావజాల వ్యాప్తికైనా పరిస్థితులు దోహద పడాలి. అది ఎంతకాలం అంటే ఎవరు చెబుతారు.మూర్తిగారే అన్నట్లు హిందూ మత పూర్వ వైభవం తెచ్చుకోవటానికి ఎంత కాలం పడుతుందో ఎవరినైనా చెప్పమనండి !

     హేతువాదుల ఇండ్లలో ఇతర కుటుంబ సభ్యులు పూజలు, పునస్కారాలు చేయటం గురించి ప్రస్తావించారు.తమ కుటుంబ సభ్యులనే మార్చటంలో ఎందుకు విఫలమయ్యారు అని ప్రశ్నించారు. ఇది వినటానికి ఇంపుగానే వుంటుంది. మొదటి విషయం నాస్థికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మిగతావారికంటే అత్యంత ప్రజాస్వామిక వాదులు. తమ భావాలను కుటుంబ సభ్యులతో సహా ఇతరులపై రుద్దరు. మోతీలాల్‌ నెహ్రూ మితవాది, ఆయన కుమారుడు జవహర్‌లాల్‌ కాంగ్రెస్‌లో అతివాది అయ్యాడు. కమ్యూనిస్టు దిగ్గజం సుందరయ్య భూస్వామిక కుటుంబంలో, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పచ్చి మితవాద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.లోకసభ స్పీకర్‌గా,సిపిఎం అగ్రనేతగా వున్న సోమనాధ్‌ చటర్జీ తండ్రి ఒక పెద్ద లాయర్‌, హైకోర్టు జడ్జి. అంతకు మించి ఆయన హిందూ మహాసభ నాయకుడు. సుందరయ్య,నంబూద్రిపాద్‌, సోమనాధ్‌లు కమ్యూనిస్టులు కాకుండా చేయటంలో వారి కుటుంబ పెద్దలు ఎందుకు విఫలమయ్యారు?

    మతం కూడా ఒక భావజాలమే. ప్రముఖ బిజెపి నాయకులు, సంఘపరివార్‌ పెద్దలు ముస్లింలు లవ్‌ జీహాద్‌ పేరుతో హిందూ యువతులను వివాహమాడి, మతమార్పిడి చేస్తున్నారంటూ ముస్లిం మత భావజాలానికి వ్యతిరేకంగా నిరంతరం గగ్గోలు పెడుతుంటారు.అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, తొగాడియా,సుబ్రమణ్యస్వామి అలాంటి ఎందరో ప్రముఖులు తమ కుటుంబ సభ్యులు ముస్లింలను వివాహం చేసుకుంటుంటే ఎందుకు ఆపలేకపోయారు? ఇతరులకు ఎందుకు నీతులు చెబుతున్నారు? అందుకని చర్చను అలాంటి వైపు తిప్పితే ప్రయోజనం లేదు. ఏ వాదంలో అయినా దాని మంచి చెడ్డలను చర్చించటం మంచిది.

     భారత దేశాన్ని మొగలాయీలు ఆక్రమించినపుడు స్వాతంత్య్రం కావాలన్న వాంఛ దేశ ప్రజలలో పుట్టలేదు, బ్రిటీష్‌ వారు ఆక్రమించిన తరువాత కూడా చాలా కాలం వరకు కలగలేదు. ప్రధమ స్వాతంత్య్ర పోరాటం తరువాత కూడా దేశంలో అంతగా జ్వాల రగలలేదు. అంత మాత్రాన 1857 తిరుగుబాటు విఫలమైనట్లు కాదు. కాంగ్రెస్‌ ఏర్పడిన వెంటనే జనం కుప్పలు తెప్పలుగా వుద్యమంలో పాల్గొనలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా చాలా కాలం వరకు బ్రిటీష్‌ వాడి పాలనే బాగుందని చెప్పిన వారు మనకు ఎందరో తెలుసు. అందువలన ఒక భావజాలాన్ని మెజారిటీ అంగీకరించి అనుసరించనంత మాత్రాన అది విఫలమైనట్లు , మెజారిటీ ఆమోదించిన భావజాలాలన్నీ సఫలమైనట్లూ కాదు. హిందూమతంపై తిరుగుబాటుగానే బౌద్దం అవతరించింది. అది మన దేశంలో ఆదరణ పొందలేదు, అంత మాత్రాన అది విఫలమైనట్లా ? తరువాతనే మన దేశంలోకి ఇస్లాం, క్రైస్తవం వచ్చాయి.ఎందరో బలహీనవర్గాల వారు ఆ మతాలపట్ల ఆకర్షితులయ్యారు. మెజారిటీగా వున్న హిందూమతం లేదా దానిని కాపాడాలని కంకణం కట్టుకున్న పెద్దలు ఎందుకు ఆ పరిణామాన్ని నివారించలేకపోయారు?

    నాస్తికత్వం, హేతువాదం, భౌతిక వాదం వీటన్నింటినీ కొంతమంది ఒకే గాటన కడుతున్నారు. వాటిలో అనేక అంశాలు ఒకటిగా వుండటం ఒక కారణం. ఈ మూడు వాదాలతో ప్రభావితులైన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కానీ కమ్యూనిస్టులు ఈ మూడు అంశాలను కలిగి వుంటారు. వాటిని జనంలో కలిగించటానికి నిరంతరం ప్రయత్నిస్తారు. కమ్యూనిస్టులుగా వుండి మూఢనమ్మకాలను, తిరోగమన భావాలను ప్రోత్సహిస్తే తప్పు. అయితే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేరటానికి ఈ అంశాలను షరతులుగా పెట్టటం లేదన్నది తెలుసుకోవాలి.అంటే పార్టీలో ఆస్థికులు,నాస్థికులూ అందరూ వుంటారు. ఎవరైనా దేవాలయం, మసీదు, చర్చికో వెళుతూ మరోవైపు దోపిడీ లేని సమసమాజం కావాలని కోరుకుంటే అలాంటి వారిని ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సభ్యులుగా వద్దంటే అంతకంటే పిచ్చిపని మరొకటి వుండదు. మా మతం కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని వ్యతిరేకించమని చెప్పింది అంటేనే పంచాయతీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మతాలు పుట్టినపుడు కమ్యూనిస్టు సిద్ధాంతమే లేదు.అందువలన మతాలు కమ్యూనిజాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది? తప్పుడు వ్యాఖ్యానాలు చేసే అలాంటి వారిని పార్టీలు అంగీకరించవు. పార్టీ సభ్యులుగా చేరిన తరువాత వేల సంవత్సరాలుగా వచ్చిన అనేక అన్యవర్గ ధోరణులను పోగొట్టటానికి ప్రయత్నిస్తారు. అయితే అది అన్ని చోట్లా, అందరూ ఒకే విధంగా చేయకపోవచ్చు. అలాంటివి ఏవైనా వుంటే సద్విమర్శలు చేయాలి. ఒక కమ్యూనిస్టు సంస్మరణ సభలో కొందరు వక్తలు బొట్లు పెట్టుకొని జోహార్‌ కామ్రేడ్‌ అనటం చూసి అవాక్కయ్యానని మూర్తిగారు రాశారు. సంస్మరణ సభ కనుక ఇతరులు ఎవరైనా వచ్చి అలా చేసి వుండవచ్చు.దానికి అవాక్కవ్వాల్సిందేముంది. ఎవరైనా బొట్టుపెట్టుకో కూడదని కమ్యూనిస్టుపార్టీ ఎక్కడైనా చెప్పిందా ? సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాండ్రైన బృందాకరత్‌, సుభాషిణీ అలీ పెద్ద బొట్లు పెట్టుకోవటం లేదా ? మతాలు, మతాచారాలు మాత్రమే అలాంటి ఆంక్షలు విధిస్తున్నాయి.

     అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు అన్నట్లు దైవశక్తి ఆస్థికుల అనుభవంలోకి రావటాన్ని నాస్తికవాదులు ఎన్నిరాసినా అడ్డుకోలేరు అని ఒక నిర్ధారణ చేశారు. ఆస్థికులలో కూడా మేథావులు వున్నారని మరువరాదు అన్నారు. మొదటి విషయం, ఆస్థికులలో మేథావులు వుండరని నాస్తివాదం చెప్పలేదు. కొద్ది మందిగా వున్న నాస్థిక, హేతువాద మేథావుల వైఫల్యం గురించి మూర్తిగారు సంతోష పడుతున్నారు ఓకే. వేల సంవత్సరాలనాడే వుద్భవించిన నాస్థిక వాదం ఇప్పటికీ వునికిలో వుందంటే అత్యధికులుగా వున్న ఆస్థిక మేథావులు, పండితులు, మతాధికారులు, వారి రాజపోషకులు, కొత్తగా టాటా , బిర్లావంటి పెట్టుబడిదారీ పోషకుల వైఫల్యం కనపడటం లేదా ? హిందూమతాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన అనేక మంది ఆస్థిక మేథావులు ఎందుకు విఫలమయ్యారు. వీధికొక దొంగబాబా పుట్టుకు వచ్చి మతం పేరుతో దండుకుంటుంటే ఎందుకు నివారించలేకపోయారు ? వెర్రి మొహాలు వేసుకొని ఎందుకు చూస్తున్నారు? ఇది వైఫల్యం కాదా ?

    శంకరాచార్యుడు తన వాదనా పటిమతో అనేక మందిని బౌద్ధం నుంచి మళ్లించి హిందూ మతానికి పూర్వ వైభవం తెచ్చారు అని మూర్తిగారు చెప్పారు. ఇది ఘర్‌ వాపసీ ప్రచార ప్రభావంగా కనిపిస్తోంది. ఆ శంకరాచార్యుడు పుట్టిన కేరళలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంత మంది క్రైస్తవులు, ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎందుకు ఆ మతాలవారు విస్తరించారు? ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల అనేక మంది హిందూ నుంచి ఇతర మతాలకు ఎందుకు మారిపోతున్నారు? ఆస్థికులు అంటే ఒక్క హిందువులే కాదు, దైవాన్ని, దైవదూతలను నమ్మే ఇతర మతాల వారు కూడా ఆస్థికులే. వారు మార్చుకొనేది మతం తప్ప ఆస్తికత్వాన్ని కాదు, అయినా ఎందుకు ఆ మార్పిడులపై ఎందుకు అంత రగడ చేస్తున్నారు? ఆస్థికులలో ప్రజాస్వామ్యం లేదా ?

     చివరగా ఒక్క మాట నాస్థికులు,హేతువాదులు, భౌతిక వాదులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు వేల సంవత్సరాల నుంచి మా విశ్వాసం, మనోభావాలు అంటారు తప్ప సరైన సమాధానం చెప్పటంలో ఆస్థికులు విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో తమ వ్యతిరేక భావాలను,చర్చలు, వాదనలను కూడా సహించటం లేదు. దబోల్కర్‌, పన్సారే,కులుబుర్గి వంటి నాస్థిక,హేతువాదుల్ని హతమార్చారు. ఇంకా అనేక మందిని అదే చేస్తామని బెదిరిస్తున్నారు. వారి హత్యలను ఆస్థికులుగా వున్న ప్రముఖులు ఏ మతం వారైనా ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకంటే వారి వాదనలు ఆస్థికవాద మూలాలనే ప్రశ్నిస్తున్నాయి, అహాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది ఈనాటిది కాదు, చార్వాకులు,లోకాయతుల నుంచి జరుగుతున్నదే. హిందూ మతానికి ఒక సాధికార కేంద్రమే లేదు. అందువలన హిందూమతావలంబకులు, దానిని కాపాడాలనుకొనేవారు, ముందు ఎవరు సాధికారులో తేల్చుకొని విశ్వాసం, మనోభావాలను కాసేపు పక్కన పెట్టి ఆ పండితులు, మతాధిపతులతో శాస్త్రీయమైన పద్దతులలో చర్చలు జరిపి నాస్థికవాదం తరతరాలుగా ‘ఎందుకు’ వునికిలో వుంటున్నదో, ఇప్పటి వరకు హిందూ మతం పేరుతో జరిగిన తప్పులను, ఇప్పటికీ కొనసాగుతున్న అస్పృశ్యత, వివక్ష, వంటి సవాలక్ష అవలక్షణాలను, మతం పేరుతో బాబాలు,యోగులు,యోగినులు భారీగా ఆస్థులను పోగేసుకోవటాన్ని ఎలా అరికట్టాలో తేల్చి ప్రకటించాలి.మనుషులను మనుషులుగా చూస్తారనే భరోసా కలిగించాలి. అప్పుడే జనానికి మతం మారాలన్న ఆలోచన వుండదు. మతాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు ఆ పని చేస్తామంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది ఏమతం అయినా కావచ్చు, జనం ఇతర మతాలోక్లి మారుతున్నారన్న దుగ్దకంటే మన మతంలోకి ఇతరులను ఎలా ఆకర్షించాలనే విషయంలో అన్ని మతాలూ పోటీ పడటం ఆరోగ్యకర లక్షణం.అలాగాక దాడులకు దిగటం బలహీనత, అనాగరిక లక్షణం.