Tags

, , , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

   సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌, వివిధ గ్రూపులలో సభ్యులు ఒక సమాజం అనుకుంటే దానిలోని మంచి చెడులన్నీ ప్రతిబింబిస్తున్నాయి.బుర్ర తక్కువ పోస్టులు పెట్టే వారి గురించి వదలి వేద్దాం. కొంత మంది సమాజంలో వున్న యథాతథ స్థితిని, వాస్తవాలను ప్రస్తావిస్తున్నారు. తమ అనుభవంలోకి వచ్చిన వాటిని ఆవేదనో, కసి, బాధ, మార్పు రావాలనో ఏదో ఒక భావంతో పెడుతున్నారు. మంచిదే. దేన్నీ దాచుకోవాల్సిన అవసరం లేదు. కారల్‌ మార్క్సు ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘ హేతువు ఎప్పుడూ వునికిలోనే వుంది, కానీ ఎల్లవేళలా యుక్తమైన రీతిలో లేదు( Reason has always existed, but not always in a reasonable form ) బాధితులు చెప్పే దానిలో ఎప్పుడూ హేతువు వుంటుంది, అయితే అది ఎల్లవేళలా సరైన రీతిలో వ్యక్తం కావటం లేదని చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఇది కొందరిని వుద్ధేశించి ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తున్నది కాదు, సవరించుకోవాల్సిన అవసరం గురించి సూచించేందుకు మాత్రమే. పెద్దదిగా వున్నప్పటికీ చదవండి, చర్చించండి. సూక్ష్మంలో మోక్షాలు, దగ్గరి దారులు, గోసాయి చిట్కాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేవన్నది ఏడుపదుల స్వాతంత్య్ర అనుభవం చెబుతోంది. వాటి గురించి పైపైన కాకుండా లోతుగా చర్చిస్తేనే ప్రయోజనం. కావాల్సింది పాలపొంగు కాదు, మరగటం, మధించటం.

  చరిత్రలో కార్మికులు ఒక దశలో యంత్ర విధ్వంసకులుగా వ్యవహరించినట్లు మనం చదువుకున్నాం. దేశాలను ఆక్రమించుకొనే క్రమంలో ఐరోపాలో నెపోలియన్‌ యుద్ధాలతో సహా అనేక యుద్ధాలు జరిగాయి. పర్యవసానంగా అనేక దేశాలలో ఆర్ధిక పరిస్థితులు దిగజారాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా పారిశ్రామికవేత్తలు తమ లాభాలను కాపాడుకొనేందుకు నూతన యంత్రాలను ప్రవేశపెట్టారు. వాటిలో బ్రిటన్‌ పవర్‌లూమ్స్‌ పెద్ద మార్పునే తెచ్చాయి. అప్పటి వరకు అక్కడి సాంప్రదాయ నేత కార్మికుల జీవితాలు వీటితో అతలాకుతలమయ్యాయి. యుద్ధాలతో మొత్తంగా కార్మికుల బతుకులూ ఛిద్రమయ్యాయి.ఇటు సంప్రదాయ నేత పని కరువై, అటు ఫ్యాక్టరీలలో సరైన పనిలేక మొత్తం మీద ఏం చేయాలో తెలియని స్థితిలో తమకు కష్టాలు రావటానికి పవర్‌లూమ్స్‌ కారణమని భావించి వాటిని నాశనం చేస్తే పరిష్కారం దొరుకుతుందని భావించి అదే పని చేశారు. వారి ఆవేదనలో హేతువు లేదా వుంది, కానీ యంత్రాల ధ్వంసం పరిష్కారం కాదు. దీంతో 1788లోనే బ్రిటీష్‌ పార్లమెంట్‌ పవర్‌లూమ్స్‌ తదితర యంత్రాల పరిరక్షణకు ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా వాటిని కావాలని ధ్వంసం చేసినట్లు లేదా ధ్వంసం చేసేందుకు అక్రమంగా ప్రాంగణాలలో ప్రవేశించినా, ప్రోత్సహించినా ఏడు నుంచి 14 సంవత్సరాల పాటు ఖైదీల సెటిల్మెంట్లకు ప్రవాసం పంపేవారు. తరువాత యంత్రాలు పనిచేయకుండా కొన్ని భాగాలు లేకుండా చేస్తున్నట్లు గ్రహించి దానిని కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించారు. దాని పర్యవసానమే ఇప్పటికీ కార్మికులు డ్యూటీ దిగి వెళుతుంటే భద్రతా సిబ్బంది తనిఖీ చేయటం. ఆ తరువాత 1788 చట్టాన్ని రద్దు చేసి మరణశిక్షను కూడా చేర్చి 1823లో మరో చట్టం చేశారు. ఈ యంత్ర విధ్వంస కార్మిక తిరుగుబాటును బ్రిటీష్‌ పాలకులు ఎంత తీవ్రంగా అణచివేశారో తెలుసా ? నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలలో ఒకటైన లెబెరియన్‌ ద్వీపకల్పాన్ని నిలబెట్టుకొనేందుకు నియోగించిన సైన్యం కంటే ఎక్కువ మందిని దించారు.

  ఆధునిక చరిత్రలో వుగ్రవాద దారి పట్టిన నక్సల్స్‌ ఏ గ్రూపు అన్నది అప్రస్తుతం, అటవీ ప్రాంతాలలో రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్ల, లేదా ప్రభుత్వ యంత్రాలను విధ్వంసం చేయటం, రోడ్లను, స్కూలు భవనాలను కట్టకుండా చేశారని మీడియాలో అనేక వార్తలను చదివాము. అన్నింటి కంటే ఆధునిక రూపంలో సంఘటిత కార్మికవర్గం కొన్ని సంవత్సరాల క్రిందట కంప్యూటర్ల వినియోగాన్ని అడ్డుకున్నపుడు వారి మీద కూడా అదే విమర్శ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కుల వివక్ష రాక్షసికి బలౌతున్న వారు దానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం ఎలా కొనసాగించాలన్నదే సమస్య. దీనిపై తీవ్రమైన పోరాటాన్ని కొనసాగించాలనటంలో ఎలాంటి రాజీ లేదు. ఎలా సాగించాలన్నదే చర్చ. ఈ మధ్య జైనీల్‌-జైలాల్‌ అనే నినాదం వినిపిస్తోంది. ఇదొక శుభపరిణామం.

     కార్మికవర్గం సమాజంలో 99 శాతం మెజారిటీ. మన దేశానికి వస్తే దళితులా, గిరిజనులా, ముస్లింలా, హిందువులా, మరో మతం వారా, బ్రాహ్మలా, కమ్మా, రెడ్డి, కాపు, కుమ్మరి, కమ్మరి ఇలా అన్ని రకాల కులాల వారు కార్మికులలో వున్నారు, ఒక శాతంగా వుండే దోపిడీ వర్గంలోనూ వీరందరూ వున్నారు. వర్గరీత్యా ఏ వర్గంలో వుంటే వారు తమ ఆర్ధిక సమస్యల మీద ఐక్యం అవుతున్నారు, కార్మికులతో పోల్చితే పెట్టుబడిదారులలో అది ఎక్కువగా వుంది. నిజానికి కార్మికులకు సమాజంలోని పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారుల వంటి ఇతర తరగతుల మద్దతు అవసరమే.వీరికీ వారి మద్దతు అవసరమే.

       మన దేశంలో కొంత మంది దృష్టిలో వర్గం కంటే కుల సమస్య పెద్దది. దానితో మరికొంత మంది ఏకీభవించ వచ్చు, విబేధించవచ్చు. అంత మాత్రాన అది పరిష్కరించాల్సింది కాదు అని అర్ధం కాదు. ఏ సమస్య పరిష్కారానికి అయినా అందుకు కలసి వచ్చే స్నేహితులను ఎంచుకోవాలి. వర్గ సమస్యలో పెట్టుబడిదారుడు- కార్మికులు ముఖాముఖీ తేల్చుకుంటారు. సమస్య ఎక్కడంటే కుల వివక్ష, కులాంతర, మతాంతర వివాహాల వంటి సామాజిక అంశాల దగ్గర వస్తోంది. పెట్టుబడి దారీ విధాన వయస్సు ఐదు వందల సంవత్సరాలు అనుకుంటే ఏ రీత్యా చూసినా రెండు వేల సంవత్సరాలకు పైబడే వుంది. ఇది గిజిగాడి గూడు కంటే సంక్లిష్టమైనది. ఇక్కడ కూడా మార్క్సు మహనీయుడు చెప్పినది, అంబేద్కర్‌ చెప్పిన అంశాలు ఎన్నో వున్నాయి. ‘ తత్వవేత్తలు వివిధ పద్దతులలో ప్రపంచానికి భాష్యం మాత్రమే చెప్పారు, సమస్య ఏమంటే దానిని మార్చటం ఎలాగన్నదే’ దీనిని మనం మన దేశంలో దళిత సమస్యకు ఎందుకు వర్తింప చేసుకోకూడదు. వర్తమానంలో జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ మాదిరి కాకపోయినప్పటికీ అనేక మంది ప్రముఖులు మనువాదాన్ని వ్యతిరేకించారు. పూలే,అంబేద్కర్‌ తాము నమ్మినపద్దతులలో పరిష్కారాన్ని చెప్పారు. వారితో ఎవరూ విబేధించనవసరం లేదు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లోనే జ్యోతిబాపూలే జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరగటం, వెంటనే ఆయన తన సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత అంబేద్కర్‌ కొనసాగించారు. అంటే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట బీజం కమ్యూనిజానికంటే ముందే పడింది. వేదాలను విమర్శిస్తూ పూలే కుల వివక్ష సమస్యను జనం ముందు పెట్టారు. దళిత్‌ అనే మరాఠీ పదాన్ని ఆయనే ముందు వుపయోగించారని చెబుతున్న విషయం తెలిసిందే.

    ‘విద్య లేకపోవటం తెలివి తేటల లేమికి దారి తీస్తుంది, అది నైతిక విలువల లేమికి కారణం అవుతుంది, నైతిక విలువలు లేకపోతే ప్రగతి వుండదు, ప్రగతి లేకపోతే జనం దగ్గర డబ్బు వుండదు, డబ్బలేకపోతే దిగువ కులాలపై అణచివేతకు దారితీస్తుంది, చూడండి విద్యలేకపోవటం ఎన్ని అనర్ధాలకు కారణం అవుతుందో ‘ అన్న పూలే అందుకుగాను విద్యాసంస్ధలను స్థాపించటానికి ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత అంబేద్కర్‌ కూడా పూలే బాటలోనే విద్యతో దళితుల అభ్యున్నతి సాధించవచ్చని భావించి ఆమేరకు ‘బహిష్కృత్‌ హితకారిణీ సభ ‘ సంస్ధను స్ధాపించారు.అయితే వెంటనే తన పంధా మార్చుకొని అస్పృస్యతకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సమీకరించు, పోరాడు, సాధించు అన్నది అంబేద్కర్‌ నినాద సారాంశం. ఇదంతా భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా వేళ్లూనుకోక ముందే ప్రారంభమైంది.

    మన దేశంలో కుల వివక్ష, కుల నిర్మూలన సంస్కరణలు, పోరాటానికి పూలేతో అంటే 1848లో నాంది పలికారంటే ఇప్పటికి 168 సంవత్సరాలు, మధ్యలో అంబేద్కర్‌ కలిసి 90 సంవత్సరాలు . ఈ మొత్తం కాలంలో దళిత వుద్యమం సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? విజయాలను మరింత పటిష్ట పరుచుకోవటం, వైఫల్యాలను అధిగమించటానికి కొత్తదారులు వెతకాల్సిన అవసరం లేదా ? మన దేశంలో కమ్యూనిస్టు వుద్యమం 1920లో ప్రారంభమైంది. పురాణాల ప్రకారం పుట్టుతోనే శ్రీకృష్ణుడు చెరసాల పాలై తరువాత అజ్ఞాతంలో పెరిగినట్లుగా భారత కమ్యూనిస్టుపార్టీ కూడా నిర్బంధాలు, నాయకుల అరెస్టులు,జైలు జీవితంతోనే ప్రారంభమైంది. పుట్టిన పదిహేను సంవత్సరాల తరువాతే బహిరంగంగా పనిచేయటం సాధ్యమైంది. తరువాత మరోసారి నిర్బంధం, నిషేధం. అంటే దాని వయస్సు కూడా తొమ్మిది పదులు. మ్యూనిస్టులు కూడా పూలే-అంబేద్కరిస్టుల మాదిరి తమ విజయాలు,పరాజయాలను సింహావలోకనం చేసుకొని జనసామాన్యాన్ని ఆకర్షించటంలో ఎదురౌతున్న సమస్య లేమిటో అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటో రూపొందించుకోవాల్సి వుంది. రెండు వుద్యమాలు ఒకదానితో ఒకటి విబేధించే అంశాలు వున్నాయి,అంగీకరించేవి వున్నాయి. ఏవి ఎక్కువ ఏవి తక్కువ అన్న వాటిని చర్చించుకోవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్య పడుతుందంటే అంగీకృత అంశాలపై కలసి పనిచేసినపుడే.రెండు వుద్యమాల మధ్య వున్నవి మిత్ర వైరుధ్యాలే తప్ప శతృపూరితమైనవి కాదు.ఒక వేళ ఎవరైనా అలా చిత్రించేందుకు ప్రయత్నిస్తే తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు. అంబేద్కరిస్టులు చెబుతున్న దళిత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు, లేదా కమ్యూనిస్టులు చెబుతున్న ఆర్ధిక దోపిడీ అంతం కావాలనటాన్ని పూలే-అంబేద్కరిస్టులు వ్యతిరేకించటం లేదు. అయితే సమస్య ఎక్కడ. కమ్యూనిస్టులలో విలీనం కమ్మని పూలే-అంబేద్కరిస్టులను గానీ లేదా తమ రాజకీయ వేదికను రద్దుచేసుకొని సామాజిక వుద్యమాలలో విలీనం కమ్మని కమ్యూనిస్టులను గానీ ఎవరూ కోరటం లేదు. కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల మధ్య సైద్ధాంతిక విబేధాలు వున్నాయి కనుకనే ఆ పార్టీలు విడివిడిగా వుంటూ ఐక్యంగా పోరాడుతున్నాయి.కలసి వచ్చిన చోట లౌకిక శక్తులను తోడు చేసుకుంటున్నాయి.దీనికి కూడా దాన్నే ఎందుకు వర్తింప చేయకూడదు. మనకు స్వాతంత్య్ర వుద్యమం అనేక పాఠాలు నేర్పింది. కాంగ్రెస్‌ సంస్థలోనే ఎన్ని భావజాలాలు వున్నవారు కలసి పని చేయలేదు. వారిలో ఎన్ని విబేధాలు లేవు? అయినా వారిని కలిపి వుంచింది తెల్లవాడిని దేశం నుంచి తరిమివేయాలి అన్న ఏకైక లక్ష్యం ఒక్కటే.

   ముందుగా పరిష్కారం కావాల్సింది దళిత సమస్య అన్నది మొత్తంగా ఇప్పటి వరకు పూలే-అంబేద్కరిస్టులు ముందుకు తెచ్చిన వైరుధ్యం. అర్ధిక దోపిడీ అంతమైతే సామాజిక సమస్యలు పరిష్కారం కావటం సులభం కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది కమ్యూనిస్టుల వైఖరిగా వుంది. ఇవి ఇలా వుంటే ఇప్పుడు ఈ రెండు శక్తులను దెబ్బతీసి అటు ఆర్ధిక దోపిడీని పెంచే నయా వుదారవాదాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తే దానిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు బిజెపి, దానితో చేతులు కలిపిన శక్తులు చూస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షను పెంచి పోషించే మనువాదాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కూడా మత శక్తులు మరింత వూపుతో పనిచేస్తున్నాయి. కుల శక్తులు దానికి అనుబంధంగా వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందువలన నయావుదారవాదం, మతోన్మాదం అనే జంట ప్రమాదాలను ఎదుర్కోవటం ఎలా అన్నది సమస్య.

     నయా వుదారవాదం ఇంకా వేగంగా, విస్తృతంగా అమలులోకి వస్తే అమలులో వున్న విద్యా, వుద్యోగ రిజర్వేషన్లు మరింతగా తగ్గిపోతాయి. ఇప్పటికే సామాజిక రంగంలో ఎవరు ఎలా వుండాలో, వుండకూడదో నిర్ణయించేందుకు మతశక్తులు ఎలా ముందుకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ జంట ముప్పును తప్పించకుండా ఈ వుద్యమాలు ముందుకు సాగవు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరిలో ముఖ్యంగా సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పును గత పది హేను సంవత్సరాలుగా వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చూస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాటానికి ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నారు. ఇప్పుడు అఖిలభారత స్థాయిలో కూడా అలాంటి సంస్ధ ఏర్పడి రాష్ట్రాల వుద్యమాలను మరింత ముందుకు తీసుకుపోతున్నది. ఇంకా అనేక సంస్ధలు కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే అలాంటి కృషే చేస్తున్నాయి.అయితే అన్ని వుద్యమాలు,వుద్యమ రూపాలు ఒకే విధంగా వుండటం లేదు. అందుకే ముందే చెప్పినట్లు సామాజిక వుద్యమ సంస్ధలైనా, రాజకీయ పార్టీలైనా అంగీకృత అంశాల మేరకు కలసి పనిచేయాలి. ఈ విషయంలో ఇటీవలి కాలంలో అంబేద్కరిస్టుల వైఖరిలో కూడా మార్పును గమనిస్తున్నాం, రిజర్వేషన్లు అమలు జరగాలంటే అసలు ప్రభుత్వ వుద్యోగాలు, ప్రభుత్వ రంగంలో పరిశమ్రలు వుండాలి. వుద్యోగాలను క్రమంగా రద్దు చేస్తున్నారు, పరిశ్రమలను మూసివేస్తున్నారు, లేదా పొరుగు సేవల పేరుతో పర్మనెంటు వుద్యోగాలను రద్దు చేస్తున్నారు. వీటిని రక్షించుకోవటంతో పాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రారంభమైన వుద్యమంలో కూడా వారు భాగస్వాములు కావటం ప్రారంభమైంది.

   ఇక్కడ ఒక విషయంపై స్పష్టత కలిగి వుండటం అవసరం. మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయి, బీసిల సమస్యలు వారికే తెలుస్తాయి, ఎస్సీ,ఎస్టీల సమస్యలు వారికే తెలుస్తాయి. ఈ అభిప్రాయాలతో ఎవరూ విబేధించాల్సిన అవసరం లేదు. వాస్తవం వుంది. పేచీ ఎక్కడ వస్తుందంటే ఈ తరగతులకు చెందని వారికి ఆ సమస్యలు తెలియవు, అందువలన వారు మాట్లాడకూడదు, వుద్యమాలకు సారధ్యం వహించకూడదు అన్న పెడ ధోరణులకు గురైన స్థితి వుంది. దీనికి గురైన వారు రెండు రకాలు. ఇది నయా వుదారవాద భావజాలం ముందుకు తెచ్చిన విభజించి పాలించు అన్న పాత ఎత్తుగడలకు కొత్తరూపం. తమకు తెలియకుండానే ఇది నిజమే కదా అనుకున్నవారు కొందరు. వీరితో పేచీ లేదు. మంచి చెడులను వివరిస్తే అర్ధం చేసుకుంటారు. రెండో రకం వారు వున్నారు. అన్నీ తెలిసి కూడా ఈ వాదాన్ని ముందుకు తెచ్చేవారు. వీరు కలిగించే హాని అంతా ఇంతా కాదు. అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న కులాలలో పుట్టిన వారు మాట్లాడ కూడదు అంటే రాజ కుటుంబంలో పుట్టిన బుద్దుడు ఎవరు? ఆయన కులతత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ఆద్యుడిగా పరిగణించబడుతున్నారా లేదా ? అందువలన ఎవరు ఏ కులంలో పుట్టారు లేదా పేదవాడా, ధనికుడా అని కాదు, ఏం చెబుతున్నారు అన్నది ముఖ్యం. ఒక అగ్రకులంలో పుట్టిన వ్యక్తి కుల తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అగ్రకులతత్వం వున్న వారి నుంచి దూరమైనట్లే. ఒక కులంలో పుట్టటం అనేది ఒక యాదృచ్చిక ఘటన మాత్రమే.

    మతశక్తులు తమ అజెండాను అమలు జరిపే క్రమంలో తమకు తెలియకుండానే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విశ్వవిద్యాలయాలలో వ్యవరించిన తీరుతో కమ్యూనిస్టులు, వామపక్షాలు,అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయం కోరుకొనే ఇతర అనేక శక్తులను దగ్గరకు తెచ్చాయి. దాని నుంచి వచ్చిందే జైనీల్‌ -జై లాల్‌ నినాదం.ఎవరి ఎజండాలు వారు కలిగి వుండండి, ఎవరి జండాలను వారు మోసుకోండి. సమస్యలపై కలసి పనిచేయండి, జనానికి మేలు చేయండి.