Tags

, , , , , ,

ఎంకెఆర్‌

  ప్రపంచంలో సోషలిజాన్ని తొక్కి వేశామని, కమ్యూనిజాన్ని కాలరాశామని అమెరికా సామ్రాజ్యవాదులు ప్రకటించిన పాతిక సంవత్సరాలు దాటింది. అయితేనేం వారి కనుసన్నలలో నడుస్తున్న ఇండోనేషియా పాలకవర్గం ఇప్పుడు ఎటు వైపు నుంచి ఎప్పుడు కమ్యూనిస్టులు తమకు దర్శనమిస్తారోనని భయపడి చస్తోంది, మాటి మాటికీ వులికిపడుతోంది. యాభై సంవత్సరాల నాడు ఐదులక్షల మందికిపైగా కమ్యూనిస్టులు, వారి సానుభూతి పరులుగా పరిగణించిన వారిని వూచకోత కోసిన వారు ఇప్పుడు ఏ సమాధి నుంచి ఎవరు ఎక్కడ లేచి వస్తారో అన్నట్లుగా సామూహిక సమాధులను కూడా కానరాకుండా చేసేందుకు పూనుకుంది.

     లేకపోతే కార్మిక, కర్షక చిహ్నాలైన సుత్తీ, కొడవలి ముద్రించిన టీ షర్టులు అమ్ముకుంటున్న ఇద్దరు చిరు వ్యాపారులు కమ్యూనిజాన్ని వ్యాపింపచేస్తున్నారంటూ అరెస్టు చేస్తారా? అలాంటి టీ షర్టులను తయారు చేయవద్దని యజమానులను ఆదేశిస్తారా ? ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అక్కడి పాలకవర్గం వామపక్ష భావజాల చర్చను బహిరంగంగా అనుమతిస్తే ఏం జరుగుతుందో, అనుమతించక ఇంకా అణచివేత కొనసాగనిస్తే దాని మీద ఇంకా యువతలో మోజు పెరుగుతుందా అన్నది తేల్చుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు యాభై సంవత్సరాల నాడు జరిగిన అణచివేతకు గురైన వారి కుటుంబాలతో సర్దుబాటు చేసుకోవాలనే పేరుతో మారణకాండ గురించి ప్రభుత్వమే అధికారికంగా ఒక సదస్సు నిర్వహించి వివరాలుంటే చెప్పమని కోరింది.మరోవైపున అదే ప్రభుత్వం కమ్యూనిస్టు చిహ్నాలను పంపిణీ చేస్తూ కమ్యూనిజాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయలేదు, ఏకపక్షంగా రాసిన చరిత్రను, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇంకా అధికారికంగా కొనసాగిస్తూనే వుంది.

    ఈ కారణంగానే పోలీసులు తాజాగా సుత్తీ,కొడవలి గుర్తులున్న టీ షర్టులను విక్రయించేవారిని అరెస్టు చేసి, వాటి తయారీని నిలిపివేయాలని కోరారు.ఈ చర్య కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ చర్యను అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు ఖండిస్తున్నారు. కమ్యూనిస్టు చిహ్నాలను ప్రదర్శిస్తున్న, వ్యాపింప చేస్తున్నవారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని అధ్యక్షుడు జోకోవి ఇండోనేషియా మిలిటరీ, నేషనల్‌ ఇంటలిజెన్స్‌, అటార్నీ జనరల్‌ కార్యాలయాలను ఆదేశించించినట్లు జాతీయ పోలీసు ప్రధాన అధికారి బద్రుదిన్‌ హయతీ వెల్లడించారు.దేశంలో కమ్యూనిస్టు భావజాలం అదుపులేకుండా విస్తరించటం ఆందోళన కలిగిస్తున్నదని బద్రుదిన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. కమ్యూనిజం గురించి చర్చించటం, సమావేశాలు జరపటం వంటి కార్యకలాపాలు పెరగటాన్ని గమనించామన్నారు.ఈ పరిస్ధితులను కొన్ని బాధ్యతారాహిత్య పార్టీలు వినియోగించుకోచూడటాన్ని నిరోధించేందుకు పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి సుత్తీ, కొడవలి గుర్తులున్న టీ షర్టులు ధరించి వున్నా వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఎందుకు వాటిని ధరించారో విచారణ జరుపుతారని చెప్పారు. కమ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. మ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవమని తేలితే అలాంటి వారికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. పోలీసులతో పాటు కమ్యూనిస్టులని అనుమానం వున్నవారి సమాచారం చేరవేసేందుకు ఏజంట్లను కూడా వినియోగిస్తున్నారు. టీషర్టులను అమ్మేవారిని నిర్బంధించటంతో వెల్లువెత్తిన నిరసనలతో దిక్కుతోచని అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి జాన్‌ బౌడీ ఒక ప్రకటన చేస్తూ భద్రతా సిబ్బంది ఈ విషయంలో అతిగా స్పందించారని, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చను పరిరక్షించేందుకు కూడా శ్రద్ధ తీసుకోవాలని అధ్య క్షుడు కోరినట్లు నష్ట నివారణకు ప్రయత్నించారు.

   కమ్యూనిజం పునరుద్ధరణను నిరోధించే పేరుతో పౌర విధుల్లో మిలిటరీ ప్రమేయం ఎక్కువ అవుతోందని అనేక మంది విమర్శిస్తున్నారు. తూర్పు జావాలో ఈనెల మూడవ తేదీన ‘చెరకు తోటల్లో సుత్తీ, కొడవలి ‘ అనే పేరుతో వున్న గ్రంధ కాపీలను మిలిటరీ స్వాధీనం చేసుకుంది. మరొక ప్రాంతంలో గిరిజన సంఘం సభ్యుల వద్ద వామపక్ష సాహిత్యం, కమ్యూనిస్టు గుర్తులున్న టీ షర్టులు ధరించారనే పేరుతో నలుగురిని అరెస్టు చేశారు.

   టీ షర్టులపై ముద్రించేందుకు ఏ గుర్తులు బాగుంటాయో చూద్దామని తాము ఇంటర్నెటలో వెతికామని దానిలో 1990 దశకం నాటి తూర్పు జర్మనీ చిత్రం ఆకర్షణీయం వుండటంతో దానిని తీసుకొని టీ షర్టులపై ముద్రణకు ఇచ్చాం తప్ప ఆ గుర్తుల గురించి వాటిని కలిగి వుంటే ఇలా జరుగుతుందని తమకు తెలియదని వాటిని అమ్మిన చిరు వ్యాపారులు చెప్పారు. పోలీసులు కూడా తరువాత దానిని నిర్ధారించారు.అయితే ఆ చిహ్నాలను ముద్రించిన ఫ్యాక్టరీ యజమానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే జకర్తాలో జరిపిన ఆసియన్‌ సాహిత్య వుత్సవాన్ని కమ్యూనిజం వ్యాప్తి కోసం తలపెట్టారంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు దానిని జరగనీయరాదని డిమాండ్‌ చేశారు.అయితే పోలీసు రక్షణలో అది జరిగింది. ఇదిలా వుండగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ప్రతినిధులు జావా,సుమత్రా దీవులలో 122 సామూహిక సమాధుల వివరాలను వెల్లడించింది. ఇండోనేషియా విశ్వవిద్యాలయ ఆంత్రోపాలజిస్టు దవే లుమెంటా మాట్లాడుతూ పాఠశాలల్లో బోధించినది తప్ప అత్యధికులకు దేశ చరిత్ర అందుబాటులో లేదన్నారు. ప్రభుత్వం అందించిన దానిని అంగీకరించటం తప్ప దాని అర్ధం చేసుకోలేక జనం కమ్యూనిజం గురించి భయపడుతున్నారని అన్నారు. ఆ పాఠాలలో కూడా చరిత్రలో ఏ రోజు ఏం జరిగిందో వరుసగా చెప్పటం తప్ప అలా జరగటానికి కారణాలు, పర్యవసానాల గురించి వాటిలో వుండదని, ప్రస్తుతం వునికిలో లేని కమ్యూనిస్టు పార్టీ గురించి ఏమీ వుండదని తెలిపారు. 1965నాటి సామూహిక హత్యాకాండ గురించి ఏకపక్షంగా చెప్పే కధనాల ప్రకారం కమ్యూనిస్టులు కేవలం అంతరాత్మలు లేని నాస్థికులుగా చిత్రితమైందని దవే చెప్పారు. 1965 తరువాత మిలిటరీతో సహా కొన్ని పార్టీలకు రాజకీయ చట్టబద్దత లభించిందని, వాటికి పైన చెప్పిన చెప్పిన కథనాలను పరిరక్షించటం తప్ప మరొకదానిపట్ల ఆసక్తి లేదంటూ నూతన అధికార వ్యవస్ధ కాలంగా పరిగణించబడుతున్న 1966-1998 మధ్య మిలిటరీకి చెందిన వారిని రాజకీయాలు, వాణిజ్యంలో కూడా అనుమతించారని తీవ్రవాదంతో కూడిన మితవాద శక్తులను ప్రోత్సహించటం ప్రమాదకరమని అన్నారు. యాభయి సంవత్సరా క్రితం సామూహిక హత్యాకాండకు గురైన వారి, లేదా దాని నుంచి తప్పించుకున్నవారి కుటుంబాలపై ఇప్పటికీ నింద, వివక్ష కొనసాగుతోందని ఇండోనేషియా విశ్వవిద్యాలయానికి చెందిన సోషియాలజిస్టు రువైదా నూర్‌ చెప్పారు. ప్రభుత్వం దానిని సంస్థాగతంగా జోక్యం చేసుకొని సరిదిద్దాలన్నారు. కుటుంబం, స్కూలు, మీడియా ద్వారా ఇది జరగాలని చెప్పారు.