Tags

, , , , ,

సత్య

    చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టానికి చుట్టాలుగా వుంటారా ? న్యూఢిల్లీలో మేనెల రెండవ వారంలో పుష్పా శర్మ అనే జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాధానాన్ని ఫోర్జరీ చేశారని, దానిని పత్రికలో ప్రకటించి తప్పుడు సమాచారంతో మతాల మధ్య విబేధాలు రెచ్చగొట్టటానికి ప్రయత్నించారనే ఆరోపణలతో నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా దినం సందర్భంగా శిక్షకుల ఎంపికలో ఒక్క ముస్లింనుకూడా చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర కారమే అలా చేసినట్లు ఆయుష్‌ మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారన్నది పోలీసుల అభియోగం. అది నిజమే అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు.ఈ వుదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరు అసాధారణంగా వుంది. ఆ వార్తను ప్రచురించిన పత్రిక ‘మిలీ గజెట్‌ ‘ అనే పత్రికకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందినట్లు పేర్కొన్న సదరు శర్మను అనేక మార్లు పోలీసులు ప్రశ్నించారు. ఎలాంటి వారంటు లేకుండానే అరెస్టు చేసే బెయిలు రాని సెక్షన్‌ 153ఏ కింద కేసు బనాయించారు.

     కానీ ఇదే పోలీసులు ఫిబ్రవరి నెలలో జెఎన్‌యు వుదంతంలో తిమ్మిని బమ్మిని చేసి చేయని దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా రూపొందించిన వీడియోలను పదే పదే ప్రసారం చేసిన జాతీయ టీవీ ఛానల్స్‌పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.ఆ వీడియోల కారణంగా దేశమంతటా ప్రతిష్టాత్మక జెఎన్‌యు పరువు పోయింది, దానిలో చదువుకొనే విద్యార్ధులు దేశద్రోహులుగా దేశం ముందు ప్రదర్శితమయ్యారు. విద్యార్ధి సంఘనేత కన్నయ్య కుమార్‌తో సహా అనేక మందిపై దేశద్రోహ నేరం కేసులు మోపి అరెస్టులు చేశారు. ఢిల్లీ కోర్టుల వద్ద దేశ భక్తుల ముసుగులో వున్న లాయర్లు విద్యార్ధులు, ఆవార్తలను కవర్‌ చేయటానికి వచ్చిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటాన్ని దేశమంతా చూసింది. భారత మాతాకీ జై అన్న నోళ్లతోనే విద్యార్ధుల అరెస్టులు అక్రమం అన్న మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని బెదిరించారు. దేశమంతటా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అందుకు దోహదం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు తోడ్పడిన వీడియో టేపులను తయారు చేసిన వారు, వాటిని ప్రసారం కోట్లాది మంది జనంలో విద్వేషాన్ని నింపిన సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, టీవీ ఛానల్స్‌ యాజమాన్యాలు, ఆ తప్పుడు వీడియోల ఆధారంగా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు యంత్రాంగంపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అంతే కాదు వుమర్‌ ఖాలిద్‌ అనే విద్యార్ధికి వుగ్రవాద సంస్ధతో సంబంధాలు వున్నాయని తప్పుడు వార్తలను ప్రచురించిన పత్రికలు, ప్రసారం చేసిన టీవీలపై కూడా ఎలాంటి చర్యలు లేవు. తనతో పాటు అనిర్‌బన్‌ భట్టాచార్య అనే విద్యార్ధిపై ప్రచురించిన తప్పుడు వార్తల కారణంగా తాము కనిపిస్తే చంపే విధంగా జనంలో ఆగ్రహం వెల్లడైందని వారు స్వయంగా కోర్టుకు విన్నవించుకున్నారే. అంతటి తీవ్రమైన చర్యలు అక్రమాలుగా కేంద్ర ప్రభుత్వానికి కనిపించ లేదా ? ఒక జర్నలిస్టు పుష్పా శర్మ ఫోర్జరీ(రుజువు కావాల్సి వుంది) కారణంగా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తే, మరో ఫోర్జరీ వీడియోల ద్వారా రాజకీయంగా లాభపడేందుకు అదే ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకేనా వీడియో అక్రమాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ?