Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

    ఐదు సంవత్సరాల తరువాత కేరళలో తిరిగి అధికారానికి రావటంతో సిపిఎంతో సహా అన్ని వామపక్షాలు, శక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తిరిగి అధికారానికి రాకపోయినా గతం కంటే మెరుగైన ఫలితాలను అయినా వామపక్షాలు సాధిస్తాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. గతంలో వున్న స్ధానాలను కోల్పోయాయి. అందువలన కేరళ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేవు. ఇది భౌతిక వాస్తవం. కేరళలో మూడింట రెండు వంతుల మెజారిటీకి కేవలం రెండు స్ధానాలు మాత్రమే తగ్గాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) విజయానికి వున్న ప్రాధాన్యతను ఎవరూ తగ్గించజాలరు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు కడుపు మంటతో ఏడవలేక నవ్వు ముఖం పెడతారు. అది సహజమే, అర్ధం చేసుకోవాలి అంతే. ఇదే సందర్భంలో మరో కోణం నుంచి కూడా ఫలితాలను విశ్లేషించటం అవసరం.అది ఈ దేశంలో అభ్యుదయ పురోగామి శక్తులు మరింతగా పెరగాలని కోరుకొనే వారందరూ చేయాలి. ఓటమి చెందినపుడు ఎంత తీవ్రంగా అంతర్మధనం చేయాలో గెలిచినపుడు దానిని కొనసాగించటానికి అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సి వుంటుంది.

     కేరళలో ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఎక్కువగా సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమికి సీట్లు  వచ్చాయి.ఎల్‌డిఎఫ్‌ ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం తెచ్చుకుంది. కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుపొందింది. త్రిసూర్‌, పథ్థానం తిట్ట, అలప్పూజ, వైనాడ్‌ జిల్లాలో ఒక సీటు మినహా , కన్నూరు, కాలికట్‌ జిల్లాలో రెండేసి తప్ప అన్నింటినీ గెలుచుకుంది. ఇదే సమయంలో ఓటింగ్‌ తీరు తెన్నులు సిపిఎంకు ఒక పెద్ద సవాలును కూడా విసిరాయి.

1.గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు దాదాపు ఒక శాతం తక్కువగా 43.1శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో అధికారం రానప్పటికీ కాసరగోడ్‌, కోజికోడ్‌, ఇడుక్కి, కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఒక్క కొల్లం జిల్లాలోనే ఆ విజయాన్ని కొనసాగించింది.

2. అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గి 45 నుంచి 38.78శాతానికి పడిపోయాయి. పోటా పోటీగా కేరళలో జరిగే ఎన్నికలలో రెండు కూటముల మధ్య ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల తేడా వుండటం, రెండు కూటములకూ ఓటింగ్‌ శాతం తగ్గటం కూడా ఇదే ప్రధమం.

3.బిజెపి నాయకత్వంలోని కూటమి గత ఎన్నికలలో వచ్చిన ఆరుశాతాన్ని 15కు పెంచుకుంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు, కొద్ది నెలల కితం జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికల కంటే కూడా అదనంగా ఓట్లు తెచ్చుకొంది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో ఒక సీటు గెలుచుకోవటంతో పాటు ఏడు చోట్ల రెండవ స్ధానంలో నిలిచింది.

     కాంగ్రెస్‌ మీద వున్న వ్యతిరేకతతో పాటు బిజెపి గణనీయంగా ఓట్లు చీల్చటం కూడా ఎల్‌డిఎఫ్‌కు కలసి వచ్చి ఘన విజయం సాధించిందని ఓటింగ్‌ తీరుతెన్నులను బట్టి కొందరు విశ్లేషించారు. గతంలో అనేక సందర్బాలలో కమ్యూనిస్టులను అధికారానికి రానివ్వకూడదన్న గుడ్డి వ్యతిరేకతతో బిజెపి తన ఓట్లను కాంగ్రెస్‌కు బదలాయించిందన్నది బహిరంగ రహస్యం.ఈ సారి ఎలాగైనా బిజెపి పర్మనెంటు అభ్యర్ధిగా పేరు తెచ్చుకున్న ఓ రాజగోపాలన్‌ను గెలిపించేందుకు తోడ్పడటం ద్వారా బిజెపి హిందూత్వ ఓటర్ల మద్దతు పొందేందుకు కాంగ్రెస్‌ ఆయనపై బలహీనమైన అభ్యర్ధిని నిలిపి పరోక్ష సందేశం పంపింది. అయితే బిజెపి కాంగ్రెస్‌ మద్దతు పొంది తొలిసారిగా కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టింది తప్ప మొత్తం మీద తన ఓట్లను బదలాయించినట్లు కనిపించటం లేదు. అయితే గతంలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అనేక చోట్ల ఈ సారి బిజెపి ఓట్లు తగ్గాయి. అంటే అక్కడ ఆ ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయించారా ? చూడాల్సి వుంది. కాంగ్రెస్‌, బిజెపి చేసిన తప్పుడు ప్రచారాల కారణంగా సిపిఎంకు హిందువుల ఓట్లతో పాటు అనేక చోట్ల మైనారిటీలు కూడా మద్దతు ఇచ్చినట్లు ఫలితాల తీరు తెన్నులపై విశ్లేషకులు చెబుతున్నారు.’ సాంప్రదాయంగా సిపిఎంకు ఓటు చేసే హిందువులలో చీలిక తెచ్చేందుకు చివరి దశలో బిజెపిఏ తనకు ప్రధాన ప్రత్యర్ధి అని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. కానీ ఫలితాలను చూస్తే హిందువులు మెజారిటీ వున్న ప్రాంతాలతో పాటు బిజెపి పెరుగుదల కారణంగా మైనారిటీలు ఎక్కువగా వున్న కొన్ని చోట్ల కూడా సిపిఎం తన ఓట్లను పెంచుకున్నట్లు వెల్లడి అవుతోందని’ డెక్కన్‌ క్రానికల్‌ కేరళ ఎడిషన్‌ సంపాదకుడు కెజె జాకబ్‌ అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు కారణంగానే ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మెజారిటీ 70వేల నుంచి 27వేలకు పడిపోయిందన్నారు.

    బెంగాల్లో ఫలితాలు వామపక్షాలను తీవ్రంగా పునరాలోచనలో పడవేస్తాయి. రెండు సంవత్సరాల క్రితం పార్లమెంట్‌ ఎన్నికలలో 16శాతం ఓట్లు పొందిన బిజెపి అసెంబ్లీలో 10శాతానికి పడిపోయింది.అవి తృణమూల్‌ కాంగ్రెస్‌కు బదిలీ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమికి కారణాలుగా చెబుతూ వస్తున్న కొన్ని వ్యాఖ్యలను వామపక్షాలు నిశితంగా పరిశీలించాల్సి వుంది. మమతాబెనర్జీ కిలో రెండు రూపాయల బియ్యం పధకం ప్రవేశపెట్టి శారద, నారద వ్యతిరేకతను అధిగమించారన్నది ఒకటి. దేశవ్యాపితంగా ఆహార భద్రత కావాలని డిమాండ్‌ చేసిన వామపక్షాలు బెంగాల్‌లో తమ మూడున్నర దశాబ్దాల పాలనలో సబ్సిడీ బియ్యం పధకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. బాలికలకు స్కాలర్‌ షిప్పులు, సైకిళ్లు ఇచ్చారని మరికొన్ని ఇలాంటివే వున్నాయి. అన్నింటినీ ప్రజాకర్షక పధకాలుగా కొట్టివేయలేము. సిపిఎం కార్యక్రమం జనతా ప్రజాస్వామిక విప్లవ దశకు చేరటం తప్ప నేరుగా సోషలిజం కాదు. అటువంటిది ఒక రాష్ట్రంలో మౌలిక మార్పులను చేయలేని పరిస్థితులలో వున్నంతలో ప్రజలకు వుపశమనం కలిగించటం అవసరమా లేదా ? అందువలన బెంగాల్లో గతంలో ఏం జరిగింది అని అంతర్గతంగా మధించుకోవటంతప్ప ఇప్పుడు బహిరంగంగా చర్చించి ప్రయోజనం లేదు. అధికారంలో వున్న త్రిపుర, కేరళలో అయినా అలాంటి వైఫల్యాలు, లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.

    రెండవది కాంగ్రెస్‌ ఓటింగ్‌ పూర్తిగా బదిలీకాలేదన్న వాదన. దీని గురించి ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. బదిలీ అవుతాయి అని ఎవరైనా భావిస్తేనే భ్రమలకు లోనయినట్లుగా పరిగణించాలి. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, ఇతర వామపక్షపార్టీలతో కలిగిన అనుభవం ఏమిటి? సిపిఎం ఓట్లు పూర్తిగా, నిజాయితీగా బదిలీ అయ్యాయి తప్ప ఇతర పార్టీల నుంచి అవి మిత్రపక్షాలుగా వున్నపుడే పూర్తిగా బదిలీ జరగలేదని తేలింది. అలాంటిది బెంగాల్లో గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పనిచేసిన కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఓట్లు పూర్తిగా బదిలీ అవుతాయని భావించటం అత్యాశే అవుతుంది. సాధారణ పరిస్థితులలో పార్టీ పనిచేయటానికి కూడా అవకాశం లేని స్ధితిలో ప్రజాస్వామ్య పరిస్ధితుల పునరుద్దరణకోసం చేసుకున్న సర్దుబాటు తప్ప అది మరొకటి కాదు. కమ్యూనిస్టులు ప్రపంచంలో అనేక చోట్ల అంతకంటే తీవ్ర నిర్బంధం, ప్రతికూల పరిస్థితులలో పనిచేస్తున్నారు. అందువలన బెంగాల్లో వామపక్షాలు రాబోయే అయిదు సంవత్సరాలలో మరిన్ని దాడులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. నూతన పరిస్ధితులకు అనుగుణంగా పని చేసి తిరిగి ప్రజల విశ్వాసం పొందటం తప్ప మరొక మార్గం లేదు. అది ఎలాగన్నదే సమస్య.

     ఫలితాలకు సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణలు రాబోయే రోజుల్లో వెలువడతాయి. వామపక్షాల ముందున్న ఒక తీవ్ర సవాలును అవి ఎలా అధిగమిస్తాయన్నదే ప్రశ్న. అదే మిటంటే గత ఎన్నికల ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే స్పష్టం అవుతుంది. వర్గరీత్యా ఒక శాతం పెట్టుబడిదారులు, భూస్వాములు అయితే 99శాతం కార్మికవర్గం, ఇతర కష్టజీవులే. అటువంటపుడు కమ్యూనిస్టులు పొందుతున్న ఓటింగ్‌ శాతం దానిని ప్రతిబింబించటం లేదు. అనేక మంది శ్రామికులు కమ్యూనిస్టులు కాని పార్టీల, కుల మత శక్తుల వెనుక వున్నారు. ఓడిపోయిన ప్రతి సారీ కమ్యూనిస్టులు ఆత్మశోధన చేసుకొని బలహీనతను అధిగమిస్తామని చెబుతూనే వున్నారు. కానీ తరువాత అది ప్రతిబింబించటం లేదు. కమ్యూనిస్టుల బలం ఒక పరిధికి మించి పెరగటం లేదు. అలాగని దీన్ని గురించి గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు గానీ తీవ్రంగా పరిశీలించకతప్పదు. వివరాలు చూడండి. కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌,బిజెపి ఓట్ల శాతాలు ఇలా వున్నాయి.

                1987      1991      1996     2001     2006     2011     2016

ఎల్‌డిఎఫ్‌    44.65     45.80    44.69    43.70     48.60    44.83   43.10

యుడిఎఫ్‌    44.04     48.07    43.58    49.27    42.98     45.90   38.78

బిజెపి                                                5.20       4.75      6.00    15.00

     గత ఏడు ఎన్నికలలో తొలిసారిగా 2016లో అటు ఎల్‌డిఎఫ్‌ ఇటు యుడిఎఫ్‌ రెండు కూటములు అతి తక్కువ ఓట్లు పొందాయి.ఏడు ఎన్నికల సగటు ఎల్‌డిఎఫ్‌కు 45, యుడిఎఫ్‌కు 44.6శాతంగా వున్నాయి. ఎల్‌డిఎఫ్‌ గరిష్టంగా 2006లో 48.6శాతం, యుడిఎఫ్‌ 2001లో 49.27 శాతం ఓట్లు పొందాయి.

     పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2006 వరకు జరిగిన ఎన్నికలలో వామపక్ష సంఘటన సగటున 49.82 శాతం ఓట్లు పొందింది. ఏడు ఎన్నికలలో రెండు సార్లు మాత్రమే 50 శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది. బెంగాల్‌, కేరళలో రెండు చోట్లా సగం మంది కంటే తక్కువ ఓటర్ల మద్దతు మాత్రమే వామపక్షాలు ఇంతకాలం పొందగలిగాయి. బెంగాల్లో గత రెండు ఎన్నికలలో వామపక్ష ఓటింగ్‌ గణనీయంగా తగ్గిపోయింది. తిరిగి ప్రజా మద్దతు పొందటం ఎలా అన్నది ఆ పార్టీలు చూసుకుంటాయి, అది వేరే విషయం. బాగా వున్న రోజులలో కూడా వాటి బలం అంతకు మించి పెరగ లేదు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో బెంగాల్లో పోయిన పునాదిని తిరిగి సంపాదించటం ఒక సవాలైతే కేరళలో పునాదిని మరింత పెంచుకోవటం అంతకంటే పెద్ద సవాలు. కేరళలో వున్న సామాజిక పరిసిస్థితులలో 43శాతం మైనారిటీ జనాభాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని మరిచి పోరాదు. మైనారిటీలందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కానప్పటికీ వారు మెజారిటీగా వున్న ప్రాంతాలలో ఎన్నికల ఫలితాలను చూసినపుడు మతశక్తుల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతశక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోంది.అదే సమయంలో కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో రాజీపడటం, కుమ్మక్కు కావటమే ఇప్పటివరకు దాని చరిత్రగా వుంది. ప్రపంచంలో మత ధోరణులతో పాటు నయా వుదార వాద విధానాల ప్రభావం అన్ని తరగతులలో బలంగా వ్యాపిస్తున్న తరుణమిది.అందుకే మన దేశంలో మైనారిటీ మతాలకు చెందిన కొన్ని శక్తులు బిజెపిని చూసి ఒకవైపు భయపడుతూనే మరోవైపు దానిని సమర్ధించటానికి కూడా పరిమితంగానే అయినప్పటికీ వెనుకాడటం లేదు. ఆ తరగతులలో మధనం జరుగుతోంది. దీనికి కేరళ మినహాయింపు అవుతుందా ?