Tags
Acheedin, BJP, CHANDRABABU, CHANDRABABU TWO YEARS RULE, failure Modi, flying Modi, KCR, KCR TWO YEARS RULE, Narendra Modi, NDA, NDA Two years rule, Two years Modi rule
అచ్చే దిన్ ఆమడ దూరం
ఎం కోటేశ్వరరావు
కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. మూడు చోట్లా అధికారానికి వచ్చిన వారు రాజకీయ, పాలనా రంగాలకు కొత్తవారు కాదు. అందువలన అనుభవాల గురించి మాట్లాడుకోవటంలో అర్ధం వుండదు. ఈ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏమిటి ? జనానికి వాటి పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. గత పాతిక సంవత్సరాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ నయా వుదారవాద విధానాల చట్రంలో పనిచేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్ లేదా బిజెపి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాలు ఏవి వున్నా ఎడమ చేయికి,పురచేయికి వున్న తేడా తప్ప వేరు కాదు. నయా వుదార వాద విధానాలు విదేశీ కార్పొరేట్లు, అంతర్జాతీయ సంస్ధలైన ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్ధల విధానాలకు స్వదేశీ ముద్రవేసి అమలు జరుపుతున్నారన్నది స్పష్టమైంది. వాటి ప్రకారం దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన అమలు జరపాల్సి వుంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం వుంటే విదేశీ కంపెనీలకు తలనొప్పి. పన్ను రేట్లు, చట్టాలు ఒకే విధంగా వుండేట్లు ఇప్పటికే చూశారు. వాట్ బదులు జిఎస్‌టిని అమలు జరపాలన్నది కూడా దానిలో భాగమే.ఇలా ఎన్నో వున్నాయి. వాటి గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయికి ఎక్కువ, కేంద్రానికి తక్కువ.
ఎవరు అవునన్నా కాదన్నా , అభిమానులు గింజుకున్నా ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్ పట్ల మోజు తగ్గిపోతున్నది.వెంకయ్య నాయుడి వంటి వంది మాగధులు నరేంద్రమోడీని దేవదూత, దేవుడు అని పొగడవచ్చు. కేంద్రంలో లేని ప్రత్యేకత ఏమంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను, వారి కుటుంబ సభ్యులను కూడా పొగడాల్సి రావటం బోనస్ వంటిది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు నరేంద్రమోడీ తమ పాలిట బంగారు పళ్లెంతో వస్తారని రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయంలో వారు సంబరాలు చేసుకున్నారు.తొలి ఏడాది ఫ్లయింగ్ మోడీగా పేరు తెచ్చుకున్న ప్రధాని రెండో ఏడాది ఫెయిల్యూర్ మోడీగా పిలిపించుకుంటున్నారు. మనువాదం పట్ల వున్న శ్రద్ధ జనవాదం గురించి లేకపోవటంతో అటు పారిశ్రామికవేత్తలు, బడా వాణిజ్యవేత్తలు, సామాన్య జనం కూడా అసంతృప్తికి గురవుతున్నారు. విదేశీయులకు మన దేశం అంటే కనిపించేది నరేంద్రమోడీ తప్ప రాష్ట్రాలు కాదు. అందువలన శరభ శరభ దశ్శరభ శరభ అంటూ వీరతాళ్లతో చంద్రబాబు, కెసిఆర్ వంటి వారు విదేశాలలో, స్వదేశంలో ఎన్ని వీరంగాలు వేసినా వారిని కొమ్ముగాసే స్వరాష్ట్రాల మీడియాను తప్ప విదేశీ కార్పొరేట్లను రంజింపచేయవు.
తాను అధికారానికి వస్తే గుజరాత్ మోడల్‌ను దేశమంతటికీ విస్తరిస్తానని మోడీ చెప్పారు. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావన కూడా చేయటం లేదు. అమలు జరుపుతున్నట్లా లేదా కనీసం ఆ నమూనా ఏమిటో అయినా జనానికి వివరించారా అంటే లేదు. చిత్రం ఏమిటంటే గుజరాత్ మోడల్ బండారం గురించి అనేక మంది అనేక సందర్భాలలో వెల్లడించారు. ఇక్కడ స్ధలాభావం వలన దాని గురించి వివరించటం లేదు. మోడీ మహాశయుడు చెప్పినట్లు అదొక ఆదర్శ నమూనా, వాస్తవమే అయితే అందుకు దోహదం చేసింది పంచవర్ష ప్రణాళికలే. నరేంద్రమోడీ అధికారానికి రాగానే అసలు ఆ విధానాన్నే రద్దు చేశారు. నీతి ఆయోగ్ పేరుతో ప్రణాళికా సంఘాన్ని తెరమరుగు చేశారు. రెండు సంవత్సరాలు సాము చేసి ఇప్పుడు చెబుతున్నదాని ప్రకారం పదిహేను సంవత్సరాల పాటు అమలు జరిపే ఒక స్వప్న పత్రాన్ని రూపొందించబోతున్నారు.అది 2018 నుంచి అమలులోకి వస్తుంది. దాని ప్రకారం తొలి ఏడు సంవత్సరాలకు ‘ జాతీయ అభివృద్ధి అజెండా’ను రూపొందిస్తారు. దానిని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తారు. దాని ప్రకారం తొలి సమీక్ష 2020లో జరుగుతుంది. దీన్నే చిల్లి కాదు తూటు అంటారు. మరి అప్పటి వరకు అంటే 2018 వరకు ఏ విధానాలను అమలు జరుపుతారు? విఫల కాంగ్రెస్ విధానాలను కొనసాగిస్తున్నట్లా ?
రెండు సంవత్సరాల పాలనలో పరిశ్రమలు, సేవలు, నిర్మాణం,వ్యవసాయం మొదలైన రంగాలలో వాణిజ్య అవకాశాల తీరుతెన్నుల గురించి విశ్లేషణ జరిపిన జర్మనీకి చెందిన ఎంఎన్‌ఐ బిజినెస్ సూచిక 2014లో గరిష్టంగా 80.3 వుండగా ఈఏడాది ఏప్రిల్ నెలలో 69.6కు దిగజారింది. ఇదే కాలంలో చైనా సూచిక 50-55 పాయింట్ల మధ్య కదలాడినట్లు అదే సంస్ధ తెలిపింది. ఏ దేశంలో ఎలాంటి పరిస్ధితులు వున్నాయో ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో సూచిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల నిమిత్తం ఇలాంటి సూచికలను రూపొందిస్తారు. వాటి ఆధారంగా పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకుంటారు. దేశం మొత్తానికి ఈ సూచికను రూపొందించినప్పటికీ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేవారు కూడా వీటిని గమనంలోకి తీసుకుంటారు. మన రిజర్వుబ్యాంకు విశ్లేషణ ప్రకారం వాణిజ్య ఆశల సూచిక 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో 117.9 వుండగా 2016 తొలి మూడు నెలల్లో 111 పాయింట్లకు పడిపోయింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ 8.2శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని గతంలో చెప్పారు. రిజర్వుబ్యాంకు తాజా జోస్యం ప్రకారం సమీప భవిష్యత్‌లో ఆ అంకెను చేరుకొనే అవకాశం లేదని ఆచరణ వెల్లడిస్తోంది.
అంతర్జాతీయంగా వినియోగదారుల విశ్వాసాన్ని అభివృద్ధి సూచికలలో ఒకదానిగా పరిగణిస్తున్నారు.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 98.2 వుండగా తరువాత అది 109కి పెరిగి ప్రస్తుతం 104.1 పడిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన పరిస్థితులకు ఇది ప్రతిబింబం అని భావిస్తున్నారు.ఈ ఏడాది మంచి వర్షాలు పడితే, కేంద్ర ప్రభుత్వం వుద్యోగులకు వేతనపెంపుదల చేస్తే సూచిక తిరిగి పెరగవచ్చని వాణిజ్యవేత్తలు ఆశిస్తున్నారు. పారిశ్రామిక వుత్పత్తి సామర్ధ్య వినియోగ సూచిక కూడా దేశ పరిస్ధితికి దర్పణం పడుతుంది. 2013-14 చివరి మూడు నెలల్లో ఈ సూచిక 76శాతం వుండగా 2015-16 మూడవ త్రైమాసికంలో 72.5 పాయింట్లకు పడిపోయింది. పారిశ్రామిక ఆర్డర్లు కూడా సగటున ప్రతి మూడు నెలలకు 1.45 బిలియన్ రూపాయల నుంచి 1.15 బిలియన్లకు పడిపోయింది. అంటే పెట్టుబడులను ఆకర్షించే పరిస్ధితి లేదన్నది దీని అర్ధం. ఈ పూర్వరంగంలోనే చంద్రబాబు నాయుడు, లోకేష్, కెసిఆర్, కెటిఆర్‌లు ఎన్ని రాష్ట్రాలు, దేశాలు తిరిగినా వాగ్దానాలు తప్ప పెట్టుబడులు వచ్చేఅవకాశాలు ఏమేరకు వుంటాయో అర్ధం చేసుకోవచ్చు.గడచిన 24నెలల పాలనలో వరుసగా 17వ నెలలో కూడా మన ఎగుమతులు పడిపోయాయని అధికారికంగా ప్రకటించారు.2014-15తో పోల్చితే గతేడాది ఎగుమతుల మొత్తం 310 బిలియన్ డాలర్ల నుంచి 261 బిలియన్లకు పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.మోడీ అధికారానికి వచ్చిన తరువాత మన రూపాయి పతనం చెంది జనం మీద భారమూ పెరిగింది, అదే సమయంలో మన ఎగుమతులూ పడి పోయాయి. రూపాయి పతనమౌతుంటే గుడ్లప్పగించి చూడటం తప్ప నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో మన దిగుమతులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి కనుక విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సమస్య తీవ్రత కూడా తగ్గింది. ఈ స్థితిలో మేకిన్ ఇండియా గురించి చెప్పుకోవటం అంటే నరేంద్రమోడీ ఘోర వైఫల్యం గురించి గుర్తు చేయటమే.
చిత్రం ఏమిటంటే ఆర్ధిక రంగంలో ఇన్ని వైఫల్యాలు,దిగజారుడు కనిపిస్తున్నప్పటికీ కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లు ఇప్పటికీ బిజెపి అధికార ప్రతినిధి నరేంద్ర తనేజా మాట్లాడుతున్నారు. అసాధారణ రీతిలో ఆర్ధికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవటం ప్రతిపక్షాలకు కనిపించటం లేదని, కోమాలోకి పోయిన ఆర్ధిక వ్యవస్ధను చైతన్యంలోకి తీసుకువచ్చి ఇప్పుడు మరమ్మతులు ప్రారంభించి మార్పుకోసం పనిచేస్తున్నామని నమ్మబలుకుతున్నారు.
నరేంద్రమోడీ పాలనలో ఒక్క అవినీతి వుదంతమైనా వున్నదా? అవినీతి సూచికలో మన స్థానం తగ్గిందని ప్రకటించటం చూడ లేదా అని ఆయన అభిమానులు అడ్డు సవాళ్లు విసురుతుంటారు. నిజమే, అసలు కొత్తగా ఏదైనా పనిచేస్తే కదా అవినీతి వున్నదీ లేనిదీ తెలిసేది. తొమ్మిదివేల కోట్లరూపాయలు ఎగవేసిన విజయ మాల్య వుదంతం ఏమి తెలియ చేస్తోంది. దాని గురించి అడిగితే అతగాడికి కాంగ్రెస్ హయాంలో రుణాలు ఇచ్చారని తెలివిగా సమాధానమిచ్చారు.అదే పెద్దమనిషి దేశం నుంచి పరారీ అవుతుంటే దొంగగారు పోతుంటే చూసి చెప్పమన్నారు తప్ప పట్టుకోమనలేదని నిఘా సంస్థలు చెప్పటం చూస్తే తెలివితక్కువ తనానికి సరికొత్త వుదాహరణగా మోడీ సర్కార్‌ను కొందరు వర్ణించారు. వీడ్కోలు ఇచ్చి మరీ విదేశాలకు పంపిన నిర్వాకాన్ని చూసి దేశం నివ్వెర పోతోంది. నిజానికి ఇది తెలివితక్కువ తనం కాదు, వున్నత స్థానాలలోని పెద్దల ప్రాపకం లేకుండా పట్టుకోవాల్సిన వ్యవస్థలను దానికి బదులు ఎటువెళుతున్నారో చెబితే చాలని ఆదేశాలు జారీచేయించింది ఎవరు? రేపు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తారనగా ముందురోజే దేశం నుంచి పరారీ కావటానికి పెద్దల సహకారంలేకుండా సాధ్యమా? అధికారం వున్నంత కాలం కాంగ్రెస్‌ను వుపయోగించుకొని పోగానే బిజెపిలో చేరిన మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కూడా విజయమాల్యను ఆదర్శంగా తీసుకున్న పెద్దమనిషే,తమ దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది ధర్నా చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త నివేదన ఆధారంగా బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప పదవి నుంచి తప్పుకున్న విషయం లోకవిదితం. తిరిగి అదే పెద్ద మనిషిని ఆ పార్టీ అందలమెక్కించించింది. ఇలాంటి వారందరినీ పార్టీలో చేర్చుకుంటూ అవినీతి వ్యతిరేక కబుర్లు చెబితే ప్రయోజనం వుందా ? కాంగ్రెస్ హయాంలో అవినీతి అక్రమాలపై విచారణను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత మందిని శిక్షించారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదా ? గొప్పగా చెబుతున్న గుజరాత్ మోడల్ ఏమిటి, అప్పనంగా ప్రకృతి సంపదలైన నీరు, భూముల వంటి వాటిని పెట్టుబడిదారులకు కట్టపెట్టమేగా ? దాన్ని ఏమంటారు ? వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతోంది . చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ అవినీతి గురించి ఎన్నికలపుడూ, ఇప్పుడూ నానా యాగీ చేశారు, చేస్తున్నారు. కానీ గత రెండు సంవత్సరాలలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఫిరాయింపులకు ప్రోత్సహించి తన పార్టీలో కలుపుకొనేందుకు చూపిన శ్రద్ధ తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు చూపటం లేదేమి? చంద్రశేఖరరావు కూడా కాంగ్రెస్ అవినీతి గురించి అలాగే కబుర్లు చెప్పారు. అక్కడ కూడా జరుగుతున్నది అదే ఫిరాయింపులు, ఫిరాయింపులు.
ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులు గతేడాది నాలుగవ త్రైమాసిక ఫలితాల ప్రకారం ఏడువేల కోట్లరూపాయలను నష్టపోయాయి. అధికారానికి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ సర్కార్ ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ కనిపించటం లేదు. బ్యాంకులకు వుద్ధేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు చట్ట సవరణలు ప్రతిపాదించటానికేే రెండు సంవత్సరాలు పట్టిందంటే దున్నపోతు మీద వానపడ్డట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపియే హయాంలో 2008-13 సంవత్సరాలలో బ్యాంకుల నిరర్ధక ఆస్థుల సగటు 2.6శాతం వుండగా తమ అసలైన ప్రతినిధి మోడీ అనుకున్నారేమో పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రెండు సంవత్సరాలలో వాటిని 4.5శాతానికి పెంచి ఎంతో లబ్దిపొందారు, 2008లో 2.3శాతంగా వున్నవి కాస్తా 2015 నాటికి 4.3 శాతానికి పెరిగాయి. వుద్ధేశ్యపూర్వంగా రుణాలు ఎగవేసిన పెద్ద మనుషులు 2015 డిసెంబరు నాటికి 7,686 మంది వుంటే వారి నుంచి రావాల్సిన సొమ్ము 66వేల కోట్ల రూపాయలు. అందువలన కాంగ్రెస్ హయాంలో రుణాలు ఇచ్చారన్నది సాకు మాత్రమే వారి మీద చర్య తీసుకుంటే, డబ్బువసూలు చేస్తే వీరికి ఎవరు అడ్డుపడ్డారు? అవినీతికి పాల్పడటం ఎంత నేరమో పాలకులుగా వుండి అవినీతి పరులను వుపేక్షించటం కూడా దానితో సమానమైన నేరమే అవుతుంది.సుగర్, బిపి కవల పిల్లల వంటివి. అలాగే పెట్టుబడిదారీ విధానంతో అవినీతి పెనవేసుకొనే వుంటుంది. అందుకే అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నట్లు ఎవరి గురించి అయినా ముందే సంబరపడిన వారు తరువాత విచారించకతప్పదు.
జపాన్‌లో పిల్లలకు వేసే డైపర్ల కంటే వృద్ధులకు వేస్తున్న వాటి సంఖ్య పెరిగిపోతోంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ముంచుకు వస్తున్న వృద్ధాప్య సమస్యను ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్నాయి. మన దేశంలో పశు ‘వృద్ధాప్యం’ రైతాంగానికి, కొందరు వృత్తిదారులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ సర్కార్ కొత్తగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగేస్తున్నారని మహారాష్ట్రలో కరువు ప్రాంతాల రైతాంగం వాపోతోంది. అనేక రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం కారణంగా వ్యవసాయానికి, పాడికి పనికిరాని పశువులను వదిలించుకోవటం రైతాంగానికి కొత్త కష్టాలు తెచ్చి పెడుతోంది. పశువుల ధరలు సగానికి సగం పడిపోయాయి. ప్రయోజనం లేని పశువులకు నీరు, మేత అందించటం పెద్ద సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్ చేసిన వ్యాఖ్య బడా పారిశ్రామికవేత్తలలో నరేంద్రమోడీ విధానాల పట్ల వున్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తి, శక్తి కాదు.’ కొన్ని అంశాలు అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి, వుదాహరణకు కొన్ని రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం. ఇది స్పష్టంగా వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిని దెబ్బతీస్తోంది, ఎందుకంటే ఈ వృధాగా వున్న ఆవులను మనం ఏమి చేసుకుంటాం, ఇది వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది,ఎందుకంటే ఇది అనేక మంది రైతులకు మంచి ఆదాయ వనరు, అందువలన ఆ చర్య ప్రతికూలం. వేదకాలంలో కూడా భారతీయులు గొడ్డు మాంసం తినేవారు, కరవు పరిస్థితులు ఏర్పడినపుడు రైతులు పశువులను వధశాలలకు తరలించేవారు.’ అని చెప్పారు. దేశంలోని 24 రాష్ట్రాలలో జంతు వధ నిషేధం, జరిమానాలు, ఇతరంగా ఏదో ఒక రూపంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్-డిసెంబరు మాసాలలో పశువుల ధరలు 13శాతం పడిపోయాయని రాయిటర్ వార్తా సంస్ధ తెలిపింది.
రాజకీయ రాజధాని న్యూఢిల్లీ అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబై.మహారాష్ట్రలోని బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ‘ గొడ్డు మాంసం, మరాఠీ చిత్రాలు తరువాత ఏమిటి; మధ్యాహ్న భోజనంలో విధిగా వడపావ్ తినాలి, మరాఠీ మాట్లాడాలి, ప్రతి రోజూ దేవాలయాలను సందర్శించాలనే చట్టాలు చేస్తారేమో అని పారిశ్రామికవేత్త హర్ష గోయంకా వ్యాఖ్యానించారు.’ భారత్ ఇప్పుడు భవిష్యత్‌లో వెలిగిపోవాలంటే జనానికి ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ వుండాలి.ప్రభుత్వం పర్యవేక్షణ కార్యకలాపాలకు పరిమితం కావాలి, జనం ఏం చేయాలో చెప్పాల్సిన పాత్ర ధరించకూడదు’ అని రతన్ టాటా ఈ ఏడాది జనవరిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఒక పార్టీ మరొక పార్టీ విధానాలను విమర్శించటం ప్రజాస్వామ్య పద్దతి. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షం లేకుండా చేసుకోవటం క్షంతవ్యం కాదు. కానీ అధికార రాజకీయాలలో ఒక్క వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ విలువలను పాటించటం లేదు. కేరళ, బెంగాల్,త్రిపుర రాష్ట్రాలలో ఎవరైనా ఒకరో అరో వామపక్షాల నుంచి ఇతర పార్టీలలో చేరటం తప్ప ఇతర పార్టీల నుంచి వామపక్షాలు ఫిరాయించిన వుదాహరణలు లేవని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్ అధికారంలో వున్నపుడు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరచటం, ఫిరాయింపులను ప్రోత్సహించాటాన్ని బిజెపి విమర్శించింది. కానీ అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పనిచేసినట్లు అరుణాచల్, వుత్తరాంచల్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టేందకు ప్రయత్నించి భంగపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న పిలుపును ఈ విధంగా అమలు జరిపేందుకు ప్రయత్నించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో టిఆర్‌ఎస్ పార్టీలు కూడా అదే చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఒక్కొక్క ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సిని ఒక పద్దతి ప్రకారం ఆకర్షించటమే పనిగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. తెలంగాణాలో వైఎస్‌ఆర్‌సిపిని పూర్తిగా పూర్తిగా, తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు అదే విధంగా స్వాహా చేయటంలో టిఆర్‌ఎస్ జయప్రదమైంది. కాంగ్రెస్ నుంచి కూడా వలసలను ప్రోత్సహిస్తోంది. వీటన్నింటినీ చూసినపుడు పార్టీ ఫిరాయింపులు సాధారణ అంశంగా మార్చివేయటంలో ఈ పార్టీలన్నీ జయప్రదమయ్యాయి. రాజకీయాలలో హుందాగా ప్రవర్తించటం అన్నది దాదాపు కనుమరుగైంది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి స్థాయిలలో వున్నవారు కూడా అందుకు అతీతులు కాదని రుజువు చేశారు.
చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల గురించి చిన్నమాట. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించటం తప్ప వీటికంటూ ప్రత్యేక విధానాలు లేవు. అందువలన ధరల పెరుగుదలను నివారించటంలో రెండు చోట్లా వైఫల్యమే. కరవు పరిస్థితులను కప్పి పెట్టేందుకు ప్రయత్నించటం తప్ప జనాన్ని ఆదుకొనేందుకు, కేంద్రం నుంచి నిధులు పొందేందుకు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఏమిటో జనానికి తెలియదు. రాష్ట్రం విడిపోతే యువతకు పెద్ద ఎత్తున వుపాధి దొరుకుతుందని తెలంగాణా నేతలు చెప్పారు. ఈ రెండు సంవత్సరాలలో అంతకు ముందుతో పోల్చితే పెద్ద మార్పేమీ కనపడటం లేదు. బాబొస్తే జాబు గ్యారంటీ అన్న నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి, వున్న వుద్యోగాలు పోతున్నాయి తప్ప కొత్తవాటి జాడ కనిపించటం లేదు. తెలంగాణాలో ముడుపుల కోసమే ప్రాజక్టుల రూపురేఖలన్నీ మార్చివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుస్తాయన్నట్లు గతంలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నవారికి, అధికారంలో వున్నవారికి కూడా ఈ విషయాలన్నీ కొట్టిన పిండి కనుక దేన్నీ కాదనలేము.ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పోలవరం తప్ప కొత్తగా కట్టే పెద్ద ప్రాజక్టులేమీ లేవు. వున్నవన్నీ పూర్తి చేయాల్సినవే. పోలవరం వంటి వాటికి నీళ్లు లేకుండానే ముందుగానే కాలువలు తవ్వి గత పాలకులు సొమ్ము చేసుకున్నారు. ఇప్పటి వారు వాటి పూడికలు తీసి సొమ్ము చేసుకుంటారు. అన్నింటి కంటే రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అతి పెద్ద ప్రాజెక్టుకు తెరలేపారు.గతంలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు ఐదులక్షల కోట్ల పధకమది. అందువలన శ్రీశ్రీ చెప్పినట్లు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అన్నట్లు ఏ పార్టీ చరిత్ర చూసినా గత రెండు సంవత్సరాలలో గర్వించదగిన చర్యలేమీ లేవు. రానున్నవి మంచి రోజులని చెప్పారు. అవి ఎండమావుల మాదిరి కనిపిస్తున్నాయి. ఈ చెంపమీద కొడితే మరో చెంప చూపమని మన వేదాంతం చెబుతుంది తప్ప కొట్టిన వారి చెంప చెళ్లు మనిపించమని చెప్పలేదు. అందుకే మన జనం కూడా అంత నిస్సారంగా తయారయ్యారు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నారు. ఇదొక చిత్రం !
గమనిక :ఈ వ్యాసం ‘ఎంప్లాయీస్ వాయిస్’ మాసపత్రిక జూన్ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది