సత్య
గత రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలతో ఎక్కువగా ఎందుకు కాలం గడుపుతున్నారంటే వెంకయ్య నాయుడి వంటి శిష్య గణం విదేశీ పెట్టుబడుల కోసం అని వెనుకా ముందు చూసుకోకుండా చెప్పారు. మూడో సంవత్సరంలో అడుగుపెట్టబోయే ముందు ప్రధాని ఇరాన్ పర్యటన జరిపారు. ఈ సందర్బంగా వచ్చిన వార్తలేమిటి అక్కడ ఒక రేవును అభివృద్ధి చేయటంతో పాటు రానున్న రోజులలో 20 బిలియన్ డాలర్లు అంటే దాదాపు లక్షా 30వేల కోట్ల రూపాయల పెట్టుబడులను అక్కడ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు మన దేశానికి విదేశీ పెట్టుబడులు రావాలని, వాటితో దేశాన్ని బాగు చేస్తామని చెబుతున్న పాలకులు మరోవైపు దేశం వెలుపలికి పెట్టుబడులను తరలించటం ఏమిటి ?
దీనికి గాను జనానికి చెబుతున్నది ఏమిటి ? ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు, వాణిజ్య లావాదేవీలు నిర్వహించాలంటే పాక్ భూ భాగం గుండా వెళ్లాలని, ఆ దేశం మనకు ఇబ్బందులు కలిగించకుండా వుండాలంటే ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని, అందుకు గాను గుజరాత్లో కాండ్లా రేవు నుంచి ఇరాన్‌లోని చబహార్ రేవుకు దగ్గరకు దగ్గర, తలనొప్పిలేని మార్గం అవుతుందని, దీనికి తోడు ఇరాన్ నుంచి మధ్య ఆసియా ద్వారా రష్యా వరకు రైలు మార్గంతో సరకు రవాణా సులభం అవుతుందని చెబుతున్నారు. ఇదేమీ కొత్త విషయం కాదు, ఇతరులతో తలనొప్పిలేని మార్గాలను వెతుక్కోవటం కూడా మంచిదే. మన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇబ్బంది లేదు, తప్పులేదు, చేయదలచుకున్నదేదో చేసుకోక పొరుగుదేశాల గురించి నోటి దూల ఎందుకు ?
అమెరికా కనుసన్నలలో నడుస్తున్న మనం ఇరాన్‌కు దూరంగా జరిగిన సమయంలో చైనా ఆ స్ధానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇరాన్‌కు తొలి సిల్కు రైలును విజయవంతంగా నడిపింది. చైనా తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లోని ఇవు నుంచి ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 10,399 కిలోమీటర్ల దూరాన్ని కజకస్తాన్, తుర్క్మెనిస్తాన్ దేశాల గుండా ప్రయాణించి 14 రోజుల్లో రైలు 32 కంటెయినర్ల సరకును చేర్చింది. అదే సముద్రమార్గం ద్వారా చైనా షాంఘై నుంచి ఇరాన్ రేవు బందర్ అబ్బాస్‌కు ఓడ చేరుకొనేందుకు 45 రోజులు పడుతుంది. రెండు దేశాల మధ్య 2003-13 మధ్య వాణిజ్యం నాలుగు నుంచి 53 బిలియన్ డాలర్లకు పెరిగింది. రానున్న దశాబ్ద కాలంలో ఈ మొత్తాన్ని 600 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని జనవరిలో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్ పింగ్ పర్యటన సందర్భంగా వుభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇరాన్‌తో మన వాణిజ్యం ప్రత్యక్షంగా 14 బిలియన్ డాలర్లు, మూడవ పక్ష దేశం ద్వారా చేసిందానితో కలిపితే 30 బిలియన్ డాలర్లకు మించి లేదు. చైనా నుంచి యూరేసియా ప్రాంతానికి రైలు ద్వారా సరకు రవాణా ఇరాన్‌కు ఆదాయం తెచ్చిపెడుతుంది. తన రైలు మార్గాన్ని వినియోగించుకున్నందుకు సరకు రవాణా సంస్ధలు చెల్లిస్తాయి. చైనాలోని ఇవు నుంచి స్పెయిన్‌లో మాడ్రిడ్ వరకు 13వేల కిలోమీటర్ల దూరం వరకు సరకు రవాణాకు అవకాశం వుంది. ఈ పూర్వరంగంలో చైనాకు చెక్ పెట్టేందుకు చబహార్ రేవు ఒప్పందం అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇరాన్ తనకు ప్రయోజనం వున్న ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరుపుకుంటుందని గుర్తించాలి.
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మన పారిశ్రామికవేత్తలు చబహార్‌లో అభివృద్ధి చేసేది పిచ్చుక గూడు అంత చిన్నది అనుకుంటే దానికి 100 కిలోమీటర్ల దగ్గరలోని పాకిస్థాన్ రేవు గ్వడార్ ప్రాంతంలో చైనా ఏకంగా పెద్ద రాజప్రాసాదమే ఏర్పాటు చేస్తున్నదట. నరేంద్ర మోడీ నిర్ణయం గురించి సంతోషం పట్టలేని ఒక తెలుగు పత్రిక ఈ ప్రాంతంలో హెచ్చుతున్న చైనా ప్రాబల్యానికి ఇది కళ్లెం వేసే నిర్ణయం అని జబ్బలు చరుచుకుంది. పాకిస్థాన్‌లో చైనా అభివృద్ధి చేసే కారిడార్‌లో పెట్టుబడులు 46 బిలియన్ డాలర్లు అయితే చబహార్‌లో మనం పెట్టేది 50 కోట్ల డాలర్లని ఒక ఆంగ్ల పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది. అదే చబహార్ రేవు ఆధారంగా అక్కడ చైనా ఒక పెద్ద పారిశ్రామిక పట్టణాన్నే ఏర్పాటు చేసేందుకు అదే ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంది.
చబహార్ రేవు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పలుకుబడి పెంచుకోవాలని 2003లోనే వాజ్‌పేయి బిజెపి నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతకాలం ఎందుకు ముందుకు పోలేదు? స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక కాలవ తవ్వాలన్నా బ్రిటీష్ రాణీగారి అనుమతి కావాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశం ఏం చేయాలన్నా అమెరికా అనుమతి కావాలంటే ఇదేమిటి ఇలా అంటున్నారు అని చాలా మందికి కోపం రావచ్చు. కానీ ఇది నిజం. ఇరాన్‌తో మనకు ఎలాంటి గట్టు పంచాయతీ లేదు. ఎక్కడా మార్కెట్ల కోసం పోటీ పడలేదు, తగాదా లేదు. అమెరికా-ఇరాన్‌కు మధ్య ఎప్పటి నుంచో వైరం. ఇరాన్‌లోని చమురు మొత్తాన్ని స్వాహా చేయాలన్నది అమెరికా కల. దాన్ని ఇరానియన్లు అడ్డుకున్నారు. దాంతో ఇరాన్ అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని చేపట్టిందనే పేరుతో దానిపై ఆర్ధిక, రాజకీయ ఆంక్షలు విధించింది అమెరికా. మన పాలకులు అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ దాని వెనుకే నడుస్తున్నారు కనుక మనమూ ఇంతకాలం ఇరాన్‌కు దూరంగా వుండి అమెరికన్లను సంతోషపరిచాము. ఇప్పుడు ఇరాన్‌తో అమెరికన్లు రాజీకి వచ్చారు కనుక, ఇప్పుడు మనమూ మైత్రి గురించి కవిత్వం చెబుతున్నాము. వెన్నెముకలేని విదేశాంగ విధానం, అమెరికాకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో చౌకగా చమురు ఇస్తామని ఇరాన్ ముందుకు వచ్చినా అయ్యగారికి కోపం వస్తుందన్నట్లుగా తీసుకోలేదు.
మా దేశంలో పరిశ్రమలు పెట్టండహో అని ప్రపంచమంతా తిరిగి రా రమ్మంటున్నాము. కానీ మన పారిశ్రామికవేత్తలు రాబోయే రోజుల్లో ఇరాన్లో పరిశ్రమలు పెడతారట. నీరు పల్లమెరుగు- పెట్టుబడి లాభాలనెరుగు అని కొత్త సామెతను చెప్పుకోవాలేమో. పెట్టుబడి తనకు లాభాలు ఇచ్చే దేశ మాతలు లేదా పితలకు తప్ప స్వదేశ మాతా, పితలకు జై అనదు. అదేమీ చిత్రమో గానీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో తిరిగిన కొద్దీ మన ఎగుమతులు, దేశంలో వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు నానాటికీ పడిపోతున్నాయి. పదిహేడు వుపరంగాలతో కూడిన వస్తూత్పత్తి రంగంలో 2013 ఏప్రిల్-డిసెంబరు మాసాలలో వచ్చిన ఎఫ్‌డిఐ 8.8 బిలియన్ డాలర్లయితే అదే కాలంలో 2014లో 6.8, 2015లో 4.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే ఇదే సమయంలో సేవారంగం, ఐటిలో ఎఫ్‌డిఐలు గణనీయంగా పెరిగాయి. వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే పెట్టుబడులు మన మౌలిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఇతర రంగాలకు వచ్చేవి లాభాలు దండుకొని తెల్లవారేసరికి మాయం అవుతాయి. గతేడాది మన దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐలలో కేవలం 16శాతమే వస్తూత్పత్తి రంగానివి, ఇదే చైనాలో 43శాతం వున్నాయి. అందుకే అది ప్రపంచంలో ఎక్కడ బడితే అక్కడ తన పలుకుబడిని పెంచుకొనేందుకు అమెరికా ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర కార్యాచరణతో ముందుకు పోతున్నది, తన పారిశ్రామిక వుత్పత్తులకు మార్కెట్లను నిలబెట్టుకోవటమే కాదు, విస్తరించుకుంటున్నది. మరి మన పరిస్ధితి వున్న ఎగుమతులే గత 17 నెలలుగా పడిపోతున్నాయి. మార్కెట్లు లేకుండా స్వంత కార్యాచరణ, విధానాలు లేకుండా అమెరికా,ఐరోపా దేశాలకు జూనియర్ భాగస్వామిగా మారితే , అవే చైనా ధాటికి నిలవలేక విలవిల్లాడుతుంటే మనం ఎన్ని చబహార్‌లను అభివృద్ధి చేసినా ఫలితం వుంటుందా ?
చైనా ఆర్ధిక వ్యవస్ధ గురించి అనేక మంది భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొంత మంది అక్కడ సోషలిస్టు వ్యవస్థలేదని అంటారు, మరికొందరు ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ నిర్మాణంలో వుందని వ్యాఖ్యానిస్తారు. బ్రిటన్ నుంచి హాంకాంగ్, పోర్చుగీసు నుంచి మకావో దీవులను తిరిగి తన పాలన కిందకు తెచ్చుకున్న సమయంలో చైనా ప్రభుత్వం 50 సంవత్సరాల పాటు అంటే 2049 వరకు అక్కడ వున్న వ్యవస్ధలను యధావిధిగా కొనసాగించేందుకు ఒప్పందం చేసుకుంది. అందుకే ఒకే దేశం-రెండు వ్యవస్ధలున్న దేశంగా చైనా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, ఇతర ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధ వుంది. ఇదొక నూతన ప్రయోగం. అది అనుసరించిన ప్రజానుకూల సంస్కరణల ఫలితంగా పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎంతో వేగంగా పురోగమిస్తోంది.అగ్రశ్రేణి పెట్టుబడిదారీ దేశాలతో వున్న ఆర్ధిక సంబంధాల రీత్యా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నది తప్ప పెట్టుబడిదారీ విధానం 2008 నుంచి ఎదుర్కొంటున్న అతి పెద్ద మాంద్యానికి అది దూరంగా వుంది.
చబహార్ రేవు అభివృద్ధిపై ఒప్పందం కుదుర్చుకోవటాన్ని గొప్ప అంశంగా చిత్రిస్తున్నారు. దీని వలన లాభం ఎవరికి అన్నది ప్రశ్న. చైనా కూడా అలాంటి ఒప్పందాలనే కుదుర్చుకుంటున్నది, అంతకంటే ఎక్కువ పెట్టుబడులే పెడుతున్నది. కొంత మంది వ్యాఖ్యాతలు చెబుతున్నదాని ప్రకారం అక్కడ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానమే వుందనుకుందాం. అలాంటపుడు ఇలాంటి ఒప్పందాల వలన కలిగే లాభం ఏదైనా వుంటే అది ప్రభుత్వానికే చెందుతుంది, ఆ మొత్తాన్ని చైనా సర్కార్ జనానికే ఖర్చు పెడుతుంది. మరి మన దేశం కుదుర్చుకొనే ఒప్పందాల వలన వచ్చే లాభం ఎవరికి జేబుల్లోకి పోతుంది. అంబానీ, అదానీ అండ్‌కోలకే కదా ? మన దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు వచ్చిన లాభాలను తిరిగి ఇక్కడ పెట్టుబడులుగా పెట్టకుండా బయటకు తరలిస్తున్నాయని విమర్శిస్తున్నాం, ఇప్పుడు అదే పని మన దేశ కార్పొరేట్ సంస్ధలు కూడా చేస్తున్నట్లే కదా !