Tags

, , , ,

“పాపాలు, ఇబ్బందులే హుండీ ఆదాయాలు పెంచుతున్నాయి”

సత్య

     తన రెండేళ్ల పాలన పూర్తి కావస్తున్న సమయం, మహానాడుకు ముందుగా విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జనానికి వుపయోగపడే పనుల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో తెలియదుగానీ మద్యం గురించి చేసిన వ్యాఖ్యలతో కలెక్టర్ల సదస్సుకు కాస్త కిక్కు వచ్చింది. ప్రత్యేక రాష్రనఠ హోదారాదని తేలిపోవటం, చంద్రన్నే చెప్పినట్లు విభజన సమయంలో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు కాకపోవటంతో వడదెబ్బ తగిలినట్లు కలెక్టర్ల సదస్సు ప్రసంగం నిస్సారంగా సాగిందని చెప్పవచ్చు.తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో తాను చేసిన వుపన్యాసాన్ని ఒక వర్గపు మీడియా వక్రీకరించిందని దేవుడి గురించి తాను పాజిటివ్‌గానే మాట్లాడానని రెండోరోజు వివరణ ఇచ్చారు.

    చంద్రబాబుకు సానుకూల మరొక వర్గపు మీడియాగా గుర్తింపు వున్న ఒక పత్రికలో కష్టాల్లో వున్న వారు దేవుణ్ని నమ్ముకొంటున్నారు అనే శీర్షికతో ప్రధాన వార్తలో వుప భాగంగా రాశారు. దేవాదాయశాఖ కష్టపడకపోయినా 27శాతం ఆదాయం పెరిగిందనీ, ఇది ప్రజల్లో పెరిగిన భక్తిని తెలియ జేస్తుందని చంద్రబాబు అన్నారు. కష్టాల ో్ల వున్న వాళ్లు దేవుణ్ని నమ్ముకుంటున్నారు. వారితో పాటు తప్పులు చేసిన వాళ్లు హుండీల్లో డబ్బులు వేస్తున్నారు. కష్టాల్లో వున్నామని వ్యసనాల బారిన పడకుండా దేవుణ్ని విశ్వసిస్తున్నారు. గుళ్లు, చర్చిలు, మసీదుల్లాంటివి లేకపోతే పిచ్చి వాళ్లయ్యేవారేమో ! దీక్షల కాలంలో దుర్వ్యవసనాలకు దూరంగా వుంటున్నారు. అయ్యప్ప దీక్షల్లాంటివి చేస్తూ 40 రోజుల పాటు మద్యాన్ని ముట్టుకోవటం లేదని చెప్పారు. ఇదే తరగతికి చెందిన మరొక పత్రిక పాపపు సొమ్ము అనే వుప శీర్షికతో వార్త ఇచ్చింది. ఎక్కువ తప్పులు చేసిన వారు, ఆదాయం బాగా వచ్చేవారు హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు ‘ అని నవ్వుతూ అన్నారు. అని పేర్కొన్నది.చంద్రబాబు చెప్పిన ఓ వర్గానికి చెందిన మీడియాలో భాగమైన ఒక పత్రిక తన పాఠకులకు మరింత కిక్కు ఇచ్చేందుకు ఇదే అంశాన్ని మొదటి పేజీలో, తరువాత లోపలి పేజీలో పతాక శీర్షికతో వార్తను ఇచ్చింది. ‘తప్పులు చేసే వారే గుడికి వెళుతున్నారు ‘అని రాయటంతో సమస్య వచ్చింది.

    ఇదే వార్తను ఏ వర్గానికీ చెందని మీడియాలో భాగంగా పరిగణించబడే ఒక ఆంగ్ల పత్రిక తనకు మందీ మార్బలం వున్నప్పటికీ పిటిఐ వార్తా సంస్ధ ఇచ్చిన కధనాన్ని ప్రచురించటం విశేషం. ‘తప్పులు(పాపాలు), ఇబ్బందులు పెరగటమే దేవాలయాల ఆదాయ పెరుగుదల కారణం ‘ అని శీర్షిక పెట్టింది.’ జనం పాపాలు చేస్తున్నారు. కొంత మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వాటిని వదిలించుకొనేందుకు దేవాలయాలకు వెళుతున్నారు, ప్రార్ధనలు చేస్తున్నారు. వారు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటే, ఎక్కువ పాపాలు చేస్తే వారు దేవాలయాలకు వస్తున్నారు, డబ్బులు సమర్పించుకుంటున్నారు, ఇది వాస్తవం’ అని చెప్పినట్లు దానిలో పేర్కొన్నారు. అందువలన మొత్తం మీద దీనిలో వక్రీకరణగా చెప్పాల్సి వస్తే తప్పులు చేసేవారే గుడికి వెళుతున్నారు అన్న శీర్షిక తప్ప ఆయన చెప్పిన అంశాలలో వక్రీకరణ కనిపించటం లేదు. చంద్రబాబు నాయుడు రెండవ రోజు ప్రవచించిన అంశాలలో ఒకటి ఆధ్యాత్మిక టూరిజం. ఏడు ప్రధాన పుణ్య క్షేత్రాలలో దీనిని అభివృద్ధి చేయాలని కోరారు. పరిశ్రమలు, ఇతర రంగాల అభివృద్ధి ద్వారా ఆదాయం సమకూరే పరిస్ధితులు కనిపించటం లేదు కనుక అప్పనంగా వచ్చే ఆధ్యాత్మిక ఆదాయాన్ని మరింత పెంచేందుకు చంద్రబాబు పూనుకున్నారు.

   తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డేంజరుగా మారుతోంది అని ఎప్పుడో ఒక కవి చెప్పారు. ఇప్పుడు సునామీలా వుండబట్టే చంద్రబాబు నాయుడు అంత ఆనందంగా హుండీల ఆదాయం గురించి చెప్పారు. ఏ మతానికి చెందిన దేవుడు, దేవత లేక ప్రవక్తలు కూడా అవినీతిని సహించమనే చెప్పారు. కానీ వారి కళ్లెదుటే రోజు రోజుకూ దుర్మార్గాలు, పాపాలూ పెరిగి పోతున్నా వారెలాంటి చర్యలూ తీసుకోవటం లేదంటే వారు ఇస్తున్న డబ్బులు తక్కువనా లేక రూపాయి విలువ దిగజారిందని పట్టించుకోవటం లేదా? పోనీ బంగారం వేస్తున్న వారికి ఏదైనా ప్రత్యేక దారి వుందా అంటే అదీ లేదు. పాపులు వారి పాపాన వారే పోతారు అనుకుంటే మంచి వారికి ఎదురైన సమస్యలనైనా దేవతలు, దేవదూతలు, ప్రవక్తలు ఎందుకు పట్టించుకోవటం లేదు.

    మన దేశంలో ఇంకా ఫ్యూడల్‌ అవశేషాలు ఒకవైపు, ఆధునిక పెట్టుబడిదారీ తెంపరితనం మరొకవైపు కవలల మాదిరి కొనసాగుతున్నాయి. దాని పర్యవసానమే ఒక పక్కన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచే బిర్లా ప్లానెటోరియం వుంటే దాని పక్కనే మూఢ భక్తి, విశ్వాసాలను పెంచే బిర్లా మందిరం వుండటం. తమ విధానాలను ప్రశ్నించకుండా, జనాన్ని మతం మత్తులో ముంచేందుకు పూర్వకాలంలో రాజులు, రంగప్పలు గుడులు గోపురాలు కట్టించి జనం దృష్టిని మళ్లించేవారు లేదా మత బేధాలు పెంచేవారు. ఆధునిక పాలకులు కూడా అందుకు అతీతులు కాదు.గోదావరి పుష్కరాల గురించి ఎన్నడూ లేని విధంగా జనాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించి స్నానాలు చేయించటాన్ని చూశాము. ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు సిద్ధం అవుతున్నారు. పుష్కర ఘాట్లకు విదేశీ సాయం గురించి కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణాలో యాదాద్రి అభివృద్ధికి చూపుతున్న శ్రద్ధలో వెయ్యోవంతైనా దళితులకు భూమి పంపిణీ కార్యక్రమంపై చూపటం లేదంటే కారణం ఏమిటి?

   ప్రపంచ మంతా గత కొద్ది సంవత్సరాలుగా ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధల వంటి వన్నీ కార్పొరేట్‌ల లాభాలు తప్ప సామాన్యుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు. వాటి ఎజండాలోనే అది లేదు. ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి తప్ప వుల్లిపాయల వ్యాపారం చేయకూడదని, వాటిని ప్రయివేటు రంగానికి వదిలి వేయాలన్నది చంద్రబాబు స్కూలు సిద్ధాంతం. గ్రామాల్లో పాలు, కూరగాయలు అమ్ముకొనే వారు హెరిటేజ్‌ వంటి సంస్ధలు పెట్టక ముందు నుంచీ వున్నారు. వారు ఎంత మంది కోటీశ్వరులయ్యారు? లక్షల కోట్ల సంపదలున్న అంబానీలు పట్టణాలలో మూల మూలనా దుకాణాలు తెరిచి వుల్లిపాయలు, కూరగాయలు, పిన్నీసుల వంటివి అమ్ముతున్నారు. జడ పిన్నులు కావాలన్నా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్ధలలో బుక్‌ చేసుకొని ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. అందుకే అనేక మంది చిన్న వ్యాపారులు తమకు కలిసి రావటం లేదని ఎప్పుడూ వాపోతుంటారు. రానున్న రోజుల్లో ఇలాంటి వారు ఇంకా పెరిగి పోతారు. అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు దేవాదాయ శాఖ సిబ్బంది పని చేసినా చేయకపోయినా అభాగ్యుల సొమ్ముతో హుండీలు దండిగా నిండిపోతాయి. కాళ్లూ, చేతులు చూసి జాతకాలు చెప్పి సొమ్ము చేసుకొనే వారు ఇప్పటికే తామర తంపరగా పెరిగిపోయారు. కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు అనుసరిస్తున్న విధానాలు సమాజంలో మెజారిటీకి నష్టదాయకమైతే వాటి వలన లాభపడే వారు కూడా వుంటారు.అదిగో అలాంటి వారే ఆదాయాలు పెరిగి పోయి మరింత పెరగాలని కోరుకుంటూ హుండీలలో నల్లధనాన్ని గుట్టలుగా వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.