Tags

, , , ,

 

రెండేళ్ల మోడీ పాలన

ఎం కోటేశ్వరరావు

    తన రెండు సంవత్సరాల పాలనలో అవినీతిని  చూపండంటూ మూడవ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక సవాలు విసిరారు. అవినీతి అంశాన్నే ప్రధాన సోపానంగా చేసుకొని అధికారానికి వచ్చిన మోడీ ఈ కాలంలో ఎన్ని అవినీతి కేసులను ఒక కొలిక్కి తెచ్చారు? ఎంతమందిని కటకటాల వెనక్కు పంపారు ? అందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలేమిటి? అన్నింటి కంటే ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలను పంచుతానన్న నల్లధనం సంగతేమిటి ? దానిని దాచినవారిపై చర్యలేమిటి అన్న అసలు ప్రశ్నలకు రెండేళ్లు గడిచినా సమాధానం లేదేమిటా అని ఎదురు చూస్తున్నవారికి మోడీ సవాలు గానీ, ఎన్నో సంస్కరణలు అమలు చేశానని చెప్పుకోవటం గానీ అంతగా కిక్కు ఇవ్వటం లేదు. అన్నింటి కంటే పనామా పత్రాలలో పేరు చోటు చేసుకున్న అమితాబ్‌ బచ్చన్‌ న్యూఢిల్లీలో నరేంద్రమోడీ విజయాలను పొగుడుతూ ఒకవైపు కార్యక్రమం నిర్వహించుతున్నపుడు మరోవైపు అవినీతి అక్రమాలకు వ్యతిరేక పోరాట యోధుడిగా నరేంద్రమోడీ ఎన్నికబుర్లు చెప్పినా ప్రయోజనం ఏముంది ?

     మోడీ ప్రభుత్వ పని తీరు గురించి ఆయనను వ్యతిరేకించే పార్టీలు ఏదైనా చెబితే ఒక పద్దతి, ఆయన మిత్రపక్షం శివసేన ఏం చెబుతున్నది ? కొండంత రాగాలు తీయటమే తప్ప చేస్తున్నది తక్కువని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ ప్రకటించిన పధకాలన్నీ గత ప్రభుత్వం వేరే పేర్లతో అమలు చేసినవే అని కూడా గాలితీసింది. నల్లధనాన్ని వెలికి తీసి కనీసం పదిలక్షల రూపాయల వంతున పంచుతానని వాగ్దానం చేసిన మోడీ దాన్ని అమలు జరపటంలో విఫలమయ్యారని పేర్కొన్నది. సరిహద్దులలో పాక్‌ వుగ్రవాదం కొనసాగుతూనే వుంది, నిరంతరం మన సైనికులు మరణిస్తూనే వున్నారు, కానీ పొరుగు దేశంతో కౌగిలింతలు, ముద్దులు కొనసాగుతూనే వున్నాయని వ్యాఖ్యానించింది.మోడీ సర్కార్‌ ఐదు సంవత్సరాలకు ఎన్నికైంది కనుక ఆ గడువు ముగిసిన తరువాతే ప్రభుత్వ పని తీరు గురించి వ్యాఖ్యానించటం సబబుగా వుంటుంది, ఇప్పటికైతే మోడీకి మా శుభా కాంక్షలు అని ముగించింది.

     నరేంద్రమోడీ సర్కార్‌ ఏరి కోరి రాజ్యసభకు ఎంపిక చేసిన సుబ్రమణ్యస్వామి నోటి వెంట వచ్చిన నిజాలేమిటి ? దేశంలో అసహన వాతావరణం వుందని దీనికి బిజెపి ప్రభుత్వమే కారణమని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌ అభిప్రాయమని సుబ్రమణ్యస్వామి తాజాగా ప్రధానికి సంధించిన లేఖలో పేర్కొన్నారు.రాజన్‌ అసహనవాతావరణం గురించి మాట్లాడి వుండవచ్చు తప్ప దానికి బిజెపిఏ కారణమని బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు.ఒక వేళ రాజన్‌ అలా అని వుంటే అధికారంలో వున్నంత మాత్రాన అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదా ? మొత్తం మీద స్వామి ఫిర్యాదు స్వభావం భావ ప్రకటనా స్వేచ్చను సవాలు చేస్తున్నట్లే ? అన్నింటి కంటే గత రెండు సంవత్సరాల కాలంలో రిజర్వుబ్యాంకు గవర్నరు హోదాలో రాజన్‌ వడ్డీ రేటు తగ్గించని కారణంగా పరిశ్రమలన్నీ కుప్పకూలాయని, నిరుద్యోగం పెరిగిందని అదీ మోడీ రెండేళ్ల సంబరాలు జరుపుకుంటున్న సమయంలో సుబ్రమణ్యస్వామి చెప్పటం గమనించాల్సిన అంశం.ఇక్కడే చిన్న కిక్కుంది. అదేమిటంటే ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ అనేక సందర్భాలలో మోడీ హయాంలో ఆర్ధిక వ్యవస్ధ తిరిగి పట్టాలెక్కిందని, చైనాను అధిగమించే దిశలో పురోగమిస్తోందని అనేక సందర్బాలలో చెప్పారు. అంటే మంత్రి అవాస్తవాలను చెబుతున్నట్లా ? స్వామి నిజాలను చెబుతున్నట్లా ?ఈ సంబరాల సమయంలో కాకపోయినా తరువాత అయినా మౌన ముని మోడీయే నోరు విప్పాలి.

   మోడీ, ఆయన అర్ధభాగం అమిత్‌ షా ఇతర పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో అనేక అంశాలు చెప్పారు. వాటి సంగతి ఏమంటే ఎన్నికలపుడు అనేకం చెబుతుంటాం అవన్నీ అమలు జరపటం ఎవరికైనా ఎలా సాధ్యం అని అమిత్‌ షా నల్లధనం వెలికితీత గురించి అడిగిన సందర్భంలో చెప్పారు.తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న పార్టీ నేత ఆయన. మోడీ సర్కార్‌ పార్లమెంట్‌లో చెప్పిన వాటిని కూడా అమలు జరపటం లేదన్నదే ఇక్కడ అసలు సమస్య.

    లోక్‌సభ అధికారిక సమాచారం ప్రకారం మూడింట రెండువంతుల కేంద్ర మంత్రిత్వశాఖలు సగానికిపైగా హామీలను అమలు జరపలేదని వివరాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో రోజుకు 250 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిస్తుంది. ప్రశ్నలు, చర్చలు, ఇతర ప్రస్తావనల సందర్భంగా మంత్రులు అనేక హామీలు ఇస్తారు. అవి అధికారికంగా నమోదు అవుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాటన్నింటినీ క్రోడీకరించి హామీల స్టాండింగ్‌ కమిటీకి పంపుతుంది. వాటిని మూడు నెలలలోగా అమలు జరిపించేందుకు కమిటీ ప్రయత్నిస్తుంది. అది ఎంత వరకు వచ్చిందనేది వారం, పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుంది. ఒకసారి హామీ ఇచ్చిన తరువాత ఏ కారణంతో అయినా లోక్‌సభ రద్దయితే తరువాత ఏర్పడే సభ, ప్రభుత్వానికి వాటిని అందచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా అలాంటి హామీలలో ఒకటి. అది ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా బిజెపి సర్కార్‌ కాదు అనటానికి లేదు. లేదా అధికారికంగా అది సాధ్యం కాదు అని అయినా చెప్పాలి.

     వుదాహరణకు ముంబై వుగ్రవాద దాడుల సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కోస్తా ప్రాంతాలలో పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు గురించి హామీ ఇచ్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ దానిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే అణువిద్యుత్‌ కేంద్రాలను సకాలంలో పూర్తి చేస్తామన్న హామీకి కూడా అదే జరిగింది.పెద్దగా ఆర్ధిక భారం లేని హామీలను కూడా మోడీ సర్కార్‌ నెరవేర్చటం లేదు. దేశంలోని మరో 38 భాషలను రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో చేరుస్తామని 2014 ఆగస్టులో ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రస్తుతం మన దేశంలో అద్దె గర్భంతో పిల్లలను కనటం కూడా ఏటా రెండున్నర వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. దీనిలో ఎక్కువగా బలహీన వర్గాలకు చెందిన మహిళలే దోపిడీకి గురి అవుతున్నారు. దీనిని క్రమబద్దీకరించేందుకు అవసరమైన చట్ట సవరణ చేస్తామని 2014 ఆగస్టులో ప్రభుత్వం ఇచ్చిన హామీకి ఇంతవరకు దిక్కులేదు. ఇలా అనేకం వున్నాయి.న్యాయ మంత్రిత్వశాఖ ఇచ్చిన హామీలలో కేవలం 27శాతమే అమలు చేసింది. ఇంకా అనేక మంత్రిత్వశాఖలు తరతమ స్దాయిలో హామీలు ఇ్వటమే తప్ప అమలు జరపటం లేదు. ఈ వైఖరిని ఏమనాలి? జవాబుదారీతనం లేక మోడీ చెప్పినట్లు ఇసాబ్‌(లెక్క)లేని తనం కాదా ఇది. మంత్రుల గురించి తరువాత చెప్పుకోవచ్చు ఏకంగా ప్రధాన మంత్రి ఇచ్చిన ఏకైక హామీకి ఇంతవరకు దిక్కులేదు. మంత్రిత్వశాఖల పనితీరు, మదింపు పద్దతి గురించి 2013-14 సంవత్సరానికి సంబంధించి నివేదికలు ఇస్తామని మోడీ స్వయంగా 2014లో హామీ ఇచ్చారు. వాటిని ఇంతవరకు ఇవ్వలేదు. అందువలన ఆర్భాటంగా పధకాలు ప్రకటించటం కాదు, అవి ఎంతవరకు అమలు జరిగాయన్నది కావాలి. ప్రతి పధకంపై అధికారిక శ్వేత పత్రాలు ప్రకటిస్తే అసలు రంగు తేలుతుంది.

   అవినీతికి పాల్పడబోమని, స్వచ్చమైన పాలన అందిస్తామని మంత్రులు ప్రమాణం చేస్తారు. అందువలన అలా వుండటం వారి విధి. దానిని మరిచి పోయి మేం అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకోవటం ప్రత్యేకమే. అవినీతికి పాల్పడకపోవటం సంతోషమే, కానీ అవినీతికి పాల్పడిన వారిని వెలికి తీసి శిక్షించటం కూడా రాజధర్మమే. అందువలన మేము మా రాజధర్మాన్ని నిర్వర్తించామా లేదా అన్న సవాలు విసరాలి. అధికారాంతమందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నారు. అసలు ఏదైనా పని చేస్తే కదా సక్రమంగా చేశారా అక్రమంగా చేశారా అనేది తేలేది. ఎరువులు, గ్యాస్‌ సబ్సిడీలను తగ్గించటం, బ్యాంకు ఖాతాలను తెరవటం వంటి వాటిలో అవినీతికి అస్కారం తక్కువ. ప్రజల సంపదలను కార్పొరేట్లకు కారుచౌక రేట్లకు కట్టపెట్టటం నీతా ? అవినీతా ? అది లంచం తీసుకొని చేశారా తీసుకోకుండా చేశారా అని కాదు, విధాన పరమైన అక్రమమా కాదా ?