Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

సార్‌ నేను అర్ధరాత్రి తరువాత నిద్రపోతానని మీరంతా అంటారు, ఇక నుంచీ నేను నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటా సార్‌ అని మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అర్ధరాత్రి తలుపుకొట్టీ మరి చెప్పాడు.

ఏం ఈ వుద్యోగం చేయాలని లేదా అన్నాను. అదేంటి సార్‌ అలా అంటారు అన్నాడు.

ఓరి పిచ్చోడా నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటానంటే ఇక్కడ వున్న వుద్యోగం వూడగొడతారు, కొత్తగా ఎక్కడా ఇవ్వరు అన్నాను. అదేంటి సార్‌ అని నిజంగానే వూడగొట్టిన వుద్యోగి మాదిరి నీరసపడిపోయాడు.

న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విజయగాన బజానాలను ఎప్పుడూ లేనిది శుక్రవారం రాత్రి దూర దర్శన్‌లో చూసి అమాయకుడు వుత్సాహపడిపోయాడు. ఎన్నడూ లేనిది పొద్దున్నే లేచి నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. కనిపించగానే సార్‌ రాత్రి మీరు అలా అన్నారేంటి సార్‌ అని అడిగాడు.

తొమ్మిదివేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగవేసిన విజయ మాల్య దేశం విడిచి పోతుంటే గుడ్లప్పగించి చూసిన నరేంద్రమోడీ, ఫాదర్‌ ఆఫ్‌ వాచ్‌మెన్‌ అంటే దేశంలోని వాచ్‌మన్లకు తలకాయ. ఆ పెద్దమనిషి మాదిరి పని చేస్తా అంటే దొంగలు దోచుకొని పారిపోతుంటే చూస్తూ వూరుకుంటా, ఎటు వెళ్లిందీ చెబుతా తప్ప పట్టుకోను అని చెప్పటమే అన్నాను.

రాత్రి నుంచి నిద్రపోకుండా ఎంత ఆలోచించినా మీరెందుకు అలా అన్నారో తట్టలేదు సార్‌. ఇప్పుడు మీరు చెప్పిన తరువాత ఇంక చచ్చినా ఎక్కడా నేను వాచ్‌మన్‌ వుద్యోగం చేస్తున్నా అని చెప్పను గాక చెప్పను సార్‌ అన్నాడు ఏదో ధృఢ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాదిరి.

పొద్దున్నే పాలకోసం దుకాణానికి వెళ్లా. మూమూలుగా నన్ను చూడగానే పాలు ఇచ్చేసి తన పనిలో తాను నిమగ్నమయ్యే దుకాణదారు ఎన్నడూ లేని విధంగా అదేంటి సార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భజన చేశాడు రాత్రి అన్నాడు.

ఏం తప్పేముంది నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అన్నా. అమితాబ్‌ కాంగ్రెస్‌, నెహ్రూ కుటుంబానికి బాగా దగ్గర కదా అలాంటిది ఇప్పుడు ఇలా ఫిరాయించాడేమిటి అన్నాడు సంభాషణ పొడిగిస్తూ.

అపుడు కాంగ్రెస్‌ ‘మా’ ఇప్పుడు పనామా పత్రాలలో పేరు కనిపించటంతో నరేంద్రమోడీ ‘బా'(పు) అయ్యాడు. అయినా ఎన్నడూ దేని గురించి అడగనిది ఇవాళ ఇదేమిటి? నీకూ రాజకీయాలలో చేరాలని వుందా అని అడిగా.

పాత సినిమాల్లో వీలునామా పత్రాల గురించి చూశా, పనామా పత్రాల పేరు ఎప్పుడూ వినలే, కొత్త ప్రభుత్వాలు రాగానే పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టినట్లుగా వీలునామా పత్రాలకూ పేరు మార్చారా ఏమిటి అన్నాడు.

దొంగడబ్బు దాచుకున్నవారి వివరాలను మా జర్నలిస్టులు కొందరు బయట పెట్టారులే, ఆ ఖాతాలు పనామా అనే దేశంలో వున్నాయి, కనుక వాటిని పనామా పత్రాలు అంటున్నారులే.

అంటే కొంత మంది ఇంట్లో వారికి తెలియకుండా నా దగ్గర డబ్బు, నోట్లు పెట్టి వడ్డీకి తిప్పుతుంటార్లే అలాగేనా అన్నాడు.

ఓర్నీ, అంటే ప్రతి దుకాణమూ ఒక పనామా యేనా ఏమిటి కొంపదీసి, నీ సంగతి తెలిస్తే అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ కూడా నీ దగ్గరకే వచ్చి వుండేవారన్నమాట.

అంత పెద్ద మొత్తాలను నేనెక్కడ తిప్పగలను సార్‌, ఏదో….. ఏదో నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితో అనకు….ఏం సార్‌ అన్నాడు.

ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి చెప్పిన బిజెపి వారు ఇప్పుడు విదేశాల్లో కంటే స్వదేశంలోనే ఎక్కువ వుంది అంటున్నారు, నువ్వు ఇలాగే నలుగురితో చెప్పావనుకో ఏదో ఒక రోజు భారత మాతాకీ జై అంటూ ఖాకీ నిక్కరు వాళ్లు వచ్చి దాడి చేసి నీ దగ్గర ఎవరెవరు నల్లధనం దాచుకుంటున్నారో బయట పెట్టు అంటారు జాగ్రత్త.

సార్‌ ఖాకీ నిక్కరంటే గుర్తుకు వచ్చింది మా పక్కింటి పోరగాడికి వుద్యోగమేదీ రాలేదు, ఈ మధ్య కొత్తగా నిక్కర్లేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, పిల్లలు నిక్కరంటే సరేగానీ అదేంటి సార్‌ పెద్ద వారు కూడా అలా అసహ్యంగా, వారు వస్తుంటే వీధిలో అడవాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారు, ఈ మధ్య మీరన్నారే భారత మాతాకీ జై అంటూ నిద్రలో కలవరించటమే కాదట, పక్కనున్నవారిని పట్టుకొని మీరూ అనరెందుకు అని నిద్రలోనే కొడుతున్నాడట ఏం చేయాలో తెలియటం లేదంటూ వాళ్ల నాన్న తలపట్టుకుంటున్నాడు.అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందీ అంటూ పాలు తీసుకొని బయలు దేరా.

ఇంతలో పచ్చ చొక్కా వేసుకొని మా ఎదురింటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపించాడు.ఏం తిరుపతి మహానాడుకు వెళ్లలేదా ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్లుగా తిరుపతి వెంకన్న దర్శనం, ఎంచక్కా మూడు రోజుల పాటు మంచి భోజనాలు పెడుతున్నారట కదా !

మీరు జర్నలిస్టు కనుక వూరుకున్నా అదే ఇంకొకరు అని వుంటేనా అంటూ, అయినా మహానాడులో మీకు కనిపించింది భోజనాలేనా, తీర్మానాలు, వుపన్యాసాలు వినిపించలేదా అన్నాడు వుక్రోషంగా.

మిత్రమా లైట్‌ తీస్కో అదేదో సామెత చెప్పినట్లు పండగనాడూ పాత….. పాడిందే పాడరా…. అన్నట్లు ఎన్నికలకు ముందు నుంచి తరువాత గత రెండు సంవత్సరాలుగా జగన్‌ భజన చేస్తూనే వున్నారు బోరు కొట్టటం లేదా ! ఒకవైపు జగన్‌ పార్టీని ఫినిష్‌ చేశాం చూడమంటారు, మరోవైపు తద్దినపు తంతు మాదిరి ఎన్‌టిఆర్‌ పేరన్నా అప్పుడపుడు చెబుతున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్‌ పేరు తలవకుండా, పలకకుండా తెలుగుదేశం సమూహం మాట్లాడలేని స్ధితికి వచ్చింది, భాషా దారిద్య్రం పట్టుకుందా ! ఒకవైపు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు జనంలోకి వెళ్లటం లేదని మీరే చెబుతుంటారు, జగన్‌ భజన మాని ఆ పని ఎందుకు చేయరు ? అయినా అదేమిటయ్యా నేను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదే పదే చెప్పే చంద్రబాబు హాయిగా నిద్రపోతున్నా అని మహానాడులో చెప్పాడు విడ్డూరంగా లేదూ !

మనలో మన మాట ఆఫ్‌ది రికార్డు, ప్రధాని నరేంద్రమోడీకి భార్యను వదిలేశారు కనుక ఆయన న్యూఢిల్లీలో వున్నపుడు నిశ్చింతగా నిద్రపోతున్నారు, మా నాయకుడికి భార్యా కుటుంబం వున్నా వారంతా హైదరాబాదులో వుంటున్నారు, ఈయనేమో వుండేది వుండవల్లిలో ఇంక నిద్రపోకేమీ చేస్తారు.

అదేమిటి ? వుండవల్లికి నిద్రకు సంబంధం ఏమిటి, ఆ వూరి వారంతా రేయింబవళ్లు కష్టపడి బాగా పని చేస్తారే అన్నాను నిజంగానే ఆశ్చర్యంగా !

ఎక్కడైనా దేవుళ్లందరూ నిలబడే వుంటారు, కానీ వుండవల్లి గుహలలోని అనంత పద్మనాభ స్వామి పడుకొని కదా వుండేది, మరి చంద్రబాబు నిద్రపోకుండా రాత్రంతా మేలుకొని వుంటే పద్మనాభునికి అంతరాయం కలుగుతుంది కదా అందుకని అన్నాడు.

నీ లాజిక్‌ వినటానికి బాగానే వుంది గానీ బాబొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, దానితో ఇంటికో జాబొస్తుందని ఆశించారు, ఇప్పుడే హోదా లేదు గీదా లేదు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం కావాలంటే లెక్కలు తీయండి అని బిజెపి, కేంద్ర ప్రభుత్వం వారు సవాళ్లు విసురుతున్నారు. వాటి గురించి చెప్పకుండా నా పాలనలో అవినీతి లేదు కనుక నిద్ర పోతున్నా అంటారేమిటి ?

సార్‌ మరోసారి మనలో మాట, కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్కకూతురైపాయే అన్నట్లు మా పరిస్ధితి వుంది. అందుకే కేంద్రాన్ని మోడీని, వెంకయ్య నాయుడిని ఏమీ అనలేక ఆ కసిని జగన్‌, కాంగ్రెస్‌ మీద తీర్చుకుంటున్నాం అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చక్కా పోయాడు.