Tags
Amitshaw, BJP, CHANDRABABU, Nara lokesh, tdp, tdp mahanadu, YS jagan, ysrcp
ఎం కోటేశ్వరరావు
తిరుపతిలో తెలుగుదేశం మహానాడు మూడు రోజుల సువార్త కూటములు ముగిశాయి. రాష్ట్ర దేవదూత చంద్రబాబు నాయుడు అన్నీ తానే అయి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులకు సందేశాలను అందచేశారు. ఇదే సమయంలో కేంద్ర దేవదూత నరేంద్రమోడీ ప్రభుత్వ విజయ గానోత్సవాలు దేశమంతటా ప్రారంభమయ్యాయి. అయితే ఏమిటి అన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకటం లేదు. తిరుపతిలో మిగిలిపోయిన తీర్మానాలు లేదా అక్కడ చేసిన వాటినే పునరుద్ఘాటిస్తూ జూన్ రెండున విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసలు సమస్యల గురించి తేల్చకుండా ఎన్ని దీక్షలు చేసినా ఆ ప్రాంతంలో జనాన్ని ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేయటం తప్ప సాధించేదేమీ వుండదు. గతేడాది దీక్ష ఫలితంగా ఏం సాధించారో చెప్పి ఈ ఏడాది ఎందుకు చేస్తున్నారో చెబితే అర్ధం వుంటుంది.
ఇటు చంద్రబాబు మూడు రోజుల ప్రసంగాలు, ఆయన వంది మాగధుల స్త్రోత్రాలు, అటు కేంద్రంలో నరేంద్రమోడీ వుపన్యాసాలు, భజనపరుల కీర్తనలు అతిశయోక్తులతో నిండి దాదాపు ఒకే విధంగా వున్నాయి. సందేశ, వుపదేశ, భజన వ్యూహాలను బహుశా ఒకటి కొంటే ఒకటి వుచితం అన్నట్లుగా ఒకే నిపుణుల బృందం రెండు చోట్లా సమకూర్చి వుండాలి. చేసిన పనులను వాస్తవాలతో నిమిత్తం లేకుండా పెద్దవి చేసి చెప్పటం (తమపాలనలో దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారం చేసి 2004 ఎన్నికలలో ఆరిపోయిన విషయాన్ని నరేంద్రమోడీ, చంద్రబాబు మరిచి పోయి లేదా గోబెల్స్‌ను ఆదర్శంగా అయినా తీసుకొని వుండాలి), ఆత్మస్తుతి, పరనిందలతో మోతెక్కించారు. కాంగ్రెస్ తన ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తున్నదని మోడీ చెబితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తమ పాలనకు ఆటంకం కలిగిస్తున్నదని తెలుగుదేశం మహానాడు తీర్మానించింది. వాస్తవం ఏమంటే కేంద్రంలో కాంగ్రెస్‌కు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేదు, వైఎస్‌ఆర్‌సిపికి వున్నా ప్రయోజనం లేని పార్టీగా కనిపిస్తున్నది. అవ్వతో వసంత మాడినట్లు రెండు చోట్లా రెండు సంవత్సరాల తరువాత కూడా వాటిపై దాడి చేస్తూ కాలం గడుపుతున్నారు. తన ప్రభుత్వం చేసిన అవినీతి ఏదైనా వుంటే చూపమని ఢిల్లీలో మోడీ సవాలు విసిరితే, తన ప్రభుత్వంలో అవినీతి లేదుకను రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నానని చంద్రబాబు, తన మీద అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే తానే వెళ్లి జైల్లో కూర్చుంటానని కుమారుడు నారా లోకేష్ తమ ప్రసంగాలలో చెప్పారు.
ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు( లోకేష్ తొమ్మిదో, పదో చదువుతుండగానే 1996లో తాత్కాలిక మైన ప్రధాని పదవి చేపట్ట వద్దని తనకు సలహా యిచ్చినట్లు చంద్రబాబు నాయుడు మహానాడు సందర్భంగా విలేకర్లతో ఇష్టాగోష్టిగా వెల్లడించారని వార్తలు)కుమారుడు లోక్‌ష్, మంత్రులు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో తిరిగి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, పెట్టుబడులు పెట్టేవారికి ఎన్నో రాయితీలు వస్తాయి గనుక రా రమ్మని ఆహ్వానాలు పలికి వచ్చారు. ఇప్పుడు అది రాదని తేలిపోయింది. పాండవులకు చివరకు ఐదూళ్లు కాదు కదా సూది మోపినంత స్ధలం కూడా ఇవ్వం అని కౌరవులు స్పష్టం చేసినట్లుగా ఏపికి ప్రత్యేక హోదా కాదు కదా ప్రత్యేక పాకేజి కూడా సాధ్యం కాదని బిజెపి వారు తేల్చిపారవేశారు. మరి ఇప్పుడేమి చేస్తారు?
పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదాకు ఆటంకంగా వున్నాయని పిట్టకధలు చెబుతున్నారు. అటువంటపుడు ఆ నిబంధనలు ప్రత్యేక పాకేజికి కూడా ఆటంకమే కదా. లేకుంటే గత రెండు సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదు. పోనీ ఇప్పటికైనా సూటిగా ఎందుకు తేల్చరు? ప్రపంచంలో పెట్టుబడులు ఎక్కడ లాభం వుంటే అక్కడకు తరలుతాయి. టాటా తన నానో కార్ల ఫ్యాక్టరీని బెంగాల్ నుంచి భారీగా రాయితీలు ఇచ్చిన గుజరాత్‌కు తరలించారు. మిగతా రాష్ట్రాలు పోటీ పడలేకపోయాయి. వుమ్మడిగా వున్నపుడే ఆంధ్రప్రదేశ్ పోటీ పడలేక అనేక పరిశ్రమలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పోయేట్లు చేసింది. ఇప్పుడు అసలే ఇబ్బందుల్లో వున్న స్థితిలో స్వంత నిధులతో రాయితీలు ఇచ్చి ఆకర్షించటం సాధ్యమయ్యేదేనా ? కేంద్రం ఇతర రాష్ట్రాలలో వెనుక బడిన ప్రాంతాలకు ఇస్తున్న మాదిరే ఆంధ్రప్రదేశ్‌కూ ఇస్తున్నది తప్ప దయా దాక్షిణ్యం కాదు, లోటు భర్తీ చేస్తామన్న వాగ్దానాన్ని కూడా కేంద్రం నెరవేర్చటం లేదని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ఈ స్ధితిలో వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మహానాడు ఇచ్చిన సందేశం లేదా భరోసా ఏమిటి ?
తెలుగు దేశం మహానాడు జరుగుతున్న కాలంలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాదు పర్యటనకు వచ్చారు. తెలుగు దేశం పార్టీ 2019 తెలంగాణాలో అధికారానికి రావాలని తీర్మానం చేసిన సమయంలోనే తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని అమిత్ షా తెలంగాణా బిజెపికి దిశానిర్ధేశం చేశారు. అంటే తెలుగు దేశం పార్టీని పక్కకు నెట్టేయమనేగా ? ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి నేతలు పదే పదే మాట్లాడుతున్నదేమిటి ? దేశమంతటా చెబుతున్నదేమిటి? తమకు అవకాశం లేని చోట పాగా వేయటానికి ప్రాంతీయ పార్టీలను సోపానాలుగా చేసుకోవటం తరువాత, వాటిని పక్కన పెట్టి తమ చుట్టూ తిప్పుకోవటమేగా. మహారాష్ట్రలో బలంగా వున్న శివసేన, అసోంలో వున్న ఏజిపీలను బిజెపి అలాగే పక్కకు నెట్టివేయలేదా ? కర్ణాటకలో జరిగిందేమిటి ? తెలుగు దేశం పార్టీతో సఖ్యత తెగకొట్టుకున్నది తాము కాదనే పేరు తెచ్చుకోకుండా బిజెపి జాగ్రత్త పడుతున్నది. తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ ఫినిష్ అయిందన్న అంచనాతోనే బిజెపి నేతలు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ వైఖరిని వెల్లడించేందుకు అది సమయం కోసం ఎదురు చూస్తున్నది. విజయోత్సవాలలో భాగంగా విజయవాడలో కూడా బిజెపి ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది.
కేంద్రం ఇప్పటికే ఎంతో చేసింది, వాటికి లెక్కలు చెప్పాలంటున్న బిజెపి నేతలకు సమాధానంగా మహానాడులో ఇప్పటి వరకు జరిగిందేమిటో శ్వేత పత్రం ద్వారా వెల్లడించి వుంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడి అయి వుండేవి. భక్తులు స్వామీజీల, బాబాల వుపన్యాసాలు వినేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో వెళతారు. బోధనలు విన్నంత సేపు అలాగే వుండాలనుకుంటారు. ఇంటికి వచ్చిన తరువాత షరా మామూలే. అలాగే తెలుగు దేశం కార్యకర్తలు, జనానికి వుపన్యాసాలతో చంద్రబాబు బోధలు చేసి పంపారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటల పధకాల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి, ప్రత్యేక హోదా రాకపోవటం, లోటు భర్తీకి చర్యలు తీసుకోకపోవటం, రాజధాని నిర్మాణానికి తగినన్ని నిధులు ఇవ్వకపోవటం కూడా అంతకంటే తక్కువేమీ కాదు. ప్రభుత్వానికి దిశా నిర్ధేశం చేసే మహానాడు ఈ విషయంలో ఆలోచించిన ప్రత్యామ్నాయం ఏమిటి ? 2050వరకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారంలో వుండాలని వూదరగొట్టటంద్వారా యువతకు వుద్యోగాలు వస్తాయా ?అవినీతి, కేసుల గురించి వూకదంపుడుగా చెప్పటమే తప్ప సత్వర విచారణకు తీసుకున్న చర్యలు లేవు, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లేదా తండ్రీ ,కొడుకులు ప్రతిపక్ష నేతపై ఎంత కాలం శాపనార్ధాలు పెడుతూ, తిట్టిపోస్తూ ఎంత కాలం గడుపుతారు? దాని వలన రాష్ట్రానికి ఒరిగేదేమిటి ?