Tags

, , , , , , ,

సత్య

   కింద పడ్డా గెలుపు నాదే అని తన వాక్చాతుర్యంతో తనను తాను సమర్ధించుకోగల నేర్పరి ముప్పవరపు వెంకయ్య నాయుడు అని తెలుగు వారందరికీ తెలిసిందే. అయితే కర్ణాటక నుంచి గత పద్దెనిమిది సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యుడిగా వుండి కన్నడిగులను మెప్పించటంలోనూ, ఒప్పించటంలోనూ బొక్కబోర్లా పడ్డారు. ఒక్కసారి కూడా ఎగువ సభలో కర్ణాటక గురించి మాట్లాడలేదు వెంకయ్యా సాకయ్యా (వెంకయ్యా ఇక చాలయ్యా అని అర్ధం) అంటూ అక్కడి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్బంగా అంతా తానే అయి పార్లమెంట్‌లో ఎంత హడావుడీ చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా చూశారు. తీరా ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోడీ సర్కార్‌ వ్యవహరించిన తీరుతో ఆంధ్రప్రదేశ్‌ జనం మూగవారిని చూసి ముక్కు గిల్లితే ఎంత ఆగ్రహం వ్యక్తం అవుతుందో వెంకయ్య నాయుడి మీద బిజెపి మీదా అదే రీతిలో జనం ఆగ్రహంతో వున్నారు. అందువలన ఆంధ్రప్రదేశ్‌ నుంచి సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు నాయుడికి సుతరామూ అంగీకారం వుండదు.దాంతో తట్టా బుట్టా సర్దుకొని బతుకుజీవుడా అంటూ రాజస్థాన్‌లో పాగా వేసేందుకు వెళ్లి పోయారు.

     ఇక నిర్మలా సీతారామన్‌ ఆమె తెలుగింటి ఆడపడుచు అని రాజ్యసభ కట్టబెడితే మంత్రిగా తెలుగు రాష్ట్రానికి ఫలానా ప్రయోజనం చేకూర్చామని చెప్పుకోవటానికేమీ లేదు. మెట్టినింటికి వచ్చి కూడా పుట్టింటి తరఫున మాట్లాడినట్లుగా ప్రత్యేక హోదా విషయంలో తమిళనాడు పక్షాన మాట్లాడినట్లు ఆమెపై ఆరోపణలు వున్నాయి. అందువలన ఆమెకు మరోసారి అవకాశమిస్తే చంద్రబాబుకు పరువు దక్కదు. ఇక్కొడక బిజెపి పిట్టకధ చెప్పాలి. అక్కడి బిజెపి నేతల వర్ణనల ప్రకారం నిర్మలా సీతారామన్‌ ‘ కర్టాటక దా సోస్‌’ కర్ణాటక కోడలు. అదెలా అంటే ఆమె భర్త పరకాల ప్రభాకర్‌ కొంత కాలం కర్ణాటకలో వున్నారట. కన్నడ వాదులను ‘సంతృప్తి’ పరచే చౌకబారు వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇక రాష్ట్రానికి అనేక విషయాలలో రిక్త హస్తం చూపినా కేంద్ర ప్రభుత్వం, బిజెపితో బంధాన్ని తెంచుకొనేందుకు సిద్ధంగా లేరని మూడవ సీటును బిజెపి సురేష్‌ ప్రభుకు ఇవ్వటం ద్వారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు స్పష్టం చేశారు. పోనీ ఈ పెద్ద మనిషి ఏమైనా రాష్ట్రం పట్ల సానుకూలంగా వున్నారా అంటే వాగ్దానం చేసిన రైల్వే జోన్‌ కూడా ఇచ్చేది లేదని ఇప్పటికే సంకేతాలు పంపారు. అయినా చంద్రబాబు ఈ ప్రభువును ఆంధ్రప్రజల నెత్తిన ఎక్కించేందుకు పూనుకున్నారు.

    తెలుగు దేశం పార్టీ గ్యారంటీగా గెలుచుకొనే రెండు రాజ్యసభ స్ధానాల విషయంలో రుణ ఎగవేత ఆరోపణలున్న సుజనా చౌదరికి ఇవ్వటం ద్వారా చంద్రబాబు తన ‘క్లీన్‌ ఇమేజ్‌’ ను మరింత పెంచుకున్నట్లయిందని. రెండో సీటు ఎస్సీలకా, బీసిలకా అని ఊరించి, లీకుల కధనాలు రాయించి పక్కా ‘రాజకీయ’ వ్యాపారి టీజీ వెంకటేష్‌కు విక్రయించి తెలుగుదేశం కంపెనీని లాభాల బాటలో నడిపే పక్కా సిఇఓగా చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఆకర్షించిన ఎంఎల్‌ఏలతో నాలుగో సీటుకు స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దించి వైఎస్‌ఆర్‌సిపిని మరింత దెబ్బతీసేందుకు ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. విజయం సాధిస్తే లోకేష్‌ బాబు వ్యూహానికి దక్కిన ఘనతగాను, వికటిస్తే దాన్ని ఫిరాయింపు ఎమ్మేల్యేల ఖాతాలో వేయ వచ్చు. ఇవన్నీ చూసిన తరువాత ఇక చాలు చంద్రన్నా, ఇకనైనా రాజకీయాలు మాని కాస్తయినా జనానికి మేలు చేయమని జనం అంటున్నారు.