Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ జనాలను వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా ? తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారా ? ఇది ప్రతిపక్ష పార్టీల వారికి వస్తున్న ఆలోచన కాదు, స్వంత బుర్రలను వుపయోగించి తెలుగు దేశం పార్టీని పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని కోరుకొనే కార్యకర్తలలో కూడా తలెత్తున్న ప్రశ్న. విజయవాడ బెంజి సర్కిల్‌లో జూన్‌ రెండవ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని చూసిన తరువాత కలుగుతున్న సందేహాలివి.

   ముఖ్యమంత్రి, అనుచర గణం రాష్ట్ర నవనిర్మాణం కోసం దీక్ష అనే ఒక పెద్ద బ్యానర్‌ కింద మౌనంగా కూర్చొని వుంటే ఎంతో హుందాగా వుండేది. లేదూ తస్మదీయ పత్రికలు, ఛానళ్ల వారిని,తెలుగుదేశం కార్యకర్తలను సంతోష పెట్టేందుకు అసలు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలో జరిగిందేమిటి? జరగాల్సిందేమిటి? విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం, వాగ్దానాలు ఏమిటి ? అవి ఎంతవరకు అమలు జరిగాయి? జరగకపోతే ఎదురైన సమస్యలేమిటి మొదలైన అంశాలతో రాష్ట్ర ప్రజల ముందు శ్వేత పత్రం పెట్టి ఏం చేయాలో చర్చించండని ఒక్క మాట చెప్పి వుంటే జనం అర్ధం చేసుకొని వుండేవారు. తమ నిర్ణయం తాము తీసుకొని వుండేవారు.

     అటువంటి సదవకాశాన్ని చంద్రబాబు చేతులారా పోగొట్టుకున్నారు. వుపాధి హామీ పధకం కింద జనానికి పని కల్పించినా లేకపోయినా, బాబొస్తే జాబొస్తుందని ఎదురు చూస్తున్న జనాలు గోళ్లు గిల్లు కుంటూ కూర్చున్నా, వున్న వుద్యోగాలు కూడా వూడగొడుతున్నారని అనేక మంది చిరుద్యోగులు నిస్సహాయులైన స్ధితిలో వున్నా, వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఎవరికైనా దేవదూతేమో గాని తమకు మాత్రం మాత్రం సైతాన్‌గా పరిణమించారని నరేంద్రమోడీ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ జనం భావిస్తున్న తరుణంలో చంద్రబాబు వుభయుల పక్షాన ప్రతిపక్షాలకు మాత్రం చేతి నిండా పని కల్పిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తనను సవాలు చేసే ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదని, జనం విసుక్కున్నా, తిట్టుకున్నా తిరిగి తనకు తప్ప మరొకరికి పట్టం కట్టే అవకాశం లేదన్న ధీమాతో చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారా ? గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాంటి చులకన భావంతోనే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో తెలియంది కాదు. గతం మాదిరి కాకపోయినా, పాత్రలు మారినా కొత్త రూపంతో చరిత్ర పునరావృతం కాక తప్పదు.

     గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు, అదేమిటంటే ఎన్నికలపుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను, మాట్లాడతానని మిగతా సమయాలలో రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకు మరొకటి పట్టదని, ప్రతిపక్షాలు ప్రతిదానిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించేవారు. ఒకవైపు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో పెట్టుబడులు కోసం తిరిగిన దారి ఖర్చులు తప్ప పర్యటనలు ఏ మేరకు ఫలించాయో కనిపించటం లేదు. తరుణం రాక ముందే కూసిన కోయిల మాదిరి కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం విడిపోక ముందే కోరిన చంద్రబాబు కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేక, వచ్చిన డబ్బుతో తాత్కాలిక రాజధాని కడుతున్నారని జనం సానుభూతి చూపుతున్నారు. తొలి బిడ్డ పెళ్లికి అవసరమైన డబ్బు సంగతి తేల్చుకోకుండానే అన్నీ కుదుర్చుకొని, చివరకు ముహూర్తాలు కూడా పెట్టుకొని పనులు మొదలు పెట్టిన తరువాత అప్పు ఇస్తానన్న వారు సొమ్ము ఇవ్వకపోతే ఆ గృహస్థు పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి జనానికి కలిగించిన ఆశలు కూడా అలాగే కల్లలయ్యాయి. అప్పు ఇస్తామన్న వారు కనీసం మధ్యవర్తితో అయినా కొద్ది రోజుల ముందు డబ్బు సర్దుబాటు కాలేదు ఇవ్వలేకపోతున్నాము వేరే చూసుకోండని కబురు చేస్తారు. అదేమి చిత్రమో ఐదు కోట్ల ఆంధ్రప్రజలు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్న ప్రత్యేక హోదా, లోటు నిధుల భర్తీ , పాకేజ్‌ల గురించి ప్రధాని నరేంద్రమోడీ వులకరు పలకరు, అవుననీ చెప్పరు కాదనీ చెప్పకపోగా ఇప్పటికే చాలా ఇచ్చామని పార్టీ వారి చేత చెప్పిస్తున్నారు, ఎవరైనా ప్రశ్నిస్తే ఇచ్చిన దానికి లెక్కలు చెప్పమంటున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరించి చివరికి పొమ్మనకుండా పొగబెట్టినట్లు, ఇంక దాని గురించి అయితే న్యూఢిల్లీ రావద్దు అని జనానికి బాగా స్పష్టమయ్యే రీతిలో సందేశాలు పంపారు.

     ఇటువంటి స్ధితిలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీనికంటే మౌనంగా దీక్ష చేసి వుంటే అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పాటు అధోగతి పాలు చేస్తున్న బిజెపి గురించి కూడా చంద్రబాబు ఆగ్రహంతో వున్నారని అయినా జనం అనుకొనే వారు. చంద్రబాబు చెబుతున్నట్లు అసాధారణ రీతిలో అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఎలా విభజన బిల్లును ఆమోదించిదీ పదే పదే చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో అదేగా చెప్పారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌లేదు, అలాంటి పని చేసిన వారికి రాష్ట్ర శాసన సభలో కనీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా జనం తగిన విధంగా తీర్పు నిచ్చారు. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ఇంకా చంద్రబాబు దాని గురించి మాత్రమే మాట్లాడితే ఆయన విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది. రెండు కళ్ల సిద్దాంతాలు చెప్పి విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చరిత్ర చెరిగిపోదు. పార్లమెంట్‌లో చట్టం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఒక్కటే లేదు, అంతకంటే ఎక్కువ హడావుడి చేసిన బిజెపి ఏం చేసింది? పోనీ వారేమీ చిన్న పిల్లలు, తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వారు కాదే. అందువలన చంద్రబాబు చెప్పినట్లు సంబరాల బదులు విభజన కారణంగా జరిగిన అన్యాయానికి దీక్షలు చేయాల్సి రావటానికి కాంగ్రెస్‌ ఎంత కారకురాలో బిజెపి కూడా అంతే బాధ్యురాలు. కాంగ్రెస్‌ అధికారం నుంచి పోయింది. ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన బిజెపికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా ? అలాంటి పార్టీతో స్నేహం కొనసాగించాలా లేదా అనేది తెలుగు దేశం పార్టీ ఇష్టం. తమ్ముడు తమ్ముడే న్యాయం న్యాయమే బిజెపి కూడా ఏపికి న్యాయం చేయలేదు అనే మాట చెప్పటానికి నోరు రావటం లేదే. అవ్వతో వసంత మాడినట్లు అన్నీ అయి పోయిన కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శిస్తే అది జనాన్ని మభ్యపెట్టే రాజకీయం తప్ప మేలు చేసేది కాదు.

    విభజన చేసి అప్పులు మాత్రమే జనాభా దామాషాలో పంచారు, ఆస్థులు మాత్రం ఎక్కడివి అక్కడే అన్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను తరలించుకుపొమ్మని చెబితే చంద్రబాబు తీసుకు వస్తారా? అనేక రాష్ట్రాలను విడగొట్టారు. ఎక్కడైనా ఎక్కడి ఆస్థులు అక్కడే వుంచారు, అప్పులు పంచారు తప్ప మరొక పద్దతిని పాటించలేదు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో పదేండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలో ఒక రికార్డు సృష్టించిన చంద్రబాబుకు నిజంగా ఈ మాత్రం తెలియదా ? తెలిసినా ఎందుకు ఇలాంటి అంశాలను జనం మెదళ్లకు ఎక్కిస్తున్నారు ? ఒక సీనియర్‌ రాజకీయవేత్తగా విశ్వసనీయత కోల్పోవటం, పోసుకోలు కబుర్లకు తప్ప దాని వలన ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా వుపయోగం వుంటుందా ?