Tags

, , ,

ఎంకెఆర్‌

    ఇండోనేషియాలో అంత మైంది అనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందా ? కొంత మంది చెబుతున్నట్లు 2017లో ఈ మేరకు ప్రకటన వెలువడుతుందా ? లేక మరికొందరు అంటున్నట్లు ఎక్కువ చేసి చెబుతున్నారా ? యాభై సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోశారు. మరికొన్ని లక్షల మందిని అనుమానంతో కమ్యూనిస్టులుగా భావించి జైళ్లలో పెట్టారు, చిత్రహింసల పాలు చేశారు. కమ్యూనిజాన్ని అణచివేశామని అదింకేమాత్రం ఇండోనేషియాలో కనిపించదని సంబరాలు చేసుకున్నారు. ఆసియాలో కమ్యూనిజ వ్యాప్తి నిరోధంలో భాగంగా అమెరికా సిఐఏ రూపొందించిన ఒక దుష్ట పధకం ప్రకారం ఇదంతా జరిగింది.నాడు ఏక్షణంలో ఏ సైనికులు, పోలీసులు, వారి కిరాయి ఏజంట్లు వచ్చి తమను హతమారుస్తారో అని కమ్యూనిస్టులు, అభిమానులు, సాధారణ ప్రజాతంత్ర వాదులు భయపడ్డారు. నేడు అందుకు విరుద్ధంగా ఏ మూల నుంచి కమ్యూనిస్టులు పుట్టుకు వస్తారో అని భయపడుతూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు వీధులకెక్కుతున్నారు. అనేక సంస్థలకు చెందిన వారూ, రిటైర్డ్‌ మిలిటరీ అధికారులు కొద్ది రోజుల క్రితం కమ్యూనిస్టు వ్యతిరేక సదస్సు పెట్టి ఆ సందర్భంగా రాజధాని జకర్తాలో ఒక ప్రదర్శన చేశారు.అరుణ పతాకాలను తగుల పెట్టారు.కమ్యూనిస్టులను చంపటం సరైనదే అని వున్మాదంతో నినాదాలు చేశారు. కమ్యూనిజం, ఇతర భావజాలాల నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు ఈ ప్రదర్శన జరిపినట్లు వుపన్యాసాలు చేసిన వారు చెప్పారు. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసి ఎంతో మందిని చంపిన అమెరికా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిందని, కమ్యూనిస్టులను చంపటం కూడా యుద్ధంలో భాగంగానే పరిగణించి ప్రభుత్వం ఎలాంటి క్షమాపణలు చెప్పకూడదని వాదించారు. ఇంతకాలంగా కార్యకలాపాలలో లేని ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(పికెఐ) తన వునికిని చాటుకొనేందుకు పధకాలు వేసిందని, దానిని అడ్డుకోవాలని కోరారు. కొన్ని పత్రికలు మూడువేల మంది పాల్గొన్నట్లు రాస్తే మరికొందరు పదివేలని పేర్కొన్నారు.

    దీనికి కొద్ది వారాల ముందు ప్రభుత్వమే 1965 హత్యాకాండ బాధితుల గురించి వారి కుటుంబాలు, మేథావులు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులతో ఒక సదస్సు జరిపిన విషయం తెలిసినదే.అదే ప్రభత్వం కమ్యూనిస్టు ప్రచారం, పునరుద్ధరణలో భాగంగా చివరికి కమ్యూనిస్టు చిహ్నాలున్న టీ షర్టులను అమ్ముతున్నవారిని, ధరించిన వారిని కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పికెఐ భావజాలం వున్న వారు చెప్పింది మాత్రమే వినవద్దు, మేము చెప్పేది కూడా వినాలి, 1965లో మరణించిన వారిని (కమ్యూనిస్టులను) బాధితులుగా ప్రభుత్వం గుర్తిస్తే వారిని హతమార్చిన వారిని(మిలిటరీ, ఇతర కిరాయి ఏజంట్లు) నేరస్థులుగా పరిగణించాల్సి వుంటుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు పేర్కొన్నారు.

  ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికలిగిస్తున్నాయి.ప్రపంచంలో కమ్యూనిజాన్ని అంతం చేశామని అమెరికన్లు ప్రకటించిన పాతిక సంవత్సరాల తరువాత అదే అమెరికాలో తాము సోషలిస్టుల మంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలంటూ స్వయంగా సోషలిస్టును అని ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ ప్రస్తుతం ప్రచారంలో మునిగిన విషయం, ఆయనకు యువత నీరాజనాలు పడుతున్న సంగతి తెలిసిందే.

   ఇండోనేషియాలో నియంత సుహార్తో పతనం తరువాత 1965 నాటి మారణకాండపై విచారణ జరపాలనే అంశం మెల్లగా వూపందుకుంది. మొత్తాన్ని అంతం చేసిన తరువాత కూడా ఇంకా కమ్యూనిస్టులు మిగిలి వున్నారా ? వుంటే ఏ పేరుతో వున్నారు, తాజా డిమాండ్‌ వెనుక వారున్నారా ? అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులను వేధిస్తున్న ప్రశ్న. కమ్యూనిస్టుల నాయకత్వాన నైజా నవాబు, దేశముఖ్‌లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణా సాయుధ పోరాట సందర్బంగా కోస్తా జిల్లాలో ఆ పోరాటానికి మద్దతు తెలిపిన వారిని కూడా మిలిటరీ, పోలీసులు అనేక మందిని కాల్చి చంపటమే గాక గ్రామాలకు గ్రామాలను చుట్టుముట్టి చిత్ర హింసల పాలు చేశారు. పోలీసులకు ఎవరు కమ్యూనిస్టులో ఎవరు కాదో తెలియని స్ధితి, వచ్చిన స్పెషల్‌ ప ోలీసులకు జనాన్ని బాదటం తప్ప తెలుగు తెలియదు. గాంధీ విగ్రహాల ముందు జనాన్ని మందవేసి చిత్రహింసలు పెడుతున్న సందర్భంలో కొంత మంది తాము యాంటీ కమ్యూనిస్టుల మని చెప్పుకున్నారట. అసలే పోలీసు, తలమీద టోపీ పెట్టగానే బుర్ర అసలు పని చేయదని తెలిసిందే. దాంతో వున్న కమ్యూనిస్టులతోనే వేగలేకపోతుంటే వీరెవరో కొత్తగా యాంటీ కమ్యూనిస్టులట వీరికి నాలుగు అదనంగా తగిలించమని పురమాయించినట్లు చెప్పేవారు. అలాగే ఇండోనేషియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఎంతవరకు పోయిందంటే కమ్యూనిస్టు వ్యతిరేక పుస్తకాలను కూడా మిలిటరీ, పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారట. ఏమిటంటే కమ్యూనిస్టులను విమర్శించాలన్నా కమ్యూనిస్టులు ఏమి చెప్పేది వివరించాలి కనుక అది కూడా కమ్యూనిస్టు ప్రచారానికి తోడ్పడుతందని వారు భయపడుతున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకత ముసుగులో నియంత సుహార్తో అనుసరించిన మేథోవ్యతిరేక ధోరణులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్‌ బాగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇలాంటి చర్యలు ఫలితాలనివ్వవని తెలిసినప్పటికీ అదే మొరటు పద్దతులను పాటిస్తున్నారు. మిలిటరీ, పోలీసులు ఎంతగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడితే యువతరం అంతగా దానిపట్ల ఆకర్షితులయ్యే ప్రమాదం లేకపోలేదని కొందరు భయపడుతున్నారు.

   ఇండోనేషియాలో కమ్యూనిస్టు కార్యకలాపాల పునరుద్ధరణ గురించి వస్తున్న వార్తలు అతిశయోక్తులని దేశ వుపాధ్యక్షుడు యూసఫ్‌ కలా వ్యాఖ్యానించారు.’ కమ్యూనిజం అనేది సమానత్వం కోరుతున్న ఒక భావజాలం,అందుకే కాబోలు జనం దానిని భిన్నంగా చూస్తున్నారు, ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ అనేది అతిశయోక్తి అనుకుంటున్నా. అది అనేక దేశాలలో విఫలమైంది, ప్రస్తుతం వుత్తర కొరియాలో మాత్రమే వుంది, అక్కడి ప్రభుత్వం కూడా విఫలమైంది, ఒక భావజాలంగా ఒకసారి తిరస్కారానికి గురైంది తిరిగి వేళ్లూను కుంటుంది అనుకోవటం లేదు.’ అన్నారు. మిలిటరీ అధికారి కివలన్‌ జెన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరించబడింది, 2017లో ప్రకటన వెలువడ నుంది అన్నారు. రాజకీయ, భద్రత, న్యాయ వ్యవహారాల మంత్రి లుహుత్‌ బిన్సర్‌ పండజైటన్‌ మాట్లాడుతూ ‘ అదే నిజమైతే ఆ సంస్ధ ఎక్కడుందో చెప్పమనండి, నాకు చాలా కళ్లు,చెవులు వున్నాయి కానీ ఒక్క నివేదిక కూడా నాకు అందలేదు’ అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది ఆసక్తి కలిగిస్తోంది.