Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

   ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించటంపై రెండు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. కవి చౌడప్పకు సమాజం మీద కోపం వచ్చి తిట్లదండకం రచించారు. మరి ఈ పార్టీల వారికి ఏమి వచ్చి అందుకు పాల్పడుతున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు ప్రత్యేకించి తెలుగుదేశం-వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు కొన్ని సార్లు సభ్యతగా మాట్లాడినపుడు మాట్లాడుతున్నది మనవారే అని వారి అభిమానులకే అనుమానం వస్తుంది, నీరసపడిపోతారు. రాజకీయాలంటే తిట్లు, నిందలుగా తయారు చేసి కార్యకర్తలకు, జనానికి గంజాయి దమ్ము వంటి కిక్కు ఎక్కించారు. అది లేకపోతే డీలా పడిపోతారు. దొందూ దొందే అన్నట్లు ఎవరూ తక్కువ కాదు. ఎవరినైనా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తిట్లకు దిగటం అంటేనే విమర్శలలో పసలేక వాటిని ఆశ్రయిస్తున్నారని లేదా అసలు విషయాల నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నపూర్వకంగా చేస్తున్నారని అనుకోవాలి.

    ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పులతో కొట్టాలని అది బాగాలేదంటే చీపుర్లతో కొట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించటం కొంత మందికి వినోదంగా మరికొందరికి అభ్యంతరంగా కనిపిస్తోంది. అదే చంద్రబాబు , తెలుగుదేశం మంత్రులు, నేతలు జగన్‌ను నేరస్థుడు, దొంగ వంటి ఎన్నో పద ప్రయోగాలు చేసినపుడు కూడా పైన చెప్పిందే జరిగింది. అందువలన ఎవరు ఎవరిని తప్పుపట్టాలి? వారికి వారు కూర్చుని నిర్ధారించుకుంటే తప్ప దీనిని ఎవరు ముందు ప్రారంభించారని తేల్చటం కూడా కష్టమే. ఒక ప్రముఖుడిని చెప్పుతో, చీపుర్లతో కొట్టాలి అని విమర్శించటం చట్టవిరుద్దమా, సభ్య సమాజంలో పలకాల్సిన మాట కాదా ? కానీ ఏ నేరం రుజుకు కాకుండానే ఒకరిని నేరస్ధుడు అని వర్ణించటం చట్ట బద్దమా ? జగన్‌ కొట్టాలి అన్నారు, కానీ తెలుగు తమ్ముళ్లు అనంతపురం జిల్లాలో ఏకంగా చెప్పులతో దాడి చేసి కొట్టి చూపించారు. ఏది మంచో ఏది చెడో ఎవరూ వినే పరిస్థితి లేదు. ఒక అసహ్యకర పరిస్థితిని రెండు పార్టీలూ సృష్టించాయన్నది మాత్రం స్పష్టం. దాని నుంచి వెనక్కు తగ్గే చైతన్యం, సంస్కారాన్ని ఎవరు ముందు ప్రదర్శిస్తారో చూడాలి.

    చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫిరాయించిన వైసిపి ఎమ్మెల్యేలతో కలసి సంఖ్యా పరంగా ఎంతో బలంగా కనిపిస్తున్నారు. కానీ అనూహ్యంగా రాజకీయంగా ఎంతో బలహీనపడి పోయారు.ఎప్పుడైతే కేంద్రం నుంచి ఆశించింది రాకపోవటంతో శాశ్వత రాజధానికి అట్టహాసంగా శంకుస్థాపన చేసి తాత్కాలిక రాజధానిపేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలను తగలేస్తున్నారో అప్పుడే చంద్రబాబు బలహీనత వెల్లడైంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వూరించిన పాకేజీకీ కూడా గతి లేకపోయింది. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపిని కనీసం సానుకూల విమర్శలు కూడా చంద్రబాబు చేయలేకపోయారు. తన ఎంఎల్‌ఏలు ఒక్కొక్కరుగా జారిపోతుంటే జగన్‌ నిస్సహాయుడై గుడ్లప్పగించి చూస్తూ సంఖ్యా పరంగా బలహీనపడిపోయారు. పోయినవారు పోగా ఇంకా ఎంత మంది మిగులుతారన్నది ప్రశ్న. అయితే ఇదే సమయంలో చంద్రబాబు తన వాగ్దానాలు, విజన్‌ రంగుల కలలు మసకబారి పోయేకొద్దీ ఆ బలహీనతను ఆధారం చేసుకొని రాజకీయంగా దాడి చేయటానికి రాబోయే రోజుల్లో జగన్‌కు ఇంకా అవకాశాలు పెరగవచ్చు. కేంద్ర ప్రభుత్వంపై పల్లెత్తు విమర్శ చేయకుండా చంద్రబాబుకే పరిమితమైతే జనం మెచ్చరని, అనుమానిస్తారని జగన్‌ గుర్తించాలి.

    బిజెపి నేతలు ఒకవైపు తమ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశమంతటా సభలు, ప్రదర్శనలు పెడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విభజన కారణంగా తాము నష్టపోయామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పునర్‌నిర్మాణం పేరుతో దీక్షలను పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విజయాలు దానికి కనిపించే స్ధితి లేదు.అలాగే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చూసే స్ధితిలో బిజెపి నేతలూ లేరు. ఈ తరుణంలో కోరని వరంలా జగన్‌ విమర్శలు తెలుగుదేశం పార్టీ వారి నోళ్లకు పని చెప్పి వుత్సాహాన్ని నింపాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో చేశానని చెబుతున్నారు. ఇప్పుడు ఆమె స్ధానాన్ని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు అలంకరించారు. రైల్వే ప్రత్యేక జోన్‌ ఎలాగూ ఇచ్చే, వచ్చే పరిస్ధితి కనిపించటం లేదు, కనీసం దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న రైల్వే ప్రాజెక్టులలో రానున్న మూడు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి పూర్తి అయినా మద్దతు ఇచ్చి అందలం ఎక్కించినందుకు చంద్రబాబు జన్మ ధన్యమైనటే.్ల .