Tags

, , ,

సత్య

     తాను అధికారంలోకి వస్తే విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వంద రోజుల్లో బయటకు తెచ్చి ప్రతి ఒక్కరికి 15లక్షల వంతున బ్యాంకుల్లో వేస్తానని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్రపక్షాల నేతలు గత లోక్‌ సభ ఎన్నికలలో చేసిన వాగ్దానాలలో ఒకటి. దానికి అనుగుణంగానే డిపాజిట్లు లేకుండానే ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన హడావుడీ ఇంతా అంతా కాదు. తమ వాటా పదిహేనులక్షలు వేసేందుకే మోడీ తమ చేత ఖాతాలు తెరిపించారని అనేక మంది భ్రమ పడ్డారు, రెండు సంవత్సరాల తరువాత కూడా ఇంకా అనేక మంది అలాంటి వారు వున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలపుడు ఏదో మాట వరసకు ఎన్నో అంటాం మేడంటే మేడా కాదు, ఇల్లంటే ఇల్లూ కాదు, తలా పదిహేను లక్షలు వేస్తామంటే వేస్తామని కాదు అని తరువాత ఒక సందర్భంగా బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా అబ్బే వుట్టిదే అని తేల్చిపారేశారు. అయినా నల్లధనం గురించి పెద్ద డ్రామా నడుస్తూనే వుంది.

     అంబిట్‌ కాపిటల్‌ రీసర్చ్‌ అనే సంస్ధ తాజాగా భారత్‌లో 30లక్షల కోట్ల రూపాయల మేర నల్లధనం వున్నదని పేర్కొన్నది. ఇది నిజానికి పెద్ద వార్త కాదు, దీనిలో కొత్త విషయూ లేదు. కాకపోతే ప్రధాని నరేంద్రమోడీ నల్లధన ప్రపంచ రాజధానిగా పరిగణించబడే స్విడ్జర్లాండ్‌, ఇతర దేశాల పర్యటన సందర్భంగా దీనిని వదలటం, మీడియా ప్రముఖంగా ప్రచురించటంతో మరోసారి జనాన్ని ఆకర్షించింది. స్విడ్జర్లాండ్‌ వెళ్లిన తరువాత ప్రధాని నల్లధనంతో పాటు మా సినిమా పరిశ్రమ మీ దేశంలోనే షూటింగ్‌లు కూడా జరిపి అందాలను బందీ చేస్తోంది అని ఆదేశ అధ్యక్షుడు జాన్‌ షిండర్‌ అమన్‌తో కలిసి చెప్పారు. నల్లధనం గురించి మాట్లాడేందుకు ఒక అధికారిని భారత్‌కు పంపుతామని వారు హామీ ఇచ్చారు. తరువాత జరిగేదేమిటో మనం పెద్దగా వూహించుకోనవసరం లేదు.

    నల్లధనం విషయానికి వస్తే 1970 దశకంలో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న సమయంలో పన్నుల రేట్లు బాగా పెంచింది. దాంతో బ్లాక్‌ మనీ సమస్య కూడా అప్పటి నుంచే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. తరువాత కాలంలో పన్ను రేటు గణనీయంగా తగ్గించినా, అనుసరించిన నూతన ఆర్ధిక విధానాలు కోటీశ్వరులను శత కోటీశ్వరులుగా మార్చటం, కొంత మంది చేతిలో నడమంత్రపు సిరి చేరటంతో దేశ, విదేశాలలో నల్లధనం దాచుకోవటం, సమాంతర ఆర్ధిక వ్యవస్ధ నడపటం గురించి చెప్పనవసరం లేదు.నల్లధనం అంటే ఏమిటి అంటే నిర్ధిష్ట నిర్వచనం లేదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేయటం, వుత్పత్తిని, అమ్మకాలను తక్కువ చూపటం వంటి కార్యకలాపాల ద్వారా సమకూరే లెక్కలు లేని ఆదాయాన్ని నల్లధనం అంటున్నారు. ఇది ఇంకా దొంగరవాణా తదితర అనేక మార్గాలలో కూడా సమకూరుతుంది. ఇది ఎంత అంటే రెండు రెళ్లు నాలుగు అన్నట్లు ఎవరూ చెప్పలేరు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అంచనా అంకెలను మాత్రమే చెబుతారు. ఈ విధంగా చూసినపుడు 1970-71లో జిడిపిలో 4.8 నుంచి 22.3 శాతం వరకు వున్నట్లు వివిధ అంచనాలు తెలిపాయి. పది సంవత్సరాల తరువాత 13.5 నుంచి 48శాతం వరకు పెరిగాయి. ప్రపంచబ్యాంకు పరిశోధనా బృందం 1999-2007 మధ్య 162 దేశాలలో పోటీ ఆర్ధిక వ్యవస్థల గురించి చేసిన పరిశోధనలో అధికారికంగా ప్రకటించే జిడిపిలో ప్రపంచ సగటు 31 నుంచి 34శాతం నల్లధనం వున్నట్లు పేర్కొనగా భారత్‌ అది 20.7 నుంచి 23.2 శాతం వరకు నల్లధనం వున్నట్లు తెలిపింది. అంబిట్‌ కాపిటల్‌ రీసర్చ్‌లో పేర్కొన్న అంకెలు దీనికి అనుగుణంగానే వున్నాయి. 2016లో మన జిడిపి రెండులక్షల 30వేల కోట్ల డాలర్లు అని అంచనా వేస్తే దానిలో 20శాతం 46వేల కోట్ల డాలర్లు, అది 30లక్షల కోట్ల రూపాయలకు సమానం. ఇదీ అంబిట్‌ లెక్క. దీనికంటే ఎంతో ముందే మన దేశ నల్ల ధనం విలువ 35లక్షల కోట్లని అంచనా వేసిన విషయాన్ని మరిచిపోరాదు. మరొక పద్దతి ప్రకారం ఒక దేశానికి ఎంత విదేశీ అప్పు వుంటే దానిలో 20శాతానికి సరిపడా ఆదేశ పెద్ద మనుషులు విదేశాల్లో నల్లధనాన్ని దాచుకుంటారట.మన దేశ నల్లధనం విషయానికి వస్తే అడ్డదారుల్లో దేశం నుంచి దాటించి తిరిగి దానినే పెట్టుబడులో మరో రూపంలోనో మన దేశానికి తరలించి రాయితీలు పొందుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఒక డాలరు పెట్టుబడి పెడితే దానికి వివిధ రూపాలలో ఇస్తున్న రాయితీలు అంటే చౌకధరలకు భూమి, విద్యుత్‌, నీరు వంటి మౌలిక సదుపాయాలు, సంవత్సరాల తరబడి పన్ను రాయితీలను కలుపు కుంటే రెండున్నర డాలర్ల లాభాన్ని పెట్టుబడిదారులు పొందుతున్నారు. ఎవరైనా దీనిని ప్రశ్నిస్తే మన దేశంలో వాణిజ్యవేత్తల మనోభావాలు దెబ్బతింటాయి, అభివృద్ధి నిరోధకులు అని ముద్రవేసి దాడిచేస్తున్నారు.

   అంబిట్‌ కాపిటల్‌ రిసర్చ్‌ కధ విషయానికి వస్తే దీనిలో అనేక ఆసక్తికర అంశాలు వున్నాయి.ఈ నల్లధనాన్ని ఎక్కువ భాగం రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్ల రూపంలో దాచుకుంటున్నారని అంబిట్‌ తెలిపింది. నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న వివిధ చర్యల కారణంగా బంగారం, ఆభరణాల రూపంలో నల్లధనం దాచుకోవటం కష్టంగా మారిందని, వాటి కొనుగోలు తగ్గిపోయిందని, భూమి, భవనాల ధరలు కూడా పడిపోయాయని పేర్కొన్నది. నల్లధనంపై గతేడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుకోని పర్యవసానాలకు దారితీసి పెట్టుబడి వ్యయం 24నుంచి 34శాతానికి పెరిగిందట. దాడుల కారణంగా జనం బ్యాంకుల ద్వారా కాకుండా నేరుగా డబ్బుతో లావాదేవీలు చేస్తున్నారట.బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయాయట, వీటన్నింటి ఫలితంగా జిడిపి వృద్ధి రేటులో ఎలాంటి పెరుగుదల వుండదట. పెట్టుబడి ఖర్చు పెరిగినా తీసుకొని జనం లావాదేవీలు నిర్వహిస్తున్నపుడు జిడిపి వృద్ధి రేటులో పెరుగుల ఎందుకు ఆగిపోతుందో తెలియదు. మోడీ ప్రతిష్ట పెంచేందుకు సామాజిక మీడియాలో ఒక పోస్టు తిరుగుతోంది. దానిలో ఏం వుందంటే మోడీ ప్రభుత్వం 50వేల కోట్ల రూపాయల మేరకు పన్ను ఎగవేతలను వసూలు చేసిందట,మరో 21వేల కోట్ల రూపాయల లెక్కల్లో చూపని సంపదను కనుగొన్నదట.నాలుగువేల కోట్ల రూపాయల విలువగల నకిలీ వస్తువులను కనుగొన్నదట. వీటిలో వాస్తవ మెంతో తెలియదు. పోనీ నిజంగా పూర్తిగా వాస్తవమే అనుకున్నా దీన్నొక విజయంగా చెప్పుకోవటమే ఆశ్చర్యం. ఈ నేరాలకు పాల్పడిన వారిని ఎంత మందిని జైళ్లకు పంపిందో ఈ సర్కార్‌ వెల్లడించి వుంటే దానికి విలువ వుండేది.ఇన్నేసివ వేల కోట్ల రూపాయలను కనుగొన్ని మరో 36వేల కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని పొదుపు చేయటం తమ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలని చెప్పుకున్న ప్రభుత్వం జిజియా పన్నుల మాదిరి వీధుల శుభ్రానికి జనం మీద పన్నేసిన మోడీ సర్కార్‌ తాజాగా కృషి కల్యాణ్‌ పేరుతో జనం మీద మరో అరశాతం పన్ను వడ్డించటాన్ని ఏమనుకోవాలి. వెలికితీస్తున్న డబ్బంతా ఏమౌతున్నట్లు ?

   గతంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ పదవీ కాలం చివరిలో భారత్‌ వెలిగిపోతోందంటూ ప్రచారం చేసి ఎన్నికలలో ఆరిపోయింది. తెలివి తేటలు ఎక్కువ వున్న మోడీ సర్కార్‌ ఎత్తుగడ మార్చి కొత్త అంకెల సీరీస్‌ను ప్రారంభించి పాలన ప్రారంభం నుంచే దేశం వెలిగిపోతోందని విజయగానాలు చేస్తోంది.కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేశామని చెబుతున్నారు.కానీ ఆచరణలో ఆ కాంగ్రెస్‌ బూట్లలో కాళ్లు దూర్చారు. పెట్రోలు,డీజిల్‌పై పన్ను భారం, సేవా పన్ను పెంపు మచ్చుకు ఇవిచాలు. వంటగ్యాస్‌ సబ్సిడీ అనర్హులకు పోతోందంటూ కోత పెట్టారు. సంతోషం, కానీ ఏనుగులు దూరే కంతలను వదలి దోమలపై కేంద్రీకరించారని తెలుసుకోవాలి.

     వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో సబ్సిడీలుగా ఇస్తోంది.ఇది గతంలో జరిగిందీ,ఇప్పుడు ఇంకా పెరిగింది. కోల్పోయిన ఆదాయం పేరుతో ఎంత మొత్తం రాయితీలు ఇచ్చిందీ ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్‌ పత్రాలలో సగర్వంగా ప్రకటించుకుంటోంది. నిత్యావసరాలలో ఒకటైన బంగారం మీద విధిస్తున్న పన్ను 1.6 శాతం కాగా, విలాస వస్తువులలో ఒకటైన పాల మీద మాత్రం 15-20 మధ్య వసూలు చేస్తున్నారు. జిడిపిలో బ్లాక్‌ మనీ 20శాతం అన్నట్లుగా బాంకులు విజయమాల్య వంటి నిరుపేదలకు ఇచ్చిన తొమ్మిదివేల కోట్ల రూపాయల వంటి రాని రుణాల మొత్తం కూడా మొత్తం బ్యాంకుల అప్పులలో 20శాతం వరకు అంటే 4.4లక్షల కోట్ల వరకు వున్నాయట.మోడీ అధికారానికి వచ్చిన తరువాత పన్ను ఎగవేతదారులు, లెక్కల్లో చూపని ఆదాయం వున్నవారిపై దాడులు ఎక్కువ చేసిన మాటలో ఎంత వాస్తవం వుందో గాని రెండు సంవత్సరాల క్రితంతో పోల్చితే నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి బ్యాంకులను దగా చేసిన వుదంతాలు మాత్రం రెట్టింపై బ్యాంకులు కోల్పోయిన సొమ్ము 2015-16లో 13వేల కోట్ల రూపాయలకు చేరింది.

    సామాన్య వుద్యోగుల వద్ద గోళ్లూడగొట్టి వేతనాల్లోనే పూర్తి పన్ను మినహాయించుకుంటారు. కార్పొరేట్‌ కంపెనీలు చెల్లించాల్సిన పన్ను 30శాతం అని కాగితాల్లో మాత్రమే వుంటోంది, ఆచరణలో 23శాతానికి మించటం లేదు. ఈ మాత్రం కూడా చెల్లించకుండా నల్లధనంగా మార్చుతున్నారు. మెగా సిటీల నుంచి చిన్న పట్టణాల వరకు విస్తరిస్తున్న కార్పొరేట్‌ ఆసుపత్రులు జనాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో ఒకసారి వాటిలో వైద్యం కోసం వెళ్లిన వారికి చెప్పనవసరం లేదు, వైద్యఖర్చులను తిరిగి పొందే సౌకర్యం వున్న వారికి తప్ప సామాన్యులను రోగాలు కూడా అప్పుల వూబిలో ముంచుతున్నాయి. కానీ వాటినే అభివృద్ధిగా చూపుతున్నారు. అమెరికా, ఐరోపా వంటి ధనిక దేశాలలో బ్యాంకులలో సొమ్ము దాచుకుంటే ఒకటి, రెండు శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. అందువలన అక్కడి ధనికులు మన వంటి కార్పొరేట్‌ ఆసుపత్రులలో పెట్టుబడులు పెట్టి దానికి పది రెట్లు లాభాలు పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు.

   కేంద్ర ప్రభుత్వం గతేడాది కోల్పోయిన 6.11లక్షల కోట్ల ఆదాయంలో లక్షా 16వేల కోట్ల రూపాయలు కేవలం బంగారం, ఆభరణాలపై ఇచ్చిన పన్ను రాయితీలే అన్నది నమ్మలేని నిజం.ఇవన్నీ పేదల అభ్యున్నతి కోసమే అంటూ దోచిపెడుతున్న సొమ్ము అంటే అతిశయోక్తి కాదేమో !